red coral: అందరి చూపు పగడం వైపు..!

ఆభరణం అందంగా ఉండాలంటే ఒక్క బంగారు నగిషీలే చాలవంటూ కెంపుల సొంపులూ, పచ్చల మెరుపులూ, ముత్యాల మురిపాలూ జోడించేసి, తీరైన జ్యువెలరీ చేయడమనేది నిన్నమొన్నటి మాట.

Updated : 15 Dec 2022 16:38 IST

red coral: అందరి చూపు పగడం వైపు..!

ఆభరణం అందంగా ఉండాలంటే ఒక్క బంగారు నగిషీలే చాలవంటూ కెంపుల సొంపులూ, పచ్చల మెరుపులూ, ముత్యాల మురిపాలూ జోడించేసి, తీరైన జ్యువెలరీ చేయడమనేది నిన్నమొన్నటి మాట. ఎర్రని రంగుతో కళ్లను కట్టిపడేస్తూ నగ సోయగాల్ని మరింత పెంచాలంటే పగడాల్ని జత చేయాల్సిందే అన్నది నేటి మాట. మరి ఈ నయాట్రెండ్‌ నగపైన ఒక లుక్కేద్దామా!

చంద్రహారం, కాసుల పేరు, బొట్టు మాల, గుత్త పూసలు, కంటె, చోకర్‌... ఇలా నగల పెట్టెలో అమ్మమ్మల తరం నుంచి ఈతరం వరకు వచ్చిన ఆభరణాలెన్ని ఉన్నా సరే, ఎప్పటికప్పుడు కొత్తదనాన్నే కోరుకుంటుంది మగువ మనసు. అందుకే అన్ని ఫ్యాషన్లలో ట్రెండ్స్‌ మారుతున్నట్టే బంగారు నగల్లోనూ కొత్త హంగులు వచ్చిపడుతుంటాయి. అయితే ఆ నయా ఫ్యాషన్‌ ఇప్పుడు ఆభరణాల డిజైన్లలో కాకుండా నగకు అదనపు వన్నెతెచ్చే ముత్యాలూ, రంగు రాళ్ల స్థానంలో వచ్చేసింది. పసిడి చెక్కుళ్ల మధ్య వాటికి బదులు పగడాల్ని పొదుగుతూ చూడముచ్చటైన ‘కోరల్‌ జ్యువెలరీ’లో సిద్ధమైపోయింది.  

నవరత్నాల్లో ఒకటైన పగడాన్ని చేతికి ఉంగరంగా, మహా అయితే బంగారు గుళ్లతో కలగలిపిన దండగా వేసుకుంటున్నాం. కానీ అప్పట్లో రాజుల కాలంలో ఏడువారాల నగల్లోనూ ఈ పగడాల ఆభరణాలు ఒకటిగా ఉండేవన్న మాట హఠాత్తుగా గుర్తొచ్చిందో, మిగతా రత్నాలు బోర్‌ కొట్టేశాయో, లేక పగడానికి ఇవ్వాల్సినంత ప్రాధాన్యం ఇవ్వట్లేదనిపించిందో... కారణమేదయితేనేం, ఫ్యాషన్‌ గురూలు ఈతరం అమ్మాయిల అందాల్ని మరింత పెంచడానికి ఎర్రని మెరుపుల పగడాల్ని బంగారు చమక్కుల మధ్యకు చొప్పించేస్తున్నారు. నగకూ ఈ నవరత్నానికీ జోడికట్టేసి పెద్ద పెద్ద హారాలు, నెక్లెసులు, గాజులు, చెవి దుద్దులు తీసుకొచ్చేస్తున్నారు. డిజైన్‌ని బట్టి పగడాల్ని రకరకాల సైజుల్లో మలుస్తూ టెంపుల్‌ జ్యువెలరీ దగ్గర్నుంచి సన్నని గొలుసు వరకూ అన్నింటినీ పగడాల ఆభరణాలుగా రూపొందిస్తున్నారు. ఇంట్లో ఉన్న సాదా పగడాల దండనూ, పెద్ద పెండెంట్‌నూ కలిపి కొంచెం మార్పులు చేస్తూ సరి కొత్త కోరల్‌ పూసల నగగా మార్చుకుని చూడండి. రొటీన్‌కు భిన్నంగానూ ఉండటమే కాదు, మీకూ సరికొత్త లుక్‌ను తెచ్చిపెడుతుంది. ఈసారి ఏదైనా వేడుకకు చక్కని చీరతో పాటూ పగడాల గుత్త పూసల హారాన్నీ దానికి మ్యాచింగ్‌గా వజ్రాలతో చుట్టిన పగడాల దుద్దుల్నీ పెట్టుకున్నామంటే చాలు, ఆ రత్నాల తళుక్కుల వల్ల మన అందం రెట్టింపవుతుంది. అది చూసినవాళ్లందరూ ‘ఎంత బాగున్నావో’ అంటూ కితాబుల వర్షం కురిపించేస్తారు.


saree: చీర కట్టుకోవడం చేతకాదా..!

‘బంధువుల పెళ్లికి తప్పకుండా చీరలోనే వెళ్లాలి. కానీ నాకైతే సరిగా కట్టడం రాదు. కట్టేవాళ్లూ అందుబాటులో లేరు. మరైతే ఎలా’ - ఈతరం అమ్మాయిల్లో చాలామంది ఏదో ఒక సందర్భంలోనైనా ఇలా అనుకునే ఉంటారు కదూ. ఈ సమస్యను పరిష్కరించడానికే వచ్చేసిందో నయా ట్రెండ్‌. అదే ‘ప్రీ ప్లీటెడ్‌ శారీ ఫోల్డింగ్‌ బాక్స్‌’.

ఫ్యాషన్‌ ప్రపంచంలో ఎన్ని రకాలున్నా చీరకట్టు అందం దేనికీ రాదనే చెప్పుకుంటారు మగువలందరూ. అందుకే ఫంక్షన్లలో ప్రత్యేకంగా మెరిసిపోవాలంటే మహిళలే కాదు, పడుచుపిల్లలూ ట్రెండీ డ్రెస్సులకు కాస్త రెస్ట్‌ ఇచ్చేసి చీరకట్టుతో రెడీ అయిపోతున్నారు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ అమ్మాయిని ఆకట్టుకునేలా తీర్చిదిద్దే ఆ చీరకట్టు మాత్రం అందరికీ కుదరదు. పైగా దానికోసం చాలా సమయమే పడుతుంది. అందుకే వేడుకల్లో చక్కని లుక్కు కోసం మేకప్‌ ఆర్టిస్టులతో పాటూ శారీ డ్రేపర్లనూ పిలిపించుకుంటున్నారు.
ఇప్పుడు అదే శారీ డ్రేపింగ్‌లో ఇంకాస్త వెసులుబాటు వచ్చేసింది. ఈ ‘ప్రీ ప్లీటెడ్‌ శారీ ఫోల్డింగ్‌ బాక్స్‌’ పుట్టుకొచ్చింది.

నగరాలూ, పట్టణాల్లో మాత్రమే శారీ డ్రేపర్లను ఇంటికి రప్పించుకుని చీరకట్టించుకునే వీలుంటుంది. పైగా దీనికోసం కచ్చితంగా నిర్దిష్టమైన సమయాన్నీ కేటాయించుకోవాల్సి వస్తుంది. అదే ఈ ప్రీ ప్లీటెడ్‌ శారీ బాక్సును చేయించుకున్నామంటే- చీరకట్టుపైన కాస్త అవగాహన ఉంటే చాలు, కావాలనుకున్నప్పుడు మనమే సొంతంగా ఎప్పుడైనా, ఎక్కడైనా కట్టేసుకోవచ్చు. ‘వావ్‌! చీరకట్టడం నీకు ఇంత బాగా వచ్చా’ అనేలా అందర్నీ ఆశ్చర్యపోయేలా చేయొచ్చు.

అసలేంటీ చీరబాక్స్‌..
సాధారణంగా చీరకట్టులో కుచ్చిళ్లూ, చీరకొంగూ సరిగా కుదిరితేనే ఆరు గజాల చీర చుట్టిన ఆ అమ్మాయి అందం బయటకు కనిపిస్తుంది. అందుకే శారీకి ముందుగానే కుచ్చిళ్లూ, పైటకొంగూ దేనికదే పెట్టేసి మడతలు పోకుండా ఐరన్‌ చేస్తారు. అవసరమైన చోట ఎక్కడికక్కడ పిన్నులు పెడతారు. ఆ తర్వాత దాన్నే చక్కగా మడతేసి ప్యాక్‌ చేసి ఇస్తారు. రెడీ టు వేర్‌లా ఉండే ఈ చీరను అవసరమైనప్పుడు తీసి అయిదు నిమిషాల్లో రెడీ అయిపోవచ్చు. మళ్లీ అలాగే ప్యాక్‌ చేసుకుని నాలుగైదు సార్లు వాడేసుకోవచ్చు. ఆర్గంజా, పట్టూలాంటి కాస్త లొంగని చీరల్నీ, జారిపోయే శాటిన్‌, క్రేప్‌ శారీల్నీ ఇలా ముందుగానే సిద్ధం చేయించుకుంటే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందంటూ ఈ ట్రెండ్‌ను ఫాలో అయిపోతున్నారు చాలామంది. విదేశాల్లో స్థిరపడ్డ మనవాళ్లూ ఈ ప్రీ ప్లీటెడ్‌ చీరల బాక్సుల్ని తయారుచేయించుకుని తీసుకెళ్తున్నారు. అటు అందాన్నీ తెస్తూ ఇటు పనినీ సులువుగా మారుస్తూ వచ్చిన ట్రెండ్‌ ఎవరికైనా నచ్చేస్తుంది మరి. చెన్నై, బెంగళూరు నగరాలతోపాటు హైదరాబాద్‌ లోనూ ఈ సర్వీస్‌ అందుబాటులో ఉంది. చీరను బట్టి ఒకదానికి రూ.800 ఉంటే నాలుగైదు చీరలకు కలిపి మూడు వేల వరకు వసూలు చేస్తున్నారట.

- ఫొటో సహకారం: గీతాస్‌
మేకప్‌ ఆర్టిస్టు, ఫోన్‌: 7842693069


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు