Published : 19 Nov 2022 23:44 IST

ఈ గాజు... చాలా స్మార్ట్‌ గురూ!

‘లోపల ముఖ్యమైన సమావేశమేదో జరుగుతున్నట్లుంది. గ్లాస్‌ క్యాబిన్‌ కలర్‌ మారిపోయింది. కాసేపు బయట వేచి ఉండటమే మంచిది’ అన్న విషయం అప్పుడే అక్కడకు వచ్చిన వాళ్లకు ఎవరూ చెప్పకుండానే అర్థమైపోతుంది. కేవలం ఆఫీసుల్లోనే కాదు... ఇంటికి పెట్టుకునే గాజు కిటికీల్నీ రిమోట్‌తో స్విచాఫ్‌ చేయడం ద్వారా బయటకు కనిపించకుండా చేసుకోవచ్చు. ఇదంతా స్మార్ట్‌ లేదా స్విచబుల్‌ గ్లాస్‌ గొప్పతనమే మరి..!

ప్రస్తుతం నడుస్తోంది స్మార్ట్‌ యుగం. వాడుకునే ఫోన్‌ నుంచి వేసుకునే దుస్తుల వరకూ అన్నీ స్మార్ట్‌ లుక్‌నే సంతరించుకుంటున్నాయి. ఇంటీరియర్స్‌లోనూ ఆ స్మార్ట్‌నెస్‌ ఉండాల్సిందే కదా మరి. అందుకే ఆధునిక ఇళ్లూ ఆఫీసుల్లో పెట్టుకునే గాజు తలుపులూ కిటికీలూ క్యాబిన్లూ అన్నీ కూడా స్మార్ట్‌గానే తయారవుతున్నాయి. రిమోట్‌ బటన్‌ ఆన్‌ చేయగానే పారదర్శకంగా- అంటే, మామూలు గాజు తలుపుల్లా అన్నీ కనిపించేలా- మారిపోతాయి... స్విచాఫ్‌ చేయగానే అది కాస్తా అపారదర్శకంగా అంటే, తెరలు వేసినట్లుగా ఏమీ కనిపించకుండా- అయిపోతుంది. పైగా అవసరాన్ని బట్టి పూర్తిగా కాకుండా కొంతవరకూ పారదర్శకంగా ఉండేలానూ చేసుకోవచ్చట.

ఒకప్పటితో పోలిస్తే ఈమధ్య కడుతోన్న ఇళ్లూ ఆఫీసుల్లో వెలుతురు కోసం గాజునే ఎక్కువగా వాడుతున్నారు. హాలులో పెట్టించే పార్టిషన్‌ వాల్స్‌కీ పూజాగదులకీ కూడా గాజునే ఇష్టపడుతున్నారు. బాల్కనీలోకి తెరుచుకునే ఫ్రెంచ్‌ విండోస్‌కీ గాజు తప్పనిసరిగా మారింది. ఇక, ఆఫీసులు సరేసరి. క్యాబిన్ల నుంచి తలుపులూ కిటికీలూ అన్నీ గాజుతోనే తయారవుతున్నాయి. సహజ కాంతి ఉద్యోగుల్లో చురుకుదనాన్ని పెంచుతుందన్న కారణంతోనూ, కరెంటు బిల్లుల్ని తగ్గించుకునేందుకూ కొన్నిచోట్ల భారీ భవంతుల్లో కాంక్రీటుకు బదులుగా అద్దాల గోడల్నే నిర్మిస్తున్నారు. అయితే కాంతికోసమో లేదా ప్రకృతిని ఆస్వాదించేందుకో కిటికీలూ తలుపులూ క్యాబిన్లూ పారదర్శకంగా ఉండటం బాగుంటుంది కానీ, కొన్ని సందర్భాల్లో బయటివాళ్లకు కనిపించకుండా ఉండాలంటే మళ్లీ ఏ కర్టెన్లో, బ్లైండ్సో తగిలించాలి. అందుకే వాటితో పనిలేకుండా ఈ ఇంటలిజెంట్‌ లేదా స్విచబుల్‌ గ్లాస్‌ వస్తోందిప్పుడు.

ఎలా పనిచేస్తుంది?

ఎండలోకి వెళ్లగానే ఆటోమేటిగ్గా రంగుమారే ఫొటోక్రోమిక్‌ సన్‌గ్లాసెస్‌లో మాదిరిగానే ఈ స్మార్ట్‌ గ్లాస్‌కోసం కూడా గాజు మీద ప్రత్యేకమైన టెక్నాలజీ ద్వారా పాలిమర్‌ డిస్పర్సడ్‌ లిక్విడ్‌ క్రిస్టల్‌ ఫిల్మ్‌ ఏర్పడేలా చేస్తారు. రిమోట్‌తో స్విచాన్‌ చేయగానే ఆ పొరలోకి విద్యుచ్ఛక్తి ప్రవహించడంతో గాజు పారదర్శకంగా మారుతుంది. అదే స్విచాఫ్‌ చేస్తే- ఆ పూత కనిపిస్తుందన్నమాట. దీన్ని అలెక్సాతోనూ ఆపరేట్‌ చేసుకోవచ్చు. ఈ స్విచబుల్‌ ఫిల్మ్‌ సూర్యకాంతిలోని యూవీ కిరణాలని పూర్తిగానూ కొంతవరకూ పరారుణ కిరణాలనీ కూడా అడ్డుకోవడంతో గదిలోని ఉష్ణోగ్రతా తగ్గుతుంది. అందుకే ఈ స్మార్ట్‌ గ్లాస్‌ని కేవలం ఇళ్లూ ఆఫీసుల్లోనే కాకుండా హోటళ్లూ షాపింగ్‌ మాల్స్‌లోనూ వాడుతున్నారు. ముఖ్యంగా ఆసుపత్రి వార్డుల్లోనూ ఐసీయూల్లోనూ కర్టెన్లకు బదులు ఈ గ్లాస్‌ పార్టిషన్‌ని పెట్టడం వల్ల వైరస్‌, బ్యాక్టీరియాల వ్యాప్తి తగ్గడంతోపాటు పేషెంట్లకు కావాల్సిన ప్రైవసీ దొరుకుతుంది. ఇక, ఇళ్లలోనూ ఆఫీసుల్లోనూ గదులు కట్టించడంకన్నా ఈ స్మార్ట్‌ గ్లాస్‌తో క్యాబిన్లను ఏర్పాటుచేసుకోవడం వల్ల విశాలంగానూ కనిపిస్తాయి అన్నది ఇంటీరియర్‌ డిజైనర్ల అభిప్రాయం కూడా. సో, ఈ గాజు నిజంగానే స్మార్ట్‌ కదూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని