Updated : 18 Aug 2022 12:06 IST

మాట్లాడే కార్డులు!

అప్పుడప్పుడే ముద్దు మాటలు చెబుతున్న బుజ్జాయిలకు అమ్మానాన్నలు బోలెడన్ని విషయాలు నేర్పించాలనుకుంటారు. కూర్చోబెట్టి చెబుతుంటే కొన్నిసార్లు పిల్లలు అసలు విననే వినరు. అలాంటప్పుడే చిన్నారుల్ని ఆడిస్తూనే సరదాగా ‘ఏబీసీడీలూ, రంగులూ, వాహనాలూ, మొక్కలూ, పూలూ, జంతువుల పేర్లూ, వాటి శబ్దాలూ... ఇలా ఎన్నెన్నో విషయాలు చెప్పడానికి ఎడ్యుకేషనల్‌ టాయ్స్‌లో ‘టాకింగ్‌ ఫ్లాష్‌ కార్డ్స్‌’ దొరుకుతున్నాయి. దీంట్లో చిన్న డివైజ్‌తోపాటు 200 వరకు రకరకాల అంశాల బొమ్మలతో ఉన్న కార్డులు వస్తాయి. ఆ డివైజ్‌ని ఆన్‌ చేసి అందులో ఏదైనా బొమ్మ ముక్కను ఉంచామంటే అందులోని సెన్సార్‌ టెక్నాలజీ ద్వారా ఆ కార్డు మీదున్న బొమ్మ పేరు వినిపిస్తుంది. ఉదాహరణకు పులి బొమ్మకార్డును ఉంచామంటే దాని పేరుతో పాటూ అది చేసే గాండ్రింపు శబ్దాల్నీ వినిపించేస్తుంది. పెద్దవాళ్లు పక్కనే ఉన్నా లేకపోయినా పిల్లలు ఎన్నో కొత్త సంగతులు వింటూ తెలుసుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. బడికి వెళ్లేలోపే అక్షరాలూ, శబ్దాలూ ఎంచక్కా ఇంట్లోనే సులువుగా నేర్చుకోవచ్చు!


మూలకాల టేబుల్‌ ఇది!

రసాయన మూలకాల జాబితాతో ఉండే పీరియాడిక్‌ టేబుల్‌ విద్యార్థులందరికీ సుపరిచితమే. కానీ అందులోని గోల్డ్‌, సిల్వర్‌, కాపర్‌లాంటివి కాకుండా ఇతర మూలకాలు ఎలా ఉంటాయో అంతగా తెలియకపోవచ్చు. అందుకే మరి... ఆ ఆవర్తన పట్టికలో మూలకం పేరూ, పరమాణు సంఖ్యతో పాటూ అది ఎలా ఉంటుందో చూపిస్తూ మొత్తం మూలకాల్లో దాదాపు 83 మూలకాల నమూనాల్ని ఉంచుతూ ‘లైవ్‌ పీరియాడిక్‌ టేబుల్‌ ఆఫ్‌ ఎలిమెంట్స్‌’ను తయారుచేశారు. గాజుతో చేసిన ఈ టేబుల్‌లో నిజమైన మూలకాలూ ఉంటాయన్నమాట. ఈ టేబుల్‌తో జతగా వచ్చే భూతద్దంతో మూలకాల నమూనాల్ని చూస్తూ, హాయిగా వాటి వివరాలూ తెలుసుకోవచ్చు. పిల్లలెవరికైనా ఎప్పటిలా బొమ్మల్ని కాకుండా దీన్ని బహుమతిగా ఇచ్చామంటే కొత్తగా ఉండటమే కాదు, అది కచ్చితంగా వారికెంతో ఉపయోగపడుతుంది.


మడతపెట్టే బుట్ట!

మాసిన దుస్తులు వేసుకోవడానికి చాలా ఇళ్లల్లో రకరకాల బుట్టల్లాంటి వాటిని వాడుతుంటారు. వాటి అవసరం తప్పకుండా ఉంటుంది కానీ వాషింగ్‌ ఏరియాలో వాటికి చోటు కూడా చాలానే కావాల్సి వస్తుంటుంది. బట్టలు ఉన్నా లేకపోయినా దానికి స్థలం కేటాయించక తప్పదు. ఈ ఇబ్బందికి పరిష్కారం చూపించడానికే ఈ మధ్య ‘ఫోల్డబుల్‌ లాండ్రీ బాస్కెట్‌’ పేరుతో ఇదిగో ఇక్కడున్న బుట్టల్లాంటివి మార్కెట్లో దొరుకుతున్నాయి. అవసరమైనప్పుడు దీంట్లో మాసిన బట్టలో, ఉతికిన దుస్తులో వేసుకోవచ్చు. అవి తీసేశాక ఎంచక్కా సన్నని అట్టలా మడతేసేసి ఓ వారన పెట్టేసుకోవచ్చు. ఐడియా బాగుంది కదూ!


మళ్లీ కొత్త ప్యాక్‌లా...

బ్రెడ్డూ, బిస్కెట్లూ, కూరగాయలూ, పండ్లూ, పప్పు దినుసులూ... ఇలా ఏ ప్యాకెట్‌ అయినా సరే, ఓసారి సీల్‌ విప్పి తెరిచాక మళ్లీ ఆ కవర్‌ని ఏదోలా మూసేసి ఫ్రిజ్‌లోనో, డబ్బాల్లోనో ఉంచేస్తుంటాం. ఇలా చేయడం వల్ల అప్పుడప్పుడు ఆ కవర్లలోని పదార్థాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ‘కానీ దుకాణాల్లోలా సీల్‌ చేయడం ఇంట్లో అవదు కదా’ అంటారా... ఇక్కడున్న ‘పోర్టబుల్‌ హ్యాండీ టేప్‌ సీలింగ్‌ మెషీన్‌’తో అది కచ్చితంగా కుదురుతుంది. మామూలుగా వాడే టేప్‌నే దీంట్లో ఉంచేసి మధ్యలో కవర్‌ను ఉంచి నొక్కామంటే... దానికి సీల్‌ పడిపోతుంది. బ్యాటరీతో పనిచేసే ఈ టేప్‌ సీలింగ్‌ మెషీన్‌ వాడటమూ చాలా సులభమే. వస్తువు నచ్చితే మీ వంటింట్లోకి తెచ్చి పెట్టుకోండి మరి!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


ఇంకా..

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని