న్యూ ఇయర్‌... చాలా స్పెషల్‌!

కొత్త సంవత్సరానికి ప్రపంచమంతా హ్యాపీ హ్యాపీగా స్వాగతం పలికేసింది. కేక్‌ కటింగ్‌లు, ఫ్రెండ్స్‌తో పార్టీలతో ఈ రోజంతా సంబరాలు సాగుతాయి కదా.

Updated : 01 Jan 2023 12:48 IST

న్యూ ఇయర్‌... చాలా స్పెషల్‌!

 

కొత్త సంవత్సరానికి ప్రపంచమంతా హ్యాపీ హ్యాపీగా స్వాగతం పలికేసింది. కేక్‌ కటింగ్‌లు, ఫ్రెండ్స్‌తో పార్టీలతో ఈ రోజంతా సంబరాలు సాగుతాయి కదా. మరి ఈ తారలు కూడా న్యూ ఇయర్‌ వేడుకల్ని ఎలా జరుపుకుంటారో వాళ్ల మాటల్లోనే...


అభిమానుల్ని విష్‌ చేస్తా

- ఎన్టీఆర్‌

కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిన రోజు ఇలా చేయాలీ అలా చేయాలీ అని నేనేమీ ప్లాన్లు వేసుకోను. షూటింగ్స్‌ను బట్టే ఉంటుంది నా ప్రణాళిక. ఇంట్లో ఉంటే మాత్రం డిసెంబరు 31 అర్ధరాత్రి అభిమానులు పెద్ద ఎత్తున వస్తుంటారు. వాళ్లని కలిసి వారి ప్రేమాభిమానాల్ని ఆస్వాదించడం ఎంతో బాగుంటుంది. నిజానికి నటీనటులకు వారి అభిమానులే బలమని నాకు అనిపిస్తుంది. అందుకే కలవడం కుదరని పక్షంలో తప్పనిసరిగా సోషల్‌ మీడియా వేదిక ద్వారా అందరికీ శుభాకాంక్షలు చెబుతా.  నిదానంగా డ్రైవ్‌ చేస్తూ ఇల్లు చేరుకోమని మాత్రం ప్రతి ఒక్కరికీ చెబుతా.


ఆనందం రెట్టింపు

- అల్లు అర్జున్‌

జీక్యూ మ్యాగజైన్‌ నుంచి ‘మ్యాన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు అందుకోవడంతో- ఈసారి న్యూ ఇయర్‌ వేడుకల్లో ఆనందం రెట్టింపు అయిందని చెప్పాలి. చిన్నప్పుడు స్నేహితులకు గ్రీటింగ్‌ కార్డులు అందిస్తూ కొత్త సంవత్సరాన్ని ఆస్వాదించా. కాస్త పెద్దయ్యాక పార్టీ చేసుకుంటూ కొత్త ఏడాదిని ఆహ్వానించేవాడిని. పెళ్లయ్యాక నా భార్య స్నేహతోనే ఆనందంగా గడుపుతూ నూతన సంవత్సర వేడుకల్ని జరుపుకుంటున్నా. ఇప్పుడు పిల్లలతో మా కుటుంబం పెద్దదైంది. బయటకు ఎక్కడికీ వెళ్లకపోతే మేమంతా మా గార్డెన్‌లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ కొత్త సంవత్సర వేడుకలు జరుపుకుంటుంటాం.


తొలి సంబరం

- ఆలియా భట్‌

నాకు ఇంతకు ముందు న్యూ ఇయర్‌ కంటే ఈసారి జరుపుకునే వేడుకలే చాలా చాలా స్పెషల్‌. పెళ్లయ్యాక, పాప పుట్టాక చేసుకుంటున్న తొలి సంబరమిది. పైగా నాకు వ్యక్తిగతంగా, వృత్తిగతంగా ఎన్నో మధురానుభూతులు పంచిన 2022కి భారంగానే వీడ్కోలు చెప్పా. అలానే ఈ ఏడాది కూడా ఉండాలని, అందుకు ఏం చేయాలో ఇవాళే ప్రణాళికలు వేసుకుంటా.  


ఇంట్లో పండుగే

- దుల్కర్‌ సల్మాన్‌

నా దృష్టిలో కొత్త సంవత్సరం వేడుకలంటే కులమతాలకు అతీతంగా జరుపుకునే పండుగ. ఇలాంటి ప్రత్యేక సందర్భాల్లో అమ్మని అస్సలు ఆపలేం. రకరకాల బిర్యానీలూ, స్వీట్లూ వండేస్తుంది. నా స్నేహితుల్నీ పిలవమంటుంది. మా అమ్మకి ఇప్పుడు నా కూతురు కూడా తోడైంది. తనూ నన్ను ఏదో ఒకటి చేయమంటుంది. కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిన రోజు నేను ఆనందంగా ఉంటూ, నా వాళ్లకీ సంతోషాన్ని పంచాలని చూస్తా. అలానే  గడిచిన ఏడాది గురించి నాకు నేను విశ్లేషించుకుని న్యూ ఇయర్‌లో ఎలా ఉండాలో ఆలోచించుకుంటా.


చిల్‌ అవ్వాల్సిందే 

- రష్మిక

కొత్త ఏడాదిని సంబరంగా జరుపుకోవడం నాకిష్టం. ఈ రోజు ఇంట్లో ఉండటం మాత్రం అస్సలు ఇష్టముండదు. కుటుంబసభ్యులతోనో, స్నేహితులతోనో ఏదో ఒక కొత్త ప్రాంతానికి వెళ్లి చిల్‌ అవ్వాలనే చూస్తుంటా. సాధ్యమైనంత వరకూ సంతోషంగా ఉంటా. అస్సలు షూటింగ్‌లో పాల్గొనాలని ఉండదు. తప్పనిసరి అయితే షూట్‌కి వెళ్లి టీమ్‌తో ఎంజాయ్‌ చేస్తా.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..