పెళ్లి అలంకరణ... కొత్తకొత్తగా!
పెళ్లికి పర్యాయపదం అలంకరణ అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అవునుమరి...నిశ్చితార్థంలో తొడిగే ఉంగరాన్ని ఉంచే పెట్టె నుంచి చీరసారెల్ని పెట్టే బుట్టల వరకూ అన్నింటినీ అందంగా అలంకరించడం నేడు ఓ సంప్రదాయంగా మారింది.
పెళ్లి అలంకరణ... కొత్తకొత్తగా!
పెళ్లికి పర్యాయపదం అలంకరణ అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అవునుమరి... నిశ్చితార్థంలో తొడిగే ఉంగరాన్ని ఉంచే పెట్టె నుంచి చీరసారెల్ని పెట్టే బుట్టల వరకూ అన్నింటినీ అందంగా అలంకరించడం నేడు ఓ సంప్రదాయంగా మారింది. అక్కడితో సరి అనుకుంటే పొరపాటే... పెళ్లికి సంబంధించిన ప్రతీదీ, అంటే- మెడలో వేసుకునే వరమాల నుంచి తలమీద ధరించే మేలిముసుగు వరకూ ఎంతో ప్రత్యేకంగానూ కొత్తగానూ ఉండాలని కోరుకుంటుందీ తరం. అందుకే వాళ్లకోసం తమలోని సృజననంతటినీ రంగరించి మరీ ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్‌లను సృష్టిస్తున్నారు డిజైనర్లు.
మేలిముసుగు సొగసు
కంచిపట్టు చీర కట్టుకుని ఒంటినిండుగా నగలు పెట్టుకుని పుత్తడిబొమ్మలా మెరిసిపోతూ బరువైన కనురెప్పలతో, సిగ్గుతో ఎర్రబడ్డ బుగ్గలతో తలదించుకుని బంధుసమేతంగా పెళ్లిమండపంలోకి వచ్చే వధువు సుందర వదనాన్ని చూసేందుకు పెళ్లికొడుకుతోపాటు అతిథులూ అంతే ఆసక్తిగా ఎదురుచూసేవారు. పైగా దీనికితోడు కొన్ని వర్గాల్లోనూ ప్రాంతాల్లోనూ వధువుకి మేలిముసుగు కూడా ఉండేది. జీలకర్రా బెల్లం పెట్టేవరకూ అది తీసేవారు కాదు. క్రమేణా ఆ మేలిముసుగు జడమీదకే పరిమితమైంది. కానీ ఈమధ్య సోషల్‌మీడియా పుణ్యమా అని పద్ధతులతో పనిలేకుండా చాలామంది మేలిముసుగు వేస్తున్నారు. అక్కడితో ఆగకుండా ఆ మేలిముసుగుతోనే ఫొటోషూట్ చేయించడం సరికొత్త ట్రెండ్‌గా మారింది. అయితే ఆ ముసుగులోంచి ముఖం స్పష్టంగా కనిపించేలా పారదర్శకంగా ఉండే నెట్, జార్జెట్... బట్ట తీసుకుని దానికే అంచుల్లో అందంగా ఎంబ్రాయిడరీ చేయిస్తున్నారట. ఆధునిక పెళ్లికూతుళ్లకి సిగ్గుపడటం ఎటూ తెలియడంలేదు కాబట్టి కనీసం ఈ మేలిముసుగు ఫొటోలో అయినా స్నిగ్ధసోయగంతో సిగ్గులమొగ్గయి కనిపిస్తారని కాబోలీ ఫొటోషూట్...!
తామరపూదండ!
సంప్రదాయాలూ పద్ధతులూ వేరయినా అన్నిచోట్లా వివాహబంధాన్ని ఎంతో పవిత్రమైనదిగానే భావిస్తారు. ఆ బంధాన్ని కలిపే పెళ్లితంతులో ఒకటి వరమాల లేదా జయమాల. స్వచ్ఛతనీ ప్రేమనీ ప్రతిబింబించే ఈ పూలదండల్ని ఎక్కువగా పరిమళభరితమైన గులాబీలూ లిల్లీలూ మల్లెలూ చామంతులూ మరువం... వంటి వాటితోనే కడుతుంటారు. అయితే ఈమధ్య తామరపువ్వుల వరమాలలూ కనిపిస్తున్నాయి. సగం విచ్చుకున్నట్లుగా ఉన్న గులాబీరంగు తామరలు- వధూవరుల దుస్తులు ఏ రంగులో ఉన్నా వాటిమీదకి చక్కగా నప్పుతున్నాయి మరి. అందులోనూ పెళ్లిదుస్తుల్లో ఈమధ్య పేస్టల్ కలర్స్ ట్రెండ్ నడుస్తుండటంతో వాటిమీదకి కాస్త పెద్దగా ఉన్న తామరలు మరింత అందంగా కనిపిస్తున్నాయి. అన్నింటినీ మించి తామరపువ్వుని ఆధ్యాత్మికతకీ పవిత్రతకీ సంకేతంగానూ భావిస్తారు. కాబట్టి సెలెబ్రిటీల నుంచి సామాన్యుల వరకూ తామర పూదండలకే జై అంటున్నారట.
ఈ మల్లెలు వేరయా!
పెళ్లికూతురి అలంకరణ అనగానే ముందుగా గుర్తుకొచ్చేది పూలజడే. ఎంత అందమైన చీర కట్టినా ఒంటినిండుగా ఎన్ని రకాల నగలు పెట్టినా పూలజడ వేయకపోతే వెలితిగానే అనిపిస్తుంది. ఆ పూలల్లోనూ మల్లెపూల జడ తరవాతే ఏవైనా. కాకపోతే అన్నికాలాల్లోనూ మల్లెలు ఉండవు కాబట్టి దొరికిన పూలతోనే జడలు వేసేవారు. కానీ ఈమధ్య ఏ కాలంలో పెళ్లయినా జడలూ ముడులే కాదు, పెళ్లి తెరలూ వరమాలలూ మేలిముసుగులూ పెళ్లి మండపాలూ అవిరేణి కుండలూ బిందెలూ... ఇలా అన్నింటినీ తెల్లని మల్లెపూలతోనే అందంగా అలంకరించేస్తున్నారు. వాటిని చూసి చాలామంది వాసన లేవుగానీ కాలంకాని కాలంలోనూ మల్లెలు బాగానే వస్తున్నాయి అనుకుంటున్నారు. నిజానికి ఈమధ్య పెళ్లి అలంకరణలో కనిపించే ఈ తెల్లని మొగ్గలన్నీ నందివర్ధనాలే. ధవళవర్ణంలో విచ్చుకునే నందివర్ధనం మొగ్గగా ఉన్నప్పుడు మల్లెనే తలపిస్తుంది. అందుకే వాటిని ఆ దశలోనే కోసి కావాల్సిన డిజైన్లలో అందమైన అల్లికతో గుదిగుచ్చేస్తున్నారు. పైగా వీటి కాడ సన్నగా పొడవుగా ఉంటుంది కాబట్టి గుచ్చడానికీ మాల కట్టడానికీ కూడా అనువుగా ఉంటుంది. అందుకే పూలజడలతోపాటు తెరలూ మేలిముసుగులూ అన్నింటినీ ఈ నందివర్ధనం మొగ్గలతో చూడచక్కగా అలంకరిస్తూ మల్లెల్నే
మరిపిస్తున్నారు.
ఫెయిరీటేల్ కాంతులు!
పెళ్లి వేడుకలో ప్రధాన ఆకర్షణ వధూవరులే అయినప్పటికీ రాగానే అతిథుల్ని ఆకట్టుకునేది వేదిక అలంకరణే. పగలు పెళ్లయితే రంగుల పూలూ పలుచని పరదాలతోనే రకరకాలుగా అలంకరిస్తుంటారు. కానీ రాత్రివేళల్లో చేసే పెళ్లికి మాత్రం రంగురంగుల దీపాల వెలుగులోనే మండపం అందంగా కనిపించేలా తీర్చిదిద్దుతారు. అయితే ఇటీవల ఆ దీపాలను ఫెయిరీటేల్ కథల్ని తలపించేలా అలంకరిస్తున్నారు. ముఖ్యంగా డెస్టినేషన్ వెడ్డింగులు పెరగడంతో వేదిక చుట్టూ ఉండే పరిసరాలకీ ప్రాధాన్యం పెరిగింది. అందులో భాగంగానే పెళ్లికీ దానికన్నా ముందు జరిగే మెహందీ, సంగీత్... ఇలా అన్ని వేడుకల్లోనూ వేదికకి తగినట్లుగా అక్కడి చెట్లనీ పందిళ్లనీ రాళ్లనీ పచ్చికనీ టేబుళ్లనీ బుల్లి బుల్లి ఎల్‌ఈడీ బల్బులతో దేదీప్యమానంగా అలంకరిస్తున్నారు. దాంతో అతిథులకు ఏ చుక్కల లోకంలోనో విహరిస్తున్న అనుభూతిని కలిగిస్తుందీ లైటింగ్.
రోకలికి అమ్మవారి బొమ్మ!
పసుపు కొట్టడంతోనే ఒకప్పుడు పెళ్లి పనులు మొదలయ్యేవి. ఇప్పుడు అది కూడా ఓ సరదా వేడుకలా మారింది. పైగా అప్పట్లో ముత్తైదువులూ పెద్దవాళ్లూ మాత్రమే పసుపు కొట్టేవారు. అదీ ఎవరింట్లో వాళ్లే ఈ కార్యక్రమాన్ని కానిచ్చుకునేవారు. కానీ ఈమధ్య కొంతమంది రిసార్టుల్లో మూడు రోజుల పెళ్లి చేయడంతో అక్కడ మరోసారి పెళ్లికూతురూ పెళ్లికొడుకుతోపాటు చుట్టపక్కాలందరితోనూ పసుపు కొట్టించి ఫొటోషూట్ చేయిస్తున్నారు. మరి ఆ ఫొటోల్లో రోకళ్లు సాదాసీదాగా కనిపిస్తే ఏం బాగుంటుందీ... అందుకే వాటిని అమ్మవారి బొమ్మలతో అలంకరించి మరీ పసుపు కొట్టే ముచ్చట తీర్చుకుంటున్నారు. ఏమైనాగానీ ఒకప్పటి పెళ్లి పద్ధతులన్నీ ఇప్పుడు అందమైన ఫొటో సంప్రదాయాలుగా మారిపోయాయి మరి!
పెళ్లి బూట్లు!
పెళ్లంటే అందంగా అలంకరించుకోవడమే కాదు, ఆటపాటలతో ఆనందంగా గడిపే సంగీత్ వేడుక కూడా అంటోందీ తరం. అందులో బంధువులూ స్నేహితులే కాకుండా పెళ్లికూతురూ పెళ్లికొడుకూ కూడా తమ ప్రతిభను చక్కగా కనబరిచి బంధుమిత్రులతో శభాష్ అనిపించుకుంటున్నారు. అందుకే ఒకప్పటిలా చమ్కీలూ రాళ్లతో ఉన్న శాండల్స్ వేసుకోవడంకన్నా షూ వేసుకోవడమే బెటర్ అనుకుంటున్నారు. అయితే పెళ్లికి వేసుకునే షూ సాదాసీదాగా ఉంటే ఏం బాగుంటుందనుకున్న డిజైనర్లు వాటిని కూడా ఎంబ్రాయిడరీతో డిజైన్ చేస్తున్నారు. పైగా కొన్ని కంపెనీలు వీటిని డ్రెస్సుకి తగ్గట్లుగా కస్టమైజ్ చేసి మరీ ఇస్తున్నాయి. దాంతో అబ్బాయిలు సైతం షేర్వాణీ పైజమాలమీదకి జైపుర్ మొజారీల్ని పక్కన పెట్టేసి, రాళ్లూ పూసలూ జర్దోజీ దారాలతో ఎంబ్రాయిడరీ చేసిన స్నీకర్లనే ఇష్టంగా వేసుకుంటున్నారు. పైగా ఇవయితే నడవడానికీ సౌకర్యంగా ఉంటాయి. దాంతో సంగీత్ అనే కాకుండా మెహందీ, రిసెప్షన్... వంటి అన్ని వేడుకల్లోనూ వధూవరులిద్దరూ ఈ వెడ్డింగ్ స్నీకర్లతోనే హల్‌చల్ చేసేస్తున్నారు. వీటిల్లోనూ వధూవరులిద్దరికీ ఒకేలా డిజైన్ చేసిన మ్యాచింగ్ మోడల్స్ కూడా ఉంటున్నాయండోయ్.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
ఇంకా..


తాజా వార్తలు (Latest News)
-
Bhimavaram: భీమవరంలో దారుణం.. ఏడో తరగతి బాలికపై హత్యాచారం
-
HP Chromebooks: గూగుల్‌తో హెచ్‌పీ జట్టు.. భారత్‌లోనే క్రోమ్ బుక్స్ తయారీ
-
Housing sales: జులై- సెప్టెంబరులో రికార్డు స్థాయిలో ఇళ్ల విక్రయాలు: అనరాక్
-
Punjab: వ్యక్తి కడుపులో ఇయర్‌ఫోన్స్, నట్లు, బోల్టులు.. శస్త్ర చికిత్స చేసి తొలగించిన వైద్యులు
-
Global Innovation Index: ఇన్నోవేషన్‌లో భారత్‌కు 40వ స్థానం
-
Bengaluru traffic : కారులో నుంచి ఆర్డర్ చేస్తే పిజ్జా వచ్చేసింది.. అట్లుంటది బెంగళూరు ట్రాఫిక్!