Updated : 21 Jul 2021 12:22 IST

కిటికీ...  డిజైన్‌ చేయించు కుందామిలా..!

నిద్ర లేవగానే ఆరుబయట లాన్‌లోనో బాల్కనీలోనో కూర్చుని నులివెచ్చని కిరణాల్లో తడుస్తూ పక్షుల కువకువల్ని వింటూ పచ్చని ప్రకృతిని ఆనందిస్తూ వేడి వేడి కాఫీ తాగుతుంటే... ఎంత బాగుంటుందో కదూ. కానీ కిక్కిరిసిన నగరజీవనంలో ఇరుకిరుకు అపార్ట్‌మెంట్లలో చాలామందికి ఆ అనుభూతి ఊహలకే పరిమితం. అందుకే ఇప్పుడు తమ పడకగది కిటికీల్నే అందమైన వ్యూ పాయింట్‌ సీట్లుగా డిజైన్‌ చేయించుకుంటున్నారిలా.

గర జీవనంలో మధ్యతరగతికైనా ఎగువ మధ్యతరగతికైనా తమకు నచ్చినట్లుగా సువిశాలమైన ఇల్లు కట్టించుకోవడం సంగతి దేవుడెరుగు... పెద్ద గదులున్న అపార్టుమెంట్‌ దొరకడమే కష్టం. అలాంటప్పుడు పిల్లలు ఇంట్లో కూర్చుని ఆడుకోవడానికి ప్రత్యేకంగా స్థలం కేటాయించాలన్నా కష్టమే. కాబట్టి వాళ్ల గదిలోనే బెడ్‌మీదే ఆడుతుంటారు. దాంతో దాన్ని ఎప్పటికప్పుడు మార్చాల్సి ఉంటుంది. అదే గది విశాలంగా ఉంటే అందులో కొంత భాగాన్ని వాళ్లకి ఆటస్థలంకోసం కేటాయించవచ్చు. కానీ అంత పెద్ద గదులు అందరికీ ఉండవు. అలాగే చాలామంది పెద్దవాళ్లు తమకోసం ఓ రీడింగ్‌ రూమ్‌ కట్టించుకోవాలని అనుకుంటుంటారు. కనీసం బెడ్‌రూమ్‌లోనే ఓ మూలగా చిన్న టేబుల్‌, కుర్చీ పట్టే స్థలం ఉన్నా చాలు అనుకుంటారు. కానీ, అదీ అందరికీ కుదరకపోవచ్చు. అయితే, ఎంత చిన్న గదికైనా చిన్నదో పెద్దదో కిటికీ మాత్రం తప్పక ఉంటుంది. కాబట్టి ఆ కిటికీలనే హాయిగా కూర్చుని ఆడుకునేందుకూ చదువుకునేందుకూ వీలుగా డిజైన్‌ చేస్తున్నారు.

పైగా ఇల్లు ఎంత పెద్దగా ఉన్నా ఎవరి గదిలో వాళ్లకయితే పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. తమకు నచ్చినట్లుగా ఉండొచ్చు. గది కిటికీలోంచి బయటకు చూస్తూ కాఫీ తాగాలనో సంగీతం వినాలనో లేదూ పుస్తకం చదువుకోవాలనో... వంటి చిన్న చిన్న కోరికలు చాలామందికి ఉంటాయి. కానీ కిటికీ దగ్గర ఎక్కువసేపు నిలబడలేరు. కిటికి పక్కన కుర్చీ వేసుకుని కూర్చున్నా ఆ అనుభూతీ రాదు. అదే ఆ కిటికీలోనే మెత్తని కుషనో పరుపు వేసుకుని కూర్చుంటే, హాయిగా ఎంతసేపయినా కాలక్షేపం చేయొచ్చు అనిపిస్తుంది. అందుకోసం కూడా అనేకమంది ఇల్లు కట్టించుకునేటప్పుడే విండో సీట్‌ వచ్చేలా కట్టమని అడుగుతున్నారు. ఒకవేళ నిర్మాణంలో భాగంగా కిటికీలను ప్రత్యేకంగా అమర్చకపోయినా ఇంటీరియర్‌ డిజైన్‌లో భాగంగా గదికి ఉన్న ఒక్క కిటికీనయినా ఆ విధంగా వచ్చేలా చేయించుకుంటున్నారు. అందులో రంగురంగుల కుషన్లు వేసి అందంగా అలంకరించుకుంటున్నారు. వీటిని మార్చుకుంటూ ఉండటం వల్ల పడకగది సాదాసీదాగా కాకుండా ఎప్పటికప్పుడు కొత్తగా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

కిటికీ గది!

ఇంటి ప్లాన్‌ని బట్టి కిటికీలు కూడా రకరకాలుగా ఉంటాయి. గది గోడలో భాగంగా ఉండేవి కొన్నయితే, గోడ నుంచి బయటకు చొచ్చుకుని వచ్చేవి మరికొన్ని. కాబట్టి కిటికీ నిర్మాణాన్ని బట్టి సీటు డిజైనింగ్‌ ఉంటుందన్నమాట.

సాధారణంగా మనదగ్గర ఉండే కిటికీలన్నీ గోడలోనే ఉంటాయి. అలాంటి కిటికీలకి అటూ ఇటూ అల్మరాలూ కింది భాగంలో అరలూ వచ్చేలా చేయించుకుంటే స్థలం వృథా కాకుండానూ ఉంటుంది. కిటికీ సీటూ సొంతమవుతుంది. ముఖ్యంగా పిల్లల గది కిటికీకి ఇలా పెట్టడం వల్ల వాళ్ల బొమ్మలూ ఇతరత్రా పుస్తకాలూ సామాన్లూ అన్నీ వాటిల్లో సర్దుకోవచ్చు. పైగా అవన్నీ వాళ్లకి అందుబాటులోనే ఉంటాయి కాబట్టి తమకు కావాల్సిన బొమ్మని తీసుకుని హాయిగా కిటికీలో కూర్చునే బయటి ప్రపంచాన్ని చూస్తూ ఆడుకుంటుంటారు. ఈ సీటు వీలైనంత తక్కువ ఎత్తులో ఉండేలా కట్టిస్తే గభాల్న కింద పడినా దెబ్బలు తగలవు.  అలాగే పుస్తకాలు చదివే అలవాటు ఉన్నవాళ్లయితే, కిటికీ లోపలి గోడలకి కూడా అరలు వచ్చేలా చేయించుకోవచ్చు.

కిటికీ విశాలంగా ఉంటే, దాన్నే ఓ చిన్న గదిలా మార్చి, కర్టెన్లతో అలంకరించుకుంటే పడక గది వినూత్నంగానూ కనిపిస్తుంది. గోడ మొత్తంగా కిటికీ ఉన్నవాళ్లయితే దాన్నో అందమైన సోఫాగానూ అమర్చుకోవచ్చు. ఇంటి ప్లాన్‌లోగానీ ఇంటీరియర్‌ చేయించుకునే టప్పుడుకానీ ఈ ఆలోచన లేదని బాధపడాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు డిటాచబుల్‌ ఫర్నిచర్‌ వస్తుంది కాబట్టి కిటికీ ఎత్తులో చెక్క సోఫాలాంటిది చేయించి దానికి అటూ ఇటూ రెండు ర్యాక్‌లు అమర్చుకుంటే సరి. ఒకవైపు ర్యాక్‌ పెట్టినా చాలు, విండో సీట్‌ రెడీ.
నిజానికి ఈ విండో సీట్‌ అనేది పాశ్చాత్యదేశాల నుంచే వచ్చిందని చెప్పాలి. అక్కడ చలి ఎక్కువ కాబట్టి ఎండ తగిలేందుకు వీలుగా వెడల్పాటి కిటికీలను పెట్టి వాటికి గాజు తలుపుల్ని అమరుస్తారు. అదే మన దగ్గరయితే కిటికీలున్నా వాటికి చెక్క తలుపుల వాడకమే ఎక్కువ. కానీ ఈమధ్య కొత్తగా కట్టే ఇళ్లకీ అపార్ట్‌మెంట్లకీ గాజు తలుపులున్న భారీ కిటికీల్ని అమర్చడం క్రమేణా పెరుగుతోంది. పైగా ఇంట్లోకి ఎండ ఎంత ఎక్కువగా వస్తే అంత మంచిదనీ, కిటికీల్ని తీసి ఉంచితే వైరస్‌, ఫంగస్‌ లాంటివి లోపల చేరకుండా ఉంటాయని ఆరోగ్య నిపుణులూ చెబుతున్నారు. అంతేకాదు, ఉదయాన్నే కాసేపు ఎండ తగిలేలా కూర్చుంటే డి-విటమిన్‌ లోపం లేకుండానూ ఉంటుంది. కాబట్టి ఈ కిటికీ సీటు ఇంటికి అందాన్నీ మీకు ఆనందాన్నీ ఆరోగ్యాన్నీ అందిస్తుంది అనడంలో నో డౌట్‌..!


Advertisement


ఇంకా..

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని