నిద్రపట్టకపోతే...

వయసు పెరిగేకొద్దీ నిద్రపోయే సమయం తగ్గిపోవడం, మాటిమాటికీ మెలకువ వచ్చేయడం సహజం. అయితే ఇటీవల చిన్నవయసు వాళ్లకీ ఇది ఓ సమస్యగానే మారింది. అందుకే హాయిగా నిద్రపోయే మార్గాలకోసం నిరంతరం శోధిస్తూనే ఉంది శాస్త్రబృందం.

Published : 24 Apr 2022 01:12 IST

నిద్రపట్టకపోతే...

యసు పెరిగేకొద్దీ నిద్రపోయే సమయం తగ్గిపోవడం, మాటిమాటికీ మెలకువ వచ్చేయడం సహజం. అయితే ఇటీవల చిన్నవయసు వాళ్లకీ ఇది ఓ సమస్యగానే మారింది. అందుకే హాయిగా నిద్రపోయే మార్గాలకోసం నిరంతరం శోధిస్తూనే ఉంది శాస్త్రబృందం. అందులో భాగంగా జ్యురిచ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌కి చెందిన నిపుణులు స్లీప్‌లూప్‌ అనే ఓ ప్రత్యేక పరికరాన్ని రూపొందించారు. హెడ్‌ఫోన్స్‌ మాదిరిగా ఉండే దీన్నుంచి గాఢనిద్రకి కారణమయ్యే మెదడు తరంగాల్ని ప్రేరేపించేలా కొన్ని శబ్దాలు విడుదలవుతాయి. తలని పట్టి ఉన్న బ్యాండ్‌లోని ఎలక్ట్రోడ్‌లూ మైక్రోచిప్‌ నిరంతరం మెదడులోని ఎలక్ట్రికల్‌ సంకేతాలను గమనిస్తుంటాయి. నిద్రకి కారణమయ్యే తరంగాల్ని పసిగట్టగానే  స్లీప్‌లూప్‌ చిన్నగా శబ్దం చేస్తూ ఆ మెదడు తరంగాలు మరింత ఎక్కువయ్యేలా చేస్తుంది. ఆ శబ్దం సంబంధిత వ్యక్తికి వినిపించదట. ఈ విషయంకోసం ఓ పన్నెండుమందికి ఈ స్లీప్‌లూప్‌ పెట్టి నాలుగువారాలపాటు ఉంచగా ఇది వాళ్లు మరింత గాఢంగా ఎక్కువసేపు నిద్రపోయేలా చేయగలిగిందట. అయితే నిద్రరాని సమయంలో కూడా ఇది పనిచేసేలా దీన్ని డిజైన్‌ చేయాలని చూస్తున్నారు. అప్పుడు దీన్ని పెట్టుకుని మెలకువ రాకుండా గాఢంగా నిద్రపోవచ్చన్నమాట.


కొవిడ్‌ వచ్చి తగ్గాక..!

కొవిడ్‌ కేసులు తగ్గిపోయినా దాని పరిణామాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి అంటున్నారు స్వీడన్‌కు చెందిన ఉమియా యూనివర్సిటీ పరిశోధకులు. ఎందుకంటే- ఇన్ఫెక్షన్‌ వచ్చి తగ్గిన కొన్ని నెలలకి అనేకమంది రక్తం గడ్డకట్టే సమస్యలతో సతమతమవుతున్నారట. అదీ గుండెకు రక్తాన్ని సరఫరా చేసే నాళాల్లోనూ శ్వాస నాళాల్లోనూ ఈ సమస్య ఎక్కువగా ఉంటుందట. అందువల్లే స్ట్రోక్‌, గుండెజబ్బులు, శ్వాసకోశ సమస్యలకు లోనవుతున్నారనీ, కాబట్టి వీళ్లు తరచూ పరీక్షలు చేయించుకుంటూ ఉండాలని సూచిస్తున్నారు. అంతేకాదు, వ్యాక్సినేషన్‌ తీసుకున్నాక వచ్చిన ఒమిక్రాన్‌ వేరియంట్‌ వల్ల కొవిడ్‌ లక్షణాలు స్వల్పంగానే ఉన్నప్పటికీ రక్తం గడ్డకట్టే సమస్యలు వాళ్లలోనూ ఉంటున్నట్లు గుర్తించారు. ముఖ్యంగా వృద్ధుల్లో ఇది మరీ ఎక్కువగా ఉందట. కాబట్టి ఏ కాస్త తేడాగా అనిపించినా అలసత్వం వద్దు అని హెచ్చరిస్తున్నారు.


రక్తదానం చేస్తే...

క్తదానం చేస్తే ఆరోగ్యానికి ఏ రకంగా మంచిదనే విషయాన్ని ఆస్ట్రేలియాలోని మ్యాక్వారీ యూనివర్సిటీ నిపుణులు నిశితంగా పరిశీలించారట. రక్తం లేదా ప్లాస్మాను దానం చేయడంవల్ల రక్తంలోని పెర్‌ఫ్లోరో ఆల్కైల్‌, పాలీఫ్లోరో ఆల్కైల్‌(పిఎఫ్‌ఏ) అనే రసాయన పదార్థాలు తగ్గుతున్నట్లు గుర్తించారు. వీటినే ఫరెవర్‌ కెమికల్స్‌ అంటారు. ఇవి రోజువారీ వాడే క్లీనింగ్‌లోషన్లూ నాన్‌స్టిక్‌ కుక్‌వేర్‌... ఇలా అన్నింట్లోనూ ఉంటాయి. వీటివల్ల ఊబకాయం, థైరాయిడ్‌... ఇలా అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. మనిషి శరీరం ఇప్పటికే ఫరెవర్‌ కెమికల్స్‌తో నిండిపోయిందనీ వాటిని ఎలా నాశనం చేయాలో తెలియడం లేదనీ తలపట్టుకుంటున్నారు పరిశోధకులు. అందులోభాగంగానే- రక్తంలో పెర్‌ఫ్లోరోఆక్టేన్‌ సల్ఫొనేట్‌లు ఎక్కువగా ఉన్నవాళ్లని గుర్తించి వాళ్లని మూడు వర్గాలుగా విభజించారట. ఒక వర్గం ఏడాదికి ఆరుసార్లు ప్లాస్మానీ మరో వర్గం ఏడాదికి పన్నెండుసార్లు రక్తాన్నీ దానం చేసేలా చూశారట. మూడో గ్రూపుతో ఏమీ చేయించలేదు. ఏడాది తరవాత మూడు గ్రూపుల్నీ పరిశీలించగా- మొదటి రెండు వర్గాల్లోనూ పిఎఫ్‌ఏల శాతం తగ్గిందట. రక్తదానం చేసినవాళ్లకన్నా ప్లాస్మా ఇచ్చినవాళ్లలో అత్యధికంగా 30 శాతం తగ్గాయట. దీన్నిబట్టి రక్తం లేదా ప్లాస్మా దానం చేసేవాళ్లలో ఈ రసాయనాల శాతం తగ్గుతుందని విశ్లేషిస్తున్నారు సదరు పరిశోధకులు.


లేజర్‌ కాంతితో ఊబకాయానికి చికిత్స!

రువు పెరిగిపోవడం... ప్రపంచవ్యాప్తంగా అత్యధికులు ఎదుర్కొంటోన్న సమస్య. దీనికి వ్యాయామం చేయడం, తక్కువ తినడం లేదంటే బేరియాట్రిక్‌ సర్జరీలు చేయించుకోవడం తప్ప మరో మార్గం కనిపించడం లేదు. అందుకే ఎలాంటి శస్త్రచికిత్సలూ లేకుండా ఆకలిని తగ్గించడం ద్వారా బరువును నియంత్రించగలిగే ఓ కొత్త పరికరాన్ని కనుగొన్నారు కొరియాలోని క్యాథలిక్‌ యూనివర్సిటీ పరిశోధకులు. మన శరీరంలోని మెదడు, క్లోమం, చిన్నపేగుల నుంచి విడుదలయ్యే గెరెలిన్‌ అనే హార్మోన్‌ ఆకలిని పెంచడం ద్వారా కొవ్వు పేరుకోవడానికి కారణమవుతుంటుంది. అందుకే దాన్ని నియంత్రించే ఇంట్రాగ్యాస్ట్రిక్‌ సెటైటీ ఇండ్యూసింగ్‌ డివైస్‌ అనే పరికరాన్ని కనుగొన్నారు. అడుగుభాగంలో మిథిలీన్‌ బ్లూ అనే ఒక రకమైన పదార్థాన్ని పూసిన ఆప్టిక్‌ ఫైబర్‌తో కూడిన ఈ పరికరాన్ని గొంతు ద్వారా పొట్టలోకి పంపిస్తారు. లోపలకు వెళ్లాక ఇది కాంతిని వెలువరిస్తూ ఆక్సిజన్‌ అయాన్లను విడుదల చేస్తుంది. ఈ అయాన్లు గెరెలిన్‌ హార్మోన్‌ను విడుదల చేసే కణాలను నాశనం చేశాయట. ఇలా వారం రోజులపాటు పంది పిల్లల్లో చేయగా గెరెలిన్‌ శాతంతోపాటు అవి బరువూ తగ్గాయట. ఇలా కొన్నివారాలపాటు చేయగా గెరెలిన్‌ హార్మోన్‌ను విడుదల చేసే కణాలు సహజంగానే తగ్గిపోయాయనీ దాంతో ఆకలి తగ్గి క్రమేణా బరువు తగ్గుతారనీ చెబుతున్నారు. త్వరలోనే ఈ రకమైన పరీక్షను మనుషుల్లోనూ చేయాలని యోచిస్తున్నారు. సో, ఇదిగానీ వాడుకలోకి వస్తే- ఊబకాయులకు క్లిష్టమైన శస్త్రచికిత్సలతో పని ఉండదన్నమాట.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..