టిఫిన్‌, స్వీట్‌, చాట్‌... ఏ థాలీ కావాలి?

‘నాకు చైనీస్‌ థాలీ కావాలి’, ‘నేనైతే స్వీట్‌థాలీని రుచి చూస్తా’, ‘నాకు టిఫిన్‌ థాలీ’... ఎవరైనా సౌత్‌/నార్త్‌ ఇండియన్‌ థాలీలని అడుగుతారు కానీ.. ఇవేంటీ కొత్తగా అని ఆశ్చర్యపోతున్నారా... మీరు

Updated : 18 Sep 2022 04:37 IST

టిఫిన్‌, స్వీట్‌, చాట్‌... ఏ థాలీ కావాలి?

‘నాకు చైనీస్‌ థాలీ కావాలి’, ‘నేనైతే స్వీట్‌థాలీని రుచి చూస్తా’, ‘నాకు టిఫిన్‌ థాలీ’... ఎవరైనా సౌత్‌/నార్త్‌ ఇండియన్‌ థాలీలని అడుగుతారు కానీ.. ఇవేంటీ కొత్తగా అని ఆశ్చర్యపోతున్నారా... మీరు విన్నది నిజమే... టిఫిన్ల నుంచీ స్వీట్ల వరకూ... అన్నీ థాలీల రూపంలో విడివిడిగా దొరకడమే ఇప్పుడున్న ట్రెండ్‌ మరి. అంటే.. మనం ఇష్టపడే పదార్థాలను నాలుగైదు రకాల్లో కొద్దికొద్దిగా అందిస్తారన్నమాట. 

పిల్లలతో కలిసి సరదాగా రెస్టరంట్‌కు వెళ్లామా.. మంచూరియా, నూడుల్స్‌, స్ప్రింగ్‌రోల్స్‌, ఫ్రైడ్‌రైస్‌, రోటీ, కర్రీ... అంటూ టకటకా ఆర్డరిచ్చేస్తారు. తీరా అవన్నీ వచ్చాక... అన్నింటినీ కొద్దికొద్దిగా రుచి చూసి ‘అమ్మా ఇక చాలు’ అనేస్తారు. ఆ మిగిలిన పదార్థాలను ఇంటికి తెచ్చుకోలేక, వాటిని అక్కడే వృథాగా వదిలేయడానికి మనసూ రాక... ‘అనవసరంగా ఇన్ని తెప్పించుకున్నాం, బిల్లేమో తడిసిమోపెడయ్యింద’ని బాధపడుతూ బయటకు వస్తారు చాలామంది. అలాంటి ఇబ్బందులేవీ లేకుండా... నచ్చిన పదార్థాలను తక్కువ బడ్జెట్‌లోనే తినేయాలనుకునేవారికోసం రెస్టరంట్లు వెరైటీ థాలీలను అందిస్తున్నాయి. మనకు కావాల్సిన వంటకాలను కొద్దికొద్దిగా పెట్టి ఇచ్చే ఈ థాలీలు.. సౌత్‌/నార్త్‌ఇండియన్‌, వెజ్‌/నాన్‌వెజ్‌ థాలీలకు పూర్తి భిన్నంగా ఉంటాయి. వీటిల్లో టిఫిన్లూ, స్వీట్లూ, చాట్‌రుచులూ, రైస్‌లూ, చైనీస్‌వంటకాలూ... ఇలా అన్ని రకాలూ ఉంటాయి.

ఈ థాలీల్లో ఏముంటాయంటే... 

సాధారణంగా ఓ సౌత్‌/నార్త్‌ ఇండియన్‌ థాలీని తీసుకుంటే.... అన్నం, బిర్యానీ, పప్పు, కూర, సాంబారు, చారు, ఒక స్వీటు, అప్పడం, పూరీ, చపాతీ, మసాలా కర్రీ లాంటివన్నీ ఉంటాయి. ఈ థాలీలు అలా ఉండవు. టిఫిన్‌/రైస్‌/స్వీట్‌/చాట్‌... ఏది ఎంచుకున్నా ఆ పదార్థాలను నాలుగైదు రకాల్లో పెట్టి ఇస్తారు. ఉదాహరణకు టిఫిన్‌ థాలీలో... ఒక ఇడ్లీ, ఒక గారె, కొద్దిగా ఉప్మా లేదా కట్టుపొంగలి, ఒక దోశ, కొద్దిగా రవ్వకేసరి వంటివి పెట్టి... అదనంగా సాంబారూ, చట్నీలు సర్వ్‌చేస్తారు. అదే చైనీస్‌ థాలీలో అయితే... నూడుల్స్‌, మంచూరియా, స్ప్రింగ్‌రోల్‌, ఫ్రైడ్‌రైస్‌... లాంటివాటిని తక్కువ మోతాదులో సర్ది ఇస్తారు. రైస్‌ థాలీని తినాలనుకునే వారికి... చిన్నచిన్న కప్పుల్లో చక్కెర పొంగలి, కొబ్బరన్నం, బిర్యానీ, టొమాటోరైస్‌, పెరుగన్నం, రైతా వంటివి సర్వ్‌చేస్తారు. చాట్‌, పానీపూరీ లాంటివి ఇష్టపడేవారికి నాలుగైదు పానీపూరీలూ, సమోసా చాట్‌, భేల్‌పూరీ, దహీపాపడీ లేదా కటోరీ చాట్‌.. లాంటివి ఉండే చాట్‌థాలీ కూడా దొరుకుతుంది. ఇవన్నీ కాకుండా సరదాగా స్వీట్‌ తినాలనుకునేవారు... స్వీట్‌థాలీనే ఆర్డరిచ్చుకోవచ్చు. ఈ ప్లేటులో ఒకటి లేదా రెండు గులాబ్‌జామూన్‌లు, ఒక రసగుల్లా, ఒక జిలేబీ, కొద్దిగా పాయసం, రెండుమూడు చెంచాల క్యారెట్‌ హల్వా, ఒక మాల్‌పువా, ఒక పేస్ట్రీ ముక్క... ఇలా అన్నింటినీ వడ్డిస్తారు. ఇన్ని రకాలుగా వచ్చేస్తున్న ఈ థాలీల వల్ల లాభాలూ లేకపోలేదు. తక్కువ బడ్జెట్‌లో ఒకేసారి నాలుగైదు రకాలను రుచి చూసేయొచ్చు. ఒకవేళ ఏదయినా నచ్చకపోయినా ఆ వంటకం కొద్దిగానే ఉంటుంది కాబట్టి డబ్బులు వృథా చేశామనే బాధా ఉండదు. అన్నింటినీ రుచి చూడాలనుకునే పిల్లలకు ఇవి సరైన ఎంపికవుతాయి. కాబట్టి... ఈసారి పై వాటిల్లో ఎవరికి నచ్చిన థాలీని వాళ్లు ఆర్డరిచ్చేసుకుంటే సరి. డబ్బులకు డబ్బులూ మిగులుతాయి. కొద్దికొద్దిగా అన్నింటినీ రుచి చూసినట్లుగానూ ఉంటుంది. ఏమంటారూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..