ఓడలే పెళ్ళి వేదికలు!

పైన నీలాకాశం... చుట్టూ అందాల సంద్రం.. నడిమధ్యలో విలాసవంతమైన క్రూజ్‌ షిప్‌... అందులో విహరించడమే ఒక అద్భుత అనుభవం.

Updated : 16 Jun 2024 12:09 IST

పైన నీలాకాశం... చుట్టూ అందాల సంద్రం.. నడిమధ్యలో విలాసవంతమైన క్రూజ్‌ షిప్‌... అందులో విహరించడమే ఒక అద్భుత అనుభవం. మరి ఆ ఓడలోనే ఆకాశ పందిరి కింద ప్రియమైన వారితో ఏడడుగులు వేస్తే ఇంకెంత బాగుంటుందో కదూ! ఇది కేవలం ఊహ మాత్రమే కాదు... కొన్ని క్రూజ్‌ సంస్థలు దాన్ని నిజం చేస్తున్నాయి. కదిలే ఓడలో కళ్లు చెదిరే ఏర్పాట్లతో- వధూవరుల జీవితాలను ముడిపెట్టే ఆ శుభఘడియలను మరింత మరపురాని ఘట్టంగా మార్చేస్తున్నాయి. విహరిస్తూ వివాహం చేసుకునే ఈ కొత్తరకం పెళ్లి ట్రెండ్‌ ఏంటో ఓ లుక్కేదామా!

ఏడడుగుల బంధంతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టే క్షణాలు ఎంతో అపురూపమైనవి. అందుకే నిశ్చితార్థంలో ఉంగరాలు మార్చుకోవడం మొదలు హనీమూన్‌లో హృదయాలు పెనవేసుకునే వరకూ జరిగే వేడుకలనూ ఓ మధురానుభూతిగా మలుచుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. చాలామంది ముందు నుంచే ఆ సంబరాల గురించి ఎన్నెన్నో కలలు కంటుంటారు. వాటికి తగ్గట్టే నచ్చిన ప్రదేశాల్లోనో ఆలయాల్లోనో సముద్రతీరాల్లోనో విదేశాల్లోనో- అభిరుచులకు అనుగుణంగా ప్రతి వేడుకనూ ఓ పండుగలా జరుపుకుంటారు. ఇప్పుడు కొందరు కదిలే ఓడలనే కల్యాణ మండపాలుగా మార్చుకుని విహారంలోనే వేదమంత్రాల సాక్షిగా ఒక్కటవుతున్నారు. అనంత్‌ అంబానీ ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు ఈ మధ్యనే ఇటలీ నుంచి ఫ్రాన్స్‌ వరకూ సముద్ర మార్గంలో ప్రయాణించే ప్రత్యేక క్రూజ్‌లో జరిగిన విషయం తెలిసిందే. అయితే విదేశాల్లోనే ఈ తరహా వేడుకలు సాధ్యమవుతాయి అనుకుంటే పొరపాటే. ఇప్పుడు మనదేశంలోనూ కొన్ని క్రూజ్‌ సంస్థలు- ఓడల్ని వివాహ వేదికలుగా మార్చేస్తున్నాయి కనుచూపు మేర నీళ్లే కనిపించే నడి సంద్రంలో- క్రూజ్‌లో విహరింపజేస్తూ... అతిథులకు ప్రత్యేక అనుభూతిని పంచుతూ, కలల వేడుకను కదిలే వేదికపైన జరిపిస్తున్నాయి.

 సేవలన్నీ అందిస్తూ...

నిశ్చితార్థం, సంగీత్‌, మెహందీ, పెళ్లి, హనీమూన్‌ తదితర కార్యక్రమాలను క్రూజ్‌లో చేసుకోవడం ఇప్పుడు ట్రెండ్‌ అయింది. అలాంటి వేడుకలకు వేదికైన క్రూజ్‌లు మనదేశంలోని ఆయా పోర్ట్‌ల నుంచి ప్రారంభమవుతాయి. లక్షద్వీప్‌, దీవ్‌, గోవా, కోల్‌కతా, ముంబయి, చెన్నై, పుదుచ్చేరి, మంగళూరు, అండమాన్‌ తదితర చోట్ల మొదలై- మనకు నచ్చిన తీరం వరకూ ప్రయాణిస్తూ వేడుకల్నీ జరుపుకోవచ్చు. వేదికలుగా ఓడల్ని ఏర్పాటు చేయడం సరే... మరి వేడుకలకోసం అలంకరణా, ఆతిథ్య సేవల సంగతి ఏంటనే అనుమానం రావచ్చు. ఆ పనులనూ క్రూజ్‌ సంస్థలే చూసుకుంటాయి. సందర్భానికి తగినట్టు మనం కోరుకునే థీమ్‌లతో మండపాలను అలంకరించడం- అతిథులకు రూమ్‌లూ, ఇతర సౌకర్యాలూ, భోజనాలూ, ఫొటోగ్రఫీ వంటి సేవలూ అందిస్తాయి. జిమ్‌, ఈత కొలను, స్పా కేంద్రం, మేకప్‌ రూమ్స్‌, బొటిక్‌ వంటి సదుపాయాలూ- డీజే షోలూ, రకరకాల గేమ్స్‌, పిల్లలకోసం మ్యాజిక్‌షోలూ, లేజర్‌షో తదితర వినోద కార్యక్రమాల ఏర్పాట్లు కూడా ఉంటాయి. వధూవరులూ, అతిథులూ కట్టుబట్టలతో క్రూజ్‌లో అడుగుపెడితే చాలు- కలల వేడుకల్ని ఆడంబరంగా నిర్వహించి... కోరుకున్న సంబరాలను కనులవిందుగా నిర్వహిస్తాయి. కొందరు ప్రతి సందర్భాన్నీ ఓడలోనే సెలబ్రేట్‌ చేసుకుంటే మరికొందరు ఏదో ఒక్కదాన్నే జరుపుకుంటున్నారు. అందుకుతగ్గట్టుగా వేడుకల్నీ, రోజుల్నీ, అతిథుల్నీ బట్టి రకరకాల ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..