మెత్తమెత్తని ‘లిక్విడ్‌ వాల్‌పేపర్లు’!

గోడలకు రంగులు వేస్తే ఇల్లు పూర్తయి నట్టేనా... అస్సలు కాదు, ఇంటికి తగ్గట్టు చక్కని ఇంటీరియర్‌ వర్క్‌ చేస్తేనే కదా ఇంటి ముస్తాబంతా ముగిసినట్టు.

Published : 22 Jun 2024 23:56 IST

గోడలకు రంగులు వేస్తే ఇల్లు పూర్తయి నట్టేనా... అస్సలు కాదు, ఇంటికి తగ్గట్టు చక్కని ఇంటీరియర్‌ వర్క్‌ చేస్తేనే కదా ఇంటి ముస్తాబంతా ముగిసినట్టు. అందుకే మరి, గోడల దగ్గర్నుంచి పైకప్పు వరకూ ప్రతిదాంట్లోనూ సరికొత్త మెరుగులు కోరుకుంటున్న ఈతరం- మార్కెట్లో కనిపించే ట్రెండ్లన్నీ జల్లెడ పట్టేస్తోంది. అలాంటి వాటిలో ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటున్నాయి ఈ ‘లిక్విడ్‌ వాల్‌పేపర్లు’.

ఇంటికి సరికొత్త లుక్కును తీసుకురావాలంటే ఇది వరకు కాస్త కష్టమైన పనే. దానికి ఖర్చూ, సమయమూ రెండూ ఎక్కువ పట్టేవి. కానీ క్షణాల్లో తెల్లటి వాల్‌ పెయింటింగ్స్‌నీ హరివిల్లు రంగులతో అందంగా మలిచే వాల్‌పేపర్స్‌, మ్యూరల్స్‌ వచ్చాక ఆ పని చాలా తేలికై పోయింది. చిన్న చిన్న మార్పులతోనే ఇంటి రూపురేఖల్ని కొత్తగా చూపే వెసులుబాటు వచ్చేసింది. అయితే ఇప్పుడు అందులోనే మరింత సౌకర్యంతోపాటూ కొత్తవెరైటీల్నీ అందివ్వాలనుకున్న తయారీదారులు- ఈ లిక్విడ్‌ వాల్‌పేపర్స్‌ను తీసుకొచ్చారు.

లివింగ్‌రూమ్‌, కిచెన్‌, బెడ్‌రూమ్‌... ఇలా ఇంట్లోని గదులన్నింటిలో ఎంచుకున్న థీమ్‌కు నప్పేలా ఈ లిక్విడ్‌ వాల్‌పేపర్లనూ పెట్టుకోవచ్చు. ఆకట్టుకునే రంగులతో కనిపించడమే కాదు, తాకితే మెత్తటి నునుపుదనంతో గోడలకు సరికొత్త లుక్కునూ తీసుకొస్తాయివి. అంతేకాదు, నచ్చిన ఆకారాల్లోనే వీటిని ఉంచుతూ గదికి ముచ్చటైన డెకరేషన్‌ చేయొచ్చు కూడా.

ప్రత్యేకత ఏంటీ...

త్రీడీ బొమ్మలతో వచ్చే వాల్‌పేపర్స్‌ని గోడలకు అతికించడం తెలిసిందే, మరి ఈ లిక్విడ్‌ వాల్‌పేపర్ల సంగతేంటీ అంటారేమో... సిల్క్‌, కాటన్‌ పదార్థాలతో తయారుచేసే ఈ వాల్‌పేపర్స్‌- మామూలుగా పొడిలా దొరుకుతాయి. దాన్ని నీళ్లతో కలిపి ముద్దలా చేసి ఆ తర్వాత కావాల్సిన చోట అతికిస్తారు. అంతే, గోడకు అదనపు అందాన్ని తీసుకొస్తూ ఈ వాల్‌పేపర్‌ ఇంటీరియర్‌లో భాగమైపోతుంది.

ఏమిటీ ఉపయోగం...

దాదాపు వందకుపైగా మెరిసే రంగుల్లో వెరైటీ డిజైన్లలో దొరుకుతున్న ఈ లిక్విడ్‌ వాల్‌పేపర్లతో బోలెడన్ని లాభాలూ ఉన్నాయి. సాధారణంగా గోడలు ఎలా ఉన్నా, పగుళ్లు పడినా వాటిని ఈ వాల్‌పేపర్స్‌తో అందంగా తీర్చిదిద్దొచ్చు. ఇంకా అప్పుడప్పుడు గోడలపైన మరకలు పడటమూ, చెమ్మతో గోడలు పాడవ్వటమూ జరుగుతుంటుంది కదా. వీటిలో అలా జరగదు. ఈ వాల్‌పేపర్లపైన నీళ్లు పడినా కాసేపటికి వాటంతటవే ఆరిపోతాయి. మామూలు వాల్‌పేపర్‌ షీట్స్‌ లాంటివి చూడ్డానికి బాగుంటాయి కానీ ఎక్కడైనా కాస్త చిరిగినా మరక పడినా మొత్తంగా దాన్ని తీసేయాల్సి వస్తుంది కదా. ఇందులో అయితే పాడైన చోటు వరకే మళ్లీ సరిచేయొచ్చు. ఏళ్ల తరబడి చెక్కుచెదరకుండా ఉండే ఈ లిక్విడ్‌ వాల్‌పేపర్ల రంగులు కూడా ఏమాత్రం వెలిసిపోవట. వస్తువు ఏదైనా అందంతోపాటూ సౌకర్యంగా ఉంటే ఎవరికి మాత్రం నచ్చకుండా ఉంటుంది చెప్పండి... అందుకే ఇంటి అలంకరణల్లో ఇప్పుడు వీటినీ చేర్చుతున్నారు.

హైదరాబాద్‌, విజయవాడలతోపాటు అన్నిప్రాంతాల్లోనూ అందుబాటులో ఉన్న ఈ లిక్విడ్‌ వాల్‌పేపర్లను కావాలంటే ఇంటీరియర్‌ డిజైనర్లతో కోరినట్టు చేయించుకోవచ్చు. లేదంటే మార్కెట్లో దొరికే లిక్విడ్‌ వాల్‌పేపర్స్‌ ప్యాకెట్లు కొనుక్కుని మనమే ఇంటి గోడలకు సరికొత్త అందాన్ని అద్దేయొచ్చు కూడా.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..