Published : 22 May 2022 00:30 IST

ఎత్తైన చెరకు ఎలా పండిందబ్బా?

చెరకు సాగులో సరికొత్త విధానాలను అవలంబిస్తూ... 23 అడుగుల ఎత్తైన చెరకును పండించాడు మొరాదాబాద్‌ రైతు మహ్మద్‌ మొబీన్‌. ప్రయోగాలతో అధిక దిగుబడినీ సొంతం చేసుకున్న ఈ రైతు పాటించిన పద్ధతేంటో మనమూ తెలుసుకుందామా!

అత్యధికంగా చెరకును పండించే రాష్ట్రాల్లో ముందుంటుంది ఉత్తర్‌ప్రదేశ్‌. ఆ రాష్ట్రంలోని మొరాదాబాద్‌ జిల్లాకు  చెరకు బెల్టుగా పేరుంది. ఆ ప్రాంతం లోని థాన్వాలా గ్రామానికి చెందిన మహ్మద్‌ మొబీన్‌ పదిహేనేళ్లుగా చెరకును పండిస్తున్నాడు. అలాగని ఏటా అదే కాకుండా క్యాలీఫ్లవర్‌, క్యాబేజీ, బంగాళాదుంపల వంటివీ మార్చి మార్చి సాగు చేస్తుంటాడు. అయితే రెండేళ్లుగా పన్నెండెకరాల పొలంలో ప్రయోగాత్మకంగా సాగుచేసిన చెరకు పంటనుంచి రెట్టింపు దిగుబడి వస్తుందట. సాధారణంగా పదో పదకొండో అడుగులు పెరిగే చెరకు అతని పొలంలో 23 అడుగులకుపైనే ఎత్తు పెరిగి అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. మొబీన్‌ అనుసరించిన ట్రెంచ్‌ విధానమే రెట్టింపు దిగుబడికీ, ఎత్తు పెరగడానికీ కారణమైంది అని చెబుతున్నాడు.

ఏంటీ విధానం...

వ్యవసాయ శాస్త్రవేత్తలూ, అగ్రికల్చర్‌ యూనివర్సిటీలూ సూచించే ట్రెంచ్‌ పద్ధతిని ఎంచుకున్న మొబీన్‌ గతేడాది సెప్టెంబరులో చెరకును వేశాడు. ట్రెంచ్‌ అంటే కందకం అని అర్థం. అంటే ఈ విధానంలో రెండు సాళ్ల మధ్యలో 75 నుంచి 90 సెంటీమీటర్ల దూరం తప్పనిసరిగా ఉంచుతారు. అలా సాళ్ల మధ్య వదిలిన చోట 20 నుంచి 25 సెంటీమీటర్ల లోతైన కందకం తవ్వుతారు. అలానే సాళ్లలో నాటే చెరకు గడకీ గడకీ మధ్యలో కాస్త ఎక్కువ స్థలమే వదులుతారు. చెరకు పంట బాగా ఎదగడానికీ, గడ లావవ్వడానికీ గాలీ వెలుతుకూ దోహదపడతాయి. సాళ్లకి మధ్యా, గడకీ గడకీ మధ్యా దూరం ఉంచడం వల్ల అవి సమృద్ధిగా అంది గడ బలంగా పెరగడానికి తోడ్పతాయి. అలానే లోతైన కందకాల్లో నీరు ఎక్కువగా పెట్టడానికీ వీలవుతుంది. లోతు వల్ల ఎరువులు చెరకు వేళ్ల వరకూ వెళతాయి. అంతేకాదు, ఈ విధానంలో ఉప్పు నీటినే పంటకి పెట్టమంటారు. ఆ నీటిలోని లవణాలు గడ దృఢంగా పెరగడానికి తోడ్పడతాయి. నీరు పెట్టాక తేమ ఆరకుండా చక్కెరను తయారు చేసే క్రమంలో వచ్చే ప్రెస్‌మడ్‌ అనే వ్యర్థాన్ని చల్లితే అది చక్కగా ఎరువులా పనిచేస్తుంది. అలానే ఎండిన చెరకు ఆకుల్ని పడేయకుండా కందకాల్లో వేస్తే అవి భూమి తేమని కోల్పోకుండా కాపాడతాయి. నీటి తేమకి అవీ కుళ్లిపోయి ఎరువుగా మారతాయి. ఈ విధంగా సాగు చేయడం వల్ల చెరకు బలంగానూ, ఎత్తుగానూ పెరుగుతుంది. మొబీన్‌ తన పొలంలో ఈ విధానాన్నే అనుసరించడం వల్ల ఎకరాకి వంద క్వింటాళ్లు పండే చోట రెండు వందలకుపైనే క్వింటాళ్ల చెరకు పండుతోంది. గతేడాదీ ఇలానే సాగు చేసి లాభాలను అర్జించిన మొబీన్‌ చెరకు పంట వైరల్‌ కావడంతో- ఈ పంటను చూడ్డానికి మొబీన్‌ పొలం బాట పట్టారు జనాలు. దాంతో అడిగిన రైతులకి ట్రెంచ్‌ విధానం గురించి అవగాహన తరగతులు నిర్వహిస్తూ ప్రోత్సహిస్తున్నాడు మొబీన్‌.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని