Published : 24 Sep 2022 23:38 IST

కేకుని చుట్టేస్తున్నారు!

జరిగేది చిన్న వేడుక అయినా సరే... కేకులేనిదే పార్టీ పూర్తి కావడం లేదిప్పుడు.అసలు కేకు తినడానికి సందర్భం ఎందుకూ అనేవారూ లేకపోలేదు.అందుకే.... ఎన్నెన్నో ఫ్లేవర్లూ, మరెన్నో ఆకృతులూ కేకు ప్రియుల్ని ఎప్పటికప్పుడు కొత్తగా అలరిస్తూనే ఉన్నాయి. అలా ఇప్పుడు ప్రింటెడ్‌ స్విస్‌రోల్‌ కేకుల వంతు వచ్చింది. ఏంటివి అంటారా...

చూడముచ్చటైన రంగుల్లో, నోరూరించే అలంకరణతో ఆకట్టుకునే కేకుల రుచి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చూడగానే చటుక్కున నోట్లో వేసుకోవాలనిపిస్తుంది. ఇప్పటికే వివిధ రంగులూ, ఆకృతుల్లో కేకులెన్నింటినో చూసుంటారు. వాటిల్లో ‘ఔరా’ అనిపించేలా చేసిన హైపర్‌ రియలిస్టిక్‌ కేకులూ, రకరకాల సంఘటనల్నీ, సందర్భాల్నీ తలపించేలా తీర్చిదిద్దిన థీమ్డ్‌ కేకులు... వంటివెన్నో ఉన్నాయి. కానీ ఈ స్విస్‌ రోల్‌ కేకు వాటికి కాస్త భిన్నం. సాధారణ కేకుకి... రంగు, రూపం, డిజైన్‌ వంటివి మార్చి వినియోగదారుల మనసు దోచేయాలనుకున్న తయారీదారులు ఈ రోల్‌కేక్‌లకు శ్రీకారం చుట్టారు. పల్చటి పొరలా తయారు చేసిన స్పాంజ్‌ కేకుపైన క్రీమూ, జామూ వంటివి చేర్చి చుట్టేయడమే కాదు... కంటికింపైన ప్రకృతి దృశ్యాలూ, పూలూ, జంతువుల ఆకృతులూ, కార్టూన్లూ, మనసుకి హత్తుకునేలా రాసిన అక్షరాలు... వంటివెన్నో వీటిపైన వర్ణరంజితంగా అద్దేస్తున్నారు.

ఎలా చేస్తారంటే...

స్పాంజ్‌ కేక్‌ కోసం మిశ్రమాన్ని తయారు చేసుకుని పెట్టుకున్నాక...ముందుగా డిజైన్‌ చేసుకున్న కేక్‌ షీట్‌కి బటర్‌ రాసి బొమ్మ గీసుకుంటారు. ఇందుకోసం షుగర్‌ సిరప్, ఎడిబుల్‌ కలర్స్‌ను వాడతారు. దానిపైన పలుచగా కేక్‌ మిశ్రమాన్ని పరిచి చిన్న చిన్న పండ్ల ముక్కల్నీ పెడతారు. ఆపైన మరో బటర్‌పేపర్‌ పరిచి బేక్‌ చేస్తారు. తర్వాత దాన్ని తీసి క్రీమ్, జెల్లీ వంటివి రాసి బొమ్మల ప్రింట్లు పైకి వచ్చేలా రోల్‌ చేస్తారు. వీటిని రెడీమేడ్‌గా కొనుక్కోవచ్చు... లేదనుకుంటే సులువుగా మనమే ఇంట్లోనూ చేసుకోవచ్చు.

కస్టమైజేషన్‌తో...

మనసుకు నచ్చిన వారికోసం చేసే వేడుకల్ని సాదా సీదాగా చేస్తే ఏం బాగుంటుంది చెప్పండి. వారికి ఇచ్చే కానుకలకు కాస్త పర్సనల్‌ టచ్‌ అద్దితే... పుచ్చుకునేవారు ఉబ్బితబ్బిబ్బవుతారు. అందుకే పుట్టినరోజూ, పెళ్లిరోజూ...వంటి సందర్భాలనూ గుర్తు తెచ్చేలా, ఆయా వ్యక్తులకు ప్రత్యేకమైన చిత్రాలను ప్రతిబింబించేలా ఈ స్విస్‌ రోల్‌ కేకులను కస్టమైజేషన్‌ చేసి ఇస్తున్నారు బేకర్స్‌. ఈ కారణంతోనే కానుకగా ఇచ్చేందుకూ, కృతజ్ఞతలు చెప్పేందుకూ కూడా వీటిని ఎంచుకునేవారి సంఖ్య పెరిగింది. అయితే, ప్రతి సందర్భాన్నీ వేడుకలా చేసుకున్నా...అన్నిసార్లూ పదిమందినీ పిలిచి చేసుకోలేకపోవచ్చు. ఇలాంటప్పుడు పెద్ద పెద్ద కేకులను ఎంచుకునే బదులు... ఈ థీమ్డ్‌ ప్రింటెడ్‌ రోల్‌కేక్స్‌కు ప్రాధాన్యం ఇవ్వొచ్చు. ఫలితంగా డబ్బూ వృథా కాదు. కేకునీ ఆస్వాదించొచ్చు. పైగా ఈ స్విస్‌రోల్స్‌ పెద్దగా బరువూ ఉండవు కాబట్టి వాటిని ప్యాకింగ్‌ చేయడం కూడా సులువు. కాస్త దూరమైనా సరే సౌకర్యంగా తీసుకెళ్లొచ్చు కూడా. ఇక, పెద్దల నుంచి పిల్లల వరకూ అందరికీ ఈ స్విస్‌రోల్స్‌ రుచి నచ్చేస్తుండటంతో వీటి పాపులారిటీ కూడా రోజు రోజుకీ పెరుగుతోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts