Published : 29 May 2022 00:09 IST

నా హీరోలందరూ ప్రత్యేకమే!

‘హనీ ఈజ్‌ ద బెస్ట్‌’ అంటూ ‘ఎఫ్‌2’లో సరికొత్త మేనరిజంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న మెహ్రీన్‌ ఈసారి ‘హనీ ఈజ్‌ రిచ్‌’ అంటూ మన ముందుకొచ్చింది. ‘కృష్ణగాడి వీర ప్రేమ గాధ’ నుంచి తాజాగా విడుదలైన ‘ఎఫ్‌3’ వరకూ వైవిధ్యమైన పాత్రల్లో అలరించిన ఈ పంజాబీ ముద్దుగుమ్మ తన హీరోల గురించి ఏం చెబుతోందంటే..

ప్రేమగా పలకరిస్తాడు..

శర్వా, నేనూ సెట్‌లో ఉంటే అల్లరే అల్లరి. మమ్మల్ని ఆపడం ఎవరితరం అయ్యేదికాదు. ‘మహానుభావుడు’ సెట్‌లో తెగ సందడి చేశాం. మా ఇద్దరి మనస్తత్వాలూ, అభిరుచులూ చాలా వరకూ ఒకలానే ఉంటాయి. ఇద్దరికీ నిద్రంటే పిచ్చి. ఎప్పుడన్నా కాస్త ఎక్కువ సమయం దొరికితే నిద్రపోయేవాళ్లం. ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడు. సెట్‌ బాయ్‌ని కూడా ప్రేమగా పలకరిస్తాడు. ఎవర్నీ విసిగించడు. తన పని తాను పర్‌ఫెక్ట్‌గా చేసుకెళ్లిపోతాడు. ఎవరైనా బాగా చేస్తే ఆ క్షణమే మెచ్చుకుంటాడు.  


కనిపించడు కానీ..

వరుణ్‌తేజ్‌ పక్కన నిల్చోవాలంటే నాకు చాలా భయం. ఎందుకంటే ఆరు అడుగుల మూడంగుళాల ఎత్తున్న వరుణ్‌ పక్కన నేను చాలా పొట్టిగా కనిపిస్తా. తనతో సీన్‌ ఉన్నప్పుడు కాస్త దూరంగా నిల్చోడానికి ప్రయత్నించేదాన్ని. వరుణ్‌ సెట్‌లో కామ్‌గా ఉన్నట్టు కనిపిస్తాడు గానీ... అందరి మీద పంచ్‌లు బాగా వేస్తాడు. తన టైమింగ్‌ నాకు నచ్చుతుంది. ‘ఎఫ్‌2’, ‘ఎఫ్‌3’లో మా ఇద్దరి మధ్యా కెమిస్ట్రీ బాగా కుదిరిందంటే అది వరుణ్‌ వల్లే. నాకు డైలాగులు పలికే విషయంలో చాలా సాయం చేశాడు. తెలియని విషయాలు ఓపిగ్గా చెబుతాడు. 


నన్ను మార్చేశాడు..

నాని హీరోగా నటించిన ‘కృష్ణగాడి వీరప్రేమ గాధ’ నా మొదటి సినిమా. తను నా ఫస్ట్‌ హీరో కాబట్టి ఎప్పుడూ ప్రత్యేకమే. మొదట్లో నానిని చూసినప్పుడు సరిగా మాట్లాడడేమోనని భయపడ్డా. కానీ, తను అందరితో కలివిడిగా ఉండే తీరు చూసి ముచ్చటేసింది. అంతేకాదు, సెట్‌లో బెరుగ్గా కూర్చునే నన్ను కూడా అందరిలో కలిసిపోయేలా చేసి చాలా తక్కువ సమయంలోనే మంచి ఫ్రెండ్‌ అయ్యాడు. తను పక్కనుంటే నవ్వుల పూలు పూయాల్సిందే. నేనూ నలుగురిలో ఉన్నప్పుడు తనలా ఆనందంగా ఉండటం నేర్చుకున్నా. ఇక, ఆ సినిమాలో తను కృష్ణగా, నేను మహాలక్ష్మిగా చేశాం. ఇప్పటికీ తను నన్ను ‘లక్కీ’ అంటే, నేను ’క్రిషీ’ అని పిలుస్తా.


పలుకే బంగారం..

‘చాణక్య’ కంటే ముందు గోపీచంద్‌తో ‘పంతం’లో నటించా. ఆయన నటించిన ‘లౌక్యం’ ఎన్ని సార్లు చూశానో లెక్కే లేదు. గోపీ చాలా స్వీట్‌ అండ్‌ రిజర్వ్‌డ్‌ పర్సన్‌. ఎవరన్నా పలకరిస్తే తప్ప ఎక్కువ మాట్లాడరు. ‘పంతం’ సినిమా షూటింగ్‌ మొదలైన కొత్తల్లో ఆయనతో మాట్లాడాలంటే కాస్త వెనకాడా. ఆ తరవాత క్రమంగా మాట్లాడటం మొదలుపెట్టారు. నేనైతే లొడలొడా వాగేస్తా. ఆయన నా పక్కన కూర్చుంటే ఏదో ఒక విషయం చెప్పి తనూ మాట్లాడేలా చేస్తుంటా. నిజానికి గోపీలా తక్కువ మాట్లాడటం కొందరికే సాధ్యమవుతుంది. అలా ఉండాలని చాలాసార్లు అనుకున్నా కానీ, సాధ్యం కావట్లేదు.


అది నచ్చింది..

‘అర్జున్‌ రెడ్డి’ చూశాక విజయ్‌కి వీరాభిమానినయ్యా. ఆ తరవాత  ‘నోటా’లో తనతో నటించే అవకాశమొచ్చింది. విజయ్‌కి సెన్సాఫ్‌ హ్యూమర్‌ ఎక్కువ. సామాజిక మాధ్యమాల్లో తనకి యూత్‌ఫాలోయింగ్‌ చాలా ఉంది. తన షెడ్యూల్‌ ప్రకారం పని చేసుకుని వెళ్లిపోవాలనుకోడు. ఎప్పుడన్నా దర్శకుడు ‘ఈ సీన్‌ మళ్లీ చేద్దామా’ అంటే కూల్‌గా ఒప్పేసుకుంటాడు. అంతేకాదు, చాలా తక్కువ సమయంలో తమిళం నేర్చుకుని ‘నోటా’లో తనే డబ్బింగ్‌ చెప్పుకున్నాడు. ఆ డెడికేషన్‌ నాకెంతో నచ్చింది.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని