Ramoji Rao: అక్షరం... అక్షయం... మీ సంకల్పం!

రామోజీరావు.. ఈనాడు పత్రికను పదివేల అక్షౌహిణుల సైన్యంగా తీర్చిదిద్దారు. అణచివేతకు గురైన అక్షరానికి ధర్మాగ్రహం బోధించారు. పదాల్ని ఫిరంగుల్లా గురిపెట్టారు. బేలచూపుల వాక్యాన్ని బ్రహ్మాస్త్రంలా మలిచారు. శీర్షికలతో శీర్షాసనం వేయించారు. ఇంట్రోలను బంట్రోతులుగా మార్చుకున్నారు. ఫొటోలతో మాట్లాడించారు.

Updated : 16 Jun 2024 20:12 IST

ఆయన క్రమశిక్షణను చూసి..
కాలసాక్షికి కడుపుమంట.
సూర్యోదయాల విషయంలో
ఉషోదయ వేగంతో పోటీపడలేకపోయానని.
ఆ సత్యనిష్ఠతో పోల్చుకుని..
సమవర్తిలోనూ అసంపూర్తి భావన.    
పాలకుల పాపాల చిట్టాలను

ఆయనంత గొప్పగా కూర్చలేకపోయానని.
ఆ గంభీర ముద్రతో బేరీజు వేసుకుని..
సముద్రుడిలోనూ సతమతం.
అంతటి నిబద్ధత, ఆపాటి నిబ్బరం
తనకు సాధ్యం కాలేదెందుకని.
ఆ భాషాభిమానాన్ని తలుచుకుని..  
చదువులమ్మకు చిన్నపాటి అసూయ.
వర్ణమాలతో అన్నన్ని
విన్యాసాలెలా చేయిస్తున్నారని...
అవును. ఆయనకు ఆయనే సాటి. ఆయనకు ఆయనే పోటీ.

రామోజీరావు.. ఈనాడు పత్రికను పదివేల అక్షౌహిణుల సైన్యంగా తీర్చిదిద్దారు. అణచివేతకు గురైన అక్షరానికి ధర్మాగ్రహం బోధించారు. పదాల్ని ఫిరంగుల్లా గురిపెట్టారు. బేలచూపుల వాక్యాన్ని బ్రహ్మాస్త్రంలా మలిచారు. శీర్షికలతో శీర్షాసనం వేయించారు. ఇంట్రోలను బంట్రోతులుగా మార్చుకున్నారు. ఫొటోలతో మాట్లాడించారు. క్యాప్షన్లతో కవాతు చేయించారు. కార్టూన్లతో కత్తులు నూరించారు. సంపాదకీయ వ్యాసాల్లో మందుగుండు చొప్పించారు. పరిశోధనాత్మక కథనాలతో కదనకుతూహలం రేకెత్తించారు. అవినీతిపై అవిశ్రాంత యుద్ధం ప్రకటించారు. అక్రమార్కులపై త్రివిక్రమించారు. నియంతల అంతు చూశారు. పాలన వ్యవస్థలు దారితప్పిన ప్రతిసారీ, పట్టుబట్టి ప్రజాస్వామ్యాన్ని గెలిపించారు. పత్రిక అనేది అధికార పక్షమో, ప్రతిపక్షమో కాదనీ.. అక్షరాలా జనపక్షమనీ నిరూపించారు.

ఒకసారి కాదు.. వందసార్లు. ఒక పోరాటం కాదు.. అనేక యుద్ధాలు. ఒక శత్రువు కాదు.. నలువైపులా ప్రత్యర్థులు. ఒక గాయం కాదు.. నిలువెల్లా గుర్తులు. ఒక గెలుపు కాదు.. వరుస విజయాలు. ఒక ఘనత కాదు.. కీర్తి కిరీటాలు.

*         *         *

కొన్ని ప్రయాణాలంతే. గమ్యాల గడప దగ్గరే ఆగిపోవు. జీవన మార్గాన్నీ నిర్దేశిస్తాయి. ఐదు దశాబ్దాల నాటి ఈ సంఘటనా అలాంటిదే.

హైదరాబాద్‌ నుంచి విశాఖ వెళ్తున్న విమానంలో ఓ దినపత్రిక యజమాని ప్రయాణిస్తున్నారు. పక్క సీట్లో ఓ యువకుడు. నిరంతర స్వాప్నికుడు. శ్రమోపాసకుడు. సమాజం పట్ల బాధ్యత కలిగినవాడు. అప్పుడప్పుడే వ్యాపారంలో ఎదుగుతున్నాడు. అతనికెందుకో ఆ పారిశ్రామికవేత్తతో మాటలు కలపాలని పించింది. కాలక్షేపానికి కాదు, జిజ్ఞాసకొద్దీ.

‘వైజాగ్‌కు దినపత్రికలు వచ్చేసరికి మధ్యాహ్నం దాటుతోంది. ఇక్కడి నుంచే ఎడిషన్‌ ప్రారంభిస్తే బావుంటుందేమో.. ఆలోచించండి’ అని సూచించాడు.

ఆ పెద్దమనిషి చిరాగ్గా కదిలారు.

‘పత్రిక నడపడం చాలా కష్టం. కొత్త ఎడిషన్‌ తీసుకురావడమంటే మాటలు కాదు’ జవాబిచ్చారాయన. గొంతులో కించిత్‌ అసహనం.

‘కష్టం.. అసాధ్యం.. మాటలు కాదు’ అని ఎవరైనా అన్నప్పుడు, ఆ యువకుడిలో పట్టుదల పదిరెట్లు పెరుగుతుంది. ‘మనిషికి అసాధ్యమేముంది?’ అనుకుంటాడు. ‘సవాళ్లు లేని జీవితం నిస్సారం కదా!’ అని మనసులోనే మథనపడతాడు. అవసరమైతే, ఆ సవాలును తానే స్వీకరిస్తాడు. ఆ సమస్యలన్నీ స్వయంగా అధిగమిస్తాడు. ఇక్కడా అదే జరిగింది.

సరిగ్గా ఆ క్షణానే.. మనసులో ఓ దినపత్రికకు అంకురార్పణ జరిగింది.

పేరు.. ఈనాడు

ఆ యువకుడు.. రామోజీరావు.

*         *         *

విశాఖ నగరాన.. 1974 ఆగస్టు 10న..
హంగూ ఆర్భాటాల్లేవు. ప్రచార పటాటోపాల్లేవు. నిజానికి, అవన్నీ రామోజీరావుకు (Ramoji Rao) నచ్చని విషయాలు. కొద్దిమంది అతిథుల సమక్షంలో.. ఓ సాధారణ ఉద్యోగితో మీట నొక్కించారు. క్షణాల్లో ముద్రణ ప్రారంభమైంది. కొమ్మరెమ్మల నుంచి కాగితం పూలు రాలినట్టు.. ప్రింటింగ్‌ మెషీన్‌లోంచి టపటపా పత్రికలు! అలా, బౌద్ధం వెలుగులీనిన నేలపై నుంచి సమస్యల చీకట్లపై అక్షర యుద్ధం ఆరంభమైంది. జెండా పండగకు ఐదు రోజుల ముంద.. ప్రజల అజెండాతో ఓ దినపత్రిక ప్రాణం పోసుకుంది. పత్రికంటే పదివేల సైన్యమే. కానీ, పత్రికను నడపాలంటే.. పది తలలతో ఆలోచించాలి. ఇరవై చేతులతో పనిచేయాలి. వంద సమస్యలను ఎదిరించాలి. అయినా, అవన్నీ ఆయనకు తెలియని విద్యలా? లక్ష అవరోధాలనైనా తట్టుకుని నిలబడగల లక్ష్యశుద్ధి ఆయనది. అప్పటికే ‘అన్నదాత’ పేరుతో వ్యవసాయ మాస పత్రికను తీసుకొస్తున్న అనుభవమూ ఉంది. దినపత్రిక మాత్రం కొత్తే. ఆత్మబలం ఆ పరిమితినీ అధిగమించేలా చేసింది. మరింత స్పష్టత కోసం.. దిగ్గజాలతో చర్చించారు. నిపుణులతో సమాలోచనలు జరిపారు. తనవంతు కసరత్తూ పూర్తి చేశారు. ప్రోత్సహించినవారు ప్రోత్సహించారు. నిరాశపరిచినవారు నిరాశపరిచారు. ఎవరి మాట ఎలా ఉన్నా.. ఆయన దారి ఆయనదే. ‘పట్టు పట్టరాదు, పట్టి విడువరాదు’.. అనుకునే గట్టి స్వభావం. కాబట్టే, ఆలోచన ప్రణాళికగా మారడానికీ, ప్రణాళిక ఆచరణగా రూపుదాల్చడానికీ ఎంతో సమయం పట్టలేదు.
‘ఈ..నా..డు’ పేరులోనే మూసను బద్దలుకొట్టారు. చద్ది వార్తల పద్దు రద్దయిపోయిందని ప్రతీకాత్మకంగా ప్రకటించారు.

నిన్న.. గతం. రేపు.. అస్పష్టం.
నేడే నిజం. ఈనాడే నిజం!

సీతమ్మధార ప్రాంతంలోని పాత గోడౌన్‌ పత్రికా కార్యాలయంగా మారింది. అధినాయకుడి ఆత్మవిశ్వాసాన్ని చూసి పాత అచ్చు యంత్రాలకూ కొత్త ఉత్సాహం వచ్చింది. ‘నవహింద్‌ టైమ్స్‌’ పత్రిక నుంచి కొన్నారు వాటిని. సిబ్బంది విషయానికొస్తే.. రామోజీరావే ప్రతి ఒక్కర్నీ ఇంటర్వ్యూ చేసి తీసుకున్నారు. అక్షరాల్ని ప్రేమించేవారినే ఏరికోరి ఎంచుకున్నారు. స్టైల్‌ షీట్‌ విషయంలో ఆయన ముందే స్పష్టత ఇచ్చారు కాబట్టి, రాతకోతల్లో తగిన జాగ్రత్తలు తీసుకున్నారంతా. పంటికింద రాయి ప్రయోగాల్లేవు. సంస్కృతం నుంచి అరువు తెచ్చుకున్న కృతక విన్యాసాల్లేవు. మయసభ మార్కు సంపాదకీయాలూ లేవు. ప్రతి వాక్యం రసాత్మకమే. ప్రతి కథనం సుబోధకమే. వెన్నముద్దలో అద్దితీసినట్టు.. వేడుకైన వాడుకభాష. ఆ అచ్చ తెలుగు పత్రికను జనం గుండెలకు హత్తుకున్నారు. రామోజీరావును నిండుమనసుతో ఆశీర్వదించారు.  

‘సామాన్య’ శాస్త్రవేత్త

అప్పట్లో దిల్లీ వార్తలదే రాజ్యం. అంతర్జాతీయ కథనాలకే అగ్రస్థానం. స్థానికతకు స్థానమే లేదు. ఏ మూలనో చోటిచ్చినా.. మూడంటే మూడు ముక్కలే. ఇదెక్కడి అన్యాయం, ఇదేం వివక్ష? అంటూ పాఠకుల గుండెలు మండిపోయేవి. మట్టివాసనల కోసం పరితపించేవి. రామోజీరావు ఆ వెలితిని గుర్తించారు. పాత కొలతలకు పాతరేశారు. నూకలు చెల్లిన తూకంరాళ్లను తోసిరాజన్నారు. ఏడంతస్తుల మేడ మీది ఆరుకాలాల వార్తను కాలుపట్టి కిందికి లాగారు. నేలమీద నిలబెట్టారు. ప్రజాగళానికి పట్టం కట్టారు. పత్రికల ప్రాధాన్యాలను పునర్నిర్వచించారు.
కాలనీలో చెత్త పేరుకున్నా వార్తే. కుళాయి నీళ్లు మొరాయించినా వార్తే. కరెంటు తీగలు తెగిపడినా వార్తే. వీధికుక్కలు వీరంగం చేసినా వార్తే. ప్రచురించి తీరాల్సిందే. పెద్దక్షరాల్లో హెడ్డింగ్‌ పెట్టాల్సిందే. అక్కడితో ఆగలేదు. పట్టణాలకే పరిమితమైన పత్రికను మారుమూల పల్లెకూ తీసుకెళ్లారు. జిల్లా అనుబంధాల రాకతో ఆ బంధం మరింత బలపడింది.

పత్రికల్లో ఫొటోల విలువను తొలుత గుర్తించిందీ రామోజీరావే. కృత్రిమత్వపు ఛాయల్లేని ఛాయాచిత్రాలు ఈనాడు పేజీలకు వన్నె తెచ్చాయి. అప్పటివరకూ ఫొటోలు దిష్టిబొమ్మలతో సమానం. నాణ్యత కరవు. స్పష్టత సున్నా. రైటప్‌ ఉన్నా కూడా గుర్తించడం కష్టమే. ఆ దృశ్య దారిద్య్రాన్నీ వదిలించారాయన. మరింత నాణ్యత కోసం, ఇంకొంత వేగం కోసం సంస్థ ఆవరణలోనే బ్లాక్‌ మేకింగ్‌ విభాగాన్ని ప్రారంభించారు. మారుతున్న కాలానికి తగినట్టు సిబ్బందికి ఖరీదైన కెమెరాలు సమకూర్చారు. పదునైన ఫొటోలు పతాక శీర్షికల పక్కన సగర్వంగా చోటు సంపాదించుకున్న రోజులున్నాయి. పాలకులకు చెమటలు పట్టించిన సందర్భాలూ, అధికారులకు బీపీలు తెప్పించిన దాఖలాలూ అనేకం. సాక్షాత్తూ అధినేతే.. గుట్టలకొద్దీ ఫొటోల్ని ముందేసుకుని కూర్చుని.. ప్రచురణ కోసం ఓ ఆణిముత్యాన్ని ఎంపిక చేసిన ఘట్టాలూ లేకపోలేదు. మరుసటిరోజు రచ్చబండ మీద ఆ చర్చే, అసెంబ్లీలోనూ ఆ రచ్చే! ‘ఆర్ట్‌ ఆఫ్‌ చూజింగ్‌’లో ఆయన తర్వాతే ఎవరైనా.

మార్పు తీర్పరి..

కవి హాలికుడైతే.. కవిత ముక్కారు భావాలు పండిస్తుంది. సాక్షాత్తు సంపాదకుడే రైతు పక్షపాతి అయినప్పుడు.. పత్రిక పొద్దుతిరుగుడు పువ్వులా వ్యవసాయం చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిందే. రామోజీరావు పదహారణాల రైతుబిడ్డ. వ్యవసాయ కుటుంబంలో పుట్టారు. పంటల విలువ, ఆకలి మంటల కష్టం తెలిసినవారు కాబట్టే, సేద్యానికి అక్షర నైవేద్యంగా.. ఈనాడు వైజాగ్‌ ఎడిషన్‌లో ‘రైతే రాజు’ను ఆరంభించారు. అదొక సాగుబడి. పత్రికా ప్రపంచంలోనే సరికొత్త ఒరవడి. ఆ ప్రయోగం విజయవంతమైంది. పత్రికను పక్కనపెట్టుకుని బంగారం పండించిన రైతులూ ఎంతోమంది. ఆ నిబద్ధత హాలికులను విధేయులైన పాఠకులను చేసింది. రైతన్నలో ‘మన పత్రిక’ అనే ప్రగాఢ నమ్మకం ఏర్పడింది. రామోజీరావులో ‘నా రైతులు’ అనే భావన బలపడింది. ప్రతి సంక్షోభ సమయంలోనూ ఈనాడు రైతుల పక్షాన నిలిచింది. పాలకులను నిలదీసింది. ప్రభుత్వాలను కడిగేసింది. ఆకలితో, అప్పులతో రైతులు రైలుపట్టాలకెక్కుతున్న దుస్థితిని సూటిగా ప్రశ్నించింది. డొల్ల విత్తనాలతో రైతు పొట్టగొడుతున్న కల్ల కంపెనీలపై కన్నెర్రజేసింది. వలస బతుకుల గురించి వరుస కథనాలు ప్రచురించింది. ప్రైవేటు రుణాల వెనుక దారుణాలను బట్టబయలు చేసింది. పత్రికకెక్కిన ప్రతి వ్యవసాయ కథనం రామోజీరావు గుండె చప్పుడే. ఆయన అంతర్మథనానికి నిలువెత్తు సాక్ష్యమే.  

రామోజీరావును చాలామంది మార్కెటింగ్‌ మాంత్రికుడిగా అభివర్ణిస్తారు. ఆయన దృష్టిలో మార్కెటింగ్‌ అంటే.. తిమ్మిని బమ్మిని చేయడం కాదు. అబద్ధాలకు అందమైన ముసుగేసి పత్రికల్ని అమ్మేసుకోవడమూ కాదు. జనానికి చేరువకావడానికి ఇదొక మార్గం. పాఠకుల ఆసక్తులూ, అభిరుచులూ తెలుసుకోడానికి ఓమంచి అవకాశం. మార్కెటింగ్‌ సిబ్బందిని రామోజీరావు తన రాయబారులుగా ప్రకటించారు. ప్రజలూ తమ మనుషులుగానే భావించారు. కష్టసుఖాలు పంచుకున్నారు. మంచిచెడులు ముచ్చటించారు. మార్పుచేర్పులు సూచించారు. ఫలహారాలు పెట్టి మరీ పత్రికకు చందాలు కట్టారు. మనం ఏ జాంగ్రీలో, జిలేబీలో కొనడానికి వెళ్లినప్పుడు మిఠాయికొట్టు యజమాని చేతిలో ఓ స్వీటు ముక్క పెడతాడు. ఆ రుచి తప్పక నచ్చుతుందనీ, అరకిలో కొనాల్సిన కస్టమర్‌ కిలో కొనేస్తాడనీ అతని విశ్వాసం. ఇదోరకమైన ఎపిటైజర్‌ ఎఫెక్ట్‌. ఆ మాటకొస్తే వార్తలూ మిఠాయిల్లాంటివే. వార్తా పత్రిక పఠనం ఓ పాజిటివ్‌ వ్యసనం. ముందు రుచి చూపించాలి. క్రమంగా అలవాటు చేయాలి. తొలిరోజుల్లో ఈనాడు ఇదే ఫార్ములాను పాటించింది. పేపరు ఉచితంగా వేసింది. అంతేకాదు, ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కించింది. రిక్షాలూ,  బస్సులపైనా ఈనాడు ప్రకటనలు వచ్చేవి. అగ్గిపెట్టెల్నీ వదల్లేదు.

మనిషి స్వతహాగా ఆర్థిక జీవి. పైసా పైసా లెక్కేసుకుంటాడు. దుబారా అనిపిస్తే ఖర్చులకు కోత విధించుకుంటాడు. అప్పటికి పత్రిక ధర పావలా. నెలకు ఎనిమిది రూపాయల బిల్లు. ‘పత్రిక కొనడం పెద్ద ఖర్చే’ అనుకునేవారిని ఒప్పించడానికి ఈనాడు తిరుగులేని మార్గాన్ని ఎంచుకుంది. ‘పాత పేపర్లు అమ్ముకున్నా నాలుగు రూపాయలొస్తాయ్‌ బాబాయ్‌’ అంటూ ఏజెంట్లు పాఠకుల్ని ఒప్పించేవారు. చాలావరకూ పల్లెలోని ప్రైవేటు ఉపాధ్యాయులు, పోస్టు మాస్టర్లు,  గృహిణులకు ఆ బాధ్యత అప్పగించేవారు రామోజీరావు. వాళ్ల పట్ల జనంలో నమ్మకం ఉండేది. దీంతో చందాలకు ఒప్పించడం సులభమైపోయేది. ఈనాడు ఏజెంటు.. అనే గుర్తింపు సామాజిక హోదాగా వర్ధిల్లింది. ఓ దశలో రామోజీరావు వారికి వాహనయోగమూ కల్పించారు. ముఖ్యమైన పాయింట్ల నుంచీ పత్రికల్ని తీసుకెళ్లడానికి సొంత బండ్లు సమకూర్చుకునేలా ప్రోత్సహించారు. కొత్త ద్విచక్రవాహనం మీద ఏజెంటు రివ్వున దూసుకుపోతుంటే.. జనం కళ్లింతలు చేసుకుని చూసేవారు. ‘రామోజీరావుగారి మనిషి మరి!’ అంటూ  మురిపెంగా ముద్ర వేసేవారు. ఎవరికి వారు తమ మనిషే అనుకునేంత.. అందరి మనిషి ఆయన.

వేగమే వేదమై..

మార్పును ఆమోదించని జీవులు పరిణామక్రమంలో కనుమరుగైపోతాయి. వేగాన్ని అందుకోలేని ప్రాణులు అంతే శీఘ్రంగా అంతరించిపోతాయి. సంస్థలకూ ఆ హెచ్చరిక వర్తిస్తుంది. ఐదు దశాబ్దాల ప్రస్థానంలో ఈనాడును నిలబెట్టిందీ, గెలిపించిందీ అలుపెరుగని ఆ వేగమే. తొలి రోజుల నుంచే పత్రికకు పరుగుపందెం అలవాటు చేశారు రామోజీరావు. యూనిట్లు పెరిగిపోయాక.. పంపిణీ వ్యవస్థ మెరుగుపడింది. ముద్రణ పూర్తయిన గంటల వ్యవధిలోనే పత్రిక గమ్యాన్ని చేరింది. అంతకు ముందైతే.. రోజూ ఓ యుద్ధమే. ప్రతి మజిలీ ఓ గండమే. మొదట్లో దినపత్రికలు రైళ్లు, బస్సుల్లో వెళ్లేవి. సాయంత్రానికి గమ్యం చేరినా అదృష్టమే. సుదూర ప్రాంతాలైతే.. మరుసటి రోజు ఉదయానికి పాఠకుడి చేతిలో పడేవి. ఆ చద్ది వార్తల్నే కళ్లకద్దుకుని చదివేవారు అమాయక జనం. స్తోమత ఉన్న యాజమాన్యాలు మాత్రం ఒకట్రెండు డొక్కు వ్యాన్లలో పేపర్ల కట్టలు వేసి పంపేవి. ఆ మందగమనాన్ని ఈనాడు ఛేదించింది. పత్రిక ఏ సమయానికి పాఠకుడి చేతికి చేరాలనేది.. బస్సుల రాకలో, రైళ్ల పోకలో నిర్ణయించడం రామోజీరావుకు నచ్చలేదు. ప్రత్యామ్నాయాల్ని ఆలోచించారు. ముద్రణ కేంద్రం నుంచి రూట్‌ మ్యాపులు సిద్ధం చేశారు. ప్రతి మర్గానికీ ఓ వాహనం ఏర్పాటు చేశారు. ఆ బండి ఏ సమయానికి ఏ ఊరికి చేరాలన్నది స్పష్టంగా నిర్ణయించారు. ఐదువేల పైచిలుకు జనాభా కలిగిన ప్రతి గ్రామం మీదా ఈనాడు జెండా ఎగరాల్సిందేనని నిర్దేశించారు. రవాణా సిబ్బంది కూడా ఆ లక్ష్యాన్ని సవాలుగా తీసుకున్నారు. తుపాన్ల తాకిళ్లనూ, వరదల ఒత్తిళ్లనూ తట్టుకుని.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పత్రికల కట్టలు అందించిన సందర్భాలు అనేకం. పెరుగుతున్న సర్క్యులేషన్‌కు అనుగుణంగా.. ముద్రణనూ ఉరకలెత్తించారు. అత్యాధునికమైన యంత్రాలు సమకూర్చారు. సరికొత్త ప్రింటింగ్‌ టెక్నాలజీని దిగుమతి చేసుకున్నారు. వేగవంతమైన కంప్యూటర్లు, ఆ వేగానికి దీటైన సాఫ్ట్‌వేర్లు కొనుగోలు చేశారు. విశాఖ తీరంలో మొదలైన అక్షర యాత్ర అనతికాలంలోనే హైదరాబాద్‌కు చేరుకుంది. విజయవాడలో విజయధ్వజం ఎగరేసింది. అప్పటి వరకూ అక్కడ ఎక్కువ కాపీలు అమ్ముతున్న ఓ పత్రికను వెనక్కి తోసేసి.. ఈనాడు అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది. అప్పటి నుంచి నేటి వరకూ.. 46 సంవత్సరాలుగా తెలుగువారి ఆశీస్సులతో నంబర్‌ వన్‌ పత్రికగా విలసిల్లుతూనే ఉంది. ఆపైన.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి కీలక ప్రాంతానికీ విస్తరించింది. ‘మనిషి ముసలివాడైపోవచ్చు. కానీ, పత్రికకు వృద్ధాప్యం రాకూడదు. నిత్యనూతనంగా ఉండాలి’ అనేవారు రామోజీరావు.

మారిన జీవితాలు

ఒక్క వార్త కష్టాలను తీరుస్తుంది. జీవితాలను తీర్చిదిద్దుతుంది. ‘ఈనాడు’ కథనాలతో మారిపోయిన జీవితాలు అనేకం. నిరుపేద విద్యార్థుల ఫీజుల సమస్య తీరుతుంది. ప్రాణాంతక రోగికి చికిత్స ఖర్చులు అందుతాయి. చావుబతుకులతో పోరాడుతున్న వ్యక్తికి.. అవయవదాత తారసపడతాడు. రామోజీరావు కూడా ఇలాంటి వార్తల్ని ప్రోత్సహించేవారు. ఈనాడు పత్రిక పైనే ఆధారపడి పోటీ పరీక్షలకు సిద్ధమైన సివిల్స్‌ విజేతలు, గ్రూప్‌వన్‌ టాపర్స్‌ ఎంతోమంది.

నేను సైతం..

పత్రిక సైనికుడి పాత్రకే పరిమితం కాకూడదు. ఉద్యమాల్లో శూన్యాన్ని భర్తీ చేయడానికి, విపత్తులలో దైన్యాన్ని పోగొట్టడానికి అవసరమైతే నాయకత్వ బాధ్యతా స్వీకరించాలి. రామోజీరావు నినాదమూ, విధానమూ ఇదే.  జనస్వామ్యానికి పాతరేసి.. ఎన్టీఆర్‌ ప్రభుత్వాన్ని కేంద్ర సర్కారు కూలదోసినప్పుడు.. అక్షరం అగ్నికణమై మండింది. కథనాల కరవాలాలు ఝళిపించారు. దెబ్బకు కేంద్రం దిగివచ్చింది. రాష్ట్రం చల్లబడింది. ఈనాడు సంబరపడింది. శ్రమదానం మహాదానమంటూ రామోజీరావు ఇచ్చిన పిలుపు.. తెలుగుగడ్డ మీద సేవా యజ్ఞానికి శ్రీకారం చుట్టింది. రహదారులు వెలిశాయి. వంతెనలు ప్రాణం పోసుకున్నాయి. కాలువలకు కొత్త కళ వచ్చింది. చెరువులు కరవును ఓడించాయి. ‘సుజలాం.. సుఫలాం’ జల వనరుల రక్షణకు ఊతమిచ్చింది. తుపాన్ల బీభత్సాలూ, వరదల ఉత్పాతాలూ జనజీవనాన్ని అతలాకుతలం చేసినప్పుడు.. రామోజీరావు సహజ గాంభీర్యం చెదిరిపోయేది. గుండె కదిలిపోయేది. ఆయన కనుసైగతో ఈనాడు సైన్యం రంగంలోకి దిగేది. జనం ఆకలి తీర్చేది. అభాగ్యులను అక్కున చేర్చుకునేది. ఆయన నిర్మాణాత్మక ఆలోచనకు సాక్ష్యాలు సూర్య భవనాలు. తుంగభద్ర వరదల సమయంలోనూ.. ఈనాడు పరివారాన్ని రంగంలోకి దించారాయన. రామోజీ ఫౌండేషన్‌.. నేతృత్వంలో చేపట్టిన కార్యక్రమాలు అధినేత ఆకాంక్షలకు ప్రతిరూపాలు. సమాచార హక్కుకు ఈనాడు పెద్ద దిక్కుగా వ్యవహరించాలన్న సంకల్పమూ ఆయనదే. ‘ఈనాడు-ముందడుగు’ ప్రజా చైతన్యం దిశగా ఓ పెద్ద అడుగు. జమ్మిచెట్టు మీదున్న ఆ ఆయుధాన్ని.. కిందికి దించి, సామాన్యులకు అందించిన ఘనత రామోజీరావుదే.   

Ramoji Rao: శిరసా నమామి!

కృషి ఉంటే..

పరుసవేది ప్రత్యేకత ఏముంది? మహా అయితే, ఇనుమును బంగారంగా మారుస్తుంది. ఒక లోహం మరో లోహం అవుతుంది. ముదురు పసుపు వర్ణాన్ని ఒళ్లంతా పూసుకుంటుంది. రామోజీరావుకు అంతకంటే గొప్ప విద్య తెలుసు. ఆయన కర్తవ్యదీక్షోపదేశం చేస్తే  బద్ధకస్తుడైనా శ్రమజీవి అవుతాడు. అంతర్ముఖుడైనా గడగడా మాట్లాడేస్తాడు. సాధారణ వ్యక్తులు సమష్టిగా అసాధారణ విజయాలు సాధిస్తారు. రామోజీ ఫిల్మ్‌సిటీలోని కార్పొరేట్‌ ఆవరణలో ఐఐఎమ్‌లూ, ఐఐటీల గ్రాడ్యుయేట్లు మనకు కనిపించరు. సాధారణ పట్టభద్రులే ఎక్కువ. కొందరి దగ్గర ఆ కాగితం ముక్కా ఉండదు. పట్టాలకంటే పట్టుదలే ముఖ్యమంటారు రామోజీరావు. ఎదుటి మనిషిలో మెరుపు కనిపిస్తే చాలు. ప్రోత్సహించి, పదును పెట్టి, తమను తాము నిరూపించుకునే అవకాశం ఇచ్చేవారు. గుమస్తాలుగా చేరి  మేనేజర్లుగా ఎదిగినవారూ, అత్తెసరు చదువులున్నా సమర్థ పాత్రికేయులుగా ప్రతిభను చాటుకున్నవారూ రామోజీ పరివారంలో ఎంతోమంది. వాళ్లకు అధినాయకుడే ఓ మేనేజ్‌మెంట్‌ స్కూల్‌. ఆయన సూచనలే నాయకత్వ పాఠాలు. రామోజీరావు ఆలోచనలు ఓ తరం ముందుంటాయి. కాబట్టే, రాళ్లగుట్టలను రామోజీ ఫిల్మ్‌సిటీగా తీర్చిదిద్దగలిగారు. విశ్వశ్రేణి చలనచిత్ర నగరిని సినిమా పరిశ్రమకు అందించగలిగారు. ఈటీవీ నెట్‌వర్క్‌ తెలుగువారి సత్తాను జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. ఈటీవీ ‘పాడుతా తీయగా’ ఓ పాటల పందిరి. ఆ వేదిక మీద పరిచయమై సినీ గాయకులుగా పేరు తెచ్చుకున్నవాళ్లు చాలామందే ఉన్నారు.

అవినీతిపై యుద్ధం

పాలకుడు నియంత అయితే.. అవినీతి వ్యవస్థీకృతం అవుతుంది. హద్దులు మీరిన అధికార కాంక్ష ప్రజల ఆకాంక్షలను బలిపెడుతుంది. రామోజీరావు ఆ పెడధోరణిని ప్రశ్నించారు. ఆ అవినీతిని నిలదీశారు. ఎవడబ్బ సొమ్మని నిగ్గదీశారు. పెద్దల ముసుగులోని గద్దల్ని తరిమికొట్టారు. నిజానికి అదొక యుద్ధం. తానొక్కడూ ఒక వైపు... సకల రాక్షస గణాలూ మరో వైపు. అక్షరానికి, అహంకారానికి మధ్య జరిగిన పోరాటమది. కుట్రలు చేశారు. కుయుక్తులు పన్నారు. బురదజల్లారు. విమర్శల వరద పారించారు. మరొకరైతే.. నిశ్శబ్దంగా నిష్క్రమించేవారు. కానీ, అక్కడున్నది రామోజీరావు. ఆయన నిఘంటువులో రాజీ అనే మాటకు చోటు లేదు. కొందరు యుద్ధాలు చేయడానికే పుడతారు. ప్రశ్నించడానికే అవతరిస్తారు. కాబట్టే, ఏ దశలోనూ ఆయన శత్రువుకు తలవంచలేదు. ప్రత్యర్థులు కుత్తుకకు గురిపెట్టినా సరే.. ఎత్తిన కత్తి దించలేదు. ఎనిమిది పదుల వయసును అవరోధం గానూ భావించలేదు. అంపశయ్యను అసహ్యించుకునే భీష్ముడాయన. నిలిచి పోరాడారు. అక్షరానిదే అంతిమ విజయమని గెలిచి నిరూపించారు. 

*         *        *

ఆ కర్మయోగి ఎనభై ఎనిమిదేళ్ల పరిపూర్ణ జీవితం.. ఎందరికో అండనిచ్చింది, ఎన్నో కుటుంబాలకు అన్నం పెట్టింది. తెలుగు ప్రజలకు అక్షయమైన అక్షర సంపదను ప్రసాదించింది. తీర్చుకోలేని రుణమిది.. నివాళులర్పించాల్సిన తరుణమిది. ఆయన దేవుడిని నమ్మకపోవచ్చు. కానీ, దేవుడికి మాత్రం ఆయనంటే అపారమైన నమ్మకం. అందుకే, ఏరికోరి తెలుగు గడ్డమీద పుట్టించాడు. తాను చేయలేకపోయిన ఎన్నో పనుల్ని ఆయనకు పురమాయించాడు.

రామోజీరావు శ్రమజీవి. ఖాళీగా ఉండాలనుకోరు.
అక్షరం అవసరమైన చోట.. తప్పక అవతరిస్తారు.
మార్పు అనివార్యమైన నేలపైన.. తూర్పు దిక్కున ఉదయిస్తారు.


కృష్ణమ్మ తీరాన..

పెదపారుపూడి... పచ్చటి పొలాలతో కళకళలాడే గ్రామం. కృష్ణాజిల్లాలో అది నేడో మండల కేంద్రం. విజయవాడకు యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కృష్ణవేణమ్మ తీరంలోని ఆ పచ్చదనాల ఊరిలో ఓ చిన్న పెంకుటింట్లోనే 1936 నవంబరు 16న పుట్టారు రామోజీరావు. తెలుగునాట సామాజిక, రాజకీయ, సాంస్కృతిక చైతన్య వారధులైన విశ్వనాథ సత్యనారాయణ, చండ్ర రాజేశ్వరరావు, ఎన్టీఆర్‌, అక్కినేని నాగేశ్వరరావు, ఘంటసాల, కొండపల్లి సీతారామయ్య వంటి ఎందరో మహానుభావులకు జన్మనిచ్చిన కృష్ణాజిల్లా కన్న మరో అనర్ఘ రత్నం... రామోజీరావు.


తల్లిదండ్రులు..

చెరుకూరి వెంకట సుబ్బారావు, వెంకట సుబ్బమ్మ దంపతులు రామోజీరావు తల్లిదండ్రులు. ఇద్దరు అక్కయ్యల తర్వాత పుట్టిన గారాలబిడ్డ. అసలు పేరు రామయ్య. శ్రీవైష్ణవ సంప్రదాయాన్ని అనుసరిస్తూ, తాతగారి పేరూ కలిసివచ్చేట్టూ తల్లిదండ్రులు ఈ పేరు పెట్టారట. అయితే తాను చేరిన ప్రాథమిక పాఠశాలలో ‘నీ పేరేంట’ని అడిగితే- ఎందుకు అనిపించిందో తెలియదుకానీ ‘రామోజీరావు’ అని చెప్పేశారట. అలా తన పేరు తానే పెట్టుకున్నారు. అప్పట్లోనే తనలోని విలక్షణతని చాటారు!


పెళ్ళి.. పిల్లలు

1961 ఆగస్టున 19న తాతినేని రమాదేవిని పెళ్ళి చేసుకున్నారు. విజయవాడ పక్కనున్న పెనమలూరు ఆమెది. బెజవాడ కనకదుర్గ గుడి దగ్గర్లోని కన్యకాపరమేశ్వరి మందిరంలో 1961 ఆగస్టు 19న వివాహం జరిగింది. 1962 మే 21న పెద్ద కుమారుడు కిరణ్‌ పుట్టారు. ఆయనే ఇప్పుడు ఈనాడు మేనేజింగ్‌ డైరెక్టర్‌. సంస్థను మరింత అభివృద్ధి చేయడానికి సృజనాత్మక ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు. 1966 డిసెంబర్‌ 23న రెండో కుమారుడు సుమన్‌ జన్మించారు. ఈటీవీ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా రచన, దర్శకత్వం, నటన, నిర్మాణం.. ఇలా అన్ని విభాగాలనూ ఒక్క చేతిమీద నడిపారు. జీవించి ఉంటే తండ్రిని మించిన తనయుడిగా ఎదిగేవారేమో కానీ- దురదృష్టవశాత్తూ 2012లో అనారోగ్యంతో కన్నుమూశారు.


మానసపుత్రిక!

ఎన్ని వ్యాపారాలున్నా- రామోజీరావుకు ఈనాడు తరువాతే అన్నీ. ఈనాడును తన మానస పుత్రికగా చెప్పుకుంటారు. తెల్లవారకముందే దినపత్రిక పాఠకుడి చేతికి చేరాలన్న లక్ష్యంతో ఆయన ప్రారంభించిన ఈనాడు అచిరకాలంలోనే రాష్ట్రంలో నంబర్‌-1 పత్రికగా ఎదిగింది. జిల్లాకొక అనుబంధ పత్రికని పరిచయం చేసి, ఆదివారం అనుబంధాన్ని పుస్తక రూపంలో తీసుకొచ్చి పత్రికా రంగంలో పెనుసంచలనం సృష్టించారాయన. మహిళల కోసం ప్రత్యేకంగా ‘వసుంధర’ పేజీని మొదలుపెట్టి సరికొత్త విప్లవానికే కారణమయ్యారు. చదువు, సుఖీభవ, ఈ-నాడు, సిరి, ఈతరం, హాయ్‌బుజ్జీ, మకరందం, ఆహాలతో తెలుగు పాఠక లోకాన్ని ఆశ్చర్యానందాలలో ఓలలాడించారు.


మార్గదర్శి..!

డిగ్రీ పూర్తయ్యాక రామోజీరావు దిల్లీలోని ఓ యాడ్‌ ఏజెన్సీలో ఆర్టిస్టుగా చేరారు. రామోజీరావులోని సహజ ప్రతిభకి దిల్లీ జీవితం మెరుగుపెట్టింది. తానెన్నో గొప్ప విజయాలు సాధించవచ్చన్న ఆత్మవిశ్వాసాన్ని సొంతం చేసుకుని... 1962లో మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ని స్థాపించారు. ఎన్నో సవాళ్ళ మధ్య పట్టుదలగా ముందుకు సాగారు. వసూళ్లు, చెల్లింపులు కచ్చితంగా ఉండేలా చూడటంతో ఖాతాదారుల్లో విశ్వాసం ఏర్పడింది. వాళ్ళ దన్నుతో పలు రాష్ట్రాలకి విస్తరించారు. మార్గదర్శి నేడు సుమారు పదిన్నరవేల కోట్ల పైచిలుకు టర్నోవర్‌తో దేశంలోనే నంబర్‌ వన్‌గా విరాజిల్లుతోంది.


కోడళ్ళూ..

రామోజీ పెద్ద కుమారుడు కిరణ్‌ వివాహం 1989 నవంబరు 5న శైలజతో జరిగింది. మార్గదర్శి ఎండీగా శైలజ ఆ సంస్థను వేగంగా విస్తరిస్తున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు. సహరి, బృహతి, దివిజ. 1993 మే 29న విజయేశ్వరితో సుమన్‌ వివాహం జరిగింది. అనంతరకాలంలో రామోజీ ఫిల్మ్‌సిటీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన విజయేశ్వరి ఆ సంస్థను విజయపథంలో నడిపిస్తున్నారు. సుమన్‌ దంపతులకు ఇద్దరు పిల్లలు. కుమార్తె కీర్తి సోహన, కుమారుడు సుజయ్‌.

తాతయ్య కోరిక అదే!

అతిథి పాత్రలో!

రామోజీరావు కళాభిమాని, కళాపోషకుడు, సంగీత ప్రియుడు. చిన్నప్పటి నుంచీ నాటకాలు, సాంస్కృతిక కార్యక్రమాలంటే చెప్పలేనంత ఇష్టం. ఆ ఇష్టంతోనే చిన్నతనం నుంచీ వాటిల్లో ఉత్సాహంగా పాల్గొనేవారు. ఆ ఆసక్తితోనే ఓ చిత్రంలో అతిథి పాత్రలోనూ నటించారు రామోజీరావు. విశ్వేశ్వరరావు 1978లో నిర్మించిన ‘మార్పు’ చిత్రంలో ఆయన న్యాయమూర్తి పాత్రను పోషించారు. కావడానికి అది చిన్న పాత్ర అయినా.. సినిమా పోస్టర్లపైన అప్పట్లో రామోజీరావు బొమ్మను ప్రచురించారు!


ఈటీవీ.. మీటీవీ

ఈటీవీ తెలుగు ఛానల్‌ 1995 ఆగస్టు 27న మొదలైంది. తెలుగుదనం ఉట్టిపడే ధారావాహికలు, కార్యక్రమాలతో ఈటీవీ ఇంటింటి టీవీ అయింది. నిరంతర వార్తా ప్రసారాలే లక్ష్యంగా 2003 డిసెంబర్‌ 28న ఈటీవీ-2 ప్రారంభమైంది. 2019లో మరో అద్భుత ప్రయోగానికి ఆద్యులయ్యారు రామోజీరావు. అదే ఈటీవీ భారత్‌. అప్పటిదాకా ఆన్‌లైన్‌ న్యూస్‌ ఆప్‌ల గురించే పాఠకులకి తెలుసు. ఒకే సంస్థ నుంచి, ఒకే ఆప్‌ ద్వారా రెండు మూడు భాషలకి చెందిన వార్తలు రావడమూ నాడు కొత్త కాదు. కానీ పదికిపైగా భాషలకి సంబంధించిన న్యూస్‌ వీడియోలు ఒకే ఆప్‌లో- అదీ ఎప్పటికప్పుడు లైవ్‌గా రావడం- ఓ అపూర్వ ప్రయోగం. 24 రాష్ట్రాలకి చెందిన పదమూడు భాషల్లో వచ్చే నిరంతర దృశ్య-వార్తా స్రవంతిగా మన్ననలందుకుంది ఈటీవీ భారత్‌. 2019లో ‘ఈటీవీ విన్‌’తో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకీ అడుగుపెట్టింది రామోజీ గ్రూపు.


ఉషాకిరణాలు

ఆరోగ్యకరమైన వినోదంతోపాటూ సందేశాత్మక కథా చిత్రాలు నిర్మించాలన్న సంకల్పంతో ‘ఉషాకిరణ్‌ మూవీస్‌ సంస్థ’ను ఏర్పాటు చేశారు రామోజీరావు. తొలి సినిమా ‘శ్రీవారికి ప్రేమలేఖ’తో మయూరి ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్‌ని ప్రారంభించారు. తెలుగు చిత్రాలనే కాకుండా ఇతర భాషా చిత్రాలను కూడా పంపిణీ చేస్తూ వచ్చారు. సుమారు రెండున్నర దశాబ్దాల కాలంలో వందల మంది కొత్త తారలనూ కళాకారులనూ సాంకేతిక నిపుణులనూ వెండితెరకు పరిచయం చేశారు.


పద్మ విభూషణుడు

రామోజీరావుకి 2016లో కేంద్రప్రభుత్వం అత్యున్నత పౌరపురస్కారాల్లో ఒక్కటైన పద్మవిభూషణ్‌ని అందించింది. అలాగే, ఈనాడు పత్రిక ద్వారా అక్షర సేద్యం చేసినందుకు 1986 నవంబరు 16న ‘ఆంధ్ర విశ్వకళాపరిషత్‌ స్నాతకోత్సవ సభ’లో ‘డి.లిట్‌’ను ప్రదానం చేశారు. 2001లో వివిధ రంగాల్లో సేవలగ్గాను యుధ్‌వీర్‌ పురస్కారాన్ని పొందారు. 1989లో శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం, 2015లో శ్రీశ్రీ రవిశంకర్‌ వర్సిటీ నుంచి డాక్టరేట్‌ను అందుకున్నారు. కానీ ఆయన ఎక్కడా ఎప్పుడూ డాక్టర్‌ రామోజీరావు అని ఇప్పటి వరకూ రాసుకోలేదు, తన పత్రికల్లోనూ రాయనివ్వలేదు!

Ramoji Rao: బాధ్యతల వీలునామా!


ఈనాడు జర్నలిజం స్కూలు

ఈనాడులో ఎప్పటి నుంచో పాత్రికేయులకు సమగ్ర శిక్షణ ఇస్తూ వచ్చినా దానికో ప్రత్యేక సంస్థంటూ లేదు. దీన్ని గుర్తించిన రామోజీరావు పటిష్ఠమైన శిక్షణ సంస్థగా 1990లో ఈనాడు జర్నలిజం స్కూలుని ప్రారంభించారు. ఈ స్కూలు జనపాత్రికేయాన్ని ప్రబోధిస్తూ వేలమంది సామాన్య యువకులను సుశిక్షిత పాత్రికేయులుగా తీర్చిదిద్దింది. ఈనాడు, ఈటీవీ, ఇంటర్‌నెట్‌, ఈటీవీ భారత్‌లకి క్రమశిక్షణ కలిగిన అక్షర సైనికులను అందిస్తోంది.గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు