Published : 10 Apr 2022 00:46 IST

పాపాయి జ్ఞాపకాలు పదిలంగా...

అప్పుడే పుట్టిన పసిపాపకి సంబంధించి ప్రతిదీ మధుర జ్ఞాపకమే. అందుకే మన చేతుల్లోకి తీసుకున్న ఆ మొదటి క్షణమూ, తేదీ, పాపాయి బరువూ వంటివాటిని గుర్తుపెట్టుకుంటాం. తొలిసారిగా వేసిన డ్రస్సూ, తీసిన ఫొటోల్నీ పదిలంగా దాచుకుంటాం. ఎంతో ఆనందాన్ని ఇచ్చే ఆ తీపి గుర్తులన్నింటినీ ఒక ఫ్రేములో పెట్టి ఎప్పటికీ భద్రపరిస్తే మరెంతో బాగుంటుంది కదా! ఇదిగోండి... అలా కోరుకునే వాళ్లకోసమే ‘పర్సనలైజ్డ్‌ బేబీ షాడో బాక్స్‌’లు వచ్చేశాయి. బోసినవ్వుల చిన్నారి పుట్టినప్పటి వివరాలూ, గుర్తుల్నీ అందులో అందంగా పెట్టి ఇస్తుంటారు. వీటికోసం కస్టమైజ్డ్‌ గిఫ్ట్స్‌ తయారుచేసే ఎన్నో ఆన్‌లైన్‌ వెబ్‌సైట్లు అందుబాటులో ఉన్నాయి.


చల్ల చల్లని గ్లాసు!

ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చారంటే ఈ ఎండాకాలంలో అయితే తప్పకుండా జ్యూసో, చల్లని మజ్జిగో అందిస్తుంటాం. మాటల్లో పడి వాళ్లు తాగడం కాస్త ఆలస్యం అయిందంటే వాటి చల్లదనం పోతుంది. అలా జరగకుండా ఉండాలంటే ఈ ‘డబుల్‌ వాల్‌ జెల్‌ ఫ్రీజర్‌ గ్లాస్‌’ని వాడి చూడండి. ఫ్రిజ్‌ నుంచి బయటకు తీసిన పండ్లరసం దీంట్లో పోస్తే రెండు గంటలపాటు చల్లగానే ఉంటుంది. దానికి కారణం ఈ గ్లాసులో ఉండే జెల్‌. ప్రత్యేకమైన జెల్‌తో ఉండే ఈ గ్లాసును కాసేపు ఫ్రిజ్‌లో ఉంచితే గ్లాసంతా చల్లగా అవుతుంది. బయటకు తీసిన కొన్ని గంటలపాటూ ఆ చల్లదనం అలాగే ఉంటుంది. అందుకే అందులో పోసినవీ చాలాసేపు చల్లచల్లగా ఉంటాయన్నమాట.


టోపీకే ఇయర్‌ఫోన్స్‌!

వేసవికాలంలో బయటకు వెళ్లినప్పుడు చాలామంది ఎండ నుంచి రక్షణగా టోపీలు పెట్టుకుంటారు. అలాగే కాలక్షేపానికి హెడ్‌ఫోన్సూ వెంటబెట్టుకెళ్తారు. ఇక, ఈ రెండింటినీ వేరు వేరుగా తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ‘వైర్‌లెస్‌ హెడ్‌ఫోన్స్‌ హ్యాట్‌’ పేరుతో టోపీలు దొరుకుతున్నాయి. బ్యాటరీలతో పని చేసే ఈ టోపీకే ఇయర్‌ఫోన్సూ జతచేసి ఉంటాయి. ఫోన్‌కీ, టోపీకీ బ్లూటూత్‌ ద్వారా కనెక్ట్‌ చేసి ఆన్‌ బటన్‌ నొక్కితే చాలు, ఎంచక్కా నచ్చిన పాటలు వినొచ్చు. అంతేకాదు, టోపీ మీద బటన్స్‌ నొక్కుతూ నచ్చినట్టు
సౌండుని తగ్గించుకోవచ్చూ, పెంచుకోవచ్చూ. రంగురంగుల్లో అందుబాటులో ఉన్న ఈ ఇయర్‌ఫోన్స్‌ టోపీలు బాగున్నాయి కదూ!  


మొక్కను వాడనివ్వదు!

ఎండాకాలం వచ్చేసింది. ఓ రెండ్రోజుల పాటు ఎక్కడికైనా వెళ్లామంటే చాలు, ఇంట్లో ఎంతో ఇష్టంగా పెంచుకున్న మొక్కలు నీళ్లులేక వాడిపోతుంటాయి. ఆ సమస్య నుంచి తప్పించుకోవాలంటే ఈ ‘సెల్ఫ్‌ వాటరింగ్‌ గ్లోబ్స్‌’ను కొనితెచ్చుకోండి. రకరకాల రంగుల్లో, ఎన్నో బొమ్మల ఆకారాల్లో అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో నీళ్లు నింపి మొక్కల కుండీల్లో గుచ్చితే సరిపోతుంది. కొద్దికొద్దిగా నీళ్లు అందిస్తూ కొన్ని రోజుల పాటు మొక్కల్ని తేమగా ఉంచుతూ వాడిపోనివ్వకుండా చేస్తాయి. ఒకవైపు మొక్కలకు నీళ్లు ఇస్తూనే మరోవైపు చూడ్డానికీ అందంగా కనిపిస్తున్న ఈ వాటర్‌ గ్లోబులు భలేగా ఉన్నాయి కదూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు