ముఖానికి బంతిపూల మాస్క్‌!

బంతిపూలు అనగానే పెరటి అందంకోసం మాత్రమే అనుకుంటాం. కానీ ఆ పూలల్లోని యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీసెప్టిక్‌ గుణాల కారణంగా వాటిని ముఖానికి మాస్క్‌లా వేసుకుంటే ఎంతో ఫలితం ఉంటుంది

Updated : 23 Jan 2022 07:11 IST

ముఖానికి బంతిపూల మాస్క్‌!

బంతిపూలు అనగానే పెరటి అందంకోసం మాత్రమే అనుకుంటాం. కానీ ఆ పూలల్లోని యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీసెప్టిక్‌ గుణాల కారణంగా వాటిని ముఖానికి మాస్క్‌లా వేసుకుంటే ఎంతో ఫలితం ఉంటుంది అంటున్నారు సౌందర్య నిపుణులు. ముఖ్యంగా వయసు పెరిగేకొద్దీ శరీరంలోని కొల్లాజెన్‌ ఉత్పత్తి తగ్గిపోవడంతో ముఖం ముడతలు పడుతుంటుంది. అలాంటప్పుడు కాసిని బంతిపూల రేకులకి కాస్త అలొవెరా జెల్‌, టేబుల్‌స్పూను చొప్పున నిమ్మరసం, వేపాకుపొడి కలిపి ముద్దలా చేసి ముఖానికి పట్టించి పావుగంట తరవాత కడిగేయాలి. ఇలా వారానికి మూడుసార్లు చేస్తే ఫలితం ఉంటుంది. అలాగే మొటిమలు, మచ్చలు, చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్లతో బాధపడేవాళ్లు బంతిపూల పొడికి అరటీస్పూను పసుపు, టేబుల్‌స్పూను పాలు కలిపి ముఖానికి పట్టించి పావుగంట తరవాత కడిగేయాలి. వాడిపోయినట్లున్న చర్మం వెంటనే నిగారింపుని సంతరించుకోవాలంటే అరకప్పు రేకులకి 5 టేబుల్‌స్పూన్ల రోజ్‌వాటర్‌, పావు కప్పు ఆపిల్‌ముక్కలు కలిపి మెత్తగా రుబ్బి ముఖానికి పట్టించి కాసేపయ్యాక చల్లనినీళ్లతో కడిగేయాలి. అలాగే బంతిపూల ముద్దకి చిటికెడు పసుపు, కాస్త తేనె, మీగడ చేర్చి మాస్క్‌లా వేసుకుని 20 నిమిషాలాగి కడిగినా మంచిదే.


పిల్లలకు కొవిడ్‌ సోకితే...

కొవిడ్‌ సోకి కోలుకున్న పిల్లల్లో డయాబెటిస్‌ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తోంది అమెరికాలోని డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ సంస్థ. గతంలో ఎలాంటి మధుమేహ ఛాయలూ లేని పిల్లలకు కొవిడ్‌ నుంచి కోలుకున్నాక రక్తంలో చక్కెరస్థాయులు ఓ పట్టాన తగ్గడం లేదని చెబుతున్నారు. 2020 మార్చి నుంచి జూన్‌ 2021 వరకూ కొవిడ్‌ వచ్చిన 18 సంవత్సరాల్లోపు పిల్లల్ని పరిశీలించినప్పుడు- వాళ్లలో 30 శాతం మందికి మధుమేహం వచ్చినట్లు గుర్తించారట. పైగా వాళ్లెవరికీ అంతకుముందు ఆ సూచనలులేవనీ కనీసం వాళ్లెవరికీ ఊబకాయం కూడా లేదనీ పేర్కొంటున్నారు. ఎందుకంటే కొవిడ్‌-19 వైరస్‌ నేరుగా క్లోమగ్రంథి కణాలమీద ప్రభావం కనబరుస్తుందనీ, ఫలితంగా జీవక్రియలో మార్పులు చోటుచేసుకుంటున్నాయనీ తద్వారా మధుమేహం వస్తుందనీ పేర్కొంటున్నారు. అయితే వ్యాక్సినేషన్‌ తీసుకున్న తరవాత వచ్చే కొవిడ్‌ కారణంగా అంత ప్రభావం ఉండకపోవచ్చట.


ఒమిక్రాన్‌ను తరిమేద్దాం!

ఆయుర్వేదంలో వందల సంవత్సరాలనుంచీ తిప్పతీగను వాడటం తెలిసిందే. దీన్నే అమృత లేదా గుడుచి అని కూడా అంటారు. హృదయాకారపు ఆకులతో పాకే ఈ తీగ, చాలాచోట్ల పెరుగుతుంది. టెర్పినాయిడ్లూ ఆల్కలాయిడ్లూ లిగ్నన్లూ యాంటీఆక్సిడెంట్లూ పీచూ ప్రొటీన్లూ పుష్కలంగా ఉండే ఈ తీగను ఇప్పుడు పాశ్చాత్యదేశాల్లో కూడా వాడుతున్నారు. అప్పట్లో మనదగ్గర దీన్ని ఇన్ఫెక్షన్‌ సంబంధిత జ్వరాలూ డయేరియా డయాబెటిస్‌ నివారణకు ఎక్కువగా ఉపయోగించేవారు. అయితే దీన్ని డెంగ్యూ, చికన్‌గున్యా వంటి జ్వరాలతోపాటు కొవిడ్‌కీ వాడొచ్చు అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. రోగనిరోధక శక్తిని పెంచడం ద్వారా ఒమిక్రాన్‌నీ కొంతవరకూ అడ్డుకుంటుందట. అదేసమయంలో కొవిడ్‌ సోకి ఇంట్లోనే ఉండేవాళ్లు దీన్ని ఆహారంలో భాగంగా తీసుకుంటే త్వరగా కోలుకుంటారట. తాజా ఆకులూ కాడల్ని రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే కచ్చాపచ్చాగా దంచి గ్లాసు నీళ్లలో వేసి సగమయ్యేవరకూ మరిగించి ఉదయాన్నే తాగాలి. అదే ఎండిన ఆకుల పొడి అయితే పది గ్రాములు తీసుకుని దాన్ని సుమారు 400 మి.లీ. నీటిలో రాత్రంతా నాననిచ్చి ఉదయాన్నే నాలుగోవంతుకి వచ్చేవరకూ మరిగించి తాగితే మంచిదట. మధుమేహం లేనివాళ్లయితే అందులో కాస్త బెల్లం కూడా వేసుకుని తాగొచ్చు. దీంట్లో తులసి, పసుపు, లవంగాలు వేసుకుని కషాయంలానూ చేసుకోవచ్చు. లేదా టీస్పూను తిప్పతీగ పొడికి గోరువెచ్చని నీరు, తేనె కలిపి కూడా తాగొచ్చు అంటున్నారు నిపుణులు. లేదూ మార్కెట్లో దొరికే తిప్పతీగ ట్యాబ్లెట్లను రోజుకి రెండు చొప్పున భోజనానికి ముందు తీసుకున్నా రోగనిరోధకశక్తి పెరిగి త్వరగా కోలుకుంటారట. ఇది మధుమేహాన్నీ నియంత్రణలో ఉంచుతుంది.


మాటలు చెబుతున్నారా?

ఉంగా... ఉంగా... అ క్కక్కక్క.... అ త్త త్తత్త.... ఇలా రకరకాల శబ్దాలు చేస్తూ పెద్దవాళ్లు పసిపిల్లలకు మాటలు నేర్పిస్తుంటారు. అలా చెప్పేటప్పుడు అక్షరాన్నీ పదాన్నీ బట్టి కొన్నిసార్లు గొంతు పెంచడం, తగ్గించడం చేస్తుంటారు. తెలిసి చేసినా తెలియక చేసినా ఇలా చెప్పడం పసివాళ్లకు చాలా మంచిదని ఫ్లోరిడా యూనివర్సిటీ నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల ఏ పదాన్ని ఎలా పలకాలో అంటే- నోటినీ నాలుకనీ కదుపుతూ ఆ శబ్దాన్ని ఎలా తీసుకురావాలో నేర్చుకుంటారన్నమాట. అందుకే పెద్దవాళ్లు నొక్కి నొక్కి పలికేటప్పుడు పిల్లలు వాళ్ల నోటివంకే చూస్తూ ఎలా పలుకుతామో అలాగే పలకడానికి ప్రయత్నిస్తుంటారు. ఈ విషయమై ఆరు నుంచి ఎనిమిది నెలల వయసున్న పసివాళ్లను నిశితంగా పరిశీలించి మరీ తెలుసుకున్నారట. కాబట్టి పెద్దవాళ్లు ముద్దుకోసమే పిల్లలతో అలా కబుర్లు చెప్పినప్పటికీ ఆ ఉగ్గుపాల భాష వాళ్లకి ఎంతో మేలుచేస్తుంది అంటున్నారు సదరు పరిశోధకులు.


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..