తవా మిఠాయి... ఓ తియ్యని చాట్‌!

తీపి ప్రియులకి ఓ శుభవార్త. అందునా పెళ్లిభోజనంలో అచ్చంగా స్వీట్లు మాత్రమే రుచి చూడాలనుకునేవాళ్లకి మరీనూ. అవునుమరి... ఇటీవల విందుభోజనాల్లో అతిథులను హాటుహాటుగా ఓ సరికొత్త స్వీటు చవులూరిస్తోంది. దాని పేరే తవా చాట్‌ స్వీట్‌.. తాజా పెళ్లి మిఠాయి..!

Published : 29 May 2022 03:55 IST

తవా మిఠాయి... ఓ తియ్యని చాట్‌!

తీపి ప్రియులకి ఓ శుభవార్త. అందునా పెళ్లిభోజనంలో అచ్చంగా స్వీట్లు మాత్రమే రుచి చూడాలనుకునేవాళ్లకి మరీనూ. అవునుమరి... ఇటీవల విందుభోజనాల్లో అతిథులను హాటుహాటుగా ఓ సరికొత్త స్వీటు చవులూరిస్తోంది. దాని పేరే తవా చాట్‌ స్వీట్‌.. తాజా పెళ్లి మిఠాయి..!

చాటేంటీ... తియ్యగా ఉండటమేంటీ, అదీ వేడివేడిగానా అనిపిస్తోంది కదూ. నిజమే మరి, చాట్‌ తినేదే అందులోని స్పైసీ రుచి కోసం. అయితే ఇటీవల విందుభోజనాల్లో సంప్రదాయ చాట్‌ రుచులతోబాటు మరో కొత్త చాట్‌కౌంటర్‌ కూడా అతిథుల్ని రారమ్మని పిలుస్తోంది. దానిపేరే తవా చాట్‌ స్వీటు. 

భోజనాలకి వెళ్లినప్పుడు చాలామంది చివరగా ఏమి డెజర్ట్‌ ఉంటుందా అని ఎదురుచూస్తుంటారు. ఎక్కువగా గులాబ్‌జామ్‌, హల్వా, కుబానీకామీఠాలను ఐస్‌క్రీమ్‌లతో కలిపి అందించేవే ఉంటుంటాయి. అయితే ఇటీవల చాలాచోట్ల తవా స్వీటు డెజర్ట్‌ చవులూరిస్తోంది. అచ్చంగా చాట్‌భండార్‌లో మాదిరిగానే స్టవ్‌మీద పెద్ద పెనం పెట్టి ఉంటుంది. దానిపైన అంచుల చుట్టూ గులాబ్‌ జామూన్‌, కాలాజామూన్‌, సందేశ్‌, రసగుల్లా, రసమలై, కాజు కేసర్‌ రోల్స్‌, కోవా, జిలేబీ... ఇలా రకరకాల స్వీట్లన్నీ పరిచి ఉంటాయి. వీటిల్లో బెంగాలీ స్వీట్లదే హవా. వాటన్నింటినీ ఒక్కొక్కటిగా చిదిమి కాస్త రబ్డీ కలిపి వేడివేడిగా అందించే ఈ స్వీటుని ఒక్కసారయినా రుచి చూసినవాళ్లు మళ్లీ మళ్లీ తినాలనుకోకుండా ఉండలేరు. అందుకే ఈమధ్య చాలామంది పెళ్లిభోజనాల్లో రకరకాల స్వీట్లను వడ్డించడం కన్నా అన్ని రకాల స్వీట్లనూ కలిపి వేడిగా తయారుచేసి ఇచ్చే తియ్యని డెజర్ట్‌ను వడ్డించడం ద్వారా అతిథులను అలరిస్తూ తమదైన ప్రత్యేకతను చాటుకుంటున్నారు.

కొందరు బాదం కట్లి, మోతీచూర్‌ లడ్డూ, తీపి బూందీ, అంగూరీ రసగుల్లా, మినీ గులాబ్‌జామూన్‌, జీడిపప్పు బర్ఫీ, పిస్తా కట్లి, బాదం హల్వా, రబ్డీ, సేమ్యా... ఇలా రకరకాల స్వీట్లతోనూ ఈ చాట్‌ మిఠాయి తయారుచేస్తున్నారు. అందుకే అందులో కలిపే మిఠాయిలను బట్టి వాటికి తవా, డీలక్స్‌ తవా మిఠాయి చాట్‌లనీ రకరకాల పేర్లు కూడా పెడుతున్నారు. ఎందులో ఎన్ని రకాలు కలిపినా మొత్తమ్మీద భిన్న మిఠాయిల సమ్మేళనమే తవా చాట్‌ మిఠాయి. నిజానికి ఇలా రకరకాల స్వీట్లను చాట్‌ మాదిరిగా కలిపి అందించడం అనేది అరబిక్‌ సంప్రదాయం. ఇది భారత్‌లోకి ఎలా ప్రవేశించిందో తెలియదు కానీ ఉత్తరాది, దక్షిణాది అన్న తేడా లేకుండా ఇటీవల దేశమంతటా ప్రాచుర్యం పొందింది. స్టార్‌ హోటళ్ల నుంచి ఫంక్షన్‌ హాళ్ల వరకూ చాట్‌ భండార్‌లు వెలుస్తూ అతిథుల్ని రారమ్మని ఆహ్వానిస్తున్నాయి. 

 అయితే ‘తవా చాట్‌ మిఠాయి తినడంకోసం పెళ్లి భోజనానికే వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లో కూడా చాలా సులభంగా దీన్ని తయారుచేసుకోవచ్చు. ఇందులో ఇది కలపాలి, అది కలపకూడదు అన్న రూలేం లేదు. స్టవ్‌మీద పెనం పెట్టి దానిమీద మనకి నచ్చిన స్వీట్లన్నింటినీ చుట్టూ అమర్చుకుని సన్నని సెగమీద ఉంచాలి. ఆ తరవాత స్వీట్ల మధ్యలో రబ్డీ వేసి, అందులోకి ఒక్కో స్వీటునీ వేస్తూ గరిటెతో చిదిమితే తవా చాట్‌ స్వీట్‌ రెడీ. దీన్ని వేడివేడిగా చిన్న గిన్నెల్లో పెట్టి ఇంటికి వచ్చిన అతిథులకు అందిస్తే ఆశ్చర్యపోవడం వాళ్ల వంతవుతుంది’ అంటున్నారు ప్రముఖ షెఫ్‌ సంజీవ్‌ కుమార్‌. అయితే దీనికోసం మిగిలినవన్నీ మార్కెట్‌ నుంచి తెచ్చుకున్నా జిలేబీ మాత్రం ఇంట్లో వేడివేడిగా తయారుచేసి, తవా చాట్‌ మిఠాయిలో కలిపితే ఆ రుచే వేరట. మరి ఇంకెందుకు ఆలస్యం... కానీయండిక! 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..