Published : 15 May 2022 01:29 IST

ఇంటింటా పిఛ్‌వాయీ

పిఛ్‌వాయీ... ఈమధ్య చాలామంది నోట పదేపదే వినిపిస్తోన్న పదం. పెళ్లీపేరంటాలూ గృహప్రవేశాలూ... వేడుక ఏదైనా వేదిక అలంకారంలో ఆ చిత్రాలే కనిపిస్తున్నాయి. అక్కడనే కాదు, గృహాలంకరణలోనూ దుస్తులూ, యాక్సెసరీలూ, కానుకలూ... తదితరాలన్నింటిమీదా కూడా ఆ కళారూపాలే అందంగా కనువిందు చేస్తున్నాయి. ఇంతకీ ఏమిటీ పిఛ్‌వాయీ... ఏమా కథ అంటే..?

కొన్ని కళలు ఎప్పుడు ఎందుకు ఎలా ప్రాచుర్యం పొందుతాయో చెప్పడం కష్టం. అలాంటివాటిల్లో ఒకటి... రాజస్థాన్‌లోని నాథ్‌ద్వారాకి చెందిన పిఛ్‌వాయీ... విదేశాల్లోనూ కళాభిమానుల మనసు దోచుకున్న ప్రాచీన కళ ఇది... బాలకృష్ణుడి నుంచి రాధాకృష్ణుడి వరకూ నల్లనయ్య నేపథ్యంలో గీసిన అరుదైన సూక్ష్మ చిత్రకళ. తెల్లని ఆవూ గులాబీరంగులో విరిసిన తామరలూ కామధేనువూ గోవర్ధనగిరిని చిటికెన వేలుతో ఎత్తి పట్టుకున్న నల్లని చిన్నికృష్ణుడూ... ఇలా అందులో ఎన్నో రకాల బొమ్మలు కనిపిస్తుంటాయి. ఇప్పుడు వాటినే డిజిటల్‌ ప్రింట్స్‌గా చిత్రించి ఇంట్లో అలంకరించు కుంటున్నారు. పెళ్లి మండపాల్ని సైతం పిఛ్‌వాయీ థీమ్‌తోనే డిజైన్‌ చేస్తున్నారు. పెన్‌ కలంకారీ మాదిరిగానే, పిఛ్‌వాయీ చిత్రాలతో డిజైన్‌ చేసిన చీరల్నీ చున్నీల్నీ అమ్మాయిలు ఇష్టంగా ధరిస్తున్నారు. ఎకానా, సయాంటి... వంటి బొటిక్‌లు పిఛ్‌వాయీ చిత్రాల్ని ప్రత్యేకంగా డిజైన్‌ చేస్తున్నాయి. ముఖ్యంగా తామరల డిజైన్‌కి విశేషమైన ప్రాచుర్యం లభించింది. అందుకే యాక్సెసరీల్లోనూ అరవిరిసిన తామరపువ్వులూ సగం ముడుచుకున్నట్లున్న ఆకులతో కూడిన చిత్రాలే కనిపిస్తున్నాయి. నేడు ఇంతగా ప్రాచుర్యం పొందిన పిఛ్‌వాయీ చిత్రకళ గురించి తెలుసుకోవాలంటే నాథ్‌ద్వారాకి వెళ్లాల్సిందే.

శ్రీనాథ్‌జీ- ఫిచ్‌వాయీ!

ఒంటినిండుగా నగలూ సిగలో నెమలిపింఛంతో ముద్దులొలికే చిన్ని కృష్ణుడి రూపాన్ని ఎంత చూసినా తనివితీరదు. అందుకేనేమో యశోదమ్మ తన మురిపాల కృష్ణుడిని రంగుల దుస్తులూ నగలతో అలంకరించి మురిసిపోయేది. అచ్చం అలాగే నిత్యం కన్నయ్యకి సింగార సేవలు అందించే ఆలయమే నాథ్‌ద్వారా శ్రీనాథ్‌జీ టెంపుల్‌. అక్కడి కృష్ణుడినీ ఆయనకు చేసే అలంకారాన్నీ కళ్లకు కట్టినట్లుగా చూపించే సూక్ష్మచిత్ర కళే పిఛ్‌వాయీ. అందుకే నాథ్‌ద్వారా ఆలయం, పిఛ్‌వాయీ చిత్రం... ఈ రెండింటిదీ విడదీయలేని బంధం.  

నాథ్‌ద్వారాలోని శ్రీకృష్ణుడు ఏడేళ్ల బాలుడు. ఆయన్ని ఇక్కడ శ్రీనాథ్‌జీ అని పిలుస్తారు. గోవర్ధన పర్వతాన్ని చిటికెన వేలుతో ఎత్తిపట్టుకున్న చిన్నికృష్ణుడి రూపంలో దర్శనమిస్తాడిక్కడ. నల్లని రాయితో చెక్కిన ఈ విగ్రహాన్ని మధుర సమీపంలోని పర్వతంమీద వల్లభాచార్య గుర్తించి, విశాలమైన ఆలయాన్ని కట్టించి ప్రతిష్ఠించారట. అయితే హిందూ ఆలయాలన్నింటినీ ఔరంగజేబు ధ్వంసం చేయిస్తోన్న సమయంలో- ఆలయ సంరక్షకులు శ్రీనాథ్‌జీ విగ్రహాన్ని దాచేందుకు తరలిస్తుండగా శిహార్‌ అనే ప్రాంతం దగ్గర బండిచక్రం కూరుకుపోయిందట. దాంతో ఆ ప్రాంతమే కృష్ణభగవానుడికి నచ్చిందని భావించి గుడి కట్టించారట. దానిచుట్టూనే నాథ్‌ద్వారా పట్టణం వృద్ధి చెందింది. అందుకే ఈ ఆలయం రాజస్థాన్‌లో ఉన్నప్పటికీ ఈ పట్టణ ప్రజల సంస్కృతీసంప్రదాయాలన్నీ మధురవాసుల్నే పోలి ఉంటాయి. ఎక్కడ చూసినా బాలకృష్ణుడి చిత్రాలే కనిపిస్తాయి. ఆయన గురించిన వర్ణనలే వినిపిస్తాయి.

సాధారణంగా ఈ గుడిలో కృష్ణుడికి మేల్కొలుపు నుంచి పవళింపు వరకూ నిత్యం ఎనిమిదిరకాల సేవలు చేస్తుంటారు. ఆయా సేవల్లో అలంకారాలూ మారుతూనే ఉంటాయి. వాటన్నింటినీ సిల్కు లేదా నూలుబట్టమీద చిత్రిస్తారు కళాకారులు. అలంకారాలతోపాటు గోవర్ధన పూజ, శరత్‌పూర్ణిమ, రాసలీల, హోలీ, కృష్ణ జన్మాష్టమి, నంద మహోత్సవ్‌ పండుగల్ని కూడా కళ్లకు కట్టినట్లుగా చిత్రించడం నాథ్‌ద్వారా కళాకారులకి వెన్నతోపెట్టిన విద్య. మొదట్లో ఈ చిత్రాలను స్వామికి వెనక భాగంలో కట్టి రోజుకొకటి మార్చేవారట. విగ్రహానికి వెనకభాగంలో వేలాడుతూ ఉంటాయి కాబట్టే వీటికి పిఛ్‌(వెనక)వాయీ (వేలాడటం) అని పేరు వచ్చిందట. కృష్ణుడిని కొలిచే భక్తిమార్గానికి మరో రూపమే పిఛ్‌వాయీ కళ.  

ఆయా కాలాల్లో చేసే అలంకారాల్ని కళాకారులు యథాతథంగా చిత్రించి గుడి దగ్గరే విక్రయించడం, ఆలయంలోని చిన్నికృష్ణుడిని ఫొటోలు తీయనివ్వక పోవడంతో భక్తులు వాటినే కొని ఇంటికి తీసుకెళ్లి పూజిస్తుంటారు. స్వామికి సైతం ఈ పిఛ్‌వాయీ చిత్రాల్నే కానుకలుగా ఇస్తుంటారట. విదేశీ టూరిస్టులూ వీటిని కొనుక్కెళ్లడంతో ఈ కళ ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం చెందింది.

ఎలా చేస్తారు?

మందపాటి వస్త్రంమీద నలుపురంగులో స్వామివారిని చిత్రించి, ఇతర రంగులతో అలంకారాలు చేస్తుంటారు. అయితే ఒకప్పుడు ఈ చిత్రాలకోసం అన్నీ సహజరంగుల్నే వాడేవారు. బంగారురంగుని బంగారం నుంచీ, వెండి రంగుని వెండి లోహం నుంచే తయారుచేసేవారు. బంగారం ప్రియం కావడంతో తరవాత ఆ రంగుకోసం జరీదారాలను వాడుతున్నారట.  వేసవిలో వేసే పిఛ్‌వాయీల్లో గులాబీరంగు తామరల నేపథ్యం ఉంటే, జమావరీ వర్కుతో కూడిన నేపథ్యం శీతాకాలాన్ని సూచిస్తుంది. ఇతర చిత్రాల్లో మాదిరిగా అచ్చంగా కుంచెతోనే దీన్ని వేయలేరు. పెన్‌ లేదా పెన్సిల్‌ స్ట్రోక్‌తోనూ గీయాల్సి ఉంటుంది. అందుకే ఒక్కో పిఛ్‌వాయీకీ నెలల సమయం పడుతుంది. అందువల్లే ఇప్పుడు బ్లాక్‌ ప్రింటింగ్‌తోనూ డిజిటల్‌ ప్రింటింగ్‌ టెక్నాలజీతోనూ పిఛ్‌వాయీ చిత్రాల్ని రూపొందిస్తున్నారు. దాంతో కళాభిమానులతో పాటు కొత్తదనం కోరుకునే వాళ్లంతా సంప్రదాయ పిఛ్‌వాయీ కళాఖండాల్లోని తామరల్నీ కృష్ణుడినీ ఆవుల్నీ నచ్చినట్లుగా డిజైన్‌ చేయించుకుని ప్రింట్స్‌ వేయించుకుంటున్నారు. అలా క్రమంగా పిఛ్‌వాయీ గృహాలంకరణలో భాగమై పోయింది. గృహప్రవేశాలకు అందులోని ఆవుబొమ్మల్నీ పెళ్ళి వేదికలమీద తామరల్నీ నేపథ్యంగా తీసుకుని డిజైన్‌ చేస్తున్నారు. ఫిచ్‌వాయీ కృష్ణుడి మెడలోని తామరల్నే పెళ్లి దండలుగానూ ధరిస్తున్నారు. ఏమయితేనేం... నాలుగు వందల ఏళ్ల నాటి సూక్ష్మచిత్రకళ నేడు అంతటా కళకళలాడుతోంది!


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని