మ్యాచింగ్‌ శాలువాలొస్తున్నాయ్‌!

చలిగాలి తిరగ్గానే బీరువాలో నాఫ్తలీన్‌ బాల్స్‌ వేసి భద్రంగా దాచిన స్వెట్టరో శాలువానో బయటకు తీసి వేసుకోవడం పాత తరానికి తెలిసిన పద్ధతి. అదే నేటి తరం అయితే ఎంచక్కా చీరలకీ చుడీదార్‌లకీ మ్యాచింగ్‌తో వస్తోన్న శాలువాల్నీ దుపట్టాల్నీ కప్పుకుని చలికాలంలోనూ స్టైలిష్‌లుక్‌ని సొంతం చేసుకుంటోంది.

Published : 06 Nov 2022 00:34 IST

మ్యాచింగ్‌ శాలువాలొస్తున్నాయ్‌!

చలిగాలి తిరగ్గానే బీరువాలో నాఫ్తలీన్‌ బాల్స్‌ వేసి భద్రంగా దాచిన స్వెట్టరో శాలువానో బయటకు తీసి వేసుకోవడం పాత తరానికి తెలిసిన పద్ధతి. అదే నేటి తరం అయితే ఎంచక్కా చీరలకీ చుడీదార్‌లకీ మ్యాచింగ్‌తో వస్తోన్న శాలువాల్నీ దుపట్టాల్నీ కప్పుకుని చలికాలంలోనూ స్టైలిష్‌లుక్‌ని సొంతం చేసుకుంటోంది.

అందమైన డిజైనర్‌ చీర కట్టుకునో లేదా డిజైనర్‌ కుర్తీ వేసుకునో దానిమీదకి ఏ సాదాసీదా శాలువానో కప్పుకోవడం అంటే ఈ తరానికి తగని చిరాకే. అలాగని బయటకు వెళ్లినప్పుడు చలిని తట్టుకోవడమూ కష్టమే. అందుకే డిజైనర్లు వాళ్ల అభిరుచిని దృష్టిలో పెట్టుకుని చీరలమీదకీ సల్వార్‌-కమీజ్‌లమీదకీ మ్యాచింగ్‌ శాలువాల్ని డిజైన్‌ చేస్తున్నారు. ఈమధ్య అమ్మాయిలు చీర కట్టడమే అరుదు. ఒకవేళ కట్టక కట్టక ఏ పండక్కో పార్టీకో కట్టారూ అంటే దానిమీదకి మ్యాచింగ్‌ బ్యాగూ, శాండల్స్‌... ఇలా చాలానే కావాలి. ఇవన్నీ వేసుకుని చక్కగా ముస్తాబయ్యాక చలిగా ఉందని ఏదో పాతకాలం నాటి శాలువానో కప్పుకుంటే ఆ చీర అందం ఏం కనిపిస్తుంది చెప్పండి. పోనీ పెద్దవాళ్ల మాదిరిగా కొంగుని భుజాలచుట్టూ కప్పుకోనూ లేరు. అదే ఈ మ్యాచింగ్‌ శాలువాతో వస్తున్న చీరలతో అయితే ఆ ఇబ్బంది ఉండదు సరికదా, షాల్‌ని స్కార్ఫ్‌లా మెడచుట్టూ వేసుకోవచ్చు... దుపట్టా మాదిరిగా ఓ భుజంమీదకి స్టైల్‌గానూ వేయొచ్చు. ఎందుకంటే ఈమధ్య చీర మీదకీ దుపట్టా వేసుకోవడం ఫ్యాషన్‌గా మారింది. కొత్తగా వస్తోన్న పష్మీనా సిల్క్‌-షాల్‌ చీరల పుణ్యమా అని ఆ ఫ్యాషన్‌, ఇప్పుడు సామాన్యులకీ చేరిందన్నమాట. అయితే ఇలా వస్తున్న ఈ శాలువాల్లో ఊలు కన్నా సిల్కు దారాలే ఎక్కువ. సహజమైన పష్మీనా ఊలుని కశ్మీరు, లద్దాఖ్‌ ప్రాంతాల్లో పెరిగే ఇబెక్స్‌ మేకల నుంచి మాత్రమే తీస్తారు. అది చాలా ఖరీదైనది కాబట్టి సిల్కు దారాలకు సాదా ఊలు పోగుల్ని కలగలిపి ఈ శాలువాల్ని పవర్‌లూమ్స్‌మీద తయారుచేస్తున్నారట. కొందరు డిజైనర్లు అచ్చంగా వెల్వెట్‌ క్లాత్‌తోనూ సిల్కు దారాలతోనూ కూడా చీరకు మ్యాచయ్యే శాలువాల్ని డిజైన్‌ చేస్తున్నారు.

చీరలంటే ఎప్పుడో ఓసారి మాత్రమే కడతారు. కానీ రోజువారీ వేసుకునే చుడీదార్‌, సల్వార్‌మీద ధరించే కుర్తీ మీదా పార్టీల్లో వేసుకునే లాంగ్‌ ఫ్రాక్‌ల మీదకీ వేసుకునే దుపట్టానీ ఇప్పుడు శాలువాల మాదిరిగా డిజైన్‌ చేయడం మరో ట్రెండ్‌. సిల్కు, కాటన్‌, నెట్‌, షిఫాన్‌... వంటి క్లాత్‌లతో చేసే చున్నీ చలికి ఆగదు. అదే ఉన్ని దారాలతో నేసిన దుపట్టా అయితే భుజం చుట్టూ లేదా మెడ చుట్టూ కప్పుకున్నా చలి వేయకుండా ఉంటుంది. అంతేకాదు, కొన్ని కంపెనీలు కుర్తీల్లోనూ ఉన్ని దారాలను జోడించి పష్మీనా సూట్స్‌ పేరుతో మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. దాంతో చలికాలంలో ఈ నులివెచ్చని ఉలెన్‌ సూట్స్‌ వేసుకుని అమ్మాయిలు స్వెట్టర్లకు బైబై చెప్పేస్తున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..