సాహస బాలల సమ్మర్‌ క్యాంపులు!

ఈ వేసవి సెలవుల్లో సరదాగా అడవిని చుట్టిరావాలనుందా.... ఎత్తయిన కొండలెక్కాలా... నదిలో రాఫ్టింగ్‌ చేయాలా... పచ్చని చెట్ల మధ్య పరుగులు తీయాలా... అందుకోసం ఎన్నెన్నో సాహసక్రీడల్నీ, బోలెడంత థ్రిల్‌నీ అందించే వేసవి శిబిరాలున్నాయి.

Updated : 15 May 2022 02:05 IST

సాహస బాలల సమ్మర్‌ క్యాంపులు!

ఈ వేసవి సెలవుల్లో సరదాగా అడవిని చుట్టిరావాలనుందా.... ఎత్తయిన కొండలెక్కాలా... నదిలో రాఫ్టింగ్‌ చేయాలా... పచ్చని చెట్ల మధ్య పరుగులు తీయాలా... అందుకోసం ఎన్నెన్నో సాహసక్రీడల్నీ, బోలెడంత థ్రిల్‌నీ అందించే వేసవి శిబిరాలున్నాయి. ‘నేచర్‌ అండ్‌ అడ్వెంచర్‌’ పేరుతో నిర్వహిస్తున్న ఆ సమ్మర్‌ క్యాంపులేంటో ఓసారి చూద్దామా!

డాదంతా తరగతి గదిలోనే కూర్చునే పిల్లల్ని సెలవుల్లోనూ ఇంటికే పరిమితం చేయడం ఎందుకంటూ చాలామంది తల్లిదండ్రులు ఏదో ఒక వేసవి శిబిరానికి పంపుతుంటారు. అంతవరకూ బాగానే ఉందికానీ... అయితే ఎప్పుడూ డ్యాన్సూ, క్రాఫ్ట్‌వర్కూల్లాంటివి నేర్పించే క్యాంపులకే పంపాలా? చిన్నారులకు సాహసాలు చేయడం సరదా అయితే గనుక ‘నేచర్‌ అండ్‌ అడ్వెంచర్‌ సమ్మర్‌ క్యాంపు’లకీ పంపొచ్చు. ఈ సాహస శిబిరాల్లో బోలెడన్ని యాక్టివిటీలుంటాయి.

కొండాకోనల్లో...

పొడవైన తాళ్లేసుకుని పెద్ద పెద్ద కొండలెక్కడం, జిప్‌లైన్‌తో జర్రుజర్రున లోయల్ని దాటడం, ట్రెజర్‌ హంట్‌ లాంటి ఎన్నో సాహసాలూ, సరదా ఆటలూ ఉంటాయిందులో. ‘ఔట్‌లైఫ్‌’ అనే సంస్థ హైదరాబాద్‌, బెంగళూరు, మహారాష్ట్ర దగ్గర్లోని అటవీ ప్రాంతాల్లో ఏటా అడ్వెంచర్‌ సమ్మర్‌ క్యాంపుల్ని ఏర్పాటుచేస్తోంది. వీటిల్లో మనకు నచ్చిన క్యాంపును ఎంచుకోవచ్చు. తొమ్మిది నుంచి పదిహేను సంవత్సరాల చిన్నారులెవరైనా ముందుగా రిజిస్టర్‌ చేసుకుని వెళ్లొచ్చు. ఆహారం దగ్గర్నుంచి రక్షణ వరకూ అన్నీ వాళ్లే చూసుకుంటారు.

నీటిపైనా సఫారీ...

పుణెకు చెందిన ‘పగ్‌మార్క్స్‌’ సంస్థ దాదాపు ఇరవై ఏళ్ల నుంచి అడ్వెంచర్‌ క్యాంపుల్ని ఏర్పాటుచేస్తోంది. పిల్లల వయసును బట్టి రకరకాల విభాగాలుంటాయి. జంతువుల్ని దగ్గరి నుంచి చూపించే వైల్డ్‌లైఫ్‌ అడ్వెంచర్‌ లాంటి ఇతర సాహసాలతో పాటు నదిలో రాఫ్టింగ్‌, నీటిపైన సాగే రైడ్స్‌ అండ్‌ టైడ్స్‌, ట్రీ టాప్‌ వ్యూస్‌, మంచుపర్వతాల ట్రెక్కింగ్‌ లాంటివెన్నో ఉంటాయి. దీంట్లో పిల్లలతో పాటూ తల్లిదండ్రులు కూడా వెళ్లే ‘పేరెంట్‌ అండ్‌ చైల్డ్‌ క్యాంపు’లూ ఉన్నాయి.  

పర్వతాల పైపైకి...

‘ఇన్మె అండ్‌ యురేకా’, ‘ఫోలియేజ్‌ ఔట్‌డోర్స్‌’ సంస్థలు కూడా ఇలాంటి సాహస శిబిరాల్ని నిర్వహిస్తున్నాయి. 8 నుంచి 18 సంవత్సరాల వారికి సరిపోయే రకరకాల ఛాలెంజ్‌ పోటీలుంటాయి.  మౌంటెయిన్‌ క్లైంబింగ్‌, మౌంటెయిన్‌ బైకింగ్‌ తదితరాలు ఉండే ఈ క్యాంపుల్ని హిమాచల్‌ప్రదేశ్‌, మహారాష్ట్ర, తమిళనాడు లాంటి ప్రాంతాల్లో పెడుతుంటారు.

జంతువులతో సరదాగా...

‘మైసూరు జూ’ ప్రతి సంవత్సరం వేసవిలో వైల్డ్‌లైఫ్‌ క్యాంప్‌ పెడుతోంది. దీంట్లో రకరకాల జంతువుల్ని చూపించడమే కాదు, అవి ఏ జాతికి చెందినవీ... ఆహారపు అలవాట్లు ఏమిటీ... వాటి ప్రవర్తన ఎలా ఉంటుందీ... లాంటి ఎన్నో ఆసక్తికర అంశాల్ని చిన్నారులకు వివరిస్తుంటారు. మామూలుగా అయితే జూల్లో ఉన్న జంతువుల్ని చూసి వస్తామంతే, కానీ ఈ క్యాంపుకెళితే వాటి పూర్తి స్వభావాన్నీ తెలుసుకుని రావొచ్చన్నమాట.

ఇదంతా సరే కానీ, పిల్లల్ని ఒంటరిగా ఎలా పంపాలి... సాహసాలు చేసేప్పుడు దెబ్బతగిలితే కష్టం కదా... లాంటి బోలెడు సందేహాలు వచ్చే ఉంటాయి కదూ.  వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే ఈ క్యాంపుల్ని పెట్టే సంస్థలు పిల్లలకు ముందుగా సూచనలు ఇవ్వడమూ, రక్షణ కోసం హెల్మెట్లూ, జాకెట్లూ అందించడం లాంటివి చేస్తుంటాయి. పైగా శిక్షకులు పక్కనే ఉంటూ, చిన్నారులతో ఈ సాహసాలన్నింటినీ చేయిస్తారు.


అవి ‘హార్లీ డేవిడ్‌సన్‌’ షేర్‌ ఆటోలు!

హార్లీ డేవిడ్‌సన్‌... ఖరీదైన మోటారుబైకులకి పేరుగాంచిన బ్రాండ్‌ ఇది! ఆ కంపెనీ అమ్మే ప్రతి బైకూ పది నుంచి నలభై లక్షలదాకా ధర పలుకుతుంది. అలాంటి విలాసవంతమైన బైకుని షేర్‌ ఆటోలుగా మార్చి దిల్లీలో గల్లీగల్లీ తిప్పిన ఘటన ఇది. ఆ ఘనతకి సాక్ష్యంగా ఈ అందాల షేర్‌ ఆటో నమూనా ఇప్పటికీ దిల్లీలోని మోటార్‌కార్‌ మ్యూజియంలో కనిపిస్తుంది. ఈ ఆసక్తికరమైన చరిత్రకి బీజం... రెండో ప్రపంచయుద్ధ సమయంలో పడింది. అమెరికా ఆ యుద్ధమప్పుడు ‘హార్లీడేవిడ్‌సన్‌-డబ్ల్యూఎల్‌ఏ’ బైకుల్ని విరివిగా వాడింది. ఎందుకూ అంటారేమో... సైనికాధికారులకూ సిపాయిలకూ మధ్య సమాచార మార్పిడి కోసం! సైనికాధికారులు తమ సందేశాన్ని వార్తాహరులకి చెబితే... వాళ్లు అత్యంత వేగంగా ఈ బైకు నడుపుకుంటూ వెళ్లి దాన్ని సిపాయిలకి చేరవేస్తారన్నమాట. వాళ్ల కోసమే హార్లీడేవిడ్‌సన్‌ సంస్థ వేల సంఖ్యలో వీటిని తయారుచేసి అమ్మింది. కానీ... రెండో ప్రపంచయుద్ధం చివరి ఏడాదిలో వైర్‌లెస్‌ కమ్యూనికేషన్‌ వ్యవస్థ పుంజుకోవడంతో ఈ బైకుల అవసరం తగ్గింది. యుద్ధం ముగిసేనాటికి భారీగా పోగుపడ్డ ఈ బైకుల్ని ఏం చేయాలో తెలియక తుక్కుకింద అమ్మాలనుకుంది అమెరికన్‌ సైన్యం. అలా వాటిని కొన్న దిల్లీలోని వ్యాపారులు కొందరు వాటికి రెండుసీట్లూ, పైకప్పూ జోడించి షేర్‌ ఆటోలుగా మలిచారు. బలమైన ఇంజిన్‌, బరువైన ఆకారం కారణంగా డజనుమంది ఎక్కినా ఈ బైకు భరించి దూసుకెళ్లేది! ఇంకేం, 1950ల నుంచి సుమారు యాభయ్యేళ్లదాకా దిల్లీవీధుల్లో వీటి హవా నడిచింది. హార్లీడేవిడ్‌సన్‌ ఇంజిన్‌లు సృష్టించే శబ్దం కారణంగా ఈ రిక్షాలని ‘ఫట్‌ఫటా’ అనేవాళ్లు దిల్లీవాసులు. కానీ 1998లో దిల్లీనగరంలో 20 ఏళ్లకి పైపడ్డ వాహనాలేవీ నడపకూడదన్న రూలు రావడంతో హార్లీ డేవిడ్‌సన్‌ ఆటోరిక్షాల సుదీర్ఘ యాత్రకి తెరపడింది!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..