పిల్లలకో డ్రెసింగ్‌ టేబుల్‌!

కిడ్స్‌రూమ్‌లో అన్ని వస్తువులతోపాటూ పిల్లల ముస్తాబును చూపే అద్దమూ ప్రత్యేకంగా ఉండాలంటూ తయారీదారులు ‘వానిటీ టేబుల్స్‌ ఫర్‌ కిడ్స్‌ రూమ్స్‌’ పేరుతో పిల్లల డ్రెసింగ్‌ టేబుళ్లని తీసుకొచ్చారు. పెద్దవాళ్ల డ్రెసింగ్‌ టేబుళ్లలానే వీటిల్లోనూ బోలెడు రకాలు దొరుకుతున్నాయి. ఎత్తు తక్కువతో ముచ్చటైన రంగులతో పిల్లలు కూర్చుని అద్దంలో చూసుకునేలా ఉంటాయివి.

Published : 29 May 2022 00:20 IST

పిల్లలకో డ్రెసింగ్‌ టేబుల్‌!

కిడ్స్‌రూమ్‌లో అన్ని వస్తువులతోపాటూ పిల్లల ముస్తాబును చూపే అద్దమూ ప్రత్యేకంగా ఉండాలంటూ తయారీదారులు ‘వానిటీ టేబుల్స్‌ ఫర్‌ కిడ్స్‌ రూమ్స్‌’ పేరుతో పిల్లల డ్రెసింగ్‌ టేబుళ్లని తీసుకొచ్చారు. పెద్దవాళ్ల డ్రెసింగ్‌ టేబుళ్లలానే వీటిల్లోనూ బోలెడు రకాలు దొరుకుతున్నాయి. ఎత్తు తక్కువతో ముచ్చటైన రంగులతో పిల్లలు కూర్చుని అద్దంలో చూసుకునేలా ఉంటాయివి. పిల్లల మేకప్‌ సామగ్రీ, జ్యువెలరీ పెట్టుకోవడానికి టేబుల్‌కు చిన్న చిన్న సొరుగులూ, అరలూ వస్తాయి. వీటిల్లో  డిటాచబుల్‌ డ్రెసింగ్‌ టేబుళ్లూ ఉన్నాయి. పైన ఉండే అద్దాల్ని మడతపెట్టేసి దాన్నే స్టడీ టేబుల్‌లానూ మార్చుకోవచ్చన్నమాట. కలప, ప్లాస్టిక్‌లతో తయారవుతున్న వీటిల్లో రకరకాల ఆకారాలూ, మరెన్నో బొమ్మల థీమ్‌లూ వస్తున్నాయి. కొంతమంది మిగతా ఫర్నిచర్‌తోపాటూ ఈ డ్రెసింగ్‌ టేబుళ్లనీ కస్టమైజ్డ్‌గా తమకు నచ్చినట్టు చేయించుకుంటున్నారు. మీ పిల్లలకూ ఈ ‘కిడ్స్‌ డ్రెసింగ్‌ టేబుల్‌’ని బహుమతిగా ఇచ్చి చూడండి. చిట్టి టేబుల్‌ అద్దం ముందు నుంచి కదలమన్నా కదలరు మరి!


పవర్‌బ్యాంకే అద్దమయితే..

ఒకే వస్తువు రకరకాలుగా ఉపయోగపడితే మీకు ఇష్టమా... అయితే ఇక్కడున్న ‘పవర్‌ బ్యాంక్‌ కాంపాక్ట్‌ మేకప్‌ లెడ్‌ మిర్రర్‌’ని కొనుక్కుని చూడండి. ఈరోజుల్లో కచ్చితంగా వెంట ఉంచుకునే వస్తువుల జాబితాలోకి చేరిపోయిన పవర్‌బ్యాంకే ఇది. అచ్చంగా కాంపాక్ట్‌ మేకప్‌ బాక్స్‌లా ఉన్న ఈ పవర్‌బ్యాంక్‌... అవసరమైనప్పుడు ఫోన్‌ ఛార్జింగ్‌ పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. పైగా దీంట్లో మేకప్‌ వేసుకోవడానికి ఒకవైపు మామూలు అద్దమూ, మరోవైపు ముఖాన్ని దగ్గర్నుంచి చూసుకోవడానికి మాగ్నిఫయింగ్‌ అద్దమూ ఉంటాయి. అంతేకాదు... రాత్రిపూట చీకట్లో చూసుకోవడానికి ఈ బుల్లి అద్దం పవర్‌బ్యాంక్‌చుట్టూ... ఎల్‌ఈడీ లైట్లూ ఉంటాయి. మీ బ్యాగులో మామూలు అద్దానికి బదులు దీన్ని ఉంచుకున్నారంటే విడిగా పవర్‌బ్యాంక్‌ను తీసుకెళ్లాల్సిన అవసరమే ఉండదు.


బీన్‌ బ్యాగ్‌లో పరుపు!

అప్పటి వరకూ హాల్లో దొర్లాడిన బీన్‌ బ్యాగే... క్షణంలో పరుపులానూ మారిపోతే ఎంత బాగుంటుందో కదూ. ‘నిజమే చాలా బాగుంటుంది కానీ అలా ఎలా జరుగుతుందబ్బా’ అంటారేమో...  ‘కన్‌వర్టబుల్‌ బీన్‌ బ్యాగ్‌ బెడ్‌’తో అది సాధ్యమేనండోయ్‌. చూస్తే ఇదీ మామూలు బీన్‌ బ్యాగ్‌లానే కనిపించినా దానిమీదున్న కవర్‌ జిప్‌ తెరిస్తే మాత్రం లోపల ప్రత్యేకమైన ఫ్యాబ్రిక్‌తో ఉన్న పరుపు ఉంటుంది. అందుకే అటు సరదాగా కూర్చోవడానికి బీన్‌ బ్యాగ్‌లా వాడుకోవచ్చు. అప్పటికప్పుడు జిప్‌ తెరిచి బెడ్‌లానూ మార్చుకోవచ్చు. రకరకాల రంగుల్లో, వివిధ పరిమాణాల్లో మార్కెట్లో అందుబాటులో ఉన్నాయివి. ఆలస్యం ఎందుకు... నచ్చితే ఈ కొత్తరకం బీన్‌ బ్యాగ్‌ను ఇంటికి తెచ్చేసుకోండి! 


బుల్లి ల్యాపీ... బుజ్జి కెమెరా!

చిన్నారుల బారసాలకో, పుట్టినరోజుకో ఫొటోలు తీయడం అనేది ఒకప్పటి మాట. ఇప్పుడైతే ఈ కొత్తప్రపంచంలోకి అప్పుడప్పుడే అడుగుపెట్టిన పసిపాపాయిలకూ ఫొటోషూట్లు చేయిస్తున్నారు. కొంతమంది ప్రత్యేకంగా ఫొటోగ్రాఫర్లతో ఫొటోలు తీయిస్తే... మరికొంతమంది సొంతంగా రకరకాల థీముల్ని ఎంచుకుని చిన్నారుల బోసినవ్వుల్ని కెమెరాల్లో బంధిస్తున్నారు. అలాంటివారి కోసం మార్కెట్లోకి పిల్లల ఫొటోషూట్‌ యాక్ససరీలు బోలెడన్ని వచ్చేస్తున్నాయి. చిన్న ల్యాప్‌టాప్‌, బుల్లి కెమెరా, టీవీ, రేడియో నుంచి చిట్టి వయోలిన్‌, గొడుగూ, మంచమూ, సోఫా దాకా ఎన్నెన్నో మినియేచర్‌ వస్తువులు దొరుకుతున్నాయి. వీటిల్లో ఎంచుకున్న అంశాన్ని బట్టి కావాల్సినవి కొనుక్కుని ఇంట్లోనే చిన్నారుల ఫొటోలు తీసుకోవచ్చు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..