నాన్‌వెజ్‌ వేపుడు... నచ్చేలా!

మాంసాహారం అనగానే మసాలా పదార్థాలు చేర్చి గ్రేవీ కూరల మాదిరి వండేస్తుంటాం కదూ. ఈసారి అలా కాకుండా వాటిని వేపుడు కూరల్లా వేయిద్దామా.. అన్నంతోనే కాదు విడిగానూ తినేయొచ్చు.

Published : 16 Jun 2024 00:08 IST

మాంసాహారం అనగానే మసాలా పదార్థాలు చేర్చి గ్రేవీ కూరల మాదిరి వండేస్తుంటాం కదూ. ఈసారి అలా కాకుండా వాటిని వేపుడు కూరల్లా వేయిద్దామా.. అన్నంతోనే కాదు విడిగానూ తినేయొచ్చు.

రొయ్యల ఫ్రై

కావలసినవి: రొయ్యలు: అరకేజీ, నూనె: అరకప్పు, బియ్యప్పిండి: రెండు చెంచాలు, కరివేపాకు రెబ్బలు: రెండు.
మసాలా కోసం: ఉల్లిపాయలు: రెండు, అల్లం: చిన్నముక్క, వెల్లుల్లిరెబ్బలు: నాలుగు, జీలకర్ర: చెంచా, ఎండుమిర్చి: ఆరు, పసుపు: పావుచెంచా,
మిరియాలు: అరచెంచా, నిమ్మరసం: చెంచా, ఉప్పు: తగినంత.

తయారీ విధానం: రొయ్యల్ని శుభ్రం చేసి పెట్టుకోవాలి. మసాలాకోసం పెట్టుకున్న పదార్థాలన్నింటినీ మిక్సీలో వేసుకుని పేస్టులా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని రొయ్యలకు పట్టించి ఫ్రిజ్‌లో పెట్టాలి. అరగంటయ్యాక రొయ్యలపైన బియ్యప్పిండి చల్లి కలపాలి. ఇప్పుడు స్టవ్‌మీద కడాయిని పెట్టి నూనె వేయాలి. అది వేడెక్కాక కరివేపాకును వేయించి తరువాత రొయ్యలు వేసి ఎర్రగా వేయించుకోవాలి.


ఫిష్‌ పెప్పర్‌ రోస్ట్‌

కావలసినవి: ఏదయినా ఒకరకం చేప: అరకేజీ, ఉల్లిపాయ పేస్టు: కప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు: రెండు చెంచాలు, కారం: రెండు చెంచాలు, దనియాలపొడి: చెంచా, పసుపు: అరచెంచా, గరంమసాలా: చెంచా, మొక్కజొన్నపిండి: రెండు చెంచాలు, టొమాటో పేస్టు: అరకప్పు, మిరియాలపొడి: ఒకటింబావు చెంచా, ఉప్పు: తగినంత, నిమ్మరసం: చెంచా, నూనె: పావుకప్పు.  

తయారీ విధానం: చేపముక్కలపైన అరచెంచా మిరియాలపొడి, అరచెంచా కారం, పావుచెంచా పసుపు, మొక్కజొన్నపిండి, అల్లంవెల్లుల్లి పేస్టు, తగినంత ఉప్పు, నిమ్మరసం వేసుకుని మారినేట్‌ చేసుకోవాలి.
పావుగంటయ్యాక ఈ చేపముక్కల్ని రెండు టేబుల్‌స్పూన్ల నూనెలో ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి. అదే కడాయిలో మిగిలిన నూనె వేసి ఉల్లిపాయ పేస్టు వేయించుకోవాలి. తరువాత  కారం, దనియాలపొడి, పసుపు, గరంమసాలా,  టొమాటో పేస్టు  వేసి అన్నింటినీ మరోసారి వేయించాలి. ఈ మిశ్రమం బాగా మగ్గాక వేయించుకున్న చేప ముక్కలు, మిగిలిన మిరియాలపొడి వేసి ఈ మసాలా చేపముక్కలకు పట్టేవరకూ వేయించుకుని దింపేయాలి.  


మటన్‌ ఫ్రై

కావలసినవి: మటన్‌: అరకేజీ, ఉల్లిపాయలు: రెండు పెద్దవి,  కరివేపాకు రెబ్బలు: మూడు, పసుపు: అరచెంచా, అల్లంవెల్లుల్లి పేస్టు: రెండు చెంచాలు, నూనె: పావుకప్పు, దనియాలపొడి: రెండు చెంచాలు, సోంపుపొడి: చెంచా, గరంమసాలా: అరచెంచా, మిరియాలపొడి: అరచెంచా, కారం: రెండు టేబుల్‌స్పూన్లు, ఉప్పు: తగినంత.  

తయారీ విధానం: స్టవ్‌మీద కుక్కర్‌ను పెట్టి మటన్‌ ముక్కలు, పసుపు, అల్లంవెల్లుల్లి పేస్టు, చెంచా ఉప్పు వేసి... సరిపడా నీళ్లు పోసి మూత పెట్టి నాలుగు కూతలు వచ్చేవరకూ ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్‌మీద కడాయిని పెట్టి నూనె వేయాలి. అది వేడెక్కాక కరివేపాకు, ఉల్లిపాయముక్కల్ని ఎర్రగా వేయించుకోవాలి. ఇందులో ఉడికించిన మటన్‌ ముక్కల్ని వేసి మరోసారి వేయించుకుని దనియాలపొడి, సోంపుపొడి, గరంమసాలా, మిరియాలపొడి, కారం, మరో పావుచెంచా ఉప్పు వేసి అన్నింటినీ బాగా వేయించి దింపేస్తే చాలు.  


చికెన్‌ గార్లిక్‌

కావలసినవి: చికెన్‌ ముక్కలు: అరకేజీ, అల్లంవెల్లుల్లి పేస్టు: టేబుల్‌స్పూను, పసుపు: అరచెంచా, ఉప్పు: తగినంత, నిమ్మకాయ: ఒకటి, మిరియాలు: చెంచా, దనియాలు: టేబుల్‌స్పూను, జీలకర్ర: చెంచా, యాలకులు: అయిదు, లవంగాలు: నాలుగు, దాల్చినచెక్క: చిన్నముక్క, కారం: రెండు టేబుల్‌స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు: ఇరవై, నూనె: పావుకప్పు, ఉల్లిపాయలు: రెండు పెద్దవి, కరివేపాకు రెబ్బలు: మూడు.  

తయారీ విధానం: చికెన్‌ ముక్కలపైన అల్లంవెల్లుల్లి పేస్టు, పసుపు, తగినంత ఉప్పు, సగం నిమ్మకాయ రసం వేసి అన్నింటినీ కలిపి పావుగంట పక్కన పెట్టేయాలి. మిరియాలు, దనియాలు, జీలకర్ర, యాలకులు, లవంగాలు, దాల్చినచెక్క, కారం, వెల్లుల్లి రెబ్బలు మిక్సీలో వేసుకుని పొడిలా చేసుకోవాలి. స్టవ్‌మీద కడాయిని పెట్టి నూనె వేసి ఉల్లిపాయ ముక్కల్ని ఎర్రగా వేయించుకోవాలి. ఇందులో చికెన్‌ ముక్కలు వేసి వేయించి మూత పెట్టాలి. మధ్యమధ్య కలుపుతూ ఉండి చికెన్‌ ఉడికాక చేసిపెట్టుకున్న వెల్లుల్లి మసాలా, కరివేపాకు రెబ్బలు వేసి కలపాలి. ఈ మసాలా చికెన్‌ముక్కలకు పట్టి.. బాగా వేగాక మిగిలిన నిమ్మకాయ రసాన్ని వేసి మరోసారి కలిపి స్టవ్‌ని కట్టేయాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..