వీళ్ల టిఫిన్‌లో ఏం ఉంటుందంటే!

ప్రతి నిమిషాన్నీ తమ సంస్థల అభివృద్ధి కోసం కేటాయించే ప్రముఖ వ్యాపారవేత్తల ఆలోచనా విధానం, జీవనశైలీ భిన్నంగా ఉంటాయనేది తెలిసిందే కానీ... వారి ఆహారపుటలవాట్ల సంగతీ... వాళ్లు

Updated : 27 Mar 2022 02:28 IST

వీళ్ల టిఫిన్‌లో ఏం ఉంటుందంటే!

ప్రతి నిమిషాన్నీ తమ సంస్థల అభివృద్ధి కోసం కేటాయించే ప్రముఖ వ్యాపారవేత్తల ఆలోచనా విధానం, జీవనశైలీ భిన్నంగా ఉంటాయనేది తెలిసిందే కానీ... వారి ఆహారపుటలవాట్ల సంగతీ... వాళ్లు రోజూ టిఫిన్‌లో ఏం తింటారో... ఆహారానికి వాళ్లు ఇచ్చే ప్రాధాన్యం ఏంటో చూద్దామా..

ఇడ్లీలకు మారాడు

తరచూ ట్విటర్‌లో ఆసక్తికరమైన ట్వీట్లు చేస్తూ... అవసరంలో ఉన్నవారికి అండగా నిలుస్తుంటాడు ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్ర. వ్యాపార విషయాల్లో ఎంతో జాగ్రత్తగా ఉండే ఆయన ఆరోగ్యం పట్ల కూడా అంతే శ్రద్ధ చూపుతాడు. ఆయన చాలాకాలంపాటు ఉదయంపూట తన బ్రేక్‌ఫాస్ట్‌లో ఓట్స్‌ను ఎక్కువగా తీసుకునేవాడట. అయితే ఈ మధ్య రోజంతా చురుగ్గా ఉండాలంటే 30శాతం మాంసకృత్తులూ 70 శాతం పిండిపదార్థాలను తీసుకోవడం తప్పనిసరి అని ఓ సర్వేలో తెలుసుకున్నాడట. దాంతో ఆరోజు నుంచీ తన ఆలోచనా విధానం మార్చుకుని అల్పాహారంలో ఓట్స్‌ను తగ్గించి ఇడ్లీలను చేర్చుకున్నాడట.


బొప్పాయి జ్యూస్‌ తప్పనిసరి

ప్రముఖ వ్యాపారదిగ్గజం ముకేశ్‌ అంబానీ జీవనవిధానం ఎంత ఆడంబరంగా ఉంటుందో... ఆహారపుటలవాట్లు అంత సింపుల్‌గా కనిపిస్తాయి. ఫైవ్‌స్టార్‌ హోటల్‌లోనే కాదు... రోడ్డుపక్కన ఉండే స్ట్రీట్‌ఫుడ్‌ బాగుందని తెలిస్తే అక్కడికి కూడా వెళ్లి తినేందుకు ఆసక్తి చూపిస్తాడట. పొద్దున్నే తీసుకునే టిఫిన్‌లో చపాతీ, దోశ లాంటివే ఉంటాయి కానీ... వాటితోపాటు బొప్పాయి రసం తప్పనిసరిగా తాగుతాడు. మధ్యాహ్నం సూప్‌, సలాడ్‌లకే ఎక్కువగా పరిమితమైనా...రాత్రి మాత్రం దాల్‌రోటీని తీసుకుంటాడు. ఇడ్లీ-సాంబార్‌ను అమితంగా ఇష్టపడే ఆదివారం తన టిఫిన్‌లో అవి తప్పనిసరిగా ఉండాలని కోరుకుంటాడు. ఇవన్నీ కాకుండా ఎప్పుడైనా చాట్‌ తినేందుకు ఇష్టపడతాడు.


చాక్లెట్‌ బార్‌ చాలు

ప్రతి క్షణాన్నీ పని కోసమే కేటాయించే సీఈఓల్లో ముందుంటాడు స్పేస్‌ ఎక్స్‌ వ్యవస్థాపకుడు ఎలాన్‌మస్క్‌. తన దినచర్యలో ఆహారానికి ఆఖరి ప్రాధాన్యం ఇచ్చే ఎలాన్‌ నిజానికి పొద్దున్నే టిఫిన్‌ తినడు. కప్పు కాఫీ తాగి ఆ తరువాత కూడా మరీ ఆకలిగా అనిపిస్తే.. ఓ మార్స్‌ చాక్లెట్‌బార్‌ను తినేస్తాడట. మధ్యాహ్నమూ అంతే... తన ప్లేటులో ఏ భోజనం ఉన్నా... ఓ వైపు సమావేశాలు నిర్వహిస్తూనే కేవలం అయిదు నిమిషాల్లోనే కానిచ్చేస్తాడు. రోజంతా ఇలా పనిలోనే మునిగితేలే మస్క్‌ రాత్రి మాత్రం తన డిన్నర్‌లో ఫ్రెంచ్‌ వంటకాలూ అమెరికన్‌ బార్బెక్యూ పదార్థాలూ ఉండేలా చూసుకుంటాడట. అయితే... రోజూ తీపి తినడం మంచిది కాదు కాబట్టి... ఇప్పుడిప్పుడు బ్రేక్‌ఫాస్ట్‌లో చాక్లెట్‌ను తగ్గించి ఆమ్లెట్‌ను తినేందుకు ప్రయత్నిస్తున్నానని అంటాడు.


ఆక్టోపస్‌ ఉండాల్సిందే...

అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ మంచి భోజన ప్రియుడు. ఆక్టోపస్‌తో చేసిన ఏదో ఒక ఐటమ్‌ బ్రేక్‌ఫాస్ట్‌లో ఉండి తీరాల్సిందేనట. దాంతోపాటూ బేకన్లూ, గార్లిక్‌, పెరుగు, ఉడికించిన గుడ్లు, బంగాళాదుంపలు కూడా ఉండేలా చూసుకుంటాడట. అలాగే థాయ్‌ఫుడ్‌నీ ఎక్కువగా ఇష్టపడతానని అంటాడు.

ఆఫీసులో ఉద్యోగులంతా బెజోస్‌తో మీటింగు ఎప్పుడుంటుందా అని ఎదురు చూస్తుంటారట. ఎందుకంటే ఆయన సమావేశాల సమయంలో రకరకాల ఆహార పదార్థాలను తెప్పించి ఉద్యోగులకు రుచి చూపిస్తుంటాడట. మంచి ఆహారం తీసుకున్నప్పుడే బుర్ర చురుగ్గా పని చేసి గొప్ప ఆలోచనలు వస్తాయని బెజోస్‌ అభిప్రాయం.


బిస్కెట్లు కావాలి..

కొందరు బతకడానికి తింటే మరికొందరు తినడానికే బతుకుతుంటారు. మొదటి కోవకే చెందుతాడు ఫేస్‌బుక్‌ వ్యవస్థాపకుడు మార్క్‌ జుకర్‌బర్గ్‌. ఆకలి వేసినప్పుడు ఏది అందుబాటులో ఉంటే అదే తిని పొట్ట నింపేసుకుంటాడట. చదువుకునే రోజుల్లోనూ ఫేస్‌బుక్‌ ప్రారంభానికి ముందూ కేవలం బిస్కెట్లపైనే ఆధారపడ్డాడట జుకర్‌బర్గ్‌. ఆ తరవాత కొంతకాలం చికెన్‌, మటన్‌, ఎండ్రకాయల్ని ఇష్టంగా తినేవాడట. క్రమంగా ఆ ఆలవాట్లు మార్చుకుని ఓట్స్‌, గుడ్లు... వంటివి తీసుకోవడం మొదలు పెట్టాడట.


ఎండవేళ ‘మంచి’నీళ్లు..!

మారిన పరిస్థితులతో ప్రతి ఒక్కరూ తినే ఆహారం, తాగే నీళ్లూ... ఇలా అన్నింటిపైనా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. అలా ఈ మధ్య కాలంలో ఎక్కువమంది అనుసరిస్తోన్న సరికొత్త ఆరోగ్య పద్ధతుల్లో ఇన్‌ఫ్యూజ్డ్‌ వాటర్‌ ఒకటి. ఎండలు పెరుగుతోన్న వేళ నిస్సత్తువను తగ్గించి... ఉత్తేజంగా మార్చే ఈ నీళ్ల గురించి తెలుసుకుందామా?

నిన్న మొన్నటి వరకూ మేనుని చల్లగా తాకిన గాలులు ఇప్పుడు సెగలు పుట్టిస్తున్నాయి. ఇలాంటప్పుడు నీళ్లూ ఇతర ద్రవపదార్థాలూ ఎక్కువ తీసుకోవాలని చెబుతుంటారు వైద్యులు. ఆరోగ్యం కోసం పండ్ల ముక్కలు తినడం, పండ్ల రసాలు తాగడం కూడా మనకు తెలిసిందే. కానీ...వాటిని నీళ్లల్లో నానబెట్టి తాగడం గురించి ఎప్పుడైనా విన్నారా? అవే ఇన్‌ఫ్యూజ్డ్‌ వాటర్‌. వీటినే ఫ్లేవర్డ్‌ వాటర్‌, డిటాక్స్‌ వాటర్‌ లేదా స్పా వాటర్‌ అని కూడా పిలుస్తారు. ప్రస్తుతం మార్కెట్లో ఇవి ప్యాకేజింగ్‌ల్లోనూ దొరుకుతున్నాయి. వాటినే కొనుక్కోవాలనేం లేదు. మనం ఇంట్లోనే సులువుగా చేసుకోవచ్చు కూడా. ఇందులో కేవలం పండ్ల ముక్కల్నే కాదు...తులసి, పుదీనా, థైమ్‌, రోజ్‌మెరీ మూలికల్నీ జత చేయొచ్చు. కాలమేదైనా ఏ రుచీ లేని నీటిని తాగడానికి ఇష్టపడరు కొందరు. అలాంటివారు ఈ ఫ్లేవర్డ్‌ వాటర్‌ని ఇష్టంగా తాగొచ్చని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. పండ్లరసాలు తాగినా, పండ్ల ముక్కలు తిన్నా...ఏదో ఒకటో, రెండో తినగలం. పైగా పండ్ల రసాల్లో చక్కెరలూ ఎక్కువగానే ఉంటాయి. కానీ వీటిల్లో అవేవీ కలవకపోయినా వగరూ, తీపీ, పులుపు రుచులతో కొత్తగా అనిపిస్తాయి.

వేటితో చేసుకోవచ్చు...

మనకు నచ్చిన పండ్లు, కూరగాయలు, ఔషధ గుణాలు పుష్కలంగా ఉండే తులసీ, పుదీనా, థైమ్‌, రోజ్‌మెరీ, గులాబీ రేకలు...ఇలా వేటితోనైనా సరే ఈ ఇన్‌ఫ్యూజ్డ్‌ వాటర్‌ని తయారు చేసుకోవచ్చు. ఈ నీళ్ల తయారీకి ఎక్కువగా వాడే పండ్ల ముక్కల్లో బెర్రీస్‌...యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంటాయి. కీరదోస జీర్ణవ్యవస్థని శుభ్రం చేస్తుంది. కివీ నీళ్లకు మంచి రుచిని ఇస్తుంది. నిమ్మరసం శరీరంలో పీహెచ్‌ స్థాయుల్ని సమం చేస్తుంది. వీటికే కాదు...ప్రతి పండుకీ ఓ ప్రత్యేక గుణముంటుంది, నచ్చిన ఏ రకాన్నైనా ఇందుకోసం వాడొచ్చు.

ఎలా చేయాలి...

ఇన్‌ఫ్యూజ్డ్‌ వాటర్‌ తయారీ కోసం నచ్చిన మూడు నాలుగు రకాల పండ్లను అవసరం మేరకు కట్‌ చేసుకుని ఓ గాజు సీసా లేదా పాత్రలో వేయాలి. ఆపై తులసి, పుదీనా, రోజ్‌మెరీ వంటి వాటిని చేర్చి చల్లటి
నీళ్లు పోయాలి. దాన్ని ఐదారు గంటల పాటు అలానే ఉంచి తర్వాత ఆ నీళ్లను తాగొచ్చు. వేడినీళ్లు అయితే రెండు మూడు గంటల ఉంచితే చాలు. వీటిల్లో ఉప్పూ, చక్కెరలూ, శీతలపానీయాలు వంటివి అస్సలు కలపకూడదు. ఈ నీళ్లను సహజ పదార్థాలతో చేస్తారు కాబట్టి ఎవరైనా తాగొచ్చు. పండ్ల ముక్కలూ, మూలికల నుంచి అందే విటమిన్లూ, ఖనిజలవణాలూ, యాంటీ ఆక్సిడెంట్లూ, ఫైటో న్యూట్రియెంట్లూ ఈ నీళ్లల్లోకి చేరతాయి కాబట్టి ఆరోగ్యానికి ఎంతో మేలు. ముఖ్యంగా ఈ నీళ్లు వేసవి చిక్కులకు చక్కటి పరిష్కారం. ఈ నీళ్లు తాగితే డీహైడ్రేషన్‌, అతిదాహం వంటి సమస్యలు అదుపులో ఉంటాయి. సాధారణంగా ఈ కాలంలో చెమట రూపంలో ఖనిజ లవణాలు ఎక్కువగా పోతుంటాయి. అలాంటప్పుడు మామూలు నీళ్లకు బదులుగా ఈ ఇన్‌ఫ్యూజ్డ్‌ వాటర్‌ని తాగితే ఉత్తేజంగా ఉండొచ్చు. ఒంట్లోని వ్యర్థాలను బయటకు పంపించే శక్తి ఈ నీళ్లకు ఉండటం వల్ల డిటాక్స్‌ వాటర్‌గానూ వాడుతుంటారు. ఈ నీళ్లు శరీర మెటబాలిజాన్ని వేగవంతం చేస్తాయి. కెలొరీలను వేగంగా కరిగేలా చేస్తాయి. జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి. సులువుగా నచ్చిన రుచుల్లో చేసుకోగలిగే ఈ ఇన్‌ఫ్యూజ్డ్‌వాటర్‌ని ఎక్కడికైనా వెంట తీసుకెళ్లొచ్చు కూడా!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..