విహారయాత్రల్నీ డిజైన్‌ చేస్తారు!

రెండుమూడు రోజులు సెలవులు దొరికినప్పుడు... ఏదో ఒక ప్రాంతానికి వెళ్లి వచ్చేయడం వేరు. ఆ విహారయాత్రను ఓ మధుర జ్ఞాపకంగా మార్చుకోవడం వేరు.

Published : 14 Jan 2023 23:46 IST

విహారయాత్రల్నీ డిజైన్‌ చేస్తారు!

రెండుమూడు రోజులు సెలవులు దొరికినప్పుడు... ఏదో ఒక ప్రాంతానికి వెళ్లి వచ్చేయడం వేరు. ఆ విహారయాత్రను ఓ మధుర జ్ఞాపకంగా మార్చుకోవడం వేరు. అలా మధుర జ్ఞాపకంగా మార్చుకోవాలనుకునే వారికోసమే ఇప్పుడు ‘టైలర్‌ మేడ్‌ /కస్టమైజ్డ్‌ టూర్లు’ అందుబాటులోకి వచ్చేశాయి. అంటే... మన అవసరాలూ, ఇష్టాలూ, కోరికలకూ తగినట్లుగా టూర్‌ను డిజైన్‌ చేస్తారన్నమాట. పర్యటక రంగంలో ఈ తరహా టూర్లదే ఇప్పుడు సందడంతా మరి.

కుటుంబమంతా కలిసి సరదాగా ఏదయినా విహారయాత్రకు వెళ్లాలను కున్నప్పుడు... టిక్కెట్లు బుక్‌ చేసుకోవడం తేలికే. కానీ ఆ తరువాతే అక్కడ ఏమేం చూడాలీ, ఏ హోటల్‌లో ఉండాలీ, వంటకాలు బాగుంటాయో లేదో... అన్నిరోజులు తిరగడానికి సరైన కారూ, డ్రైవరూ దొరుకుతారా... షాపింగ్‌ ఎక్కడ చేయాలీ... ఇలా బోలెడు సందేహాలు మొదలవుతాయి. వాటన్నింటికీ పరిష్కారాన్ని చూపించేందుకే ఇప్పుడు టైలర్‌మేడ్‌/కస్టమైజ్డ్‌ టూర్లు అందుబాటులోకి వచ్చి... యాత్రను ఓ మధురజ్ఞాపకంగా మార్చేస్తున్నాయి. ఒకప్పుడు ఎక్కడికైనా వెళ్లినప్పుడు... సరైన సమాచారం ఇచ్చేవాళ్లు లేక అనుకున్న ప్రాంతాలన్నింటినీ చూడలేకపోవడం, ప్రయాణంలో ఇబ్బందులు, హోటల్‌ సరిగ్గా ఉండకపోవడం... తదితర సమస్యలు ఎదురయ్యేవి. ఆ ఇబ్బందులేవీ లేకుండా చేసేందుకు కొన్ని ఆప్‌లూ, సంస్థలూ క్రమంగా అందుబాటులోకి వచ్చినా... మరిన్ని సదుపాయాలతో ఈ టైలర్‌మేడ్‌/కస్టమైజ్డ్‌ టూర్లు పర్యటకులను ఆకట్టుకుంటున్నాయి. వినియోగదారుల అవసరాలకు తగినట్లుగా డిజైన్‌ చేసే ఈ టూర్లతో ఎలాంటి సమస్యా లేకుండా జాలీగా తిరిగి వచ్చేయొచ్చు అన్నమాట.

పర్యటన ఎలా ఉంటుందంటే...  

ఎక్కడికైనా విహారయాత్రకు వెళ్లాలనుకున్నప్పుడు కొంత బడ్జెట్‌ను పెట్టుకోవడం మామూలే. అందులోనే ఏవేవి చూడాలీ, ఎక్కడెక్కడికి వెళ్లాలీ... ఇలా అన్నింటినీ ప్లాన్‌ చేసుకున్నా కొన్నిసార్లు అన్నీ చూడకుండానే వచ్చేస్తుంటాం. ఈ టైలర్‌మేడ్‌ టూర్లతో అలాంటి సమస్యలు ఉండవు. ఎందుకంటే మన బడ్జెట్‌నీ, వెళ్లాలనుకుంటున్న ప్రాంతం, ఉండాలనుకుంటున్న రోజులూ, ఇష్టాలూ, సరదాలూ, వ్యక్తిగత అవసరాలను చెబితే చాలు. ఆ ప్రకారమే మన టూర్‌ను పక్కాగా డిజైన్‌ చేస్తారు. ఉదాహరణకు కేరళకు వెళ్లాలనుకుంటే... అక్కడికి ఫ్లైట్లు లేదా రైళ్లని బుక్‌ చేయడం నుంచీ... బస చేయాలనుకుంటున్న హోటల్‌, రుచి చూడాలనుకుంటున్న పదార్థాలూ ఆ హోటల్‌లో ఉండే సదుపాయాలూ ఇలా అన్నీ వివరిస్తారు. ఆ తరువాత పర్యటకుల అభిరుచి మేరకు- అక్కడ చూడదగ్గ ప్రదేశాల గురించీ వివరిస్తారు. ఆ ప్రకారం ఏ రోజు ఎక్కడికి వెళ్లొచ్చు... అక్కడ ఏమేం చేయొచ్చు... వంటివన్నీ తెలియజేస్తారు. ఇక, కారులో కాకుండా సరదాగా బోట్‌లో ప్రయాణించాలనుకుంటే... ఆ ఏర్పాట్లూ చేస్తారు. టీ తోటల్ని చూడాలనుకున్నా, ఎత్తైన కొండల్ని ఎక్కాలనుకున్నా, గుళ్లూగోపురాలకు వెళ్లాలనుకున్నా, స్థానికులతో సరదాగా మాట్లాడాలనుకున్నా.. ఇలా ప్రతిదీ పర్యటక సంస్థే చూస్తుంది. ఒకవేళ పచ్చని ప్రకృతిని ఆస్వాదిస్తూ... సరదాగా సైకిలు తొక్కాలనుకున్నా, ఆ ఊరివాళ్లతో కలిసి ఉండాలనుకున్నా, అక్కడి ప్రత్యేకమైన వంటకాలను నేర్చుకోవాలనుకున్నా కూడా సంస్థకు తెలియజేయొచ్చు. ఇవేవీ కాకుండా హాయిగా పచ్చని ప్రకృతి మధ్య యోగా చేస్తూ ఆయుర్వేద చికిత్సలు తీసుకోవాలనుకున్నా కూడా ప్రయత్నించొచ్చు. తీరా వెళ్లాక భాష అర్థంకాక గైడ్‌ కావాలనుకున్నా కూడా చెప్పొచ్చు. మనసు మార్చుకుని మన ప్లాన్‌లో లేని చోటుకి వెళ్లి సరదాగా రాక్‌ క్లైంబింగ్‌ లాంటిదేదో చేయాలనుకున్నా కూడా సందేహం లేకుండా అడగొచ్చు. మనం ఆ ప్రాంతంలో ఉన్నన్ని రోజులూ... ఏ ఇబ్బందీ లేకుండా అన్నీ వాళ్లే చూసుకోవడం వల్ల విహారయాత్రను చిరకాలం గుర్తుండిపోయేలా చేసుకోవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే... ఈ కస్టమైజ్డ్‌ టూర్లలో మనమే ఓ సెలెబ్రిటీలా మారిపోయి... ప్రతిదాన్నీ హాయిగా ఆనందిస్తూ... ఆ జ్ఞాపకాలను పదిలపరుచుకోవచ్చు. అలాంటి టూర్లు ఏర్పాటు చేసే సంస్థల్లో ‘కస్టమ్‌ టూర్స్‌ ఇండియా’, ‘నోమాడే ట్రావెల్‌’, ‘ట్రావెల్‌ ట్రయాంగిల్‌’, ‘టూర్‌రాడార్‌’.. వంటి సంస్థలు ఉన్నాయి. కాబట్టి... ఈసారి ఎక్కడికైనా వెళ్లాలనుకున్నప్పుడు ఇలాంటి ప్రయాణాల్ని ఎంచుకుని చూసేయండి మరి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..