Published : 24 Apr 2022 01:25 IST

ఆలయాల ముందు అగరుబత్తీలు అమ్మాడు..!

మీరు ఏ అంగడి వీధిలోనో వెళుతున్నారనుకుందాం. అక్కడి షాపుల్లో కొనాలనుకున్న చిన్న వస్తువేదో తన దగ్గర తీసుకొమ్మని ముక్కుపచ్చలారని పిల్లాడెవరైనా వెంటపడుతుంటే... అందరిలా చిరాకుపడకండి, కాసింత జాలి చూపండి. ఏమో... మీరు చేసే ఆ చిన్న ‘సాయం’ భవిష్యత్తులో ఆ చిన్నారిని ఓ గొప్ప విద్యావేత్తని చేయొచ్చు! నమ్మరా... అయితే మీరోసారి యూపీఎస్‌సీ కొత్త ఛైర్మన్‌ మనోజ్‌ సోని కథని తెలుసుకోవాలి. ఆలయ వీధుల్లో అగరుబత్తీలు అమ్మడం నుంచి ఐఏఎస్‌లని ఎంపిక చేసేదాకా సాగిన ఆ ప్రయాణాన్ని చదవాలి...

భులేశ్వర్‌... ముంబయిలోని అతిపెద్ద షాపింగ్‌ సెంటర్‌లలో ఒకటి. ముంబయికి ఆ పేరుతెచ్చిన ముంబాదేవి ఆలయం ఇక్కడే ఉంటుంది. పొట్టచేతబట్టుకుని ఇతర రాష్ట్రాల నుంచి  వచ్చినవాళ్లందరూ తలదాచుకునే ప్రాంతాల్లో ఇదీ ఒకటి. అలా గుజరాత్‌ నుంచి వచ్చి ఈ ప్రాంతంలో స్థిరపడ్డవాళ్లలో రిలయన్స్‌ వ్యవస్థాపకుడు ధీరూబాయ్‌ అంబానీ కూడా ఒకరు. ఆయన సాధించిన విజయం స్ఫూర్తితో ఇతర గుజరాతీ వ్యాపారులు ముంబయి వస్తుంటే... వాళ్లని ఆశ్రయించిన కూలీలెందరో ఇక్కడికొచ్చి స్థిరపడ్డారు. ఆ కూలీ కుటుంబాల్లో మనోజ్‌ తండ్రి మోహన్‌ సోనీదీ ఒకటి. మొదట్లో వ్యాపారులని ఆశ్రయించుకుని పనులు చేస్తూ వచ్చిన ఆయన... ఆ తర్వాత చిరువ్యాపారంలోకి దిగాడు. భులేశ్వర్‌ ప్రాంతంలోని మంగళ్‌దాస్‌ మార్కెట్‌ ప్లాట్‌ఫామ్‌పైన... చవక రకం రెడీమేడ్‌ దుస్తుల్ని అమ్మడం ప్రారంభించాడు. ఆయనకున్న ముగ్గురు పిల్లల్లో పెద్దవాడు మనోజ్‌. భులేశ్వర్‌లోని సర్కారు బడిలో చదువుతుండేవాడు. బడి పూర్తయ్యాక వాళ్ల నాన్నతోపాటూ షాపులో ఉండేవాడు. ‘10 రూపాయలకి రెండు షర్టులమ్మా... రండి... రండి..!’ అంటూ వాళ్ల నాన్నని అనుకరిస్తుండేవాడు. ఐదో తరగతి చదువుతున్నప్పుడు ఓ రోజు ఎప్పట్లాగే దుకాణం దగ్గరకి వెళ్లిన మనోజ్‌కి అక్కడ వాళ్ల నాన్న కనపడలేదు. అమ్మ మాత్రమే ఉంది. ‘నాన్నేడమ్మా...!’ అంటే ‘తలనొప్పని ఇంటికి వెళ్లాడ్రా!’ అంది. రాత్రి తల్లీకొడుకులిద్దరూ దుకాణం మూసేసి... ఇంటికి వచ్చినా ఆయన అలా పడుకునే ఉన్నాడు. అలా పడుకున్నవాడు... మళ్లీ లేవనేలేదు. నిద్రలోనే గుండెపోటు వచ్చిందన్నారు. కారణం ఏదైనా... ఆ కుటుంబం వీధినపడింది. ముగ్గురు పిల్లల కడుపు నింపడానికని ఆ తల్లి కూలికెళ్లడం ప్రారంభించింది. ఆమెకి ఎంతోకొంత తోడ్పడాలని ఉదయం సాయంత్రాల్లో తానూ అగరుబత్తీలు అమ్మడం మొదలుపెట్టాడు మనోజ్‌. భులేశ్వర్‌లో ప్రసిద్ధ ముంబాదేవి ఆలయంతోపాటూ మరో వంద గుళ్ళున్నాయి. బడి నుంచి రాగానే రోజుకో గుడిని ఎంచుకుని అక్కడికి వెళుతుండేవాడు. ‘ఒక్క ప్యాకెట్‌ తీసుకోండి సార్‌... ప్లీజ్‌!’ అంటూ భక్తుల వెంటపడుతుండేవాడు. ఎవరెంత చిరాకుపడ్డా చిర్నవ్వుతో ఎదుర్కోవడం అప్పుడే నేర్చుకున్నాడు. ఆ పరిణతికి పరిశ్రమ తోడై... మూడేళ్లలో చురుకైన కుర్రాడిగా పేరుతెచ్చుకున్నాడు. అలా భులేశ్వర్‌లోని ‘స్వామినారాయణ్‌ మందిరం’ నిర్వాహకుల దృష్టిలో పడ్డాడు. మనోజ్‌ ద్వారా ఆ కుటుంబం దైన్యాన్ని తెలుసుకున్నారు ఆ నిర్వాహకులు. ఓసారి అతని తల్లిని పిలిచి ‘మీ అబ్బాయి చాలా తెలివైనవాడు... చదివితే అద్భుతాలు చేస్తాడు. మేం వాణ్ణి పెద్ద చదువులు చదివిస్తాం. కాకపోతే ఇక్కడ కాదు... గుజరాత్‌లోని ఆనంద్‌లో!’ అని చెప్పారు. ఆ దయకి కన్నీటిపర్యంతమైపోయారు ఆ తల్లీకొడుకులు. ‘వాడు వెళ్లిపోతే మాకు మాత్రం ఇక్కడేం పని సార్‌! మేమూ వస్తాము... నాకూ అక్కడ ఏదో ఒక పనిచూపండి!’ అని వేడుకుంది ఆ తల్లి. అలా ఆ కుటుంబం గుజరాత్‌ ఆనంద్‌ జిల్లాలోని మోగ్రీ అన్న ప్రాంతానికి వచ్చేసింది.

ఇంటర్‌ ఫెయిలై... మళ్లీ!

స్వామినారాయణ్‌... హిందూ వైష్ణవ సంప్రదాయంలో ఇదో ప్రత్యేక మార్గం. శ్రీరామానుజాచార్యుల విశిష్టాద్వైతం, వల్లభుడి పుష్టిమార్గం పద్ధతులని జోడించి 19వ శతాబ్దంలో స్వామి సహజానంద దీన్ని రూపొందించారు. కులాలకి అతీతంగా మానవసేవలో మాధవుణ్ణి చూడటమే ఈ మార్గం ప్రధాన సూత్రం. ఈ మార్గానికి చెందిన ‘అనుపమ్‌ మిషన్‌’ అన్న ఆశ్రమం ఆనంద్‌ జిల్లాలోని మోగ్రీలో నడుస్తుండేది. మనోజ్‌ కుటుంబం అందులోనే పనిచేయడం మొదలుపెట్టింది. అతని తల్లికిచ్చిన మాటప్రకారమే ఆశ్రమం వాళ్లు ఓ మంచి బడిలో చేర్చారు. అలా పదో తరగతి పాసై... ఇంటర్‌లో సైన్స్‌ గ్రూపు తీసుకున్నాడు. తొలిసారి ఇంగ్లిషు మీడియం కావడం, సైన్స్‌ సబ్జెక్టులేవీ కొరుకుడు పడకపోవడంతో ఇంటర్‌ ఫెయిలైపోయాడు. ‘పేదవాణ్ణని జాలితలచి ఆశ్రమం నిర్వాహకులు చదివిస్తుంటే బుద్ధిగా చదువుకోక ఇలా ఫెయిలైపోయానేమిటీ... అన్న బాధ నన్ను నిలువెల్లా దహించింది. ఆశ్రమం నాపైన పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేశానన్న భావనతో కుంగిపోయాను. అక్కడితో చదువు మానేద్దామనుకున్నాను. కానీ ఆశ్రమంవాళ్లు అందుకు ఒప్పుకోలేదు. పైగా, నా శ్రమలో లోపమేం లేదని పెద్ద మనసుతో అర్థం చేసుకున్నారు. ఆర్ట్స్‌ సబ్జెక్టు తీసుకుని మరో ఏడాదిపాటు చదివి... పాస్‌కావాలని ఆదేశించారు. ఆశ్రమంలో చదివేవాళ్లలో ఎవరికీ దక్కని అరుదైన అవకాశం అది!’ అంటారు మనోజ్‌. ఆ అవకాశాన్ని అద్భుతంగా సద్వినియోగం చేసుకున్నారాయన. ఈసారి ఫస్ట్‌క్లాసులో పాసయ్యారు. ఆ తర్వాత నుంచి ఆయన తిరిగి చూసుకున్నదే లేదు...

ఒక్కో అడుగూ వేస్తూ...

చదువులో ఒక్క ఏడాది వెనకపడితేనేం... డిగ్రీలో ఆశ్రమం విద్యార్థుల్లోనే నంబర్‌వన్‌ అనిపించుకున్నారు మనోజ్‌. ‘పొలిటికల్‌ సైన్స్‌’పైన మక్కువ పెంచుకున్నారు. ఆ స్పెషలైజేషన్‌తో 1990లో పీజీ చేశారు. అనుపమ్‌ మిషన్‌ ఆశ్రమంలో చదువుకున్నవాళ్లందరూ... ఏదోరకంగా అక్కడ సేవ చేస్తుండాల్సిందే. ఖాళీ ఉన్నప్పుడల్లా తన తల్లితోపాటూ ఆశ్రమంలో సేవలు అందించేవారు మనోజ్‌. పీజీ తర్వాత అక్కడే తొలిసారి టీచర్‌ అయ్యారు. ఆ ఆశ్రమం పాలనని కంప్యూటరీకరించి... ప్రత్యేకంగా ఐటీ సెంటర్‌ని స్థాపించారు. సరిగ్గా అప్పుడే సోవియట్‌ యూనియన్‌ విచ్ఛిన్నమైంది... దాంతోపాటూ యాభైయేళ్లుగా అమెరికా-రష్యా మధ్య సాగుతూ వచ్చిన ప్రచ్ఛన్నయుద్ధం అంతమైంది. ఆ తర్వాతి ప్రపంచ పరిణామాలనే ప్రధాన అంశంగా తీసుకుని మనోజ్‌ పీహెచ్‌డీ చేశారు. ‘పోస్ట్‌కోల్డ్‌వార్‌ ఇంటర్నేషనల్‌ సిస్టమెటిక్‌ ట్రాన్సిషన్‌’ అన్న ఆ అంశం కోసం ఆస్ట్రియా వెళ్లి పరిశోధించారు. అదే ఆయన తొలి విమాన ప్రయాణం కూడా! ఆ తర్వాత అమెరికా-‘యూఎస్‌ ఎయిడ్‌’ కార్యక్రమం కింద ఆయన్ని ఇదే పరిశోధనాంశం నిమిత్తం తమ దేశానికి ఆహ్వానించింది. ఏదేమైతేనేం, 1996లో డాక్టరేట్‌ పూర్తికాగానే ఆయన గుజరాత్‌ సర్దార్‌ పటేల్‌ వర్సిటీలో లెక్చరర్‌గా చేరారు. అంతర్జాతీయ వ్యవహారాలు (ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌)లో జాతీయస్థాయి స్కాలర్‌గా పేరు తెచ్చుకున్నారు. ఆయన కుటుంబం ఆర్థికంగా కుదురుకున్నది కూడా ఆ తర్వాతే. తన తమ్ముడినీ, చెల్లెలినీ ఇంజినీర్లని చేశాడు. అప్పటిదాకా ఏదో ఒక పని చేస్తూ వచ్చిన తల్లికి అప్పుడే కాస్త విశ్రాంతి దొరికింది. ఇంకేం... పెద్దబ్బాయి మనోజ్‌కి పెళ్ళి చేయాలన్నదే లక్ష్యంగా మారింది. కానీ ఆమెకి పెద్దగా శ్రమలేకుండానే... పృథా మెహతాని జీవిత భాగస్వామిగా చేసుకోవాలనుకున్నారు మనోజ్‌!

అతిపిన్న వయసు వీసీ!

విచిత్రమేంటంటే... ఒకప్పుడు మనోజ్‌ ఏ సైన్స్‌ సబ్జెక్ట్‌ అంటే భయపడ్డారో ఆ సైన్స్‌ అంటే పృథాకి ప్రాణం. ఈయన పొలిటికల్‌ సైన్స్‌లో పీజీ చేస్తున్నప్పుడే ఆమె సర్దార్‌ పటేల్‌ వర్సిటీలో ఎమ్మెస్సీ మైక్రోబయాలజీ చదువుతుండేవారు. అనుకోకుండానే పరిచయమై... అది ప్రేమగా మారి... ఇద్దరూ జీవిత భాగస్వాములయ్యారు. మరో ఐదేళ్లకి బరోడాలోని ఎమ్మెస్‌ షాయాజీ వర్సిటీకి 2005లో వైస్‌ ఛాన్సలర్‌గా నియమితులయ్యారు. స్వాతంత్య్రం తర్వాత మనదేశంలో నలభైయేళ్లకే వీసీగా ఎంపికైన అతిపిన్నవయస్కుడిగా రికార్డు సృష్టించారు. ఇందిరాగాంధీ నేషనల్‌ ఓపెన్‌ వర్సిటీకి అకడమిక్‌ కౌన్సెలర్‌గానూ సేవలందించారు. ఆ తర్వాతే ఆయనకి నాటి గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్రమోదీతో స్నేహం కుదిరింది. రాష్ట్రంలో విద్యావిషయాలకి సంబంధించిన అన్ని సమావేశాల్లోనూ మనోజ్‌ సోనీకి అగ్రతాంబూలం లభించింది. అసలు నరేంద్రమోదీ ప్రసంగాన్ని కూడా ఈయనే రాసిస్తారన్న ఆరోపణలూ వినిపించేవి కానీ సోని దాన్ని కొట్టిపారేస్తారు. ‘ఆయనకి నేను ప్రసంగం రాసివ్వాల్సిన అవసరం ఎప్పుడూ రాలేదు. నిజానికి రాజకీయాలకి సంబంధంలేని స్నేహం మాది. అప్పటికీ ఇప్పటికీ విద్యావ్యవస్థపైనే మేం ఎక్కువగా మాట్లాడుకుంటాం!’ అంటారు మనోజ్‌.  

అమెరికా నగర మేయర్‌గా...

షాయాజీ వర్సిటీకి ఉపకులపతిగా చేశాక... గుజరాత్‌లోని డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ వర్సిటీకి వరసగా రెండుసార్లు వీసీ అయ్యారు. ఆయన ఆధ్వర్యంలోనే దూరవిద్యలో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకున్నాయి. 2015లోనే వర్సిటీని పూర్తిగా ఆన్‌లైన్‌ మోడ్‌లోకి తెచ్చారాయన. కేవలం వెబ్‌సైటే కాదు... విద్యార్థుల కోసం మొబైల్‌ ఆప్‌లనీ తెచ్చి పాఠాలని ఎప్పుడైనా ఎక్కడైనా నేర్చుకునేలా చేశారు. ఈ సేవలగ్గాను అమెరికాలోని బాటన్‌ రూజ్‌ నగరానికి ఒక రోజు మేయర్‌-ప్రెసిడెంట్‌గా నియమించారు! గుజరాత్‌ అంబేడ్కర్‌ వర్సిటీకి వీసీగా ఉండగానే, 2017లో యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌లో సభ్యుడిగా నియమితులయ్యారు మనోజ్‌. ఇటీవలే దానికి ఛైర్మన్‌గానూ మారారు! అన్నట్టు... ఆయన భార్య పృథా గుజరాత్‌లోనే ఇప్పుడు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా చేస్తున్నారు. వాళ్లబ్బాయి ఆర్ష ఆ కాలేజీలోనే పీజీ చేస్తున్నాడు. ఈ ముగ్గురూ ఇప్పటికీ ఖాళీ దొరికినప్పుడల్లా అనుపమ్‌ మిషన్‌ ఆశ్రమానికి వెళ్లి... అన్నిరకాల సేవలూ అందిస్తుంటారు. ఇటీవలే ఈ ఆశ్రమం నుంచి మనోజ్‌ ‘నిష్కామ కర్మ యోగ’ దీక్ష తీసుకున్నారట. ఆ దీక్ష తీసుకున్నవాళ్ళు ఒక్క మానవసేవ తప్ప-ఇహలోక విషయాలకి సంబంధించిన ఆశలన్నీ త్యజిస్తారట. ఇదోరకం సన్యాసమేనని చెబుతారు ఆ ఆశ్రమంవాళ్లు!

ఆయన ఇంటర్వ్యూలు ఫేమస్‌...

‘అతనో కరడుగట్టిన పాకిస్తాన్‌ తీవ్రవాది. ఈ రోజు సాయంత్రానికల్లా ఆకస్మిక దాడులతో మనదేశంపైన అతను విరుచుకుపడే ప్రమాదం ఉంది. రక్షణరంగంలోని అధికారిగా దాన్ని అదుపులో పెట్టాల్సిన గురుతర బాధ్యత మీది. ఇప్పుడు మీకు మూడు ఛాయిస్‌లున్నాయి. ఒకటి, పాకిస్తాన్‌లోకి చొచ్చుకెళ్లి ఒసామా బిన్‌లాడెన్‌ని అమెరికా హతమార్చినట్టు తక్షణ చర్య తీసుకోవడం. రెండు, సైబర్‌ దాడులు చేయడం. మూడు, అంతర్జాతీయ దౌత్యంతో పాకిస్తాన్‌పైన ఒత్తిడి తేవడం. మీరు ఈ మూడింట్లో ఏ మార్గాన్ని ఎంచుకుంటారు? ఎందుకు?’ - సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలో కీలకమైన ఇంటర్వ్యూలప్పుడు మనోజ్‌ సోని ప్రశ్నలు ఈ తరహాలోనే ఉంటాయి. ఇదొక్కటే కాదు ఆయన వేసే ప్రతి ప్రశ్నా ఎంత ఆలోచనాత్మకంగా ఉంటుందో వివరిస్తూ ఐఏఎస్‌ విజేతలు రాసిన వ్యాసాలెన్నో ఆన్‌లైన్‌లో కనిపిస్తాయి. ఆయన కెరీర్‌ ప్రయాణాన్నీ వాటి చివర్న టూకీగా వివరిస్తుంటారు. ఆ ప్రయాణానికి ముందు... పదేళ్ల వయసులో ఆయన అగరుబత్తీల అమ్మకందారుగా జీవితాన్ని తన చేతుల్లోకి ఎలా తీసుకున్నారన్న విషయం మాత్రం ఆయన ఛైర్మన్‌గా అయ్యాకే బయటకొచ్చింది!

ఆ కొత్త వెలుగుతో బయల్పడ్డ ఈ స్ఫూర్తికథ... ఒక్క సివిల్స్‌ అభ్యర్థులకే కాదు, పేదరికమనో పబ్లిక్‌ పరీక్షలు ఫెయిలయ్యామనో నిత్యం కుంగుబాటుకి గురయ్యే ప్రతి మనసుకీ ప్రేరణగానే నిలుస్తుంది.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


ఇంకా..

ap-districts
ts-districts