Updated : 26 Sep 2021 16:16 IST

ఇంట్లో పూజ.. ఆన్‌లైన్‌లో పూజారి!

కరోనా కారణంగా... పిల్లల చదువుల నుంచీ ఆఫీసు విధుల వరకూ... నిత్యావసరాల కొనుగోళ్ల నుంచీ షాపింగ్‌ చేయడం వరకూ... ఎక్కువ శాతం ఆన్‌లైన్‌పైనే ఆధారపడుతున్న రోజులివి. ఇప్పుడు వాటిపక్కన వ్రతాలూ, నోములూ, ఇతర శుభకార్యాలు కూడా చేరాయి. అంటే... పురోహితులు వీడియోకాల్స్‌ ద్వారా ఆ కార్యక్రమాలను పూర్తి చేస్తూ ఆన్‌లైన్‌లోనే దక్షిణనూ స్వీకరిస్తున్నారు. ఇలా వీడియోకాల్స్‌లో నిర్వహించే పూజాది కార్యక్రమాలకు ఇప్పుడు డిమాండ్‌ పెరిగింది.

చాలా రోజులయ్యిందనే ఉద్దేశంతో ఇంట్లో సత్యనారాయణ వ్రతాన్ని పెట్టుకుంది ప్రియ. పూజకు కావాల్సిన వస్తువులన్నింటినీ సిద్ధం చేసుకున్నాక ల్యాప్‌టాప్‌ ఆన్‌చేసి జూమ్‌కాల్‌లో లాగిన్‌ అయ్యింది. వీడియోకాల్‌లో పురోహితుడు చెప్పే ఒక్కో కథనూ శ్రద్ధగా వింటూ, ఆయన చెప్పినట్లుగా చేస్తూ ఆ వ్రతాన్ని పూర్తి చేసింది. ఇక, పాపాయికి ఆర్నెల్లు రావడంతో అన్నప్రాసన చేయాలనుకున్నారు. విజయ్‌ దంపతులు. అది చిన్న కార్యక్రమమే కాబట్టి ఇంట్లోనే కానిచ్చేయాలనుకున్నారు కానీ ఎంత ప్రయత్నించినా పూజారి దొరకలేదు. చివరకు స్నేహితుల సలహాతో ఆన్‌లైన్‌ద్వారా పూజారిని సంప్రదించడంతో గూగుల్‌మీట్‌లో అయన ఆశీర్వచనాలు చదివి ఆ కార్యక్రమాన్ని పూర్తిచేశాడు. వీళ్లే కాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది వ్రతాలూ, నోముల్లాంటివి చేయించుకునేందుకు ఆన్‌లైన్‌ పూజారుల్నే ఆశ్రయిస్తున్నారు. వాళ్లు కూడా జూమ్‌కాల్‌, గూగుల్‌మీట్‌, స్కైప్‌... వంటి వాటిద్వారా అన్నప్రాసన నుంచి పెళ్లిళ్లవరకూ అన్నింటినీ చేసేస్తున్నారు.

ఒకప్పుడు ఇంట్లో ఏదయినా శుభకార్యం పెట్టుకుంటే పుజారిని ఆహ్వానించి, ఆ కార్యక్రమం అంతా పూర్తయ్యాక దక్షిణ తాంబూలాలు ఇచ్చి, ఆశ్వీరచనాలు తీసుకోవడం ఓ సంప్రదాయంగా పాటించేవారు. క్రమంగా పూజలకు సంబంధించిన క్యాసెట్లు రావడంతో వాటిని వింటూ పూర్తిచేసుకునేవారు. ఇంటర్నెట్‌ వచ్చాక అన్నిరకాల పూజలకు సంబంధించిన వివరాలూ అందులోనే రావడంతో వాటిపైన ఆధారపడ్డారు. కేవలం పురోహితుడు అవసరం అనుకున్న కార్యక్రమాలకే వాళ్లను ఆహ్వానించేవారు. ఇప్పుడు కరోనా కారణంగా పురోహితులూ ఇళ్లకు రావడం తగ్గించడం, పూజలు చేయించుకునేవారూ ఎక్కువగా ఆన్‌లైన్‌నే ఆశ్రయించడంతో డిజిటల్‌బాట పట్టిన పురోహితుల సంఖ్య  బాగా పెరిగింది.

అన్నీ వీడియోకాల్స్‌ ద్వారానే..

పూజల్లో హోమాలూ, అభిషేకాలూ, వ్రతాలూ, నోములూ... అంటూ ఎన్నో రకాలుంటాయి. వీటితోపాటూ ఎవరికి వారు చేసుకునే శుభకార్యాలూ, పుణ్యక్షేత్రాల్లో మాత్రమే జరిపే ప్రత్యేక అర్చనలూ అదనం. వీటిల్లో ఏదయినా సరే డిజిటల్‌ పద్ధతిలోనే చేయించుకోవచ్చు. ఉదాహరణకు ఏదయినా పుణ్యక్షేత్రంలో పూజ చేయించుకోవాలనుకునే వారికి ‘ఈ-పూజ’ లాంటి వెబ్‌సైట్లు అందుబాటులో ఉన్నాయి. దేశవ్యాప్తంగా 3600 ఆలయాల్లో భక్తులు కోరిన పూజల్ని జరిపించే ఈ వెబ్‌సైటు ద్వారా హోమాలూ, అభిషేకాలూ లాంటివి కూడా చేయించుకోవచ్చు.  అదేవిధంగా ‘బుక్‌ యువర్‌ పూజ’ వెబ్‌సైట్‌లోకి వెళ్తే సత్యనారాయణవ్రతం నుంచీ రుద్రాభిషేకాల వరకూ... అన్నింటినీ వీడియో కాల్‌ ద్వారా చేయిస్తారు అర్చకులు. ‘శరణం’,  ‘పూజాభిషేకం’, ‘స్మార్ట్‌పూజ’, ‘పూజాస్‌.ఇన్‌’, ‘పూజలు’, ‘కేల్కర్‌గురుజీ’... వంటివన్నీ ఇలాంటి వెబ్‌సైట్లే. చేయించుకునే పూజను బట్టి డబ్బుల్ని ఆన్‌లైన్‌ద్వారా పంపించేస్తే సరిపోతుంది. ఒకప్పుడు విదేశాల్లో ఉండే ఎన్‌ఆర్‌ఐలు మాత్రమే ఇలాంటి పూజా విధానానికి ప్రాధాన్యం ఇచ్చేవారు. ఇప్పుడు కరోనా కారణంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చాలామంది ఈ వర్చువల్‌ పూజలకు ప్రాధాన్యం ఇస్తున్నారని అర్చకులు అంటుంటే... ఇళ్లకు వచ్చి పూజల్ని నిర్వహించినా, వీడియోకాల్‌ ద్వారా చేసినా ఒకటే కాబట్టి... ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇదే మంచిదని చేయించుకునేవారు చెబుతున్నారు. సో, ఈసారి ఇంట్లో ఏదయినా పూజ చేయించాలనుకున్నప్పుడు వర్చువల్‌ పూజారిని ప్రయత్నించి చూస్తే సరి..!


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


ఇంకా..

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని