కథ చెప్పే హెడ్‌ఫోన్స్‌!

బుజ్జాయిలకు కథలంటే చెప్పలేనంత ఇష్టం. కానీ అమ్మానాన్నలకు అన్ని వేళలా కథలు చెప్పడం కుదరకపోవచ్చు. అలా అనీ పిల్లల చేతిలో ఫోన్‌ పెట్టాలంటే మనసొప్పదు. దీనికి పరిష్కారంగానే ‘ఆన్‌ఎన్‌ఆఫ్‌’

Updated : 23 Jan 2022 07:13 IST

కథ చెప్పే హెడ్‌ఫోన్స్‌!

బుజ్జాయిలకు కథలంటే చెప్పలేనంత ఇష్టం. కానీ అమ్మానాన్నలకు అన్ని వేళలా కథలు చెప్పడం కుదరకపోవచ్చు. అలా అనీ పిల్లల చేతిలో ఫోన్‌ పెట్టాలంటే మనసొప్పదు. దీనికి పరిష్కారంగానే ‘ఆన్‌ఎన్‌ఆఫ్‌’ అనే సంస్థ ‘స్టోరీఫోన్స్‌’ పేరుతో కథ చెప్పే హెడ్‌ఫోన్స్‌ను తయారుచేసింది. వీటికి పిల్లలకు ఇష్టమైన కార్టూన్‌ కథలతో ఉండే చిన్న స్టోరీ డిస్క్‌లు జత చేసి ఉంటాయి. ఒక్కో స్టోరీ డిస్క్‌ గంటన్నర సమయం పాటు వినగల్గేంత మెమరీతో ఉంటుంది. ఇందులోనే కథ ఉంటుందన్నమాట. అందుకే ఫోనూ, ట్యాబూ పెట్టుకోకుండానే ఒక్క హెడ్‌ఫోన్స్‌తో కథలు వినేయొచ్చు. ఓ కథ విన్నాక మరో స్టోరీ డిస్క్‌ను మార్చుకోవచ్చు. ఇంకా సొంతంగా కథల్ని రికార్డూ చేసుకోవచ్చు. ఈ సరికొత్త హెడ్‌ఫోన్స్‌ త్వరలో మార్కెట్లోకి రాబోతున్నాయి.


ఇక కదలవు!

మంచం మీద వేసిన బెడ్‌షీట్‌లూ, డోర్‌మ్యాట్‌లూ వేసినవి వేసినట్టే ఉండాలా... పిల్లలు వాటిమీద ఎంత దొర్లినా చెక్కుచెదరకూడదా... అయితే ఈ యాంటీస్లిప్‌ మ్యాజిక్‌ స్టిక్కర్‌ను ప్రయత్నించి చూడండి. వస్తువు చిన్నదే అయినా ఉపయోగం మాత్రం పెద్దగానే ఉంటుంది. గుండ్రని బిళ్లల్లా వచ్చే ఈ ప్యాడ్స్‌లో రెండు వెల్‌క్రో ముక్కలుంటాయి. ఇక్కడ ఫొటోలో ఉన్నట్లు ఒక ముక్కను బెడ్‌షీట్‌కూ, రెండోదాన్ని పరుపుకూ తగిలించామంటే ఆ రెండు ముక్కలూ అతుక్కుని బెడ్‌షీట్‌ కదలకుండా ఉంటుంది. బెడ్‌షీట్‌ మార్చేటప్పుడు వాటిని తీసి మళ్లీ పెట్టుకోవచ్చు.


మేకప్‌ ‘బొమ్మలు’!

అమ్మాయిలు అందంగా ముస్తాబవ్వడానికి వాడే మేకప్‌ కిట్టే అందాల బొమ్మలా హొయలొలుకుతూ ఉంటే, భలే ముచ్చటగా ఉంటుంది కదూ! అందుకే ఈ మధ్య ‘నెస్టింగ్‌ డాల్‌, ప్యూపా డాల్‌’ పేరుతో వెరైటీ మేకప్‌ కిట్లు దొరుకుతున్నాయి. ఇవి మామూలుగా చూడచక్కని బొమ్మల్లా కనిపిస్తాయి. తెరిచి చూస్తేనే గానీ తెలియదు అవి డాల్స్‌ కాదు, మేకప్‌ కిట్స్‌ అన్న సంగతి. డ్రెసింగ్‌ టేబుల్‌ మీద సాధారణమైన మేకప్‌ కిట్‌కి బదులు వీటిని ఉంచామనుకోండి... అద్దం ముందు అలంకరణలాగే కాదు, మీకు ప్రశంసల్నీ అందిస్తాయి. ఈ డాల్‌ మేకప్‌ కిట్స్‌ని ఎవరికైనా బహుమతిగా ఇచ్చారంటే మీ అభిరుచిలోని వైవిధ్యాన్ని చెప్పకనే చెబుతాయి.


స్మార్ట్‌ గంట ఇది!

వంటగదిలో మన పనిని మరింత సులభం చేయడానికి బోలెడన్ని ఎలక్ట్రిక్‌ వస్తువులు వచ్చినట్టే ఇప్పుడు పూజా మందిరంలోకీ అలాంటి ఓ కొత్త వస్తువు వచ్చింది. అదే ‘ఎలక్ట్రిక్‌ బ్రాస్‌ పూజా బెల్‌’. చూడ్డానికి మామూలు గంటలానే ఉండి కేబుల్‌ వైర్‌, ప్లగ్‌తో వస్తుంది. దాన్ని సాకెట్‌లో పెట్టి స్విచ్‌ ఆన్‌ చేశామంటే మనకు కావాల్సినంత సేపు ‘గణగణమని’ మోగుతుంటుంది. దీని వల్ల గంట కొట్టడం మీదకాకుండా పూజ మీద శ్రద్ధ పెట్టుకోవచ్చు. మందిరం ఆకారంలోని ఈ ఆటోమేటిక్‌ బెల్స్‌ రకరకాల రంగుల్లో ఆన్‌లైన్లో అందుబాటులో ఉన్నాయి.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..