అంతోటి పంతాలు పోవాకు బిడ్డా!

సినిమా పాటలంటే మామూలుగా హీరోహీరోయిన్లో, అప్పుడప్పుడూ ఇతర పాత్రలో పాడేలాగే ఉంటుంటాయి. ఒక్కోసారి బ్యాక్‌గ్రౌండ్‌లోనూ కొన్ని పాటలు వినిపిస్తుంటాయి. ఇవేవీ కాకుండా ఓ అడవి మనకి మంచీచెడూ చెబుతున్నట్టు పాట రావడం...

Updated : 29 Mar 2022 13:02 IST

అంతోటి పంతాలు పోవాకు బిడ్డా!

సినిమా పాటలంటే మామూలుగా హీరోహీరోయిన్లో, అప్పుడప్పుడూ ఇతర పాత్రలో పాడేలాగే ఉంటుంటాయి. ఒక్కోసారి బ్యాక్‌గ్రౌండ్‌లోనూ కొన్ని పాటలు వినిపిస్తుంటాయి. ఇవేవీ కాకుండా ఓ అడవి మనకి మంచీచెడూ చెబుతున్నట్టు పాట రావడం... టాప్‌ హీరోల సినిమాల్లో అది చోటుచేసుకోవడం.. ఆ పాట విడుదలైన ఐదో రోజే అరవైలక్షలకిపైగా వీక్షణలు అందుకోవడం చాలా అరుదు. ‘భీమ్లానాయక్‌’ సినిమాలోని ‘అడవితల్లి మాట’ అలాంటి అరుదైన పాట. దాని నేపథ్యాన్ని వివరిస్తున్నారు రచయిత రామజోగయ్య శాస్త్రి...

‘అదృష్టం ఉండాలి... ఇలాంటి పాట మన జాబితాలో పడాలంటే. నిజం... విన్నాక మీరే అంటారు, చూడండి...’ - ఈ ఏడాది నవంబర్‌లో నేను చేసిన ట్వీట్‌ ఇది. సినీగేయ రచయితల కెరీర్‌లో వేళ్లపైన లెక్కించదగ్గ కొన్ని పాటలే వాళ్లకింతటి ఆత్మవిశ్వాసాన్నిస్తాయి... ఆ పాట పుట్టుక గురించిన విశేషాలని పంచుకోవాలన్న తహతహని రాజేస్తాయి. అందుకే ఆ రోజు నా ట్వీట్‌లోనే ‘ఈ పాట గురించి రేపు గట్టిగా మాట్లాడదాం!’ అనీ చెప్పుకున్నాను. కానీ తీరా ఆ పాట విడుదలయ్యేనాటికి గట్టిగా కాదు... గాద్గదికంగానే మాట్లాడాల్సి వచ్చింది. కారణం... ఈ పాట పూర్తయిన వెంటనే విని ‘గొప్పగా ఉంది’ అని ఆశీర్వదించిన మా గురువు సీతారామశాస్త్రి కన్నుమూయడం. అందుకే ఈ పాట విడుదలని ఆయనకి నివాళిగా మార్చుకున్నాను. అందుకు అన్నిరకాలా తగ్గ పాటనే ఇచ్చానని నిరూపిస్తూ... ప్రేక్షకులు ఏ రోజుకారోజు లక్షల వీక్షణలతో మనసారా హత్తుకున్నారు.
అడవి గోడు చెప్పాలి...
ఈ పాట ఆలోచన భీమ్లా నాయక్‌ సినిమాకి దర్శకత్వ పర్యవేక్షకునిగా వ్యవహరించిన త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌గారిది. ‘తన కడుపున పుట్టిన ఇద్దరు బిడ్డలు ఒకరిపైన ఒకరు కత్తులు దూసుకుంటే ఓ తల్లి మనసు ఎంత తల్లడిల్లుతుందో కదా! ఆ తల్లి ఓ అడవే అయితే...? బిడ్డల పంతాలతో ఆ తల్లి పచ్చదనమే బుగ్గిపాలవుతుంటే...? అది మనతో ఏం చెబుతుంది? అన్నదే పాట కాన్సెప్ట్‌ కావాలి!’ అన్నారు. సాహిత్యం జానపదశైలిలో ఉండాలనుకుని నేనూ తమ్ముడు తమన్‌ కంపోజింగ్‌కి కూర్చున్నాం. ఆయన బాణీ కోసం, నేను ఓ మంచి పల్లవి కోసం మథనం మొదలుపెట్టాం. తమన్‌ అకస్మాత్తుగా తన కీబోర్డుతో అడవి చెట్లని నరుకుతున్నప్పుడు వచ్చే రంపపుకోత శబ్దాన్ని సృష్టించారు. చెట్లని కాదు అడవి తల్లి గుండెనెవరో రంపంతో కోసినంత బాధ అందులో వినిపించింది. దాన్నే బాణీగానూ వినిపిస్తే... తన కళ్లెదు కయ్యానికి కాలు దువ్వే కొడుకుల్ని చూస్తున్న ఓ తల్లి నిస్సహాయతని చెప్పేలా ‘సెబుతున్నా నీ మంచి సెడ్డా... అంతోటి పంతాలు పోవాకు బిడ్డా’ అన్న వాక్యాన్ని దానికి జోడించాను. ఏ తల్లైనా పోట్లాడే తన బిడ్డల్ని అడ్డుకోవాలని దేవుణ్ణే వేడుకుంటుంది. కానీ ఆ దేవుడూ మూగబోతే ఏం చేస్తుంది...? ఆమెలోని ఆ అశక్తతని వివరించాలనే ‘కిందున్న మడుసులకా కోపాలు తెమలవు/పైనున్న సామేమో కిమ్మని పలకడు’ అని సాకీలా రాశాను. అంతేకాదు, కత్తో నిప్పో ఒక్కసారంటూ పైకి లేస్తే సర్వనాశనమేనని హెచ్చరించేలా ‘దూకేటి కత్తూలా కనికరమెరుగవు/అంటుకున్న అగ్గిలోనా ఆనవాళ్లు మిగలవు’ అన్నాను.

ఇది అందరికీ...

ఇక పాటలో ఉన్న ఏకైక చరణాన్ని కేవలం సినిమాలోని పాత్రలకే పరిమితం కాకుండా సార్వజనీనంగా ఉండాలనుకున్నాను. ‘పుట్టతేనె బువ్వపెట్నా/సెలయేటి నీళ్ళు జింకపాలు పట్నా/ఊడల్ల ఉయ్యాల కట్టి పెంచి/నిన్ను ఉస్తాదల్లె నించో పెట్నా’ అన్న తొలి నాలుగు వాక్యాల్తో మానవజాతికి అడవితల్లి అందించే ఆలనాపాలనా వివరించాను. ప్రేమతోనూ, కరుణతోనూ అందుకోగల పరిష్కారాలు ఎన్నో ఉండగా కక్షలూ, కార్పణ్యాలకి ఎందుకు దిగుతారని ప్రశ్నించేలా ‘పచ్చని బతుకిస్తే నీకు ఎల్లెల్లి కచ్చళ్లో పడబోకు బిడ్డా’ అని ముగించాను. మనం ఒకరిపైనొకరం నిప్పులు రాజేసుకుంటే కమిలి పోయేది తన కన్నపేగేనని చెప్పేలా ‘సిగురాకు సిట్టడివి గడ్డా/చిచ్చుల్లో అట్టుడికి పోరాదు బిడ్డా’ అని పాత వరసకే మరో వెర్షన్‌ని ఇచ్చాను. సినిమా పాత్రల పరిధిని ఆ కాసింతయినా దాటి అందరికీ వర్తించగల ఈ చిన్న విషయాన్ని ఈ పాటలో పెట్టడం నాకెంతో సంతృప్తినిచ్చింది. పూర్తయిన పాటని పవన్‌, త్రివిక్రమ్‌, దర్శకుడు సాగర్‌ చంద్ర, నిర్మాత చినబాబులకి వినిపిస్తే చాలా సంతోషించారు. మంచిగా వచ్చిందనుకున్న ఏ పాటైనా మా గురువు సీతారామశాస్త్రిగారికి వినిపించడం నాకున్న అలవాటు. ఆయన విని ‘ఇది రాశాక-ఈ పాటని నేనే రాశానా అన్న భావనా... ఈ పల్లెభాష నాకెలా తెలిసిందబ్బా అన్న ఆశ్చర్యం నీకు కలిగి ఉండాలి. అంతగొప్పగా రాశావ్‌!’ అన్నారు. అప్పట్లో దాన్నో అభినందనగానే భావించాను కానీ... అదో ఆశీర్వాదమని ఆయన పోయాక అనిపిస్తోంది.



 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..