Published : 13 Jun 2021 01:08 IST

ముగ్గురమ్మల స్వరూపం... మూకాంబికా దేవి

ఆ ఆలయంలోని అమ్మవారు ఉదయం కేరళలో, మధ్యాహ్నం నుంచి కర్ణాటకలో ఉంటుందని భక్తుల నమ్మకం. కోరిన కోర్కెలు తీర్చే శక్తి స్వరూపిణిగా, సౌపర్ణికా నది ఒడ్డున వెలసి భక్తులకు దర్శనమిచ్చే ఆ అమ్మే కర్ణాటకలోని కొల్లూరులో కొలువైన మూకాంబికాదేవి. ఎంతో మహిమాన్వితమైన క్షేత్రంగా పిలిచే ఈ ఆలయ సందర్శనం సర్వపాప హరణం అని అంటారు.
డమట కనుమల్లో, పచ్చని కొడచాద్రి పర్వతాలను ఆనుకుని, ఎన్నో ఔషధగుణాలున్న సౌపర్ణికా నది ఒడ్డున కనిపిస్తుంది మూకాంబికా దేవి ఆలయం. సుమారు పన్నెండు శతాబ్దాల చరిత్ర ఉన్న ఈ ఆలయానికి దేశవిదేశాలకు చెందిన భక్తులు వస్తుంటారని ప్రతీతి. ముగ్గురమ్మల మూలపుటమ్మగా దర్శనమిచ్చే ఈ తల్లిని జగద్గురువు ఆది శంకరాచార్యులు ప్రతిష్ఠించారని చెప్పే ఓ కథ ప్రచారంలో ఉంది.

స్థలపురాణం
ఒకప్పుడు ఈ ప్రాంతంలో కౌమాసుర అనే రాక్షసుడు ఉండేవాడట. అతను దేవతలనూ, రుషులనూ ఇబ్బంది పెట్టడమే కాకుండా తనకు మరణం లేకుండా చేయమంటూ శివుడిని ప్రార్థించాడట. అది తెలిసిన కోల అనే మహర్షి ఈ విషయాన్ని సరస్వతీ దేవికి చెప్పాడట. దాంతో శివుడు ప్రత్యక్షమయ్యే సమయానికి సరస్వతీదేవి ఆ రాక్షసుడిని మూగవాడిగా మార్చేసిందట. అప్పటినుంచీ అందరూ అతడిని మూకాసురా అని పిలవడం ప్రారంభించారట. తనకు మాటలు రాకపోయినా ఆ రాక్షసుడు ఎప్పటిలానే అందరినీ వేధించడంతో చివరకు పార్వతీదేవి అతడిని సంహరించిందట. ఇది జరిగిన కొన్నాళ్లకు శంకరాచార్యులు సరస్వతీదేవి కోసం తపస్సు చేశారట. అమ్మవారు ప్రత్యక్షం అవ్వడంతో కేరళలో వెలసి భక్తులకు సాక్షాత్కరించమంటూ వేడుకున్నాడట. సరస్వతీదేవి అంగీకరించి - ఆయన వెనుక తాను నడిచి వస్తాననీ, అయితే మార్గంలో ఎక్కడా తలతిప్పి వెనక్కు చూడకూడదనీ ఒకవేళ అలా చూస్తే తాను ఆగిపోతాననీ షరతు పెట్టిందట. అలా ముందు జగద్గురువూ, వెనుక అమ్మవారూ నడవడం ప్రారంభించారట. కర్ణాటక, ఉడిపిలోని కొల్లూరుకు వచ్చినప్పుడు అమ్మవారి గజ్జెల చప్పుడు ఆగిపోయిందట. ఎంతసేపటికీ అమ్మవారి అడుగుల చప్పుడు వినిపించకపోవడంతో శంకరాచార్యులు వెనక్కి తిరిగి చూశారట. అప్పుడు అమ్మవారు షరతును గుర్తుచేయడమే కాకుండా మూకాసుర రాక్షసుడి కథనూ చెప్పి తాను ఆ ప్రాంతంలో ఉంటానందట. జగద్గురువు తన తప్పును క్షమించి, కేరళకు రమ్మని కోరగా తాను పొద్దుటిపూట కేరళలోని చోటానిక్కరలో ఉన్న భగవతీదేవి ఆలయంలోనూ, మధ్యాహ్నం కొల్లూరులోనూ ఉంటానని చెప్పిందట. చివరకు జగద్గురువు అమ్మవారి విగ్రహాన్ని స్థాపించి ఆలయం నిర్మించాడని అంటారు. అలాగే ఈ ఆలయానికి సంబంధించి మరో కథా ప్రాచుర్యంలో ఉంది. మూకాసురుడి సంహారం తరువాత పార్వతీదేవి ఇక్కడ మూకాంబికగా వెలసిందనీ, కోల మహర్షి కోరిక మేరకు త్రిమూర్తులు ఈ ప్రాంతంలో తిరుగుతుంటారనీ ప్రతీతి. పార్వతీదేవి కొలువైన ఈ క్షేత్రంలో శివుడు తన కాలి బొటనవేలితో శ్రీచక్రాన్ని గీశాడనీ చెబుతారు. అదేవిధంగా శంకరాచార్యులు బాలసన్యాసిగా ఉన్నప్పుడు ఇక్కడినుంచే జ్ఞానాన్వేషణ ప్రారంభించే క్రమంలో ఆలయంలో శ్రీచక్రాన్ని ఏర్పాటు చేసినట్లు కూడా ఒక కథ ప్రచారంలో ఉంది.

సింహవాహినిగా
కేరళ వాస్తుశైలిలో నిర్మించిన ఈ ఆలయంలోని అమ్మవారు స్వయంభువు లింగంతో కలిసి ముగ్గురమ్మల స్వరూపంగా భక్తులకు దర్శనమిస్తుంది. దేవి ఇక్కడ శంఖుచక్రాలు, అభయముద్ర, వరద ముద్రతో దర్శనమిస్తుంది. ఈ గర్భగుడి వెనుక ఆది శంకరాచార్యుల పీఠం కనిపిస్తుంది. ఇక్కడ అలంకరణలూ, పూజలూ అమ్మవారికి జరిపితే, అభిషేకాలను మాత్రం లింగానికి చేస్తారు. దసరా సమయాల్లోనూ మూలా నక్షత్రం రోజునా వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు ఈ ఆలయానికి వచ్చి తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తుంటారు. ఎంతోమంది రాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారని చరిత్ర చెబుతోంది. నవరాత్రులతోపాటూ, ఏడాదికోసారి అమ్మవారికి చైత్రమాసంలో రథోత్సవాన్ని నిర్వహిస్తారు. సౌపర్ణికా నదిలో 64 ఔషధ గుణాలున్నాయనీ, ఆ నీటిని తాగితే అనారోగ్యాలు దూరమవుతాయనీ ఇక్కడకు వచ్చే భక్తుల నమ్మకం.

ఎలా చేరుకోవచ్చు
ఈ ఆలయం ఉడిపిలోని కుందాపుర- కొల్లూరులో ఉంటుంది. విమానంలో రావాలనుకునేవారు మొదట మంగళూరు విమానాశ్రయంలో దిగి అక్కడినుంచి ప్రయివేటు వాహనాలూ, బస్సుల్లో ఆలయానికి చేరుకోవచ్చు. రైల్లో రావాలనుకుంటే కుందాపుర రైల్వేస్టేషన్‌లో దిగాలి. అక్కడినుంచి నలభై కిలోమీటర్ల దూరంలో ఉండే ఆలయానికి చేరుకునేందుకు బస్సులూ, ఇతర వాహనాలూ ఉంటాయి. రోడ్డుమార్గంలో రావాలనుకునేవారికి వివిధ ప్రాంతాల నుంచి బస్సులు అందుబాటులో ఉంటాయి.


Advertisement


ఇంకా..

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని