ఆ రోజు ఎంత ఏడ్చానో!

మధుబాల... ముప్పయ్యేళ్ల క్రితమే పాన్‌ ఇండియా హీరోయిన్‌. మణిరత్నం దృశ్యకావ్యం ‘రోజా’లో ఆమె నటన యావద్దేశాన్నీ కట్టిపడేసింది.

Updated : 22 Feb 2024 16:37 IST

మధుబాల... ముప్పయ్యేళ్ల క్రితమే పాన్‌ ఇండియా హీరోయిన్‌. మణిరత్నం దృశ్యకావ్యం ‘రోజా’లో ఆమె నటన యావద్దేశాన్నీ కట్టిపడేసింది. సోగకళ్లు, మనసును దోచుకునే చిరునవ్వుతో అందానికి చిరునామా అనిపించుకున్న మధుబాల... కొన్నేళ్లకే వెండితెరకు దూరమైంది. సెకండ్‌ ఇన్నింగ్స్‌తో మళ్లీ తెరమీదకొచ్చిన ఆమె ‘శాకుంతలం’లో మేనకగా మన ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా మధుబాల తన సినీ ప్రయాణం గురించి ఏం చెప్పిందంటే...

సినిమా... సినిమా... సినిమా... చిన్నప్పట్నుంచీ ఈ పదమే వింటూ పెరిగా. బంధువులూ, స్నేహితులూ సినీ రంగానికి చెందినవారే. అమ్మ భరతనాట్యం డాన్సర్‌. కళాకారుల మధ్యలో పెరిగిన నాకూ చిన్నతనంలోనే హీరోయిన్‌ అవ్వాలనిపించింది. నా లక్ష్యానికి తగ్గట్టే ఇంటర్‌ రెండో సంవత్సరంలో ఓ సినిమాలో అవకాశం వచ్చింది. దర్శకుడే స్వయంగా మా ఇంటికొచ్చి ‘మీ అమ్మాయిని హీరోయిన్‌ని చేస్తా...’ అని నాన్నని ఒప్పించారు. ‘అబ్బా హీరోయిన్‌ అవ్వడం అంత తేలికా’ అనుకుంటూ గాల్లో తేలిపోయా. ‘నేను హీరోయిన్‌ అయిపోయానోచ్‌...’ అంటూ కాలేజీలో చిన్నపిల్లలా గెంతులేస్తూ అందరికీ గొప్పగా చెప్పుకున్నా. ఆ దర్శకుడు కూడా నన్ను హీరోయిన్‌గా ఎంపిక చేసినట్టు ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ చెప్పాడు. కానీ, మూడ్రోజులకు నా స్థానంలో మరో అమ్మాయిని తీసుకున్నట్టు పేపరులో వార్తొచ్చింది. నన్ను తీసేస్తున్నట్టు కనీసం ఒక్క మాట కూడా చెప్పలేదు. కారణం చెప్పడానికి కూడా దర్శకనిర్మాతలు ఇష్టపడలేదు. బంధువుల ముందూ, కాలేజీలో స్నేహితుల దగ్గరా అవమానంగా అనిపించింది. పదహారేళ్ల వయసులో ఆ బాధను భరించలేకపోయా. గదిలో ఒంటరిగా ఏడ్చేదాన్ని. క్రమంగా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయా. అయితే ఆ చీకటి రోజులే నన్ను నాకు పరిచయం చేశాయి. నేనేంటో, నేనేం అవ్వాలో కూడా తెలియజెప్పాయి. మరి అలాంటి తీవ్ర వేదన నుంచి... ఉత్తమ నటిగా అవార్డు అందుకోవడం, రోజాగా గుర్తింపు పొందడం వరకూ నా ప్రయాణం ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తుంది.

మాది తమిళనాడు. కమల్‌హాసన్‌, సుహాసినిలు మా అమ్మకి బంధువులు. నాన్న ఉద్యోగరీత్యా దిల్లీలో ఉండేవాళ్లం. ఐదేళ్ల వయసు నుంచే అమ్మ నాకు భరతనాట్యం నేర్పించింది. ఎనిమిదేళ్లు వచ్చే వరకూ దిల్లీలోనే చదువుకున్నా. ఆ తరవాత నాన్న సినిమాల మీద ఆసక్తితో ఉద్యోగం మానేసి ముంబయి వచ్చారు. నిర్మాతగా సినిమాలు తీయడం మొదలుపెట్టారు. మరోవైపు  నాకు నాట్యం నేర్పిస్తూ... అరంగేట్రం చేయించాలనే ఆలోచనలో ఉండేది అమ్మ. దురదృష్టవశాత్తూ నా పదమూడో ఏట క్యాన్సర్‌ అని గుర్తించేలోపే అమ్మ కన్నుమూసింది. ఆడపిల్లకు ముఖ్యంగా టీనేజ్‌లో అమ్మ అవసరం చాలా ఎక్కువ. అలాంటి సమయంలో తన మరణం నన్ను ఎంతో కుంగదీసింది. చదువుకోలేకపోయేదాన్ని. ఒంటరితనంతో బాధపడేదాన్ని. అంతేకాదు, వయసు పెరిగే కొద్దీ నేను అందంగా లేనేమో, నా వయసు వాళ్లతో ఎందులోనూ పోటీ పడలేనేమోనని లోలోపల మథనపడేదాన్ని. నన్ను నేను తక్కువ చేసుకునేదాన్ని. నాన్న ప్రేమగానే చూసుకున్నా, అమ్మ లేని లోటు మాత్రం ఉండేది. నా ఆలోచనల్ని సరిదిద్దే మనుషులు లేక మానసికంగా నలిగిపోయా. అయితే, ఇంటర్‌లో ఉన్నప్పుడు ‘మీ అమ్మాయిని మేం హీరోయిన్‌గా పరిచయం చేస్తాం’ అని ఓ దర్శకుడు నాన్నని సంప్రదించాడు. నాకు హీరోయిన్‌ అవ్వాలనే ఆలోచన లేదనుకుని ‘మా అమ్మాయికి ఆసక్తిలేదు. తను డాక్టర్‌ అవుతుంద’ని చెప్పి మరీ వాళ్లను పంపించేశారు నాన్న. నాకు చిన్నప్పటి నుంచే సినిమాల్లో నటించాలని ఉన్నా నాన్నకి ఎప్పుడూ ఆ విషయం చెప్పలేదు. ఆ సంభాషణ తరవాతే మనసులో మాట చెబితే నాన్న షాక్‌ అయ్యారు. తరవాత ప్రోత్సహించడం మొదలుపెట్టారు. అవకాశాన్ని ఇంటివరకూ తెచ్చిన దర్శకుడితో మాట్లాడారు. అలా వచ్చిన మొదటి అవకాశం చేజారిపోవడం తట్టుకోలేకపోయా. అదే జీవితం కాదు, అక్కడితో ఆగిపోకూడదని చెబుతూ కాలేజీకి వెళ్లేలా చేశారు నాన్నా, అన్నయ్యలూ. కాలేజీలో కూడా అందరూ మద్దతుగా మాట్లాడటంతో మనసు కాస్త తేలిక పడింది. అందం, నైపుణ్యాల పరంగా నన్ను నేను మెరుగుపరచుకోవాలనుకున్నా. డిగ్రీ చదువుతూనే- బరువు తగ్గడం, సినిమా డాన్స్‌, డ్రైవింగ్‌, ఈత, ఫ్యాషన్‌ డిజైనింగ్‌, హార్స్‌ రైడింగ్‌... వంటివన్నీ నేర్చుకోవడం మొదలుపెట్టా. నేను అందంగా లేనేమోననే భావనను మనసులోంచి తీసేసి- ఎలా అందంగా కనిపించాలో సాధన చేసేదాన్ని. మూడేళ్లపాటు నన్ను నేను పూర్తిస్థాయిలో మార్చుకున్నా.

ఆడుతుంటే చూసి...

డిగ్రీ అయ్యాక ఒకరోజు అన్నయ్యతో కలిసి క్రికెట్‌ ఆడటం చూశారు దర్శకుడు కె.బాలచందర్‌ సర్‌. మర్నాడు నాన్నకి ఫోన్‌ చేసి ‘మీ అమ్మాయి నా సినిమాలో హీరోయిన్‌. మీకు ఓకే కదా’ అని అడిగారట. పెద్ద దర్శకుడు పిలిచి ఆఫర్‌ ఇస్తే ఎలా కాదంటాం. అలా 1991లో ‘అళగన్‌’తో సినీరంగంలోకి వచ్చా. ఆస్కార్‌ అందుకున్న కీరవాణిగారికి కూడా తమిళంలో అదే మొదటి సినిమా. ఆ తరవాత వచ్చిన ‘ఫూల్‌ ఔర్‌ కాంటే’లో అజయ్‌దేవగణ్‌ సరసన తల్లి పాత్రలో నటించా. నిండా ఇరవై ఏళ్లు కూడా లేని నేను ఆ పాత్ర ఒప్పుకున్నందుకు చాలామంది చెవులు కొరుక్కున్నారు. అలాంటి పాత్రలు చేస్తే కెరీర్‌ ఉండదన్నారు. కానీ ఆ సినిమాకి బెస్ట్‌ ఫిమేల్‌ డెబ్యూగా ఫిల్మ్‌ఫేర్‌ అందుకున్నా. మలయాళంలో మోహన్‌లాల్‌, మమ్ముట్టి సినిమాల్లోనూ అవకాశాలు వచ్చాయి. ‘వానమే ఎల్లై’లో మరోసారి బాలచందర్‌ సర్‌ దర్శకత్వంలో నటిస్తుండగా - ఒకరోజు షూటింగ్‌ మధ్యలో ఆపేసి ‘మణిరత్నంతో ఒకసారి మాట్లాడు...’ అంటూ ఆయన చిరునామా చేతిలో పెట్టారు. తీరా వెళ్లాక అక్కడ మా కజిన్‌ సుహాసిని ఉంది. మాటల మధ్యలో ‘నువ్వు మోడ్రన్‌ లుక్‌లో ఉన్నావు. ఒకసారి జడ వేసుకుని చీరకట్టుకో’ అని నన్ను రెడీ చేసింది. కొన్ని ఫొటోలు తీశారు. వెళ్లే ముందు మణిరత్నం సర్‌ కాసేపు మాట్లాడి ‘మా తరవాతి సినిమాలో మీరే హీరోయిన్‌’ అన్నారు. అది ఆడిషన్‌ అనీ, అప్పటికే వేలమందిని పరిశీలించారనీ అప్పుడే చెప్పారు. అదే ‘రోజా’ సినిమా. మనాలిలో చిత్రీకరణ జరిగింది. మంచుకొండల్ని చూసినప్పుడు రోజా ముఖంలో అమాయకత్వంతో కూడిన ఆశ్చర్యం కనిపిస్తుంది. నేనూ నిజంగానే అలా ఫీలయ్యా. ‘పరువం వానగా...’ పాటకోసం ఎత్తైన కొండ మీదకు వెళుతుంటే- ఆ మంచు కరిగిపోతే సమాధి అయిపోతామని భయమేసింది. మంచు దుప్పటి కప్పుకున్న ఆ పర్వతాన్ని చూసి థ్రిల్లింగ్‌గానూ అనిపించింది. ‘రోజా’ విడుదలయ్యాక దేశవ్యాప్తంగా నాపేరు మార్మోగింది. ఎక్కడికెళ్లినా చిన్నపిల్లల నుంచి పెద్దల వరకూ రోజా అంటూ ఆప్యాయంగా పలకరించేవారు. ఇప్పటికీ నన్ను రోజా మధుబాల అనే అంటారు. అదే ఇంటి పేరైంది. జయ అమ్మ చేతుల మీదుగా తమిళనాడు ప్రభుత్వ అవార్డునూ అందుకున్నా. ఆ తరవాత సినిమా ఆఫర్లు ఎక్కువయ్యాయి. ఒకేసారి హిందీ, తమిళం, మలయాళం, తెలుగు, కన్నడలో చేసేదాన్ని. ‘అల్లరి ప్రియుడు’, ‘జెంటిల్‌మెన్‌’, ‘ఆవేశం’, ‘పుట్టినిల్లా మెట్టినిల్లా’, ‘గణేశ్‌’లోని పాత్రలూ మంచి పేరు తెచ్చిపెట్టాయి. చేతిలో అవకాశాలున్నా పెళ్లి తరవాత సినిమాలకు దూరంగా ఉండాలనుకున్నా. నా నిర్ణయం సినీ రంగంలో అందర్నీ ఆశ్చర్యపరిచింది. 1997లో కొత్తవేవీ ఒప్పుకోకుండా చేతిలో ఉన్న సినిమాలు పూర్తి చేసి రెండేళ్లకి పెళ్లి చేసుకున్నా. మూడేళ్లు తిరిగేసరికి ఇద్దరు పిల్లలకు తల్లినయ్యా.  

లోటు తెలిసింది

 పిల్లల్ని పెంచుతుంటే కొంత కాలం నాకు  తెలియకుండానే సమయం గడిచిపోయింది. వాళ్లు స్కూళ్లకు వెళ్లడం మొదలుపెట్టాక మాత్రం ఏదో వెలితి. కుటుంబంతో సంతోషంగా ఉన్నా, నాకోసం నేను బతకట్లేదనిపించేది. తెలియని ఒంటరితనం ఆవహించింది. దానికితోడు ఏమీ సాధించలేకపోయానే అన్న భావన మనసును తొలిచేది. ఆ దిగులుతో బరువు పెరిగా. ఒకరోజు నన్ను నేను అద్దంలో చూసుకుని ఎంతో బాధపడ్డా. అప్పట్నుంచీ ఆలోచనలు మార్చుకుని ఆధ్యాత్మిక పుస్తకాలు చదివేదాన్ని, యోగా, ధ్యానం చేసేదాన్ని. పిల్లలకు సమయం కేటాయిస్తూనే సెకండ్‌ ఇన్నింగ్స్‌ మీద దృష్టి పెట్టా. 2008లో ఓ హిందీ సినిమాతో మళ్లీ తెరంగేట్రం చేశా. తెలుగులో ‘అంతకు ముందు ఆ తరవాత’, ‘సూర్య వర్సెస్‌ సూర్య’, ‘నాన్నకు ప్రేమతో’, ‘కాలేజ్‌ కుమార్‌’, ‘తలైవి’, ‘ప్రేమదేశం’ తదితర సినిమాలతోపాటు వెబ్‌ సిరీస్‌లూ చేశా. ఈ మధ్య వచ్చిన ‘రిపీట్‌’లో సీరియస్‌ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో కనిపించా. ‘శాకుంతలం’లోని మేనక పాత్ర కోసం గుణశేఖర్‌ సర్‌ సంప్రదించినప్పుడు వెంటనే ఒప్పుకున్నా.  కాస్ట్యూమ్స్‌ వేసి చూశాక రెండు కిలోల బరువు తగ్గమన్నారు. అందుకు తగ్గట్టు సిద్ధమై ‘శాకుంతలం’ సెట్‌లోకి వెళ్లాక బాలచందర్‌ సర్‌, రాఘవేంద్రరావుగారి రోజులు గుర్తొచ్చాయి. పైగా సింగిల్‌ టేక్‌లోనే నా సీన్స్‌ అన్నీ ఓకే చేశారు. ఇప్పటి వరకూ నేను చేసిన పాత్రలు ఒకెత్తు అయితే... మేనక పాత్ర ఇంకో ఎత్తు. ఆ సంతృప్తి నాకు అవార్డు వచ్చినంత ఆనందాన్నిచ్చింది.

బాలి బీచ్‌లో కలిశా

మావారు ఆనంద్‌ షా గుజరాతీ. వ్యాపారం దృష్ట్యా ముంబయిలో స్థిరపడ్డారు. స్నేహితుల ద్వారా  పరిచయం అయ్యారు. ఓ స్నేహితుడు ప్రకటన చిత్రీకరణ ఉందని అబద్ధం చెప్పి నన్ను బాలి తీసుకెళ్లాడు. ఆనంద్‌తో మాట్లాడించాలనే ఉద్దేశంతో తనలా చేశాడు. బాలి బీచ్‌లో ఇద్దరం చాలాసేపు మాట్లాడుకున్నాం. కాసేపటికి ‘పెళ్లి చేసుకుందామా...’ అని అడిగాడు ఆనంద్‌. నాకూ తను నచ్చడంతో వెంటనే ఒప్పేసుకున్నా. నాన్నకీ తన కుటుంబం నచ్చడంతో పెళ్లికి అంగీకరించారు. పైగా సినిమాల వల్ల కుటుంబానికి సమయం కేటాయించలేనేమో అనే భయంతోనే ఆ రంగానికి కొంత కాలం దూరమయ్యా. పిల్లలు కాస్త ఎదిగాక నటన మీద దృష్టి పెట్టా. మా అమ్మాయిలు అమేయ, కేయ... ఇద్దరూ విదేశాల్లో చదువుకుంటున్నారు.  

పేరు మారింది

నా అసలు పేరు పద్మ మాలిని. నా  చిన్నతనంలో మా పక్కింట్లో ఉండే ఆంటీ- నన్ను మధు అని పిలిచేవారు. ‘నువ్వు చాలా మంచి అమ్మాయివి. తేనెలా మధురంగా అనిపిస్తుంది నీ మాట’ అనేవారు. దాంతో అందరూ మధు అని పిలిచేవారు. చివరికి నాన్న స్కూల్లో చేర్చినప్పుడు నా పేరును మధు మాలినిగా రాయించారు. సినిమాల్లోకి వచ్చాక మధు అంటే అబ్బాయి పేరులా ఉంది. దాని పక్కన బాల లేదా మాల ఉంటే బాగుంటుంది అన్నారు బాలచందర్‌ సర్‌. దాంతో నేను బాల ఎంచుకుని మధుబాలగా మార్చుకున్నా. పెళ్లయ్యాక ఆ పేరు కాస్త మధు షాగా మారింది.  

* నటి హేమమాలిని మా మేనత్త కూతురు. జూహీ చావ్లా భర్తా, మావారూ కజిన్స్‌. అలా తను నాకు ఆడపడుచు వరస అవుతుంది. రమ్యకృష్ణ బెస్ట్‌ ఫ్రెండ్‌.

అందరూ నాకు సాఫ్ట్‌ పాత్రలు నప్పుతాయి అనుకుంటారు. కానీ, హంతకురాలు, దెయ్యం తరహా పాత్రల్లో నటించాలన్నది నా కోరిక.

*నటి భాగ్యశ్రీ, పూజాభట్‌లు నా క్లాస్‌మేట్స్‌. ముగ్గురం క్లాస్‌లు ఎగ్గొట్టి క్యాంటీన్‌లో కబుర్లు చెప్పుకునేవాళ్లం. అప్పుడప్పుడూ సినిమాలకూ వెళ్లేవాళ్లం.

*రజనీకాంత్‌తో నటించలేదనే లోటు మిగిలిపోయింది. ఇకమీదటైనా ఆ అవకాశం వస్తుందేమో చూడాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..