Published : 09 Oct 2022 00:16 IST

న్యుమోనియాని తగ్గించే రోబోలు!

కొవిడ్‌ తరవాత న్యుమోనియా మరణాల సంఖ్య పెరుగుతోంది. ఎందుకంటే- ఊపిరితిత్తుల్లోని ఇన్ఫెక్షన్‌ను తగ్గించే మందును ఇవ్వడం వైద్య నిపుణులకు కష్టతరంగా మారింది. అందుకే ఈ వ్యాధికి సరైన చికిత్స కోసం- శాన్‌ డీగోలోని కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఆల్గే కణాలతో మైక్రోస్కోపిక్‌ రోబోలను రూపొం దించారు. వీటినే మైక్రోబోట్స్‌గా పిలుస్తున్నారు. ఇవి ఊపిరితిత్తుల చుట్టూ తిరుగుతూ వాటిల్లో నింపిన యాంటీబయోటిక్స్‌ను కొద్దికొద్దిగా విడుదల చేస్తూ ఇన్ఫెక్షన్‌ను నూటికి నూరుశాతం తగ్గించాయట. దాంతో సంప్రదాయ పద్ధతిలో చేసేదానికన్నా ఈ కొత్త చికిత్స ఎంతో మేలు అంటున్నారు. అదెలా అంటే- ఊపిరితిత్తుల్లోని ఇన్ఫెక్షన్‌ను తగ్గించేందుకు ఇంజెక్షన్‌ రూపంలో ఇచ్చే మందుతో పోలిస్తే - ఈ సరికొత్త మైక్రోబోట్స్‌లో వాడే మందు శాతం చాలా తక్కువ. పైగా ఇందులోని మందు మొత్తం నేరుగా ఊపిరితిత్తుల్లో పేరుకున్న వైరస్‌ లేదా బ్యాక్టీరియా మీద దాడి చేస్తుంది. అదే ఇంజెక్షన్‌ రూపంలో యాంటీబయోటిక్స్‌ను ఎంత ఎక్కువ ఇచ్చినా అందులో కొద్ది శాతం మాత్రమే ఊపిరితిత్తులకి చేరుతుంది. అందువల్లే రోగులు కోలుకోవడం కష్టంగా ఉందనీ, కాబట్టి ఈ కొత్త చికిత్స ఆశావహంగా ఉందనీ అంటున్నారు.


పొట్టలోని పాపాయికీ రుచులు తెలుసు!

గర్భస్థ శిశువులకి వాసనలూ రుచులూ తెలుస్తాయని ఆస్టన్‌ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు పేర్కొంటున్నారు. 32 నుంచి 36 వారాల్లోపు ఉన్న వంద మంది గర్భిణులను ఎంపిక చేసి వాళ్లకు రకరకాల ఆహారపదార్థాలను పెట్టి శాస్త్రవేత్తలు 4డి అల్ట్రాసౌండ్‌ స్కాన్‌లో పరిశీలించినప్పుడు - గర్భంలోని శిశువులు ఆయా రుచులకి స్పందించారట. ఇందుకోసం వాళ్లకు ఓ గంటపాటు ఆహారం ఇవ్వకుండా, స్కాన్‌ చేసే సమయంలో మాత్రం క్యారెట్‌, కేల్‌ రసాల్ని క్యాప్యూల్స్‌ రూపంలో ఇచ్చారట. క్యారెట్‌ పెట్టినప్పుడు వాళ్ల ముఖకవళికలు నవ్వుతున్నట్లుగానూ, కేల్‌ ఇచ్చినప్పుడు ఏడుపు ముఖం పెట్టినట్లూ గుర్తించారట. దీని ఆధారంగా రుచీ వాసనలకు సంబంధించిన నాడీ రిసెప్టర్లు పొట్టలో ఉన్నప్పుడే అభివృద్ధి చెందుతాయని తెలుస్తోంది. సాధారణంగా మనిషి రుచినీ వాసననీ కలిపి ఆఘ్రాణిస్తాడు. అయితే ఈ ఆఘ్రాణశక్తి అనేది పిండదశలోనే తెలుస్తుందనీ, కాబట్టి గర్భిణులు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తింటే- పొట్టలోని శిశువుకీ అదే అలవాటై ఇష్టంగా మారుతుందనేది నిపుణుల విశ్లేషణ.


అతిపెద్ద చెట్టు!

ప్రపంచంలోకెల్లా అతిపెద్ద చెట్టు ప్రమాదంలో పడింది అంటున్నారు వుటా స్టేట్‌ యూనివర్సిటీ నిపుణులు. ఫిష్‌లేక్‌ నేషనల్‌ ఫారెస్ట్‌లో భాగంగా వంద ఎకరాల్లో ఉన్న పాండో... ఓ ప్రత్యేకమైన ఉద్యానవనం. అక్కడ యాస్పెన్‌ జాతికి చెందిన సుమారు 50 వేల చెట్లు కనిపిస్తాయి. అయితే చూడ్డానికి వేర్వేరు చెట్లలా కనిపించే అవన్నీ ఒకే వేరు నుంచి ఏర్పడిన కాండం లేదా కొమ్మలని గతంలోనే శాస్త్ర నిపుణులు నిర్థరించారు. అందుకే దీన్ని అతి పెద్ద చెట్టుగా పేర్కొంటారు. సాధారణంగా అక్కడ ఉన్న ఒక్కో చెట్టూ(కాండం) కనీసం వందేళ్లు జీవిస్తుంది. వాటన్నింటికీ మూలమైన వేరు వ్యవస్థ మాత్రం లక్ష నుంచి పది లక్షల సంవత్సరాల నాటిదై ఉండొచ్చు అని భావిస్తున్నారు. అయితే ఇటీవల అక్కడి పర్యావరణ వ్యవస్థని మనుషులూ జంతువులూ కలిసి దెబ్బతీయడంతో ఆ చెట్లు వందేళ్ల కన్నా ముందే చనిపోతున్నాయట. మళ్లీ కొత్త పిలకలు వచ్చినా ఎక్కువ కాలం జీవించడం లేదు. అక్కడ నివసించే తోడేళ్లనీ ఎలుగుబంటుల్నీ వేటాడటంతో జింకలూ పశువుల జనాభా ఇబ్బడిముబ్బడిగా పెరగడమే ఇందుకు కారణమనీ, అందుకే జీవావరణ వ్యవస్థలో- వన్యప్రాణుల్ని వేటాడితే నష్టం మరో రూపంలో ఎదుర్కోవాల్సి ఉంటుందనీ హెచ్చరిస్తున్నారు సదరు పరిశోధకులు.


ఉపవాసం మంచిదేగా!

ఉపవాసం చేయడం ఆరోగ్యానికి మంచిదని తెలిసిందే. అయినప్పటికీ కొంతమంది ఆకలికి ఆగలేరు. అందుకే పూజలూ వ్రతాల సమయంలో క్యాలరీలు తక్కువా, నీటి శాతం ఎక్కువా ఉండే జావల్నీ పండ్లనీ తీసుకోమని చెబుతారు. దాంతో ఉపవాసమూ చేసినట్లవుతుంది. ఆకలీ తీరుతుంది. అయితే ఈ రకమైన ఉపవాసాలు నిజంగానే ఆరోగ్యానికి మేలు చేస్తాయని సశాస్త్రీయంగా పేర్కొంటున్నారు సదరన్‌ కాలిఫోర్నియా యూనివర్సిటీ నిపుణులు. నెలకి రెండు విడతలుగా వారం నుంచి పది రోజులపాటు ఉపవాసం చేస్తే వృద్ధాప్యంలో ఆల్జీమర్స్‌ వచ్చే ప్రమాదం తగ్గుతుందట. మితాహారంతో కూడిన ఉపవాసం వల్ల మెదడు కణాల్లో ఇన్‌ఫ్లమేషన్‌ శాతం తగ్గినట్లు ఎలుకలపై చేసిన పరిశీలనలో స్పష్టమైంది. అంతేకాదు, దీనివల్ల మూలకణాల ఉత్పత్తి పెరిగిందనీ తద్వారా క్యాన్సర్‌, మధుమేహం, హృద్రోగాలు, వయసుతోపాటు వచ్చే ఇతరత్రా సమస్యలు తగ్గుతున్నాయనీ కూడా గుర్తించారు. ఒకటీ రెండు నెలలు కాకుండా ఇలా  ఏడాదిపాటు చేయడంవల్ల- ఎలుకల్లో ఆక్సీకరణ ఒత్తిడి కారణంగా మెదడు కణాలు దెబ్బతినడం చాలావరకూ తగ్గినట్లు గుర్తించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు