Published : 03 Jul 2022 00:58 IST

రంగులతో... బొమ్మలతో... లెదర్‌ బ్యాగులు

బ్యాగుల్లో ఎన్ని రకాలున్నా లెదర్‌బ్యాగ్‌ లుక్కే వేరు అంటారు అమ్మాయిలు. అందుకే కలర్‌ఫుల్‌గా ఉండే క్లాత్‌ బ్యాగులమీదకి మనసు మళ్లినా మళ్లీ దాని దగ్గరకే వస్తారు. రంగులన్నా డిజైన్లన్నా అమ్మాయిలకి ఉండే ఇష్టాన్ని గ్రహించే కాబోలు... ఇప్పుడు బ్రాండెడ్‌ కంపెనీలు సైతం లెదర్‌ బ్యాగుల్నీ రంగుల్లోనూ ఎంబ్రాయిడరీలతోనూ పెయింటింగులతోనూ డిజైన్‌ చేసేస్తున్నాయి. ఓ లుక్కేద్దామా..!

హ్యాండ్‌బ్యాగు అనగానే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది లెదర్‌ బ్యాగే. అయితే ఇది ఎక్కువగా ముదురు గోధుమ, నలుపు రంగుల్లోనే ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ లెదర్‌కి రంగులద్దడంతోపాటు ప్యాచ్‌వర్క్‌ చేసినట్లుగా కుడుతున్న బ్యాగులు చూడ్డానికి ఆకర్షణీయంగా ఉంటున్నాయి. ఎందుకంటే హరివిల్లు రంగుల ముక్కలతో చేసిన ఈ బ్యాగులు నేటి యువతకి తెగ నచ్చేస్తున్నాయట. దాంతో కలర్‌ఫుల్‌ లెదర్‌ ప్యాచ్‌వర్క్‌లతో హ్యాండ్‌బ్యాగులతోపాటు బ్యాక్‌ప్యాకుల్నీ రూపొందిస్తున్నారు.

ఎంబ్రాయిడరీ అందాలు!

లెదర్‌ హ్యాండ్‌ బ్యాగుల్లో రంగులే అరుదు అనుకుంటే.... వాటి మీద ఎంబ్రాయిడరీ కూడా చేస్తారా అనిపించడం సహజం. ఎంతో మందంగా ఉండే తోలుమీద కుట్టడం అంత సులభమేమీ కాదు. కానీ డాల్సె అండ్‌ గబ్బానా బ్రాండ్‌ రూపొందించే ఖరీదైన ఫుల్‌ గ్రెయిన్‌, టాప్‌ గ్రెయిన్‌ లెదర్‌ బ్యాగులతోపాటు వాటికన్నా కాస్త తక్కువ నాణ్యత కలిగిన జెన్యూన్‌ లెదర్‌మీదా త్రెడ్‌ వర్కుతోపాటు త్రీడీ ఎంబ్రాయిడరీనీ కుట్టేస్తున్నారు లెదర్‌ కళాకారులు.

కుంచె చిత్రం!

డిజిటల్‌ ప్రింట్లు ఎన్ని రకాలు వచ్చినా హ్యాండ్‌ ఎంబ్రాయిడరీమీద మోజు ఎన్నటికీ పోదు. అందుకే అనుష్కా అనే కంపెనీ జెన్యూన్‌ లెదర్‌తో చేసిన షోల్డర్‌, బ్యాక్‌ప్యాక్స్‌... ఇలా అన్ని రకాల బ్యాగుల మీదా ఎంతో సృజనాత్మకంగా పెయింటింగులు వేస్తూ ఆకట్టుకుంటోంది. అబ్‌స్ట్రాక్ట్‌, మోడ్రన్‌ ఆర్ట్‌తోపాటు ప్రకృతిలోని అందమైన దృశ్యాలూ పువ్వులూ పక్షులూ జంతువులతో పెయింట్‌ చేస్తోంది. నచ్చిన థీమ్‌తో కస్టమైజేషన్‌ సదుపాయాన్నీ కల్పిస్తుందీ కంపెనీ. ఈ ఒక్కటే కాదు, లా గాలియా, లూయీ వుటాన్‌... వంటి లగ్జరీ బ్రాండ్స్‌తోపాటు సాధారణ కంపెనీలూ కృత్రిమ లెదర్‌తో చేసిన బ్యాగుల మీదా అందమైన చిత్రాల్ని చిత్రిస్తున్నాయి. కోల్‌కతాలోని శాంతినికేతన్‌కి చెందిన కళాకారులూ రంగుల జెన్యూన్‌ లెదర్‌ బ్యాగులమీద అద్భుతమైన చిత్రాల్ని ఆవిష్కరిస్తున్నారు. మధుబని ఆర్ట్‌తో వస్తున్న ఈ బ్యాగులకి విశేషమైన డిమాండ్‌ ఉందట. కుంచెతో వేయడంతోబాటు ప్రెస్‌డ్‌ టెక్నాలజీతోనూ బ్యాగులమీద బొమ్మల్ని చిత్రించడం మరో పద్ధతి. ఇవన్నీ ఒకెత్తయితే, లెదర్‌ బ్యాగులకి ఆప్లిక్‌ అందాల్నీ జోడించడం మరోకెత్తు. ఇటలీకి చెందిన బ్రకియాలిని కంపెనీ అయితే రెట్రో తరహా ఇళ్లనీ ఆ ఇంట్లోని ఫర్నిచర్‌నీ అమ్మాయిల దుస్తుల్నీ బ్యాగుమీద ఆప్లిక్‌ వర్కు మాదిరిగా కుట్టేయడంతో ఇవి అద్భుత హస్తకళాకృతులుగా అందరి మనసుల్నీ దోచుకుంటున్నాయి. చూశారా మరి. ఒకప్పుడు ఏక రంగులో నలుపూ గోధుమ ఛాయల్లో మాత్రమే కనిపించే లెదర్‌ బ్యాగులమీదా ఎన్నెన్ని చిత్రాలు చేస్తున్నారో!


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


ఇంకా..

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని