Published : 24 Sep 2022 23:46 IST

బుజ్జాయిలూ బ్యాలెన్స్‌ చేస్తారు!

పసిపాపాయి పుట్టినప్పటి నుంచీ ఒక్కో మైలురాయీ దాటుకుంటూ వస్తుంది. మనుషుల్ని గుర్తుపట్టడం మొదలు గలగలా మాట్లాడే దాకా ఎన్నో దశలు. వాటిని గమనిస్తూ పిల్లల్లో తెలివితేటలూ, ఏకాగ్రతా పెరగడానికి పెద్దవాళ్లు  రకరకాల ఆటవస్తువుల్ని అందిస్తుంటారు. అలాంటిబొమ్మల్లో ‘స్టాకింగ్‌ బ్యాలెన్సింగ్‌ స్టోన్స్‌’ చిన్నారులకెంతో ఉపయోగపడతాయి. రాయి మీద రాయి పెడుతూ బ్యాలెన్స్‌ చేసే నైపుణ్యాన్ని పిల్లలకు అలవర్చడానికి ఈ ఆట బొమ్మ వచ్చేసింది. దీంట్లో చెక్కతో తయారుచేసిన రకరకాల రంగు రంగుల బ్యాలెన్సింగ్‌ ముక్కలుంటాయి. వాటిని ఒకదాని మీద ఒకటి పడిపోకుండా పెట్టడం వల్ల పిల్లలకు ఆటగానూ ఉంటుంది, ఏకాగ్రతనూ పెంచుతుంది.


పిల్లల కోసం వీడియో వాకీటాకీ!

పిల్లలకు నిజమైన ఫోన్‌ ఇవ్వాలంటే ఏవేవో నొక్కుతారనో, కిందపడేస్తారనో భయపడుతుంటాం. అలా అని బొమ్మ ఫోన్‌ ఇస్తే పిల్లలు దాన్ని అస్సలు ఇష్టపడరు. అందుకే ఇటు మనకూ అటు చిన్నారులకూ పరిష్కారం కావాలంటే ఈ ‘వీడియో కెమెరా కిడ్స్‌ వాకీటాకీ’ని ప్రయత్నించొచ్చు. ఎల్‌సీడీ తెరతో ఉండే ఈ వాకీటాకీలతో ఎంచక్కా వీడియో కాల్‌ మాట్లాడొచ్చు. మామూలు ఫోన్స్‌లాగే వీటికీ ఛార్జింగ్‌ పెట్టుకుంటే చాలు. ఇద్దరు పిల్లలు వంద మీటర్ల దూరం వరకూ బటన్‌ నొక్కి సరదాగా ఎవరు ఏం చేస్తున్నారో చూస్తూ వీడియోకాల్స్‌ చేసుకోవచ్చు. అంతేకాదు... కొన్ని వాకీటాకీలు మెమరీ కార్డుతో సహా వస్తాయి. వాటిల్లో కథలూ, పాటలూ రికార్డు చేసుకుని నచ్చినప్పుడు వినొచ్చు. రకరకాల రంగుల్లో, ఎన్నో డిజైన్లలో అందుబాటులో ఉన్న ఈ వాకీటాకీ పిల్లలకు కచ్చితంగా మంచి బహుమతి అవుతుందంటే నమ్మండి!


చేతులు కడిగే ‘సోప్‌ పెన్‌’

చిన్నారులకు ఏదైనా నేర్పించాలంటే వాళ్లతో కలిసిపోయి వాళ్ల భాషలో చెబితే బాగా వింటారు. అలాగే పిల్లలతో ఏదైనా చేయించాలన్నా ఆ వస్తువులు వాళ్లకు సంబంధించినవైతే చక్కగా చేస్తారు. ఈ విషయాన్ని గమనించే ‘సోప్‌పెన్‌’ తయారైంది. ఇది పెన్ను రూపంలో ఉండే హ్యాండ్‌వాష్‌ అన్నమాట. ఎరుపు, ఆకుపచ్చ, నీలం రంగుల్లో పియర్‌, బెర్రీలాంటి పండ్ల వాసనలతో ఈ సోప్‌ పెన్నులు దొరుకుతాయి. పెన్నుతో కాగితం మీద రాసినట్టే దీంతో చేయిపైన రాసుకుని నీటితో కడిగితే చేతులు శుభ్రమైపోతాయి. సాధారణంగా చేతులు శుభ్రం చేసుకోమంటే చాలామంది చిన్నారులు నీళ్లతో అలా ఊరికే కడిగేసుకుని వచ్చేస్తుంటారంతే. సబ్బుతో రుద్దుకోవడానికి పెద్దగా ఇష్టపడరు. అలాంటి పిల్లలు మరిచిపోకుండా చేతులు కడుక్కోవాలంటే ఈ సబ్బుపెన్నును కొనిచ్చి చూడండి.


బొమ్మల స్కూటర్‌ భలే భలే!

ఏనుగు బొమ్మతో ఆడుకుంటూనే దానిమీద రయ్యిమంటూ ఓ రైడ్‌ చేస్తే... సరదాగా యూనికార్న్‌ బొమ్మ వీపు మీద ఎక్కి ఇల్లంతా తిరిగేస్తే... పిల్లలు చెప్పలేనంత సంబరపడిపోతారు కదూ. ఆ ఆనందం మీరూ ఇవ్వాలనుకుంటే ‘కిడ్స్‌ ఎలక్ట్రిక్‌ స్టఫ్‌డ్‌ యానిమల్‌ రైడ్‌ మోటర్‌సైకిల్‌’ని మీ ఇంటికి తెచ్చేయండి. చిన్నారుల కోసం వచ్చే చిన్న చిన్న స్కూటర్లే- కుక్క, బాతు, గుర్రం, పులి, సింహం.... ఇలా బోలెడన్ని బొమ్మల ఆకారాల్లో దొరుకుతున్నాయి. ఇవి బ్యాటరీలతో పనిచేస్తూ చక్రాలతో పరుగులుపెట్టేస్తాయి. ఎంచక్కా వీటిమీద కూర్చుని చిన్నారులు ‘చల్‌ చల్‌ గుర్రం... చలాకి గుర్రం’ అంటూ పాటలు పాడుకుంటూ ఆడుకుంటారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని