డి-విటమిన్‌తో గుండెకీ మేలు.. మెదడు పనితీరు పెంచేందుకు..
కొవిడ్ తగ్గినప్పటికీ...
కొవిడ్ నుంచి కోలుకుని అనేక నెలలు గడిచినా కొంతమందిలో ఊపిరి సమస్యలూ, నీరసం, డిప్రెషన్, నొప్పులు... వంటివి తగ్గడం లేదని అంటున్నారు అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీకి చెందిన నిపుణులు. కొవిడ్ సోకిన వాళ్లలో చాలామంది ఆసుపత్రికి వెళ్లకుండానే అది తగ్గిపోతుంది. కానీ ఆ తరవాత ఓ పట్టాన దాని తాలూకు లక్షణాల నుంచి వాళ్లు కోలుకోవడం లేదట. ఈ విషయమై వీళ్లు మూడు నుంచి పదిహేను నెలలకు ముందు కొవిడ్ వచ్చి తగ్గినవాళ్లలో కొందరిని ఎంపిక చేసి పరిశీలించారట. సీటీ స్కాన్, ఎకో కార్డియోగ్రామ్, ఎక్స్‌రేలు తీసినప్పుడు అన్నీ బాగానే ఉంటున్నాయి. కానీ వాళ్లు వ్యాయామం చేస్తున్నప్పుడు మాత్రం ఊపిరి పీల్చి వదలడంలో మాత్రం తేడా కనిపిస్తుందట. ముఖ్యంగా వాళ్లలో ఊపిరి అందకపోవడం, నిద్ర పట్టకపోవడం, ఏకాగ్రత లోపించడం, ఆలోచనాశక్తి తగ్గడం... వంటి సమస్యలు ఉంటున్నట్లు గుర్తించారు. కాబట్టి ఇలాంటి సమస్యలు ఉన్నవాళ్లు కొంతకాలంపాటు బ్రీతింగ్ వ్యాయామాలు చేయడం మంచిదని సూచిస్తున్నారు.
డి-విటమిన్‌తో గుండెకీ మేలే!
సూర్యరశ్మి నుంచి వచ్చే డి-విటమిన్ కారణంగా ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయనేది తెలిసిందే. అయితే ఇది కేవలం ఎముకలకు మాత్రమే కాదనీ గుండె ఆరోగ్యానికీ మేలు చేస్తుందని చెబుతున్నారు సౌత్ ఆస్ట్రేలియా యూనివర్సిటీ పరిశోధకులు. ఎందుకంటే మిగిలిన వాళ్లతో పోలిస్తే డి-విటమిన్ లోపంతో బాధపడేవాళ్లే ఎక్కువగా హృద్రోగాలు, బీపీ వ్యాధుల బారినపడుతున్నట్లు వాళ్ల పరిశీలనలో తేలింది. గతేడాది ఆస్ట్రేలియాలో మరణించిన ప్రతీ నలుగురిలో ఒకరు గుండెజబ్బు కారణంగానే మరణించారట. దాంతో అందుకు కారణాన్ని వాళ్లు నిశితంగా పరిశీలించగా- ఆ జబ్బుతో బాధపడిన వాళ్లలో అత్యధిక శాతం మందికి డి-విటమిన్ లోపం తీవ్రంగా ఉన్నట్లు తెలిసింది. కాబట్టి ఈ సమస్య లేకపోతే సగానికి సగం గుండె మరణాల్ని తగ్గించవచ్చు అంటున్నారు. సుమారు మూడు లక్షలమందిని పరిశీలించినప్పుడు- గుండెజబ్బులకీ డి-విటమిన్ లోపానికీ సంబంధం ఉన్నట్లు గుర్తించారు. కేవలం ఆస్ట్రేలియా అనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇటీవల అనేకమందిలో డి-విటమిన్ లోపిస్తోంది. ఆహారంలో ఇది కొద్దిపాళ్లలో ఉన్నప్పటికీ దీనికి ప్రధాన వనరు సూర్యరశ్మే. కాబట్టి రోజూ కొంతసేపయినా శరీరానికి ఎండ తగిలేలా చూసుకోవాలన్నది వారి సూచన.
గర్భిణీలకు ప్రొబయోటిక్!
గర్భం దాల్చిన మహిళలు తరచూ పొట్ట నొప్పితో బాధపడుతుంటారు. అలాగే వాంతులు, తల తిరగడం, మలబద్ధకం... వంటి సమస్యలతోనూ సతమతమవుతుంటారు. అలాంటప్పుడు ప్రొబయోటిక్స్ వాడటం వల్ల ఫలితం ఉంటుందని కాలిఫోర్నియా యూనివర్సిటీ పరిశోధకులు పేర్కొంటున్నారు. ఆ సమయంలో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్ల శాతం పెరుగుతుంది. దాంతో శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. ఆ ప్రభావం పొట్టలోని బ్యాక్టీరియామీదా తద్వారా జీర్ణవ్యవస్థమీదా ఉంటుంది. అందుకే వాంతులూ, తల తిరగడం, మలబద్ధకం... వంటి సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి అప్పుడు ప్రొబయోటిక్స్ వాడటం వల్ల పొట్టలోని మైక్రోబయోమ్ తిరిగి యథాస్థితికి వస్తుంది. 32 మంది గర్భిణులకి సుమారు రెండు వారాలపాటు రోజుకి రెండు ట్యాబ్లెట్ల చొప్పున వాటిని ఇచ్చినప్పుడు వాళ్లలో ఈ లక్షణాలన్నీ తగ్గాయట. అందుకే వీటిని వాడటం వల్ల ఎలాంటి సమస్యా ఉండదు అంటున్నారు సదరు పరిశోధకులు.
మెదడు పనితీరు పెంచేందుకు..!
ప్రస్తుతం మనిషి జీవితంలో కృత్రిమ మేధ ప్రాధాన్యం ఎంతో ఉందన్నది తెలిసిందే. మున్ముందు దీని సాయంతో మానవ మెదడునీ చురుకుగా మార్చవచ్చు అంటున్నారు మిన్నెసోటా యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు. అదెలా అంటే- మూర్ఛ వ్యాధితో బాధపడుతున్న కొందరు రోగులను షాక్ ట్రీట్మెంట్కు గురిచేసినప్పుడు- వాళ్ల మెదడులో అవి ఎక్కడి నుంచి వస్తున్నాయనే విషయాన్ని గమనించేందుకు సూక్ష్మమైన ఎలక్ట్రోడ్లను అమర్చారట. అదే సమయంలో విద్యుచ్ఛక్తి సాయంతో ఆలోచనాశక్తికి సంబంధించిన మెదడు భాగాలు సైతం మెరుగయ్యేలా చేయగలిగారట. కాబట్టి డిప్రెషన్, ఆందోళన, ఇతరత్రా మానసిక వ్యాధుల్ని దీని ద్వారా తగ్గించవచ్చు అంటున్నారు. ప్రస్తుతం షాక్ ట్రీట్మెంట్ను కొన్ని రకాల మానసిక సమస్యలకు వాడుతున్నప్పటికీ అది ఏ మేరకు ఫలితాన్నిస్తుందనేదాని మీద స్పష్టత లేదు. కానీ తాజా పరిశోధనలో ఏ భాగంలో కరెంట్ షాక్ ఇస్తే ఆలోచనాశక్తి పెరుగుతుందీ ఏ వ్యాధికి ఎక్కడెక్కడ ఇవ్వాలీ అనేదాన్ని ఆల్గారిథమ్స్ ద్వారా స్పష్టంగా గుర్తించగలిగారట. దీని ఆధారంగా మున్ముందు కృత్రిమ మేధతో మనిషి మేధాశక్తినీ పెంచవచ్చు అంటున్నారు.
Advertisement
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
-
-
సినిమా
-
ప్రముఖులు
-
సెంటర్ స్ప్రెడ్
-
ఆధ్యాత్మికం
-
స్ఫూర్తి
-
కథ
-
జనరల్
-
సేవ
-
కొత్తగా
-
పరిశోధన
-
కదంబం
-
ఫ్యాషన్
-
రుచి
-
వెరైటీ
-
అవీ.. ఇవీ
-
టిట్ బిట్స్