Published : 15 May 2022 00:59 IST

మితాహారమే మేలు!

పూర్వం అడవుల్లో తపస్సు చేసుకునే మునులు మితాహారం తీసుకోవడం వల్లే ఎక్కువకాలం జీవించేవారని అంటుంటారు. అది శాస్త్రీయంగా ఎంత నిజమో తెలియదు కానీ, తక్కువ క్యాలరీల ఆహారాన్ని నియమిత సమయంలో తింటే ఎక్కువకాలం జీవిస్తారని హొవార్డ్‌ హ్యూజెస్‌ మెడికల్‌ ఇన్‌స్టిట్యూట్‌కి చెందిన పరిశోధకులు చెబుతున్నారు. పగటిపూట మనం చురుకుగా ఉండే సమయంలో- అదీ తగు మోతాదులో ఆహారం తీసుకుంటే దీర్ఘకాలం జీవించవచ్చు అంటున్నారు. ఈ విషయం ఎలుకల్లో చేసిన పరిశోధనలో స్పష్టమైందట. అవి రాత్రిపూట చురుకుగా ఉంటాయి కాబట్టి వాటికి ఆ వేళలోనే ఆహారాన్ని అదీ కొద్దిగా ఇవ్వడం వల్ల వాటి ఆయుఃప్రమాణం
35 శాతం పెరిగిందట. తక్కువ ఆహారం వల్ల- వయసుతోపాటు పెరిగే ఇన్‌ఫ్లమేషన్‌ వాటిల్లో తగ్గడం వల్లే వాటి ఆయుష్షు పెరిగినట్లు గుర్తించారు. దీన్నిబట్టి మనుషులకీ ఇదే వర్తించవచ్చు అంటున్నారు సదరు పరిశోధకులు.


మూత్ర పరీక్ష లేకుండా...

మూత్రపిండ వ్యాధులతోపాటు ఇతరత్రా అనారోగ్య సమస్యల్ని గుర్తించేందుకు యూరిన్‌ పరీక్ష చేయడం తెలిసిందే. అయితే మంచంమీద ఉండి డైపర్లు వాడుతున్న ముసలివాళ్లకీ పసివాళ్లకీ సంప్రదాయ యూరిన్‌ టెస్ట్‌ చేయాల్సిన అవసరం లేదట. అదెలా అంటే- వాళ్ల నుంచి మూత్రాన్ని సేకరించి, పరీక్షించి ఫలితం కోసం రోజంతా ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా వాళ్లకు వేసే డైపర్ల ద్వారానే ఆ విషయాన్ని తెలుసుకోవచ్చు అంటున్నారు చైనాలోని సన్‌-యాట్‌-సెన్‌ యూనివర్సిటీకి చెందిన నిపుణులు. ఇప్పటికే స్వేదంలోని ఎలక్ట్రోలైట్ల ద్వారా చక్కెర శాతాన్ని తెలుసుకునే బ్యాండేజీల్ని రూపొందించారు. అదేమాదిరిగా డైపర్లలో అమర్చిన ఎలక్ట్రోడ్‌లు యూరిన్‌లోని పొటాషియం. సోడియం, హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌, యూరిక్‌ ఆమ్లం, గ్లూకోజ్‌ శాతాన్ని గుర్తించి బ్లూటూత్‌ టెక్నాలజీ ద్వారా ప్రత్యేకంగా అమర్చిన పరికరానికి పంపిస్తుంది. దాంతో అప్పటికప్పుడే రీడింగ్‌ తెలిసిపోతుంది అంటున్నారు.


మాస్క్‌లతో సిమెంట్‌!

వాడిపారేసిన సర్జికల్‌ మాస్క్‌ల్ని ఏం చేయాలా అని ఆలోచిస్తున్న శాస్త్ర ప్రపంచానికి చక్కని మార్గం దొరికింది. ఆ మాస్క్‌ల్ని  పీచుగా మార్చి కాంక్రీటులో కలిపితే అది మరింత దృఢంగా ఉంటుందని వాష్టింగ్టన్‌ స్టేట్‌ యూనివర్సిటీ పరిశోధకులు కనుగొన్నారు. మాస్క్‌లోని పాలీప్రొపిలీన్‌ పదార్థాన్ని 5 నుంచి 30 మి.మీ. రేణువులుగా చేసి గ్రాఫీన్‌ ఆక్సైడ్‌ ద్రావణంలో ముంచి తీశారట. దాంతో ఆ రేణువులమీద ఒకలాంటి పూతలా ఏర్పడటంతో అది సిమెంట్‌తో గట్టి బంధాన్ని ఏర్పరచుకుందట. ఈ రకమైన సిమెంట్‌తో చేసిన గోడల్ని ఓ నెల తరవాత పరీక్షించగా మామాలు సిమెంట్‌కన్నా ఇది 47 శాతం పటిష్టంగా ఉన్నట్లు గుర్తించారు. కేవలం గోడలనే కాదు, ఆస్ట్రేలియాలోని ఆర్‌ఎమ్‌ఐటి యూనివర్సిటీ నిపుణులు కూడా మాస్క్‌లను పొడి చేసి తారు రోడ్ల నిర్మాణంలో వాడితే అవి ఎంతో దృఢత్వాన్ని కలిగి ఉన్నట్లు గుర్తించారు. కాబట్టి వాడిపారేసిన సర్జికల్‌ మాస్క్‌లన్నింటినీ ఇలా వాడుకోవచ్చన్నమాట.


మతిమరపునకు మందు!

సాధారణంగా అంతో ఇంతో మతిమరుపు అందరికీ ఉంటుంది. కానీ కొంతమంది నడివయసులోనే దీని బారిన పడి తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీన్నే బిహేవియరల్‌ ఫ్రాంటొ టెంపొరల్‌ డిమెన్షియా అంటున్నారు. ముఖ్యంగా ఈ రకమైన మతిమరపు వల్ల వాళ్ల ప్రవర్తన పూర్తిగా మారిపోవడమే కాదు, దానివల్ల రోగి మరణానికి చేరువ అవుతుంటాడట కూడా. సాధారణంగా ఈ రకమైన వ్యాధికి 35 సంవత్సరాల వయసులోనే బీజం పడుతుందట. మెదడులో సోడియం సెలెనైట్‌ అన్న పదార్థం తగ్గిపోవడంతో టిఏయూ అనే ప్రొటీన్‌ పేరుకుపోవడమే ఇందుకు కారణమని గుర్తించారు. దాంతో మెదడు కుంచించుకుపోయి ఆలోచనాశక్తి తగ్గిపోతుంది. ఇదే వృద్ధాప్యంలో తలెత్తే ఆల్జీమర్స్‌కీ కారణమవుతుందట. దీనికి ఇంతకాలం ప్రత్యేకంగా చికిత్స లేదనే భావించారు. అయితే మోనాష్‌ యూనివర్సిటీ పరిశోధకులు సోడియం సెలెనైట్‌ అనే ఎంజైమ్‌ను ఇంజెక్టు చేసినప్పుడు టీఏయూ ప్రొటీన్‌ శాతం తగ్గడమే కాదు, ఆశ్చర్యకరంగా నాడీకణాల క్షీణత శాతం కూడా తగ్గిందట. దాంతో ఈ ఎంజైమ్‌ను అధిక శాతంలో ఇవ్వడంవల్ల మతిమరపు ప్రభావం క్రమేణా తగ్గుతున్నట్లు గుర్తించారు. సో, దీంతో ఆల్జీమర్స్‌కీ చికిత్స దొరికినట్లే అని భావిస్తున్నారు సదరు నిపుణులు.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


ఇంకా..

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని