టీతర్‌... చేతికి తొడిగేలా..!

బోసి నవ్వుల బుజ్జాయిలు కాళ్లూ చేతులూ ఆడిస్తున్నట్టే ఆడిస్తూ... మధ్యమధ్యలో చేతులు నోట్లో పెట్టుకుంటుంటారు. పళ్లు వచ్చే సమయంలోనేమో చిగుళ్లు దురదగా అనిపించి చేతికి ఏది దొరికితే అది నోట్లో

Updated : 12 Aug 2022 16:10 IST

టీతర్‌... చేతికి తొడిగేలా..!

బోసి నవ్వుల బుజ్జాయిలు కాళ్లూ చేతులూ ఆడిస్తున్నట్టే ఆడిస్తూ... మధ్యమధ్యలో చేతులు నోట్లో పెట్టుకుంటుంటారు. పళ్లు వచ్చే సమయంలోనేమో చిగుళ్లు దురదగా అనిపించి చేతికి ఏది దొరికితే అది నోట్లో పెట్టుకుంటారు. అందుకని వారికి గ్లవుజులు వేసినా పీకేస్తుంటారు. అలాంటి బుజ్జ్జాయిల కోసమే వస్తున్నాయి లాగేసినా ఊడిపోకుండా బెల్టు పెట్టుకొనే ఏర్పాటున్న టీతర్‌ గ్లవుజులు. అలాంటి వాటిని వేయడం వల్ల వాళ్లు చేతుల నుంచి గ్లవుజుల్ని లాగేయలేరు, గోళ్లు గుచ్చుకునే ప్రమాదమూ ఉండదు. ఒకవేళ నోట్లో చేయి పెట్టుకున్నా గ్లవుజులు నానడం, వాటి నుంచి వాసన రావడం వంటి సమస్యలేమీ ఉండవు. నెలలు గడిచేకొద్దీ టీతర్లుగా చిగుళ్లు గట్టిపడటానికీ¨ పనికొస్తాయి. ఒకసారి తెచ్చుకుంటే చేతి సైజు పెరిగినా బెల్టుతో అడ్జెస్ట్‌ చేయొచ్చు. అలానే నోట్లో పెట్టుకునే భాగాన్ని సిలికాన్‌తో తయారు చేయడం వల్ల దాన్ని విడిగా తీసి పాలడబ్బాలతోపాటు స్టెరిలైజ్‌ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో పలు సైట్లలో రకరకాల రంగుల్లోనూ, డిజైన్లలోనూ అందుబాటులో ఉన్నాయివి.


అట్టలు... అతికించేట్టు!

పిల్లలకు క్లాస్‌ పుస్తకాలు కొనగానే అట్టలు వేయాల్సిందే. లేదంటే వారు వాటిని చించడమో, చివర్లు మడతలు పెట్టేయడమో చేస్తుంటారు. కొన్నిసార్లు పొరపాటున తడి తగలొచ్చు. అందుకే చాలామంది తల్లిదండ్రులు పిల్లల బ్యాగుకీ, లంచ్‌బాక్సు బ్యాగుకీ మ్యాచ్‌ అయ్యే వాటినీ, పలు రకాల రంగుల్లో వైవిధ్యమైన డిజైన్లతో వస్తున్నవాటినీ ఎంచుకుని అట్టలుగా వేస్తుంటారు. అలా వేయడం శ్రమతో కూడుకున్నది. పైగా ఆ పుస్తకం ఏంటో దాన్ని తెరిస్తేనో లేదాపైన అతికించిన లేబుల్‌ని చదివినప్పుడో మాత్రమే తెలుస్తుంది. ఇలాంటి సమస్యలకి పరిష్కారంగా వచ్చినవే అతికించే అట్టలు. పారదర్శకంగా ఉండి జిగురుతో వచ్చే వీటిని పుస్తకాలకు అంటించేస్తే సులువుగా అతుక్కుపోతాయి. పని కూడా తేలికవుతుంది. అలానే అట్ట పారదర్శకంగా ఉండటం వల్ల ఆ పుస్తకం ఏంటో దూరం నుంచే తెలిసిపోతుంది. పలు ఈ కామర్స్‌ సైట్లలో అందుబాటులో ఉన్న ఈ అట్టలు రోల్‌ మాదిరిగానూ, పుస్తకం సైజును బట్టి విడిగానూ కూడా దొరుకుతున్నాయి.


పెన్నులోనే పేపర్‌

చాలామందికి ఫోన్‌లో మాట్లాడేటప్పుడు ఎదుటివారు ఏదైనా పేరో, ఫోన్‌ నంబరో, బ్యాంక్‌ అకౌంట్‌ నంబరో చెప్పినప్పుడు- మాట్లాడుతున్న ఫోన్‌లోనే నోట్‌ చేసుకోవడం తెలియదు. అందుకే అవతలివారు చెబుతాననగానే ‘ఒక్క నిమిషం...’ అంటూ పెన్నూ, పుస్తకం కోసం తెగ వెతికేస్తుంటారు. అలాంటి వారికోసమే అందుబాటులోకి వచ్చాయి టూ ఇన్‌ వన్‌ పెన్నులు. ఈ పెన్ను లోపలే చిన్న చిన్న పేపర్‌ ముక్కలు ఉంటాయి. వాటిలో ఏదన్నా రాసుకున్నప్పుడు ఎక్కడంటే అక్కడ అతికించేసుకోచ్చు. కాగితం జారిపోదూ, రాసుకున్నది వెతుక్కోకుండా కళ్లెదుటే ఉంటుంది. ఈ పెన్నును హ్యాండ్‌ బ్యాగులోనో, జేబులోనో వేసుకున్నారంటే... పుస్తకంతో పనుండదిక.


స్విచ్‌ బోర్డులు చూడచక్కగా

స్విచ్‌ బోర్డులు కూడా ఇప్పుడు ఇంటి అలంకరణలో భాగమయ్యాయి. ఈ మధ్య ఇల్లు కట్టుకునేవారు ఇంటీరియర్‌కి మ్యాచ్‌ అయ్యేలా స్విచ్‌లనీ, వాటి బోర్డులనీ ఎంపిక చేసుకుంటున్నారు. మరి ఆ అవకాశం లేనివారు ఆ బోర్డులను అందంగా అలంకరించేయడానికి రకరకాల డిజైన్ల స్టిక్కర్లని ఎంచుకుని బోర్డులకి అన్నివైపులా అంటించేస్తున్నారు. అలా స్టిక్కర్లను అతికించడం వల్ల ఎప్పుడూ ఒకే డిజైన్‌ ఉంటుంది. అదే అద్దె ఇల్లు అయితే ఖాళీ చేసినప్పుడు వాటిని తీసుకెళ్లడం కుదరదు. సిలికాన్‌తో తయారు చేసిన స్విచ్‌ కవర్లను తెచ్చుకుంటే ఆ సమస్యలేవీ ఉండవు. స్విచ్‌ బోర్డులకు సులువుగా తీసి పెట్టగలిగే ఈ కవర్లను ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్చుకోవచ్చు. పలు రంగుల్లో, వైవిధ్యమైన డిజైన్లతో వస్తున్న ఈ కవర్లను గోడ రంగును బట్టి ఎంచుకుంటే ఇంటీరియర్‌లో భాగమై... గది అందాన్ని ద్విగుణీకృతం చేస్తాయి. అంతేకాదు, వీటిపైన ఉండే ఎల్‌ఈడీ ఫ్లోరసెంట్‌ రంగులు చీకట్లో మెరుస్తూ పెద్దవాళ్లకీ, కొత్తగా వచ్చినవారికీ స్విచ్‌ దిశగా దారిచూపుతుంటాయి.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..