Updated : 03 Jul 2022 07:05 IST

కంట్లోంచి బుల్లెట్‌ బయటకొచ్చింది!

రింకూ సింగ్‌ రాహీ... తాను పనిచేస్తున్న డిపార్ట్‌మెంట్‌లో 83 కోట్ల రూపాయల అవినీతిని గుర్తించారు. ఆ అక్రమాన్ని నిలదీసినందుకు ప్రత్యర్థులు చేసిన దాడిలో చూపునీ, వినికిడినీ కోల్పోయారు. అప్పటికీ ప్రశ్నించడం ఆపకపోవడంతో పిచ్చివాడనే ముద్రవేసి ఆసుపత్రిలో పడేశారు. అయినా అలుపెరగక ముందుకు సాగిన రింకూ సింగ్‌... అంతటి కష్టసమయంలోనూ పట్టుబట్టి చదివి ఇటీవలి సివిల్స్‌ ఫలితాల్లో 683వ ర్యాంకు సాధించి ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడు.  

అది 2009, మార్చి 26...

ప్రతిరోజూ ఉదయాన్నే ఆరింటికి లేచి బ్యాడ్మింటన్‌ ఆడటం నాకలవాటు. ఆ రోజు కూడా ఎప్పటిలానే లేచి ఆడుతుంటే ఓ పది మంది ముఖానికి నల్ల ముసుగులు వేసుకుని తుపాకులతో చుట్టుముట్టారు. ఏం జరుగుతోందో అర్థం చేసుకునేలోపే చెవి వెెనకభాగంలో దిగిన బుల్లెట్‌ కంటిలోంచి బయటకొచ్చింది. అంతలోనే దవడలో మరొకటి దిగిపోయింది. భుజం, పొట్ట, కాలు భాగాల్లో మరో ఐదు బుల్లెట్లు తూట్లు పొడిచాయి. రక్తపు మడుగులో కుప్పకూలిపోయాను. స్పృహ వచ్చేసరికి కళ్ల ముందు చిమ్మ చీకటి. ఎడమ చెవి ఏదో శబ్దంతో హోరెత్తిపోతోంది. నోరు తెరిచి మాట్లాడదామంటే గొంతు పెగలట్లేదు. భరించలేని నొప్పితో దవడ కదపడానికి కూడా రావట్లేదు. నా కదలికల్ని గమనించిన అమ్మానాన్నలు నా చేయి పట్టుకుని ‘లేచావా నాయనా... ఐదు రోజులకి కోమాలోంచి బయటపడ్డావు. లేదంటే నువ్వు దక్కవని చెప్పారు...’ అంటూ భోరున ఏడుస్తున్నారు. దాడి జరిగాక ఐదురోజులకు స్పృహలోకి వచ్చానని అప్పుడు అర్థమైంది. అంతేకాదు, బుల్లెట్‌ చీల్చుకుంటూ వెెళ్లడంతో కుడివైైపు చెవి వినికిడీ, కంటి చూపూ పూర్తిగా పోయాయి. పది ఆపరేషన్లతో ఒళ్లు హూనమైపోయింది. ప్రాణభయం లేదుగానీ, ఇంకా కొన్ని ఆపరేషన్లు చేయాలని డాక్టర్లు చెప్పారు. ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో... భరించలేని నొప్పుల్ని పంటిబిగువున అదిమి పట్టుకుని ఆసుపత్రి బెడ్‌పైన జీవచ్ఛవంలా పడి ఉన్న నాకు ఒక్కసారిగా గతమంతా కళ్ల ముందు మెదిలింది.

మాది ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలీగఢ్‌ జిల్లా డోంగ్రీ నగర్‌. నాన్న నడిపించే పిండి మిల్లే మాకు జీవనాధారం. నేనూ తమ్ముడూ, చెల్లీ కొన్నిసార్లు ఆకలితోనే పడుకునేవాళ్లం. మా కడుపు నింపడానికి అమ్మానాన్నలు పడుతున్న కష్టంచూసి బాధ కలిగేది. దాన్ని నేనెలా తీర్చాలా అని ఆలోచిస్తున్నప్పుడు చదువుకుంటే సమస్యలన్నీ తీరిపోతాయని మా మాస్టారు క్లాసులో చెప్పిన విషయం గుర్తొచ్చింది. నాన్నని ఇబ్బంది పెట్టకుండా గవర్నమెంట్‌ స్కూల్లోనే పదో తరగతి వరకూ చదువుకున్నా. స్కాలర్‌షిప్పుతో ఇంటర్‌ పూర్తి చేశా. జంషెడ్‌పూర్‌లోని ఎన్‌ఐటీ ప్రవేశ పరీక్ష రాసి మంచి ర్యాంకు తెచ్చుకుంటే ఉపకారవేతనంతో చదువుకోవచ్చని స్నేహితుల ద్వారా తెలిసింది. దాంతో ఆ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసి ఇంట్లోనే చదువుకుని ఆలిండియా స్థాయిలో 17వ ర్యాంకు తెచ్చుకోవడంతో క్యాంపస్‌లో ఉచితంగా సీటు వచ్చింది. అలా 2002లో బీటెక్‌ పూర్తి చేసిన నన్ను చాలామంది సాఫ్ట్‌వేర్‌కి మంచి డిమాండ్‌ ఉంటుంది అటువైైపు వెళ్లమని ప్రోత్సహించారు. అలా చేస్తే నా కోసం, నా కుటుంబం కోసమే బతికినవాడిని అవుతాను. అదే ప్రభుత్వాధికారిని అయితే జనం కోసం జీవించొచ్చని భావించి గ్రూప్‌-1కు ప్రిపేర్‌ అయ్యాను. తొలి ప్రయత్నంలోనే ర్యాంకు సాధించి ముజఫర్‌నగర్‌లోని జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి పోస్టుకు ఎంపికయ్యాను. ఇక కష్టాలన్నీ తీరిపోయినట్టేనని అమ్మానాన్నలు ఎంతో సంతోషించారు. నిజానికి నా జీవితంలో అసలు సమస్యలు అప్పుడే మొదలయ్యాయి. ఎలాగంటే, నేను ఉద్యోగంలో చేరిన కొత్తలో నా కింది ఉద్యోగులు అతి వినయం ప్రదర్శించడం గమనించాను. ‘మీరెందుకు కష్టపడటం... మీ పనులు కూడా మేమే చేసి పెడతాం. మీరు సంతకాలు పెట్టండి చాలు’ అని పదే పదే అనేవాళ్లు. ఆ మాటలు నాకు చాలా తేడాగా అనిపించేవి. ఒకసారి ఆఫీసులో ఆడిట్‌ జరిగినప్పుడు ఉపకార వేతనాలూ, పింఛన్ల కింద జారీ చేసిన 83 కోట్ల నిధుల్ని తప్పుదారి పట్టించినట్టు తేలింది. కింది స్థాయి అధికారుల్ని నిలదీస్తే ‘నీకెందుకూ, నీ పని నువ్వు చూసుకో...’ అని ఎదురు తిరిగారు. దాంతో  ఆధారాలతో సహా పట్టుకోవాలని నిర్ణయించుకున్నాను. అందుకు ఆఫీసులో ఉద్యోగులంతా ఒక్కటై వేేధించడం మొదలుపెట్టారు. ఆఫీసుకు వెెళ్లేసరికి నా కుర్చీని పక్కన పడేసేవారు. ప్యూను గదిని శుభ్రం చేయడం, నీళ్లూ- టీ ఇవ్వడం మానేశాడు. మిగతా వారూ ఇష్టారాజ్యంగా ప్రవర్తించేవారు. ఆధారాలు దొరికే వరకూ తొందరపడకూడదని ఎవరేమన్నా స్పందించేవాడిని కాదు, నా గదిని నేనే శుభ్రం చేసుకునేవాడిని. ఇంటి నుంచే నీళ్లూ, భోజనం, విస్తరాకులు తీసుకెళ్లేవాడిని. ఆఫీసు నుంచి ఇంటికెళ్లేప్పుడు చెత్తనీ నేనే బయట పడేసేవాడిని. అలా దాదాపు నాలుగైదు నెలలు ఇబ్బంది పడుతూనే నిధుల స్వాహా గురించి ఆరా తీశాను. పదేళ్లుగా సాంఘిక సంక్షేమ శాఖ నుంచి ఉపకార వేేతనం, పింఛను పొందేవారు. దాదాపు 47వేేల మంది అయితే 62వేేల మందికి పైన వాటిని అందజేస్తున్నట్టు చూపిన తప్పుడు లెక్కలు బయటకు తీశాను. అకౌంటెంట్‌కి చూపించి నిలదీసినా సమాధానం చెప్పలేదు. పై అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. పైగా ఇక్కడ అలాంటివన్నీ కామన్‌, కావాలంటే మీకు ఎంత కావాలో అంత తీసుకోండి అంటూ ఉచిత సలహాలు ఇచ్చేవారు. దాంతో ఇంకా ఆధారాల్ని పక్కాగా సేకరించి కోర్టుకెళదామని నిర్ణయించుకున్నాను. అప్పుడే నా కింది స్థాయి ఉద్యోగులూ, పై అధికారులూ రాజకీయ నాయకుల అండతో అవన్నీ చేస్తున్నారని తెలిసింది. వాళ్లు నా ప్రయత్నాలన్నీ ఆపడానికి- ఆఫీసుకు ఫోన్‌ చేసి, చంపేస్తామని బెదిరించేవారు. అవేవీ పట్టించుకునేవాడిని కాదు. సైన్యంలోకి వెెళ్లిన జవాను ప్రాణం గురించి ఆలోచిస్తే అర్థమేముంటుంది. నేనూ అంతే ఏ క్షణాన ఏమైనా జరగొచ్చు. దానికి నాకేమీ బాధ లేదు. కానీ, నా కుటుంబ సభ్యులకు మాత్రం ఇబ్బంది కలగకూడదని ఆరోగ్యబీమా, జీవిత బీమా తీసుకున్నాను. ప్రభుత్వం ఆరోగ్య బీమా ఇస్తుంది కదా ప్రత్యేకంగా తీసుకోవడం ఎందుకని చాలామంది అడిగారు. రేపు నాకేదన్నా అయితే నా కుటుంబానికి ప్రభుత్వం నుంచీ ఏదీ అందదని అర్థమయ్యే తీసుకున్నాను. అయితే నా తీరు ఎవరికీ మింగుడు పడక చంపేయాలని నిర్ణయించుకునే కాల్పులు జరిపారు.

బిల్లు కట్టుకున్నాను...

అలా ఆసుపత్రి పాలై నాలుగు నెలలపాటు చికిత్స తీసుకోవడంతో పాతికలక్షలపైనే బిల్లు అయింది. కానీ, నాపై జరిగిన దాడికీ, ఉద్యోగానికీ ఏ సంబంధం లేదని పై అధికారులు తేల్చారు. దాంతో ప్రభుత్వం నామమాత్రంగానే డబ్బు ఇచ్చింది. మిగతాది బీమా, యువత ఫండింగ్‌ ద్వారా అందించిన మొత్తంతో కట్టాను. తరవాత కొన్ని రోజులు రెస్టు తీసుకోమని డాక్టర్లు చెప్పినా పై అధికారులు మాత్రం ఉద్యోగంలో చేరాల్సిందేనని నోటీసులు పంపారు. దాంతో లేని శక్తిని కూడదీసుకుని ఆఫీసుకెళ్లేవాడిని. మరోవైైపు నాపైన దాడి చేసింది- ఆఫీసులో అవినీతికి పాల్పడిందీ మా డిపార్ట్‌మెంట్‌లోని ఉద్యోగులూ, మరికొందరు రాజకీయ నాయకులేనని పోలీసులకు ఫిర్యాదు చేశాను. అయితే అవినీతికి సంబంధించి పక్కా ఆధారాలు లేక వారంతా ఆ కేసు నుంచి తప్పించుకున్నారు. కానీ, నాపై దాడి చేసినందుకు మాత్రం ఒక వ్యక్తికి మాత్రమే పదేళ్లు జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. ఆ శిక్షతో పోలిస్తే చూపూ, వినికిడీ పోవడంతోపాటు దవడ ఛిద్రమై, పళ్లన్నీ ఊడిపోయిన నాకే పెద్ద శిక్షపడింది. శారీరక వైైకల్యం మిగిల్చిన బాధ కంటే దోషులు తప్పించుకున్నారనే బాధే ఎక్కువైైంది. అయినా సరే శారీరకంగా బలహీనుడినైనా మానసికంగా నన్ను నేను బలంగా ఉంచుకునే ప్రయత్నాలు చేసేవాడిని. దాంతోపాటు నాకు న్యాయం చేయాలని యువత బయట, సోషల్‌ మీడియాలోనూ పెద్ద ఎత్తున నిరసనలతో మద్దతు తెలిపేవారు. బయటకు వెళితే నా వెెనక సైన్యంలా ఉండేవారు. నేను కూడా ఎక్కడా తగ్గకుండా దోషులకు ఎలాగైనా శిక్ష పడేలా చేయాలని ఆర్టీఐ చట్టాన్ని ఆశ్రయించి- ముజఫర్‌నగర్‌లోని సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయానికి ప్రభుత్వం నుంచి గత పదేళ్లలో విడుదలైన నిధులెన్నో, ఎవరెవరికి అవి అందాయో, ఆ లబ్ధిదారుల వివరాలేంటో చెప్పమని అర్జీ పెట్టాను. అయినా నాకు ఎలాంటి సమాధానం రాకపోగా మళ్లీ బెదిరింపులు మొదలయ్యాయి. చావు అంచుల వరకూ వెళ్లిన నేను అవేేవీ లెక్క చేయలేదు. దాంతో 2010లో భదోహీ జిల్లాకి బదిలీ చేశారు. అయినా నేను ఆ విషయం వదల్లేదు. చివరికి ముజఫర్‌నగర్‌లో నిరాహారదీక్షకూ దిగా. దాంతో పోలీసులు నన్ను అరెస్ట్‌ చేసి స్టేషన్‌కి కాకుండా పిచ్చాసుపత్రిలో చేర్పించి- దుండగుల కాల్పుల్లో నా మతి భ్రమించిందనీ, అందుకే సరిగా ఉద్యోగం చేయట్లేదనీ, ఏవేేవో మాట్లాడుతున్నాననీ ఆరోపణలు చేశారు. కానీ డాక్టర్లు మాత్రం నా వైపే నిలబడి నేను ఫిట్‌గా ఉన్నట్టు సర్టిఫికెట్‌ ఇవ్వడంతో పోలీసులు ఇంటికి పంపారు. అప్పుడే నా గురించి తెలిసిన సామాజిక కార్యకర్త, అవినీతిపైన గొంతెత్తిన అన్నా హజారే వెెతుక్కుంటూ వచ్చారు. నన్ను తీసుకెళ్లి దిల్లీలో నిరాహార దీక్ష చేయించి నా అర్జీకి బదులివ్వాల్సిందేనని పట్టుబట్టారు. దాంతో సెంట్రల్‌ ఇన్ఫర్మేషన్‌ కమిషన్‌ స్పందించి నేను అడిగిన కొన్ని ప్రశ్నలకు బదులిప్పిచ్చింది. అలా పక్కా సాక్ష్యాధారాల్ని సేకరించిన నేను ప్రభుత్వానికీ, కోర్టుకీ వాటిని సమర్పించినా ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. దోషులు మాత్రం ఖద్దరు ధ]రించి జనాలను ఉద్ధరించే మాటలు చెబుతున్నారు. మరోవైపు నన్నెక్కడా స్థిరంగా పనిచేయనీయకుండా సంవత్సరానికి రెండుమూడు సార్లు బదిలీలు చేస్తూ ఇబ్బంది పెడుతుండేవారు. అయినా నేను ప్రతి విషయాన్నీ పాజిటివ్‌గా తీసుకుంటూ సివిల్స్‌ రాయడానికి సిద్ధమయ్యాను.

వింటూ ప్రిపేర్‌ అయ్యాను...

ఉద్యోగం చేస్తూ సివిల్స్‌కి ప్రిపేర్‌ అవుతుండగా అలీగఢ్‌ జిల్లాలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ‘డాక్టర్‌ భీమ్‌ రావ్‌ అంబేడ్కర్‌ ఐఏఎస్‌-పీసీఎస్‌ స్టడీ సెంటర్‌’కి డైరెక్టర్‌గా నన్ను బదిలీ చేశారు. అక్కడ విద్యార్థులు నన్ను చూసి స్ఫూర్తి పొందడం ఎంతో సంతృప్తినిచ్చింది. నేనూ అక్కడ అవినీతికి వ్యతిరేకంగా పాఠాలు చెప్పడంతోపాటు కొన్ని క్లాస్‌లు కూడా తీసుకునేవాడిని. రోజుకి ఇరవైై గంటలు ఆ విద్యార్థులతోనే గడిపేవాడిని. ఉద్యోగం, పోరాటం, దీక్షలతో గడిపిన నేను ఆ కొత్త ప్రపంచంలో చాలా వరకూ సాంత్వన పొందాను. కానీ క్రమంగా ఎడమ కన్ను చూపు కూడా మందగించడంతో చదవడానికి ఇబ్బంది పడేవాడిని. కాసేపు మాట్లాడితేనే దవడ విపరీతంగా నొప్పి పుట్టేది. కడుపు నిండా ఇష్టమైనవి తిందామంటే పెట్టుడు పళ్లతో కాస్త గట్టిగా ఏవీ నమలగలిగేవాడిని కాదు. జావలూ, మెత్తగా ఉడికించిన అన్నం, పళ్ల రసాలూ, ఇతర ఎనర్జీ డ్రింకులే తీసుకునేవాడిని. ఒకానొక సమయంలో ఆరోగ్యం సహకరించక సివిల్స్‌ ప్రయత్నాలు మానుకోవాలనుకున్నాను. ‘మీరు ఇక్కడ ఎలాగైనా గెలవాలి. మీ లాంటి వ్యక్తి ఈ సమాజానికి చాలా అవసరం. ఎన్నో ఎదురు దెబ్బలు తిన్న మీకు వైౖకల్యం అడ్డు కాకూడదు...’ అంటూ మా ఇన్‌స్టిట్యూట్‌లోని విద్యార్థులు నాకే మోటివేషనల్‌ క్లాస్‌లు చెప్పేవారు. ఆ మాటలు నా మీద మంత్రంలా పనిచేసేవి. లైటు వెలుతురులో పుస్తకం చూసి చదువుకోవడానికి¨ చూపు సహకరించక పగలు పాఠాలను రికార్డు చేసుకుని రాత్రిపూట వింటూ ప్రిపేర్‌ అయ్యేవాణ్ని. ఒక్కోసారి ఇంటికి కూడా వెెళ్లకుండా స్టడీ సెంటర్‌లోనే ఉండిపోయేవాణ్ని. అలా 39 ఏళ్ల వయసులో చివరి ప్రయత్నంగా గతేడాది యూపీఎస్సీ పరీక్షలు రాశాను. ఈ మధ్య వచ్చిన ఫలితాల్లో 683వ ర్యాంకు వచ్చింది. శిక్షణ పూర్తై కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టాక ఆఖరిశ్వాస వరకూ అవినీతిపైనే పోరాడతాను. ప్రభుత్వ సొమ్ము రూపాయి కూడా దుర్వినియోగం అవ్వకుండా సైనికుడిలా కాపుకాస్తాను.

- పద్మ వడ్డె


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


ఇంకా..

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని