లాలపోసే ఏనుగు బొమ్మ!

పిల్లలు మామూలుగా ఉండే వస్తువుల కన్నా రంగురంగుల్లో, బొమ్మల్లా ఉండే వాటినే ఎక్కువగా ఇష్టపడతారు. అందుకే చిన్నారులు తినే ప్లేట్స్‌ మొదలు పడుకునే బెడ్స్‌ వరకూ బోలెడన్ని రకాలు

Published : 01 May 2022 00:20 IST

లాలపోసే ఏనుగు బొమ్మ!

పిల్లలు మామూలుగా ఉండే వస్తువుల కన్నా రంగురంగుల్లో, బొమ్మల్లా ఉండే వాటినే ఎక్కువగా ఇష్టపడతారు. అందుకే చిన్నారులు తినే ప్లేట్స్‌ మొదలు పడుకునే బెడ్స్‌ వరకూ బోలెడన్ని రకాలు వస్తుంటాయి. అందులో భాగంగానే ఇప్పుడు బుజ్జాయిలు ఇష్టంగా స్నానం చేసేలా ‘బేబీ బాత్‌ షవర్‌ హెడ్‌ వాటర్‌ పంప్‌’లు దొరుకుతున్నాయి. బ్యాటరీలతో నడిచే ఈ బేబీ షవర్లు ఏనుగూ, బాతూ, చిలుకా, జిరాఫీ... ఇలా ఎన్నెన్నో బొమ్మల రూపాల్లో భలేగా ఉంటున్నాయి. టబ్‌లో నీళ్లు పోసి అందులో షవర్‌ బొమ్మ కింద భాగాన్ని వేసి బటన్‌ నొక్కగానే పైనున్న పంపు నుంచి నీటి జల్లు పడుతుంటుంది. బొమ్మలతో ఉండే ఈ షవర్లు ఇటు పిల్లల్ని ఆకట్టుకునేలా ఉంటూనే అటు తలస్నానం చేయించడానికి వీలుగానూ ఉంటాయి.


అక్షరాల తాళాలివి!

ప్పుడప్పుడే అంకెలూ, అక్షరాలూ నేర్చుకుంటున్న బుజ్జాయిలకు ‘ఒకటీ, రెండూ, మూడూ...’ అంటూ నోటితో చెప్పడమో, బోర్డు చూపిస్తూ చెప్పించడమో చేస్తుంటాం కదా! ఈ రెండూ కాకుండా కాస్త కొత్త పద్ధతిలో నేర్పించాలనుకుంటే మాత్రం ఈ ‘కిడ్స్‌ లెర్నింగ్‌ లాక్స్‌ విత్‌ కీస్‌ నంబర్స్‌ మ్యాచింగ్‌ టాయ్స్‌’ని కొనిపెట్టండి. రంగురంగుల్లో రకరకాల బొమ్మలతో ఉండే తాళాలూ, తాళం చెవులూ వస్తాయి. ఒక్కోతాళంపైన ఒక్కో అక్షరమో, అంకెనో ఉంటుంది. ఆ తాళానికి సంబంధించిన తాళం చెవిపైనా కూడా అదే అక్షరం లేదంటే అంకె ఉంటుంది. ఆ తాళం చెవితో మాత్రమే అది తెరుచుకుంటుందన్న మాట. బొమ్మల్లాంటి ఈ తాళాలూ, తాళంచెవుల్నీ పిల్లలకిచ్చి దేనిది ఏదో చూసి తెరవమంటూనే ఎంచక్కా వాటిపైనున్న అక్షరాల్ని నేర్పించొచ్చు!


ఇది సుడొకు క్యూబ్‌!

సుపూ, నీలమూ, తెలుపూ అంటూ ఒక్కో వైపు ఒక్కో రంగును కలుపుతూ ఆడే రూబిక్స్‌ క్యూబ్‌ తెలిసిందేగా. ఇప్పుడు ఇదే క్యూబ్‌తో సుడొకు పజిల్‌నీ పూర్తిచేయొచ్చు. ఎలాగంటారా... ‘సుడొకు క్యూబ్‌’తో. దీంట్లో ఒక్కోవైపు ఒక్కో రంగు కాకుండా అంకెలు ఉంటాయి. క్యూబ్‌ను సరైన పద్ధతిలో తిప్పుతూ ప్రతివైపూ ఒకటి నుంచి తొమ్మిది వరకూ అంకెల్ని తెప్పించాలి. వేరు వేరు సైజుల్లో ఉండే వీటిల్లో పూర్తిగా ఒకే రంగులో కేవలం అంకెలతో ఉండే క్యూబ్సూ ఉన్నాయి. రూబిక్స్‌ క్యూబ్‌లా ఆరు రంగులతోపాటూ వాటిపైన అంకెలు ఉండేవీ ఉన్నాయి. పత్రికల్లో వచ్చే సుడొకు పజిల్‌ని ఒకసారే పూర్తిచేయగలం. కానీ ఈ క్యూబ్‌తో ఎన్నిసార్లైనా ప్రయత్నించొచ్చు. నిత్యం ఫోన్లు పట్టుకుని కూర్చునే చిన్నారులకు ఈ క్యూబ్స్‌ చక్కని ఆటవిడుపు కూడా... ఏమంటారు!


ఆటలాడించే బోర్డు తెలుసా...

సెలవుల్లో పిల్లలు ఏదైనా నేర్చుకుంటే బాగుంటుందనుకుంటారు అమ్మానాన్నలు. కాస్త సమయం దొరికితే పిల్లలకేమో సరదాగా ఫ్రెండ్స్‌తో ఆడుకోవాలనుంటుంది. ఇలా ఇద్దరూ అనుకున్నది జరగాలంటే ‘క్రాఫ్ట్‌స్టోరీ ఫెల్ట్‌ బోర్డ్‌’ని ప్రయత్నించి చూడండి. దీంట్లో ఒక బోర్డూ, జతగా ఇంగ్లిషు అక్షరాలూ, జంతువులూ, వాహనాలూ, చెట్లూ, ఆట వస్తువులూ, ఇళ్లూ... ఇంకా బోలెడన్ని బొమ్మలూ ఉంటాయి. వెల్‌క్రో పద్ధతితో ఆ బొమ్మలు బోర్డుమీద అతుక్కుంటాయి. సరదాగా స్నేహితులతో కలిసి అందులో వచ్చిన బొమ్మల్లో నచ్చినవి అతికించొచ్చు. ఎంచక్కా ఆడుకుంటూనే కొత్త విషయాలు నేర్చుకునేలా ఉన్న ఈ బోర్డులు ఆన్‌లైన్లో దొరుకుతున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..