Published : 02 Oct 2022 00:02 IST

రిబ్బనుబొమ్మ... అదిరిందమ్మా..!

బొమ్మ వేయాలంటే ఎవరికైనా రంగులూ కుంచెలే అవసరమవుతాయి. కానీ ఆ కుట్టు కళాకారులకి మాత్రం అవేవీ అక్కర్లేదు... ఓ సూదీ నాలుగు రంగుల సిల్కు రిబ్బన్లూ ఉంటే చాలు... ముద్దులొలికే చిన్నారులు పుట్టుకొస్తారు, పువ్వులు విచ్చుకుంటాయి, పక్షులు కూస్తాయి, ప్రకృతిలోని అందాలన్నీ కాన్వాస్‌మీద చూడచక్కగా ఒదిగిపోతాయి. అందుకే ఫ్యాషన్‌ చక్రంలో రిబ్బను ఎంబ్రాయిడరీ మళ్లీ మళ్లీ వస్తూనే ఉంటుంది. రాళ్లూ పూసలూ దారాల ఎంబ్రాయిడరీల బరువుతో బోరుకొట్టిన జనానికి ఇది ఎంతో హాయిగానూ తేలికగానూ అనిపించినట్లుంది. అందుకేనేమో దుస్తులూ యాక్సెసరీలతోపాటు ఇంటీరియర్‌ అలంకరణలోనూ రిబ్బను ట్రెండ్‌ నడుస్తోందిప్పుడు!

కరోజు సూదిలోకి ఎక్కుతోన్న దారం, పక్కనే ఉన్న రిబ్బనుని చూసి ఫక్కున నవ్విందట. ‘నన్ను చూడు ఈ సూదితో అడుగులేస్తూ ఎన్నెన్ని అందాల్ని సృష్టిస్తానో... నువ్వయితే ఈ గౌనుకి గోటా పట్టీలా అలా అతుక్కుని ఉండాల్సిందే’ అంటూ హేళన చేసిందట. దాంతో రిబ్బనుకి ఎక్కడలేని రోషం వచ్చి రెపరెపలాడుతూ గాల్లోకి లేచి ఆ కళాకారుడి పనికి అడ్డురాసాగిందట. అప్పుడతను ఇక లాభం లేదని దాన్ని కూడా నాలుగైదు మడతలు వేసి సూదికి గుచ్చి బట్టమీద పెట్టి పువ్వులా కుట్టేశాడట. అది కాస్తా దారం కుట్టు కన్నా అందంగా కనిపించిందట. అప్పుటి నుంచీ ఎంబ్రాయిడరీలో రిబ్బనుదే పైచేయి అయిపోయింది.

వినడానికి తమాషాగా అనిపించినా రిబ్బను ఎంబ్రాయిడరీ అలా అనుకోకుండా పుట్టుకొచ్చిందే. ఫ్రెంచ్‌ నాట్స్‌, లేజీ డెయ్‌జీ, స్టెమ్‌ స్టిచ్‌... ఇలా దారాలతో కుట్టే ఎన్నో కుట్లు రాజ్యమేలుతోన్న సమయంలో- ఏదో బోర్డర్లలో వాడే సిల్కు రిబ్బన్లనీ సూదిలోకి ఎక్కించి కుడితేనో అన్న ఆలోచనతో- 17వ శతాబ్దంలో ఇంగ్లండులో ఆవిర్భవించిందీ రిబ్బను కుట్టు. ఆపై దీన్నే అనేక రకాలుగా మడిచి కుట్టడం ప్రారంభించారట. ఒకదశలో రిబ్బను దారాన్నీ పక్కకు నెట్టేసిందట. ఎందుకంటే, దారం ఎంబ్రాయిడరీలన్నింటికన్నా ఇది తేలికగానూ త్వరగానూ అయిపోవడంతోపాటు మరింత అందంగా కనిపించేది. పైగా త్రీడీ ఎఫెక్టులో నిజంగానే అక్కడ పువ్వులు ఉన్నట్లే అనిపిస్తుంటుంది. దాంతో దుస్తులతోపాటు క్విల్టులూ దిండు గలీబులూ కుషన్‌ కవర్లూ దుప్పట్లూ కర్టెన్లూ... ఇలా గృహాలంకరణలో వాడే అన్నింటిమీదా సిల్కు రిబ్బన్ల ఎంబ్రాయిడరీ కళ్ల నిండుగా కనిపిస్తూ ఎంబ్రాయిడరీ ప్రియుల మనసు దోచుకునేది. మధ్యమధ్యలో కొన్నాళ్లు పక్కకు వెళ్లినా మళ్లీ మళ్లీ వస్తూనే ఉండేది. అదీగాక ఒకప్పుడైతే రిబ్బన్లతో ఎక్కువగా పువ్వుల్ని మాత్రమే కుట్టేవారు. ఇటీవల దీనికి మరిన్ని మెరుగులు దిద్దుతూ రకరకాల సైజుల్లోని సిల్కు రిబ్బన్లతోపాటు ఆర్గంజా బట్టనీ వాడుతూ చిన్నారుల బొమ్మల్నీ పక్షుల్నీ జంతువుల్నీ కూడా కుడుతున్నారు. ఇవి మాత్రమే కాదు, ప్రకృతిలోని ల్యాండ్‌స్కేప్‌ దృశ్యాలూ రిబ్బను కుట్టులో ఒదిగిపోతున్నాయి. పైగా పట్టి పట్టి చూస్తే తప్ప ఎంబ్రాయిడరీ అని తెలియనంత సహజంగానూ దూరానికి ఏ ఫొటోనో అనిపించేంత అందంగానూ రిబ్బనుతో పెయింటింగుల్ని కుట్టేస్తున్నారు. దాంతో గోడలమీద చిత్రాల్లోనూ ఈ ఎంబ్రాయిడరీ కనువిందు చేస్తూ ఆధునికుల మనసునీ దోచుకుంటోంది.

డిజైనర్‌ దుస్తులమీదా..!

ఆ బొమ్మల్నీ చిత్రాల్నీ చూసిన డిజైనర్లు మరోసారి రిబ్బన్‌ ఎంబ్రాయిడరీమీద మనసు పారేసుకున్నారు. దాంతో చీరలూ బ్లౌజులూ కుర్తీలూ లెహంగాలూ... ఇలా దుస్తులన్నింటిమీదా రిబ్బన్‌ కుట్టూ కనిపిస్తోందిప్పుడు. నిజానికి ఓ ఇరవై ఏళ్ల క్రితం - ఎంబ్రాయిడరీ హవా అప్పుడప్పుడే మొదలవుతోన్న సమయంలో- రిబ్బన్‌ ఎంబ్రాయిడరీదే పై చేయిగా ఉండేది. కానీ క్రమంగా ఎంబ్రాయిడరీలో రాళ్లూ క్రిస్టల్సూ రావడంతో ఇది కాస్త పక్కకు వెళ్లింది. అయితే దారంతో కుట్టే ఎంబ్రాయిడరీలో కొత్తకొత్తగా ఎన్ని డిజైన్లు సృష్టించినా కొన్నాళ్లకు బోరే కదా. అందుకే ఇప్పుడిప్పుడు వాటికి బదులుగా రిబ్బను పూలనే బ్లౌజులమీద కుడుతున్నారు. చిన్న చిన్న గులాబీపువ్వులూ ఆకులతోపాటు పూలగుత్తులూ చిలుకలూ సీతాకోకచిలుకలూ... ఇలా రకరకాల డిజైన్లను వీపుమీదకో లేదా చేతిమీదకో వచ్చేలా కుడుతున్నారు. అంతేకాదు, వెస్ట్రన్‌టాప్స్‌మీద ఎక్కువగా కనిపించే ఈ ఎంబ్రాయిడరీ ఇప్పుడు మన కుర్తీలామీదా చిన్నారుల ఫ్రాకులమీదా అందంగా ఒదిగిపోతోంది. అంతేకాదు, కొన్ని రిబ్బను పువ్వులు రెడీమేడ్‌గా మార్కెట్‌లోనూ ఉన్నాయి. కాబట్టి వాటిని తమకు నచ్చినట్లుగా ఎవరికివాళ్లు కుట్టేసుకుంటున్నారు. పైగా వీటికి సంబంధించిన కిట్స్‌ మార్కెట్‌లోనూ దొరుకుతున్నాయి. ట్యుటోరియల్స్‌ యూట్యూబ్‌లో చూసీ నేర్చుకోవచ్చు. కాబట్టి, కాస్త ఆసక్తీ సృజనా ఉంటే ఎవరైనా రిబ్బన్‌ ఎంబ్రాయిడరీతో అద్భుతాలు సృష్టించొచ్చు. ఏమంటారు!?


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts