భలేగా ఆలోచించాడే

బిల్‌బోర్డులు ప్రకటనలు ప్రదర్శించడానికే పనికొస్తాయని అందరికీ తెలిసిందే. అయితే వాటి నుంచి విద్యుత్తుని కూడా ఉత్పత్తి చేయొచ్చని నిరూపించాడు ముంబయికి చెందిన ముస్తఫా

Updated : 05 Jun 2022 00:01 IST

భలేగా ఆలోచించాడే

బిల్‌బోర్డులు ప్రకటనలు ప్రదర్శించడానికే పనికొస్తాయని అందరికీ తెలిసిందే. అయితే వాటి నుంచి విద్యుత్తుని కూడా ఉత్పత్తి చేయొచ్చని నిరూపించాడు ముంబయికి చెందిన ముస్తఫా అకోలావాలా.  ఇలాంటి ప్రయత్నం, ప్రయోగం దేశంలో ఇదే మొదటిది.

మార్కెట్‌లోకి వచ్చిన కొత్త ఉత్పత్తులను ప్రదర్శిస్తూ పెద్ద పెద్ద బిల్‌బోర్డులు మనకు దర్శనమిస్తుంటాయి. అలాంటి బిల్‌ బోర్డులను ఏర్పాటు చేసే అడ్వర్టైజ్‌మెంట్‌ సంస్థను ‘జస్ట్‌ అవుట్‌డోర్‌’ పేరిట 2012లో స్థాపించాడు ముంబయికి చెందిన ముస్తఫా అకోలావాలా. రకరకాల మాధ్యమాలకు ప్రకటనలను రూపొందించే ఈ సంస్థ క్రమంగా బిల్‌బోర్డు(ప్రచార హోర్డింగు)ల ఏర్పాటుకూ శ్రీకారం చుట్టి... దాదాపు రెండు వందల బోర్డులను అమర్చి పేరున్న వ్యాపార ప్రకటన సంస్థల జాబితాలోనూ చేరిపోయింది. అయితే మొదట్నుంచీ ఈ సంస్థ ఏర్పాటుచేసే బిల్‌బోర్డులన్నీ కరెంట్‌తోనే నడిచేవి. ఒక్కోటిగా వాటి సంఖ్య పెరిగే కొద్దీ విద్యుత్‌ వాడకం పెరగడం, రకరకాల కారణాల వల్ల ఆ సరఫరాకు అంతరాయం ఏర్పడటం వంటివెన్నో ఈ సంస్థను ఇబ్బంది పెట్టేవి. దాంతో వాటికి సోలార్‌ విద్యుత్తును అందిస్తే సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని భావించాడు ముస్తఫా.

అందుకే 2019లో బిల్‌బోర్డులకు సోలార్‌ ప్యానెల్స్‌ అమర్చి వాటికి సౌర వెలుగులు ఇవ్వడం మొదలుపెట్టాడు. అలా దాదాపు పదిహేడుకు పైనే బిల్‌బోర్డులను ముంబయిలోని పలు చోట్ల ఏర్పాటు చేశాడు. మరో పదిహేడు బోర్డులకు సంబంధించిన పనులు అవుతున్నాయి. ఇక బిల్‌బోర్డులకున్న సౌరఫలకాలు ఏడాదికి రెండు లక్షల యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి. బిల్‌బోర్డుల వాడకానికిపోగా మిగిలిన విద్యుత్తును గ్రిడ్‌కు అమ్ముకుంటే భారీగానే ఆదాయం వస్తుంది. అయితే దాన్ని ప్రజా అవసరాలకు వినియోగిస్తే మంచిదని భావించాడు. అందుకే  బిల్‌బోర్డులకున్న ఫలకాలు ఉత్పత్తి చేసే విద్యుత్తును రైల్వే స్టేషన్ల నిర్వహణకు అందిస్తే వాటిపై పడే కరెంట్‌ బిల్లు భారం నుంచి కాస్తైనా ఉపశమనం దొరుకుతుందనుకున్నాడు. అందుకే పశ్చిమ రైల్వేకి చెందిన కఫ్‌ పరేడ్‌, మహాలక్ష్మి, కార్టర్‌ రోడ్‌, బాంద్రా, అంధేరీ, మహాలక్ష్మి, ఓషివర స్టేషన్లతోపాటు మొత్తం 17 స్టేషన్లకూ, వాటికి దగ్గర్లోని రైల్వేకాలనీలకూ సౌరవిద్యుత్తును ఉచితంగా అందిస్తున్నాడు. ఈ విధంగా రైల్వేకి విద్యుత్తునివ్వడం దేశంలోనే కాదు ఆసియాలోనే ప్రధమం. అందుకుగానూ ఇండియా, ఆసియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లోకి ఎక్కింది ముస్తఫా స్థాపించిన ‘జస్ట్‌ అవుట్‌డోర్‌’. అలానే స్వలాభం చూసుకోకుండా ప్రజా అవసరాల గురించి పెద్ద మనసుతో ఆలోచించిన ముస్తఫాను అభినందించాల్సిందే!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..