వార్డ్‌రోబ్‌ బహుమతిగా...

సీమంతం, బారసాల వంటి వేడుకలకుగానీ, పసిపాపను చూడటానికిగానీ వెళుతున్నప్పుడు బుజ్జాయికి బట్టలో, బొమ్మలో కొంటుంటారు. కొందరేమో రొటీన్‌గా అవేకాకుండా మరేవైనా ఇస్తే బాగుంటుందని భిన్నంగా

Published : 08 May 2022 01:14 IST

వార్డ్‌రోబ్‌ బహుమతిగా...

సీమంతం, బారసాల వంటి వేడుకలకుగానీ, పసిపాపను చూడటానికిగానీ వెళుతున్నప్పుడు బుజ్జాయికి బట్టలో, బొమ్మలో కొంటుంటారు. కొందరేమో రొటీన్‌గా అవేకాకుండా మరేవైనా ఇస్తే బాగుంటుందని భిన్నంగా ఆలోచిస్తుంటారు. అలాంటి వారు పిల్లల బట్టలూ, టవళ్లూ, సాక్సులూ, గ్లవుజులూ, డైపర్లూ, టెడ్డీబేర్లూ తదితరాలతో చక్కగా సర్దిన వార్డ్‌రోబ్‌ను ఎంచుకోవచ్చు. ఈ వార్డ్‌రోబ్‌ను ఎక్కడ ఉంచైనా వాడుకోవచ్చు. దీనికొచ్చే చెక్క బాస్కెట్‌లో పిల్లలకు రోజూ వాడే డైపర్లూ సాక్సుల వంటివీ లేదంటే వారికి వేసే మందులూ పాలపొడీ వంటివి పెట్టుకోవచ్చు. హ్యాంగర్లకు రోజువారీ దుస్తులు తగిలించుకోవచ్చు. తల్లులకీ ఇలాంటివి చాలా సౌకర్యంగా ఉంటాయి. చూడ్డానికి కూడా బాగుండే ఈ వార్డ్‌రోబ్‌ బుజ్జాయిలకి ఓ చక్కని బహుమతిగా ఉండిపోతుంది.


డబ్బాలకు స్టిక్కర్లు

కందిపప్పూ, మినప్పప్పూ, పెసరపప్పూ, ఇడ్లీ రవ్వా, బొంబాయి రవ్వా వంటి వాటిని సాధారణంగా స్టీలు డబ్బాల్లోనే పెడుతుంటాం. అవి నిత్యం తీసేవే అయినా ఒక్కోసారి ఏ డబ్బాలో ఏం పెట్టామో మర్చిపోతుంటాం. కొన్ని సార్లు ప్రతి డబ్బా తీసి చూసుకోవాల్సి వస్తుంది. అదే వాటిని గాజు సీసాల్లో నింపి పెడితే బాగానే ఉంటుంది కానీ పొరబాటున చేయి జారితే కింద పడి పగిలిపోతుంటాయి. అలాకాకుండా ఏ డబ్బాలో ఏముందో వెతక్కుండా ఇట్టే తెలిసిపోవాలంటే ఈ వాటర్‌ప్రూఫ్‌ లేబుల్‌ స్టిక్కర్లను అంటించేస్తే సరిపోతుంది. డబ్బాలో ఏముందో ఈ స్టిక్కర్ల మీద మార్కర్‌ లేదంటే చాక్‌పీస్‌తో రాసేస్తే వెతక్కుండానే తెలిసిపోతుంది. ఇలా చేయడం వల్ల సమయం కూడా వృథా కాదు. ఇక ఈ స్టిక్కర్లు వాటర్‌ప్రూఫ్‌ కాబట్టి స్టీలు డబ్బాల్ని తోమినా ఊడిపోకుండా ఉంటాయి. రాసింది చెరిగిపోతే మళ్లీ రాసేయొచ్చు. ఈ-కామర్స్‌ సైట్లలో రోల్స్‌, షీట్స్‌ మాదిరి దొరికే ఈ స్టిక్కర్ల ధర కూడా తక్కువే.


బిస్కెట్లు డిజైన్‌తో...

పిల్లలు బయటి తిండిని ఇష్టపడినంతగా ఇంట్లో వండినవి తిననే తినరు. వాటిని వారిచేత తినిపించడం ఓ ప్రహసనం. అందుకే పిల్లలకు పెట్టే ఆహారాన్ని తల్లులు కాస్త వైవిధ్యంగా తయారు చేసి అందించాలనుకుంటారు. అందులో భాగంగానే రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. అలాంటి అమ్మలకోసమే వచ్చాయి ఈ సరికొత్త స్టాంపులు. కుకీస్‌, గోధుమ-మైదా పిండితో బిస్కెట్లు చేసేటప్పుడు పిండిపైన ఈ స్టాంపులతో ముద్ర వేస్తే వాటిపైన చక్కని డిజైన్లు వస్తాయి. ఇక, పిల్లలకు ఇష్టమైన డిజైన్‌ ఉన్న స్టాంపును వాళ్ల చేత్తోనే కుకీస్‌పైనో బిస్కెట్‌పైనో వేయిస్తే వారికీ¨ ఆసక్తిగానూ ఉంటుంది. అలా వాళ్ల చేతనే చేయించినవి తినిపించడం కూడా తేలిక అవుతుంది. అలాంటివి స్కూలుకి స్నాక్స్‌గా పెట్టినా ఇతర పిల్లలకు చూపిస్తూ చకచకా లాగించేస్తారు కూడా.


పేరూ ఫొటోతో....

ఆడవాళ్లు ఎక్కడికెళ్లినా చేతిలో పర్సో, హ్యాండ్‌ బ్యాగో తప్పనిసరి. అదే పుట్టినరోజు పార్టీలకో, మరేదైనా శుభకార్యాలకో వెళుతుంటే మాత్రం కాస్త హుందాగా చూడచక్కగా ఉన్న క్లచ్‌ పర్సులను ఎంచుకుంటారు చాలామంది. అయితే ఇప్పుడివి మరికాస్త అందంగా ఆధునిక సొబగులు అద్దుకుని కస్టమైజ్డ్‌ తరహాలో అలరిస్తున్నాయి. శాటిన్‌ పువ్వులూ చెమ్కీలూ రంగురంగుల పూసలతో... రకరకాల ఎంబ్రాయిడరీ డిజైన్లూ, మగ్గం వర్కులతో తీర్చిదిద్దిన క్లచ్‌లు- మనం కోరుకున్న పేరూ, ఫొటోతోనూ వస్తున్నాయి. ఇవి పార్టీలకు తీసుకెళ్లడానికి ఎంతో బాగుంటాయి. అమ్మకో స్నేహితురాలికో అపురూప కానుకగానూ ఇవ్వచ్చు. అలానే పెళ్లిళ్లకో ఫంక్షన్లకో రిటర్న్‌ గిఫ్టులుగానూ ఇవ్వడానికీ¨ చక్కని ఎంపిక అవుతాయి.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..