అందంగా కప్పేద్దాం!

చాలామంది ఇళ్లల్లో వేసవిలోనే ఏసీ వాడకం ఎక్కువగా ఉంటుంది. వాతావరణం కాస్త చల్లబడిందంటే ఇక ఏసీ జోలికి వెళ్లరు మరి. అలాంటప్పుడు దానిపైన దుమ్ము పడకుండా ఉంచేందుకు ‘ఏసీ కవర్లు’

Updated : 17 Aug 2022 16:19 IST

అందంగా కప్పేద్దాం!

చాలామంది ఇళ్లల్లో వేసవిలోనే ఏసీ వాడకం ఎక్కువగా ఉంటుంది. వాతావరణం కాస్త చల్లబడిందంటే ఇక ఏసీ జోలికి వెళ్లరు మరి. అలాంటప్పుడు దానిపైన దుమ్ము పడకుండా ఉంచేందుకు ‘ఏసీ కవర్లు’ దొరుకుతున్నాయి. రకరకాల రంగుల్లో, బోలెడన్ని డిజైన్లల్లో... చూడగానే కాస్త అందంగా కనిపించేలా ఉంటున్నాయి ఇవన్నీ. మన ఇంట్లోని ఎయిర్‌ కండిషనర్‌ సైజును బట్టి, గది అలంకరణకు సరిపోయేలా కావాల్సిన ఏసీ కవర్‌ను ఎంచుకోవచ్చు. ఎలాస్టిక్‌తో వస్తున్న ఈ కవర్లను ఇట్టే ఏసీలకు తొడిగేయొచ్చు. వీటి వల్ల దుమ్ము పట్టకుండా ఉంటుంది కాబట్టి మళ్లీ వాడాల్సి వచ్చినా ఏసీ మొత్తాన్ని శుభ్రం చేయడంలాంటి పనంతా ఉండదు. అప్పటికప్పుడు కవర్‌ని తొలగించేసి ఆన్‌ చేసుకుంటే చాలు. నచ్చిందా... అయితే ఆన్‌లైన్లో అందుబాటులో ఉన్న ఈ కవర్‌ను మీరూ ట్రై చేసి చూడండి. 


పొయ్యి ఎప్పుడూ శుభ్రంగానే!

గ్యాస్‌ పొయ్యి మీద పొంగిపోయే పాలూ, చారూ వంటి వాటి మరకల్ని తొలగించడమనేది ఎవరికైనా పెద్ద పనే. రోజూ ఎదుర్కొనే ఈ సమస్యకు ఇకపైన చెక్‌ పెట్టొచ్చు. ‘స్టవ్‌ బర్నర్‌ కవర్స్‌’ వాడితే చాలు... ఎన్ని మరకలు పడినా క్షణాల్లో శుభ్రం చేసేసుకోవచ్చు. ‘అల్యూమినియం ఫాయిల్‌ గ్యాస్‌ బర్నర్‌ కవర్స్, స్టవ్‌ మ్యాట్‌ ప్రొటెక్టర్స్‌’ అంటూ రకరకాల పేర్లతో ఇవి మార్కెట్లో దొరుకుతున్నాయి. బర్నర్‌ మీద వీటిని ఉంచామంటే వంట పాత్రల నుంచి ఏ పదార్థాలు పొంగినా, అనుకోకుండా పడినా... ఆ కవర్ల మీదే పడతాయి. సో... రోజూ వంట ముగించాక ఆ కవర్‌ తీసేస్తే సరి, పొయ్యిని ప్రత్యేకంగా శుభ్రం చేయాల్సిన శ్రమ ఉండదు. వేడిని తట్టుకునే వాటితోనే ఈ కవర్లను తయారుచేస్తారు కాబట్టి బర్నర్‌ మంట వల్ల కవర్లకు ఇబ్బందేమీ ఉండదు.


అరలు సౌకర్యంగా...

టేబుల్‌  సొరుగు తెరవగానే వస్తువులన్నీ చెల్లాచెదురుగా కాకుండా దేనికది విడివిడిగా ఉంటే... తీసుకోవడానికీ వీలుగా ఉంటుంది, చూడ్డానికీ చక్కగా ఉంటుంది. ‘నిజమే అలా ఉండాలనీ, ఉంచాలనీ మాకూ ఉన్నా ఎప్పుడూ సర్దుతూనే కూర్చోలేం కదా’ అంటారా... అయితే ఈ ‘అడ్జస్టబుల్‌ డ్రాయర్‌ డివైడర్ల’ను ప్రయత్నించి చూడండి. సొరుగు పరిమాణాన్ని బట్టి వీటితో అరల్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఆ అరల్లో ఒక్కోదాంట్లో ఒక్కోరకం వస్తువుల్ని సర్దుకోవచ్చు. ఎంత హడావిడిలో ఉన్నా తీసిన వస్తువును వాటిల్లోనే పెట్టేసుకోవచ్చు. డ్రెస్సింగ్‌ టేబుల్‌ దగ్గర కూడా వీటితో అరల్ని తయారుచేసుకుని అక్కడున్న వస్తువులన్నింటినీ అందులో ఉంచేయొచ్చు. చూసినవాళ్లంతా మిమ్మల్ని మెచ్చుకుని తీరతారంటే నమ్మండీ...!


మేకప్‌కీ ఓ పెన్‌! 

ఈరోజుల్లో అమ్మాయిల హ్యాండ్‌బ్యాగుల్లో మిగతా వస్తువులతో పాటు అవసరమైన మేకప్‌ సామగ్రి ఉండాల్సిందే. ఈ మేకప్‌ వస్తువులన్నీ ఉన్నా బ్యాగంతా నిండిపోకుండా ఉంటే ఎంత బాగుంటుంది కదూ. అందుకు పరిష్కారంగా వచ్చిన వస్తువుల్లోనే ఈ ‘ఆల్‌ ఇన్‌ వన్‌ మేకప్‌ పెన్‌’ కూడా చేరింది. చూడ్డానికి కాగితం మీద రాసే మామూలు పెన్నులానే కనిపించినా దీన్ని వాడేది మాత్రం మేకప్‌ కోసమే. దీంట్లో ఐ-లైనర్, లిప్‌-లైనర్, ఐబ్రో-లైనర్, హైలైటర్‌ వస్తాయి. మేకప్‌ వేసుకునేప్పుడు బటన్‌ నొక్కి ఏది కావాలంటే అది వాడుకోవచ్చు. ఒక్కదాంట్లోనే నాలుగు రకాలు ఉంటాయి కాబట్టి విడివిడిగా వాటిని కొనే పనీ ఉండదు. ఇది చూడ్డానికి కొత్తగా ఉండటమే కాదు... ప్రయాణాల్లో ఎంతగానో ఉపయోగపడుతుంది కూడా!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..