వైద్య రంగంలో రానున్న కొత్త చికిత్సలెన్నో..!

మానవాళిని ముప్పుతిప్పలు పెడుతోన్న ఆనువంశిక వ్యాధులతోపాటు మరెన్నో ఆరోగ్య సమస్యల నివారణ కోసం శాస్త్రనిపుణులు నిత్యం పరిశోధనలు చేస్తుంటారు.

Updated : 01 Jan 2023 05:30 IST

వైద్య రంగంలో రానున్న కొత్త చికిత్సలెన్నో..!

మానవాళిని ముప్పుతిప్పలు పెడుతోన్న ఆనువంశిక వ్యాధులతోపాటు మరెన్నో ఆరోగ్య సమస్యల నివారణ కోసం శాస్త్రనిపుణులు నిత్యం పరిశోధనలు చేస్తుంటారు. చికిత్సావిధానాలను రూపొందిస్తుంటారు. అవి ప్రయోగశాలలో  పరీక్షలన్నీ పూర్తిచేసుకుని ఆసుపత్రుల్లో అడుగుపెట్టడానికి దశాబ్దాలపాటు నిరీక్షించాల్సి ఉంటుంది. కొన్నేళ్లుగా మనిషిని ఊరిస్తోన్న అలాంటి వైద్య విధానాల్లో కొన్ని ఈ ఏడాది వాడుకలోకి రానున్నాయనీ వాటితో  ఆయా వ్యాధుల్ని ఎదుర్కోగలమనీ ఆశిస్తున్నారు పరిశోధకులు.


హైడ్రోజన్‌ థెరపీ

ఇంధనంగానే కాదు, హైడ్రోజన్‌ను వైద్యపరమైన చికిత్సల్లోనూ వాడనున్నారట. ఓ వారంపాటు- కాలుష్యరహితమైన ఈ గాలిని పీల్చడంవల్ల ఆస్తమా, కీళ్లనొప్పులు, మధుమేహం, బీపీ వంటి సమస్యలు తగ్గుతాయట. శరీరంలో యాంటీఆక్సిడెంట్ల శాతం తగ్గడంవల్లే ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొంటున్నామనీ కాబట్టి హైడ్రోజన్‌ను పీల్చడంవల్ల అది శరీరంలో వాటి ఉత్పత్తిని పెంచుతుందనీ అంటున్నారు. ఇది శరీరంలోని సూక్ష్మ రక్తనాళాల్లోకి చొచ్చుకునిపోయి ఆక్సీకరణ ఒత్తిడిని కలిగించే ఫ్రీ రాడికల్స్‌ సంఖ్యను తగ్గించడంతోపాటు యాంటీ ఆక్సిడెంట్లూ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ సైటోకైన్ల ఉత్పత్తికి తోడ్పడుతుందని చెబుతున్నారు.


జ్ఞాపకశక్తి తిరిగి వచ్చేలా!

ప్రపంచవ్యాప్తంగా వృద్ధుల్ని ఇబ్బందిపెడుతోన్న సమస్య ఆల్జీమర్స్‌. దీనివల్ల తలెత్తే మతిమరపుని అడ్డుకోవడం వైద్య నిపుణులకు అసాధ్యంగా మారింది. అందుకే చిప్‌ను పోలిన ఇంప్లాంట్స్‌ను రూపొందించారు. ఇవి అచ్చంగా మెదడులోని హిప్పోక్యాంపస్‌లోని ఎలక్ట్రోకెమికల్‌ సంకేతాల్లానే పనిచేసి జ్ఞాపకశక్తిని పెంచుతాయట. ఇప్పటికే ఎలుకలు, కోతులు, మనుషుల్లోనూ చేసిన ప్రయోగాలు విజయవంతమవడంతో ఇప్పుడు రోగుల్లోనూ వాడేందుకు సిద్ధమయ్యారు. ఎలక్ట్రోడ్‌ శ్రేణులను జ్ఞాపకాల్ని పదిలపరిచే ఆరోగ్యకరమైన మెదడు కణజాలంలోకి పంపించి, వాటిని ప్రేరేపించడం ద్వారా వాటికి నమూనాలు ఏర్పడేలా చేస్తారు. ఈ రకమైన న్యూరల్‌ ప్రాస్థెసిస్‌తో ఆల్జీమర్స్‌ రోగుల్లో మతిమరుపుని అడ్డుకుంటారన్నమాట. అంతేకాదు, ఈజై, బయోజెన్‌ సంస్థలు మోనోక్లోనల్‌ యాంటీబాడీలతో రూపొందించిన లెకానేమాబ్‌ అనే ఔషధం మెదడులో పేరుకునే బీటా ప్రొటీన్‌ను తొలగించడం ద్వారా మతిమరుపుని అడ్డుకుంటుందట. అనావెక్స్‌ లైఫ్‌ సైన్సెస్‌ కంపెనీ రూపొందించిన బ్లార్కామెసీన్‌ అనే మందు కూడా ఇలాంటిదే. సో, ఆల్జీమర్స్‌కీ చికిత్స రానుందన్నమాట.


జన్యు చికిత్సలతో...

వంశపారంపర్యంగా వచ్చే వ్యాధుల నివారణకు వైద్యులు ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా ఆస్ట్రేలియాకు చెందిన వెర్వ్‌ థెరప్యూటిక్స్‌ సంస్థ క్రిస్పర్‌ టెక్నాలజీని ఉపయోగించి జన్యులోపాల కారణంగా తలెత్తే హృద్రోగాల్ని నివారించవచ్చు అంటోంది. క్లినికల్‌ పరీక్షల్లో భాగంగా చెడు కొలెస్ట్రాల్‌కు కారణమవుతోన్న పీసీఎస్‌కే9 అనే జన్యువుని గుర్తించి పనిచేయకుండా చేయగలిగారట. కార్డియోమయోపతీని సైతం జీన్‌ ఎడిటింగ్‌ ద్వారా నివారించవచ్చు అంటున్నారు. అదేవిధంగా సికిల్‌సెల్‌ అనీమియా, బీటా- థలసీమియా..వంటి వ్యాధులకీ చికిత్సను అందిస్తామంటున్నాయి మాసాచుసెట్స్‌, వెర్టెక్స్‌, క్రిస్పర్‌ థెరప్యూటిక్స్‌ సంస్థలు. ఈ వ్యాధులకు కారణమైన లోపపూరిత జన్యువును నిర్వీర్యం చేసి, ఆరోగ్యకరమైన రక్తకణాలు ఉత్పత్తయ్యేలా చేయగలిగేందుకు ‘ఎక్సా-సెల్‌’ అనే జీన్‌ ఎడిటింగ్‌ చికిత్సను తీసుకొచ్చాయివి.


ఎం-ఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్లు!

రోగనిరోధకశక్తిని పెంచేందుకు శరీరంలోకి సంబంధిత వైరల్‌ యాంటీజెన్‌లను ప్రవేశపెట్టడమే వ్యాక్సిన్‌. అయితే ప్రస్తుతం ఇస్తోన్న వెక్టర్‌- వ్యాక్సిన్లలో అంత చురుకుగాలేని వైరస్‌నే ప్రవేశపెడతారు. దాంతో అది శరీరంలోకి వెళ్లి ప్రభావం చూపడానికి కొంత సమయం పడుతుంది. కానీ ఎం-ఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్లలో ఆ వైరస్‌కు సంబంధించిన ప్రొటీన్‌ శరీరంలో తయారవడంతో- దాన్ని ఎదుర్కొనేందుకు రోగనిరోధకశక్తి సత్వరమే స్పందిస్తుంది. దాంతో సంప్రదాయ వ్యాక్సిన్లకన్నా ఇవి సమర్థంగా పనిచేస్తాయన్నమాట. పైగా ఇవి కొత్త వైరస్‌ రకాల్నీ ఎదుర్కోగలుగుతాయి. ఈ తరహాలో కొవిడ్‌ను అడ్డుకునేందుకు తయారైన ఫైజర్‌, మోడర్నా వ్యాక్సిన్ల పనితీరు మెరుగ్గా ఉండటంతో మలేరియా, క్యాన్సర్‌, సికిల్‌సెల్‌ అనీమియా, హెచ్‌ఐవీ... ఇలా అనేక వ్యాధుల్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు ఈ సరికొత్త టెక్నాలజీతోనే రూపొందించిన వ్యాక్సిన్లు వాడుకలోకి రానున్నాయట.


నానో మెడిసిన్‌!

నానోటెక్నాలజీని ఇక పూర్తిస్థాయిలో వైద్యరంగంలో వాడేందుకు రంగం సిద్ధమైంది అంటే- అత్యంత సూక్ష్మమైన రోబోల్నీ(జీనోబోట్స్‌) డీఎన్‌ఏబోట్స్‌నీ రక్తనాళాల్లోకి ఇంజెక్టు చేయడంతో అవి నేరుగా వ్యాధికి కారణమైన వైరస్‌లనూ క్యాన్సర్‌ కణాల్నీ గుర్తించి, వాటిమీద దాడిచేస్తాయి. ఇవి సమాంతరంగానూ వర్తులాకారంలోనూ కదులుతూ కణుతుల్ని నాశనం చేస్తాయట. ఈ రకమైన చికిత్సతో ఆటోఇమ్యూన్‌ వ్యాధుల్నీ ఆర్థ్రయిటిస్‌నీ కూడా నివారించగలం అంటున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..