రయ్యిమంటూ... దూసుకుపోదామా!

పరీక్షలు అయిపోవడంతో స్నేహితులతో కలిసి బైక్‌మీద సరదాగా ఓ లాంగ్‌టూర్‌కు వెళ్లాలనుకున్నాడు రాహుల్‌. ఆ ప్రయాణానికి సంబంధించిన ప్రణాళికలు వేసుకుంటున్న సమయంలోనే అతడికి బైక్‌ ప్యాకేజీల గురించి తెలిసింది.

Updated : 11 Feb 2024 14:23 IST

పరీక్షలు అయిపోవడంతో స్నేహితులతో కలిసి బైక్‌మీద సరదాగా ఓ లాంగ్‌టూర్‌కు వెళ్లాలనుకున్నాడు రాహుల్‌. ఆ ప్రయాణానికి సంబంధించిన ప్రణాళికలు వేసుకుంటున్న సమయంలోనే అతడికి బైక్‌ ప్యాకేజీల గురించి తెలిసింది. దాంతో తమ బడ్జెట్‌లో ఓ మంచి ప్యాకేజీని ఎంచుకుని ఎలాంటి ఇబ్బందీ లేకుండా నాలుగైదు రోజులు హాయిగా తిరిగొచ్చారు రాహుల్‌ - అతని స్నేహితులు. అవును మరి... ఇప్పుడిప్పుడే పర్యటకుల్ని ఆకట్టుకుంటున్న ఈ బైక్‌ ప్యాకేజీలను ఎంచుకుంటే చాలు... ఎలాంటి ఆటంకాలూ లేకుండా సాహస యాత్రల్ని చేసేయొచ్చు.

ఓనాలుగైదు రోజులపాటు బిజీ జీవితం నుంచి కాస్త బ్రేక్‌ తీసుకుని... స్నేహితులంతా కలిసి బైక్‌లు వేసుకుని రయ్యిమంటూ దూసుకుపోతుంటే ఆ మజానే వేరు కదూ. కానీ అలా వెళ్లాలంటేనే బోలెడు ఏర్పాట్లు చేసుకోవాలి. ప్రయాణం మొదలుపెట్టడం నుంచీ ఆ నాలుగైదు రోజులు ఎక్కడ ఉండాలీ, పెట్రోల్‌ పోయించుకునేందుకు అందుబాటులో ఉండే పాయింట్లూ, బైక్‌కి ఏదయినా సమస్య వస్తే మెకానిక్‌ నెంబరు... ఇలా అదీఇదీ అని కాకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ సమస్యలేవీ లేకుండా కేవలం ట్రిప్పును ఎంజాయ్‌ చేయాలనుకునేవారు ఈ బైక్‌ ప్యాకేజీలను ఎంచుకోవచ్చు. అయితే రైళ్లు/బస్సులు రకరకాల ప్యాకేజీలు అందించడం అనేది ఎప్పటినుంచో ఉన్నదే. అచ్చంగా వాటిలానే స్నేహితులతో కలిసి లేదా ఒంటరిగా బైక్‌పైన సాహస యాత్రలు చేయాలనుకునేవారి కోసం బైక్‌ ప్యాకేజీలు వచ్చాయిప్పుడు. అంటే... మన బడ్జెట్‌కి అనుకూలమైన ప్రాంతంలో బైక్‌ మీద తిరుగుతూ ఆ సాహస యాత్రను ఓ మధురజ్ఞాపకంగా మార్చుకోవచ్చు అన్నమాట. నిజానికి స్నేహితులంతా కలిసి చక్కగా ప్లాన్‌ చేసుకుని రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌పైన కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణించడం... ఏదయినా కొత్త ప్రాంతానికి రైల్లోనో, ఫ్లైట్‌లోనో వెళ్లి... అక్కడినుంచి ఓ బైక్‌ అద్దెకు తీసుకుని చుట్టుపక్కల ఉన్న ఊళ్లను చూసిరావడం కొత్తేమీ కాదు. వాటితో పోలిస్తే  పర్యటక సంస్థలు అందిస్తున్న ఈ ప్యాకేజీలతో లాభాలు ఎక్కువే.

ఎలా ఎంచుకోవచ్చంటే...

బైక్‌లపైన సాహస యాత్రలు చేయాలనుకునేవారు ఎక్కువగా బృందాలుగానే వెళ్తారు. ఈ బైక్‌ ప్యాకేజీలతోనూ అలానే వెళ్లిరావొచ్చు. పైగా అదనంగా బోలెడు సదుపాయాలూ ఉంటాయి. ఉదాహరణకు లద్దాఖ్‌ వెళ్లాలనుకునేవారు తమకు సరిపోయే బైక్‌ ప్యాకేజీని ఎంచుకుంటే చాలు... రాయల్‌ఎన్‌ఫీల్డ్‌, కేటీఎం 390, పల్సర్‌, అవెంజర్‌ క్రూయిజ్‌ 220...  వంటి బైకుల్లో ఏదో ఒకటి ఇవ్వడం నుంచీ టూరు పూర్తయి తిరిగొచ్చేవరకూ అన్నీరకాల ఏర్పాట్లనూ ఆ సంస్థే చేస్తుంది. వేళకు టిఫిన్‌, భోజనం, బస ఏర్పాట్లు, పెట్రోల్‌ అందివ్వడం, దారిని చూపించేందుకు ఓ గైడ్‌, బండికి ఏదయినా సమస్య ఎదురైతే వెంటనే రిపేరు చేసేందుకు మెకానిక్‌ అతనితోపాటూ స్పేర్‌పార్ట్స్‌... వంటివన్నీ ఈ బైక్‌ ప్యాకేజీలో ఉంటాయి. దాంతో లద్దాఖ్‌ మొదలు రాజస్థాన్‌లోని ఎడారి ప్రాంతాలూ, జోధ్‌పుర్‌, జైసల్మేర్‌, మనాలీ, శ్రీనగర్‌... ఇలా ఎన్నో ప్రాంతాలను ఎలాంటి సమస్యా లేకుండా చుట్టి వచ్చేయొచ్చు. ఈ ప్యాకేజీలు సాధారణంగా ఏడు రాత్రులూ- ఎనిమిది రోజులూ- నాలుగు రాత్రులూ- అయిదు రోజులూ... పద్ధతుల్లో ఉంటాయి. ఇలా బైక్‌టూర్లను ఏర్పాటు చేసే సంస్థల్లో థామస్‌కుక్‌, థ్రిల్లోఫిలియా, ట్రావెల్‌ ట్రయాంగిల్‌, టూరిజం ఆఫ్‌ ఇండియా, నొమాడ్‌ బైకర్స్‌ వంటి సంస్థలు ఎన్నో ఉన్నాయి. ఈ సంస్థల ద్వారా బైక్‌యాత్రను బుక్‌చేసుకుంటే... ఆ తరువాత ఏం చేయాలనేదీ సంస్థలే వివరిస్తాయి. ఆలస్యమెందుకు.. సాహస యాత్రకు సై అనేసేయండి మరి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..