మనమూ వెళ్లొద్దామా మడ అడవులకు!

సముద్రం, నది కలిసే చోట- చిత్తడినేలల్లో పాతుకు పోయే చెట్ల సముదాయమే మడ అడవులు.ఎన్నో రకాల జీవజాతులకు ఆవాసాలైన ఆ  నీటి వనాల్లో బోటు ప్రయాణం ఎంతో  ఆహ్లాదకరం.

Published : 07 Jul 2024 01:16 IST

సముద్రం, నది కలిసే చోట- చిత్తడినేలల్లో పాతుకు పోయే చెట్ల సముదాయమే మడ అడవులు.ఎన్నో రకాల జీవజాతులకు ఆవాసాలైన ఆ  నీటి వనాల్లో బోటు ప్రయాణం ఎంతో  ఆహ్లాదకరం. జీవవైవిధ్యాన్నీ, ప్రకృతి రమణీయతనీ ఆస్వాదిస్తూ మడ అడవుల్లో నడుచుకుంటూ వెళ్లడమూ ఎంతో బాగుంటుంది. కాకినాడ దగ్గరలోని కోరింగ అభయారణ్యంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికీ అటువంటి ప్రత్యేక అనుభూతే కలుగుతుంది. అక్కడి మడ అడవుల్లోకి తీసుకెళ్లి మరిచిపోలేని జ్ఞాపకాలెన్నో పర్యటకుల సొంతం చేస్తున్నారు అధికారులు.

మడ అడవులు అనగానే పశ్చిమ్‌బంగాలోని సుందర్‌బన్‌ గుర్తొస్తుంది. వేలాది ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ వనాలు మన దేశంలో అతి పెద్ద మడ అడవులైతే, రెండో స్థానం కాకినాడ సమీపంలోని కోరింగ అభయారణ్యానిది. అందంగా, గుబురుగా పెరిగే ఈ అడవులు- సముద్రపు కోతలూ, ప్రకృతి వైపరీత్యాల నుంచి తీర ప్రాంతాన్ని రక్షించే సహజ కోటలు. ఎన్నో రకాల జలచరాలకూ, జంతు సంపదకూ ఆశ్రయం ఇవ్వడంలోనూ మడ అడవులది ప్రత్యేక స్థానం. కాకినాడ జిల్లా నుంచి బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పరిధిలోని భైరవపాలెం వరకు దాదాపు అరవై వేల ఎకరాల్లో విస్తరించి ఉంది కోరింగ అభయారణ్యం. కాకినాడకు చేరువగా- దాదాపు ముప్ఫై కిలోమీటర్ల పరిధిలో కొన్ని ప్రత్యేక ఏర్పాట్లతో పర్యటక కేంద్రంగా తీర్చిదిద్దారు.  

ప్రకృతి ఒడిలో హాయిగా..

సముద్రాన్ని ఆనుకుని ఉండే కోరింగ అభయారణ్యంలో కొన్ని నీటి పాయలున్నాయి. పచ్చదనం గోడ కట్టినట్టుండే ఆ పాయల్లో బోటు మీద విహరిస్తూ.. దాదాపు 35 రకాల మడ వృక్షాల్నీ(మ్యాంగ్రూవ్‌ ప్లాంట్స్‌) చూడొచ్చు. అరుదైన 120 రకాల జాతుల పక్షుల కిలకిల రావాలనీ ఆస్వాదించొచ్చు. మడ వృక్షాల వేళ్లలో దాక్కుని... చేపలు కనిపించగానే వాటిపై దాడిచేసి నోట కరుచుకునే నీటి పిల్లులు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. వాటితోపాటు నీటి కుక్కలూ, ఆలివ్‌రిడ్లే తాబేళ్లూ మనకు తారసపడతాయి. బోటులో ప్రయాణిస్తూ వీటన్నిటినీ చూడటం ఒక అనుభూతి అయితే... మడ అడవుల్లో నడుస్తూ కాసేపు తీరిగ్గా కూర్చుని ప్రకృతిలో మమేకమవడం మాత్రం కచ్చితంగా మధుర జ్ఞాపకమే అవుతుంది. అయినా చిత్తడి నేలలో... కాలు పెడితే కూరుకుపోయే బురదలో నడవడం సాధ్యమేనా అనుకోవచ్చు కానీ కచ్చితంగా సాధ్యమే! ఎందుకంటే, కోరింగ అభయారణ్యంలో చెక్క వంతెనలు ఉంటాయి. వాటి పైన నడుస్తూ చుట్టుపక్కల సుందర దృశ్యాలను చూస్తూ చేసే ప్రయాణం అద్భుతమనే చెప్పాలి. పైన పచ్చదనాన్నీ- కింద నీటిలోని జీవుల్నీ, రంగురంగుల చేపల్నీ చూస్తూ ఆనందానుభూతిని సొంతం చేసుకోవచ్చు.

లైట్‌ హౌస్‌ చూడొచ్చు...

కోరింగ అభయారణ్యంలోని ఎత్తైన వ్యూ పాయింట్‌ దగ్గర నిల్చుంటే.. కనుచూపు మేర సముద్ర తీరమంతా పచ్చని దుప్పటి పరుచుకుందా అనిపిస్తుంది. ఆ దృశ్యాలను కొన్ని గంటలు మాత్రమేనా చూసేది.. రెండు మూడ్రోజులు ఉంటే ఎంత బాగుంటుందో కదా అనుకునే వారు సమీపంలోని చొల్లంగి పర్యటక ప్రాంత ఫారెస్ట్‌ గెస్ట్‌ హౌస్‌లో బస చేయవచ్చు. అందులో భోజన ఏర్పాట్లూ ఉంటాయి. అక్కడి నుంచి బోటుపైన గంటన్నర ప్రయాణిస్తే బ్రిటిష్‌ కాలంలో కట్టిన లైట్‌హౌస్‌ దగ్గరకు వెళ్లొచ్చు. అలానే 18 కిలోమీటర్ల మేర విస్తరించిన హోప్‌ ఐలాండ్‌ కూడా పర్యటకుల్ని కట్టిపడేస్తుంది. మడ అడవులను దాటి సముద్రంలో కొంత దూరం ప్రయాణిస్తే వచ్చే ఈ ద్వీపంలో- ప్రకృతిని ఆస్వాదిస్తూ కాసేపు విహరించొచ్చు. మత్స్యకారులతో కలిసి సముద్రంలోకి గాలమేయొచ్చు... చేపలు పట్టుకోవచ్చు. తిరిగి వెనక్కి వచ్చేటప్పుడు పర్యటక కేంద్రంలోని మినీ థియేటర్‌లో మడ అడవుల ప్రత్యేకతలూ, ఇతర ఆసక్తికర విశేషాలకు సంబంధించిన డాక్యుమెంటరీలు ప్రదర్శిస్తారు. మొత్తంగా- ప్రకృతిఅందాలతో జీవవైవిధ్యంతో మధురానుభూతుల్ని పంచే కోరింగ మడ అడవులకు ఒక్కసారి వెళితే.. మళ్లీ మళ్లీ వెళ్లాలనిపించడం ఖాయం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..