అడుగంటనీయదు

వంట చేయడం ఓ కళ. అడుగంటకుండా, మాడిపోకుండా చేస్తేనే ఏ వంటకానికైనా రుచీ, సువాసనా వస్తాయి. అందుకే ప్రధానంగా వేపుళ్లూ, స్వీట్లూ వంటివి చేసేప్పుడు అడుగంటకుండా గరిటె పట్టుకుని తిప్పుతూనే ఉండాలి.

Updated : 22 May 2022 06:11 IST

అడుగంటనీయదు

వంట చేయడం ఓ కళ. అడుగంటకుండా, మాడిపోకుండా చేస్తేనే ఏ వంటకానికైనా రుచీ, సువాసనా వస్తాయి. అందుకే ప్రధానంగా వేపుళ్లూ, స్వీట్లూ వంటివి చేసేప్పుడు అడుగంటకుండా గరిటె పట్టుకుని తిప్పుతూనే ఉండాలి. ఇందుకు బోలెడంత ఓపికా టైమూ ఉండాలి. అయితే, ఇప్పుడా అవసరం లేదంటున్నారు తయారీదారులు. గరిటెకు బదులుగా ఈ ఆటోమాటిక్‌ స్టిర్రర్‌ని ఆ పాత్రలో ఉంచితే చాలు. దానంతట అదే ఆ పదార్థాన్ని మాడకుండా తిప్పుతుంది. పైగా మూడు దశల్లో వేగాన్ని నియంత్రించుకోవచ్చు. బ్యాటరీల సాయంతో కార్డ్‌లెస్‌ విధానంలో పనిచేస్తుందిది. దీన్ని వాడిన తరువాత కింది భాగాన్ని విడదీసి సులువుగా శుభ్రం చేసుకోవచ్చు కూడా. సమయం వృథానీ, శ్రమనీ తప్పించే ఈ పరికరం మన ఇంట్లోనూ ఉంటే బాగుండనిపిస్తోంది కదూ!


డబ్బులు మింగే అల్లరి కోతి!

పిల్లలు సులువుగా ఏం నేర్చుకోవాలన్నా... ఆకట్టుకునేలా చెప్పగలగాలి. ముఖ్యంగా పొదుపు చేయడం నేర్పాలంటే...వారికిచ్చే కిడ్డీ బ్యాంకుల్లో కొత్తదనం ఉండాలి. అప్పుడే చిన్నారులు దానిపైన మనసు పెట్టగలరు. అలాంటి కిడ్డీ బ్యాంకే ఈ ‘క్యూట్‌ ఫేస్‌ మనీ బాక్స్‌’. అల్లరి కోతి ముఖాన్ని గుర్తు తెచ్చేలా డిజైన్‌ చేసిన ఈ డిబ్బీ నోట్లో ఓ రూపాయి బిళ్ల వేస్తే చాలు... అచ్చం ఆహారాన్ని మింగినట్లే నోరు కదిలిస్తూ లోపలికి లాక్కుంటుంది. ఇదంతా బుజ్జాయిలకు భలే సరదాగా అనిపిస్తూ మళ్లీ మళ్లీ దాన్ని ఉపయోగించడానికి ఆసక్తి చూపిస్తారు. పొదుపునీ అలవాటు చేసుకుంటారు.


ఈ ట్యాబ్లెట్‌... ఓ టేబుల్‌..!

జీవనశైలి మార్పులూ, మారుతోన్న అవసరాలూ చాలామందికి కారుని అవసరంగా మార్చేశాయి. ఆఫీసుకే వెళ్లాల్సివచ్చినా, దూర ప్రయాణాలు చేయాల్సి వచ్చినా కొన్నిసార్లు కారులో కూర్చునే తినాల్సి వస్తుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఈ పరిస్థితి అసలే తప్పకపోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో బాక్సులూ, బాటిళ్లూ... ఒళ్లో పెట్టుకునో, చేతుల్లో ఉంచుకునో తినడం ఇబ్బంది. దీనికి పరిష్కారమే ఈ ‘ఫుడ్‌ కప్‌ ట్యాబ్లెట్‌ ట్రే’. దీన్ని ముందు సీటుకి వెనుక భాగంలో బిగించుకుంటే చాలు. అన్నింటినీ దానిమీద పెట్టేయొచ్చు. పాలు వంటి ద్రవ పదార్థాలు ఒలికి కింద పడిపోకుండా బెల్ట్‌ పెట్టొచ్చు. అవసరం లేదనుకున్నప్పుడు ఈ ట్రేని మడత పెట్టేయొచ్చు కూడా. బాగుంది కదా!


వేయించేద్దాం సులువుగా...

మిరపకాయ బజ్జీలూ, పునుగులూ, పకోడీలు... ఇలా నూనెలో వేయించి తీసే పదార్థాలంటే చాలామందికి ఇష్టం. అయితే అవి నూనె పీల్చుకోకుండా ఉండాలంటే జాలీలో వేయడమో లేదా గిన్నెలో టిష్యూ పేపర్‌ వేసి అందులో ఉంచడమో చేస్తుంటాం. ఈసారి అంత కష్టపడక్కర్లేకుండా మీ బాణలికి ఈ ఫ్రై డ్రెయిన్‌ ర్యాక్‌ని ఏర్పాటు చేయండి. పాన్‌కి ఒకవైపు అమరిపోయి ఉండటం వల్ల-వేయించిన వాటిని తీసి ఈ గ్రిల్‌ మీద పెట్టుకోవచ్చు. అప్పుడు వాటిల్లో ఎక్కువగా ఉన్న నూనె బాణలిలోకి పడుతుంది. పనీ సులువవుతుంది.


వంటింట్లో పాలరాతి సోయగం!

తాజ్‌మహల్‌ అందాన్ని చూసినవాళ్లకి ఆ గొప్పతనం పాలరాయిదా... దాన్ని చెక్కినవాళ్లదా అన్నది తేల్చుకోవడం కాస్త కష్టమే. అవును మరి... చల్లదనాన్ని పంచే తెల్లదనం పాలరాయి సొత్తయితే, దాన్ని అద్భుతంగా మలిచిన పనితనం ఆ శిల్పులది. అందుకేనేమో నాటి నుంచి నేటివరకూ ఆ పాలరాయిని పటిష్టమైన కట్టడాలతోపాటు ఇంటీరియర్‌ డిజైనింగ్‌లోనూ వాడుతున్నారు. కొత్తగా కిచెన్‌ యాక్సెసరీల్నీ పాలరాతితోనే రూపొందిస్తూ ఆధునికుల్ని ఆకర్షిస్తున్నారు తయారీదారులు.

తెల్లగా అందంగా ఉన్న అమ్మాయిని చూడగానే బొమ్మలా ఎంత బాగుందో అంటారు. అందుకే అందానికి ప్రతి రూపంగా భావించే పాలరాతితో పూర్వం కట్టడాలూ శిల్పాలూ చెక్కేవారు. ఆ తరవాత ఫ్లోరింగ్‌కీ గోడల డిజైనింగ్‌కీ కూడా పాలరాతిని వాడేవారు. అంతేనా... ఆ రాతిమీద మనసుపడ్డ పర్యావరణ ప్రేమికులూ సంపన్నులూ సోఫాలూ బెడ్‌లూ డైనింగ్‌ టేబుల్‌... వంటివీ  చేయించుకుంటున్నారు. ఇప్పుడు వంటింటి వస్తువుల్నీ మార్బుల్‌తోనే మెరిపిస్తున్నారు.


నిజానికి ఒకప్పుడు ఇల్లంతా పాలరాతిని పరిచినా- శుభ్రం చేసుకోవడం తేలిక అని వంటింట్లో మాత్రం టైల్స్‌ లేదా గ్రానైట్‌నే ఇష్టపడేవారు. కానీ ఈమధ్య కొందరు తమ ఇల్లు అందంగానే కాదు, చూడగానే ఎలిగెంట్‌గా అనిపించేందుకన్నట్టు వంటింటి కౌంటర్‌ టాప్స్‌ నుంచి స్టవ్‌ వెనకభాగంలో వేసే టైల్స్‌ వరకూ అంతా పాలరాతినే వాడుతున్నారు. ఈ రాయిలో తెలుపూ గులాబీ ఆకుపచ్చా నలుపూ ... ఇలా రంగులూ ఉండటంతో తమ కిచెన్‌కు మ్యాచయ్యే రంగుని వేయించుకుంటున్నారు. అయితే పాలరాయి మరకలు పడుతుంది. అందుకే ఎంత మోజు ఉన్నా దాన్ని వాడేందుకు వెనుకాడేవారు. కానీ నాణ్యమైన సీలర్లు వాడి కొత్త టెక్నాలజీతో నున్నగా పాలిష్‌ చేస్తున్నారు కాబట్టి పెద్దగా మరకలు పడటం లేదట. ఒకవేళ పడినా హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ కొన్ని చుక్కల అమ్మోనియా కలిపి మరకలమీద రుద్దితే త్వరగా పోతుంది. ఆ కారణంతోనే ఇప్పుడు మార్బుల్‌ కౌంటర్‌ టాప్‌లతోపాటు కిచెన్‌లో వాడుకునే స్టాండులూ, స్పూన్లూ గరిటెలూ పెట్టుకునేవీ, పండ్లు పెట్టుకునే ట్రేలూ, బ్రెడ్‌ బాక్సులూ, కోస్టర్లూ, సోప్‌ డిస్పెన్సర్లూ... ఇలా అనేక వస్తువుల్ని పాలరాతితోనే చెక్కేస్తున్నారు.  బిఅండ్‌ఎమ్‌ అనే కంపెనీ అయితే కెటిల్‌, టోస్టర్‌ ఓవెన్‌లకు సైతం మార్బుల్‌ అందాల్ని అద్దేసింది. ఉప్పూ పప్పూ నిల్వ చేసుకునేందుకు వీలుగా పాలరాతి డబ్బాలూ వస్తున్నాయి. ఇవి ఎంతకాలం ఉన్నా చెక్కు చెదరవు. పైగా పాలరాయిది సహజమైన మెరుపు. లైటు పడితే మరింతగా ప్రకాశిస్తుంది. సో, ఈ మార్బుల్‌ యాక్సెసరీలతో కిచెన్‌కి కొత్త లుక్‌ రావడం ఖాయం. అదీగాక సామాన్ల్లు ఎప్పుడూ ఒకేలా ఉంటే కొందరికి బోర్‌ కొడుతుంది. అందుకే తరచూ మేకోవర్‌ చేస్తుంటారు. అలాంటివాళ్లకి మార్బుల్‌ కిచెన్‌ యాక్సెసరీలు చూడచక్కని ప్రత్యామ్నాయం మరి!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..