షిర్డీలో... ఓ సేవాలయం!

కడుపున పుట్టినవారు ఉన్నా... కనికరించి అన్నం పెట్టేవాళ్లు లేక చివరి మజిలీలో బతుకును భారంగా నెట్టుకొచ్చే వృద్ధులు ఎందరో మనకు తారసపడుతూనే ఉంటారు.

Updated : 27 Nov 2022 18:41 IST

షిర్డీలో... ఓ సేవాలయం!

కడుపున పుట్టినవారు ఉన్నా... కనికరించి అన్నం పెట్టేవాళ్లు లేక చివరి మజిలీలో బతుకును భారంగా నెట్టుకొచ్చే వృద్ధులు ఎందరో మనకు తారసపడుతూనే ఉంటారు. అలాంటి వాళ్లందర్నీ అక్కున చేర్చుకుంటున్నారు విజయవాడకు చెందిన శ్రీనివాస్‌ - సుధారాణి దంపతులు. ప్రముఖ పుణ్యక్షేత్రం షిర్డీలో వృద్ధాశ్రమం నడుపుతూ పండుటాకుల్లో పరమాత్ముణ్ని చూసుకుంటున్నవారి సేవా ప్రస్థానమిది.

ఈ రోజుల్లో నలుగురు కుటుంబ సభ్యులున్న మధ్యతరగతి సంసారాన్ని ఈదడమంటేనే గగనం. అలాంటిది నూట 140 మందిని- అదీ... ఎవరి పని వాళ్లు చేసుకోవడం చేతకాని అభాగ్య వృద్ధుల్ని చూసుకోవడం అంటే మాటలు కాదు. కానీ, శ్రీనివాస్‌- సుధారాణి దంపతులు ఇరవై రెండేళ్లుగా చేస్తున్నది అదే. కన్నబిడ్డలు ఈసడించుకుని వదిలించుకున్నవారినీ, పెళ్లిళ్లు కాని- పిల్లలు లేని వృద్దుల్ని వీళ్లు ప్రేమగా చూసుకుంటుకున్నారు. చివరి రోజుల్లో కడుపునిండా తిండీ, కంటికి నిద్రా, వేళకి మందులూ- ఆధ్యాత్మిక సేవతో మానసిక సాంత్వన అందిస్తూ అభాగ్య వృద్ధులకు అమ్మానాన్నలయ్యారు.

చిన్నతనం నుంచి సాయిబాబా భక్తుడైన శ్రీనివాస్‌ చదువు, ఉద్యోగం గురించి ఏనాడూ ఆలోచించలేదు. భక్తిలో నిమగ్నమై విజయవాడ నుంచి వెళ్లి హైదరాబాద్‌లోని మల్లాపూర్‌ సాయిబాబా గుడిలో పని చేయడం మొదలుపెట్టాడు. ఆ సమయంలో పిల్లలు నిర్లక్ష్యం చేసిన వృద్ధులు తరచూ బాబా గుడికి వెళ్లేవారు. నిత్యం అక్కడే ఉండే శ్రీనివాస్‌తో తమ కష్టాలు చెప్పుకుని బాధపడేవారు. కొందరైతే తమకి కూడా అక్కడే ఆశ్రయం కల్పించమని వేడుకునేవారు. వాళ్ల బాధల్ని విని ఎంతో బాధపడేవాడు. అందుకోసం ఏం చేయాలో తెలిసేది కాదు. అలాగని వాళ్లని తనతోపాటే గుడిలో ఉంచడం కూడా సాధ్యం కాదు కదా అని ఆలోచించిన శ్రీనివాస్‌- క్రమంగా అలాంటి వాళ్లను బాగా చూసుకోవాలనే నిర్ణయానికొచ్చేశాడు. పైగా షిర్డీలోనే ఆ సేవ చేయాలని భావించాడు. మొదట 1997లో ‘ద్వారకామాయి సేవా ట్రస్టు’(ఫోన్‌:7020466372)ను హైదరాబాద్‌లోనే రిజిష్టరు చేయించాడు. అప్పటికే ఆధ్యాత్మిక సేవలో పడి తన గురించి ఆలోచించుకోవట్లేదని శ్రీనివాస్‌ తల్లిదండ్రులు ఎంతో బాధపడేవారు. వృద్ధుల్ని చూస్తాననీ, ఆశ్రమం పెడతాననీ చెప్పినప్పుడు చాలా భయపడిపోయారు. కానీ శ్రీనివాస్‌ తమ్ముడు రామ్‌మోహన్‌, కొందరు సాయి భక్తులు అండగా నిలబడ్డారు. వారి సహకారంతో శ్రీనివాస్‌ షిర్డీలో ఎకరం స్థలం కొన్నాడు. అప్పటికి సుధారాణితో పెళ్లై రెండేళ్లు. ఓ బాబు కూడా పుట్టాడు. దాంతో భార్యనీ, నెలల కొడుకునీ తీసుకుని షిర్డీ వెళ్లి కొనుక్కున్న స్థలంలో చిన్న భవనం నిర్మించి- 2000 సంవత్సరంలో ముగ్గురు వృద్ధులతో సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాడు. భాష రాదూ, మన ప్రాంతం కాదూ, భవనానికి కరెంటూ నీటి వసతీ లేదు. చేతిలో ఉన్నదంతా స్థలం కొనడానికీ, భవనం నిర్మాణానికీ సరిపోయింది. పైగా కొంత అప్పూ చేయడంతోపాటు భార్య సుధారాణి నగలు కూడా తాకట్టుపెట్టేశాడు. ఎన్ని చేసినా ఆయన లక్ష్యం ఒకటే- ఎవరూ తమకు అక్కర్లేదని ఈసడించుకుని వదిలించుకున్న వృద్ధుల్ని సంతోషంగా చూసుకోవడం. అందుకే ఆర్థిక సమస్యలూ, వసతుల లేమీ ఇబ్బంది పెట్టినా పని వాళ్లని కూడా పెట్టుకోకుండా సంతోషంగానే అన్నీ చేసేవారు శ్రీనివాస్‌ దంపతులు. మొదట్లో నీటి వసతి లేక సుదూరం నుంచి నీటిని మోసుకొచ్చేవారు. తమ పసిబిడ్డను చూసుకుంటూనే- వృద్ధులందరికీ స్నానాలు చేయించడం, వండి పెట్టడం, తినిపించడం, వాళ్ల బట్టలు ఉతకడం, మందులు వేయడం అన్నీ చేసేవారు. వాళ్లు గదుల్ని మురికిగా చేసినా, మలమూత్ర విసర్జనలు చేసినా ఈసడించుకోకుండా ఓపిగ్గా శుభ్రం చేసేవారు. ఎవరికి ఏ అనారోగ్య సమస్య వచ్చినా సైకిల్‌ మీదే హాస్పిటల్‌కీ తీసుకెళ్లి సొంత ఖర్చులతో వైద్యం చేయించేవారు. అలానే శ్రీనివాస్‌- సుధారాణిలు కూడా వాళ్లకంటూ ప్రత్యేకంగా ఇల్లేమీ తీసుకోలేదు. ఏ సంస్థ అయినా వృద్ధిలోకి రావాలంటే దాన్ని పూర్తిగా కనిపెట్టుకుని ఉండాలన్న భావనతో ఆశ్రమంలోనే వృద్ధులతోపాటే ఉండేవారు. వాళ్లకి పెట్టిందే తామూ తినేవారు. కొన్నాళ్లకి ఓ పాప కూడా పుట్టినా సుధారాణి అక్కడే ఉండిపోయింది. తన పిల్లల్లానే వృద్ధుల్నీ చూసుకునేది. ఆ పిల్లలు కూడా వాళ్ల అమ్మానాన్నలానే ఆప్యాయంగా ‘తాతా బామ్మా’ అంటూ ముసలివాళ్లకి కబుర్లు చెబుతూ- వాళ్ల పక్కనే పడుకునేవారు. సేవా కార్యక్రమాల్లోనూ పాలుపంచుకునేవారు.

ఆధునిక వసతులతో

చేతిలో డబ్బు లేకపోయినా దాతలు, స్నేహితుల సాయంతో అభాగ్య వృద్ధుల్ని చూసుకుంటున్న శ్రీనివాస్‌ కుటుంబాన్ని చాలామంది తక్కువగా చూసేవారు. కొందరు బంధువులు మాట్లాడటం, కలవడం, కలుపుకోవడం మానేశారు. తమదికాని ప్రాంతంలో శ్రీనివాస్‌ దంపతులు చేస్తున్న నిస్వార్థ సేవ గురించి అందరికీ తెలియడానికి కూడా చాలా సమయం పట్టింది. తన గురించి తెలిశాక 2003 నుంచి షిర్డీ సంస్థాన్‌ ట్రస్టు రాత్రి పూట ఆశ్రమానికి భోజనం పంపడం మొదలుపెట్టింది. ఆ తరవాత ట్రస్టు ఆసుపత్రిలో ఉచితంగా వైద్య సదుపాయం, ఆశ్రమంలో నీటి వసతినీ కల్పించింది. కొన్నాళ్లకి శ్రీనివాస్‌ సేవ గురించి ఆ నోటా ఈ నోటా తెలియడంతో తెలుగు రాష్ట్రాలతోపాటు, మహారాష్ట్ర, కర్ణాటక, గోవా, పంజాబ్‌.. ఇలా రకరకాల ప్రాంతాలకు చెందిన వారు ఆశ్రమానికి రాసాగారు. ఎంతమంది వచ్చినా ప్రేమగా ఆదరిస్తున్న శ్రీనివాస్‌ చేసే మంచి పనులు కశ్మీర్‌కు చెందిన అరవింద్‌ టిక్కూ అనే వ్యాపారి దృష్టికెళ్లాయి. వ్యాపారంలో మంచి స్థాయికి వెళ్లిన ఆయన తన సంపాదనలో కొంత మొత్తాన్ని సేవకు వెచ్చించాలనుకున్నాడు. షిర్డీలో సాయిబాబా దర్శనానికి వెళ్లినప్పుడు అక్కడ శ్రీనివాస్‌ నడుపుతున్న వృద్ధ్దాశ్రమం గురించి విన్నాడు. వెంటనే ఆశ్రమం వివరాలు కనుక్కుని స్వయంగా అక్కడికి వెళ్లాడు వ్యాపారవేత్త అరవింద్‌ టిక్కూ. తల్లిదండ్రుల్నే భారంగా భావించే ఈ రోజుల్లో ఏమీ కాని వారి కోసం ఎంతో చేస్త్తోన్న శ్రీనివాస్‌ దంపతుల సేవా కార్యక్రమాల్ని చూసి ఆశ్చర్యపోయాడు. అలాంటి వారిని ప్రోత్సహిస్తే ఇంకెన్నో మంచి పనులు చేస్తారని భావించిన అరవింద్‌ టిక్కూ వాళ్ల కోసం ఏదైనా చేయాలనుకున్నాడు. దాదాపు రెండున్నర కోట్లు ఖర్చు పెట్టి ఆత్యాధునిక సౌకర్యాలతో 2012లో- 108 పడకల సామర్థ్యంతో మూడంతస్తుల భవనాన్ని నిర్మించి ఇచ్చాడు. ఆ సమయంలోనే- శ్రీనివాస్‌ ఆశ్రమం కోసం కొనుక్కున్న స్థలం ప్రభుత్వానికి చెందినదనీ, అమ్మిన వ్యక్తి మోసం చేశాడనీ అర్థమైంది. దాంతో తరచూ ప్రభుత్వం నుంచి నోటీసులు వచ్చేవి. దాని ప్రకారం ఆ స్థలం, భవనం ప్రభుత్వ పరమైతే తనకు వ్యక్తిగతంగా వచ్చే నష్టం లేకపోయినా అందులో ఆశ్రయం పొందుతున్న వృద్ధులు ఏమవుతారోనని భాధపడేవారు. కొన్నిసార్లు ఆ ఆలోచనే నిద్రపోనిచ్చేది కాదు. ఆ స్థలం కోసమని ప్రభుత్వాధికారుల్నీ, నాయకుల్నీ సంప్రదించేవాడు. దాదాపు పదేళ్లపాటు ఎన్నో ఇబ్బందులు పడ్డాక ఈ మధ్యనే ఆ సమస్యకు పరిష్కారం దొరికింది. తనకోసం ఆలోచించుకోకుండా అభాగ్యుల కోసం బతుకుతున్న శ్రీనివాస్‌ని దగ్గరగా చూసిన కలెక్టర్‌ ఆయన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. శ్రీనివాస్‌ కోసం కాకపోయినా ఆయన చేస్తోన్న మంచిపనినైనా గుర్తించి స్థలం వివాదాన్ని పరిష్కరించాలని భావించిన కలెక్టర్‌- ఆ స్థలాన్ని ప్రభుత్వానికి చెందినదిగానే భావించి గవర్నమెంట్‌ రేటు ప్రకారం అరవై లక్షలు చెల్లించమని తీర్పునిచ్చారు. అలా- కొనుక్కున్న స్థలాన్నే మళ్లీ కొనుగోలు చేసిన శ్రీనివాస్‌ సమస్యలన్నీ దూరం చేసుకుని పేదల సేవలోనే నిమగ్నమయ్యాడు. ఇక, దాతలిచ్చే డబ్బు రూపాయి కూడా తమ సొంత అవసరాలకు వినియోగించుకోరు శ్రీనివాస్‌- సుధారాణిలు. ప్రతినెలా విజయవాడ నుంచి వచ్చే సొంత ఇంటి అద్దెనే వ్యక్తిగత ఖర్చులకూ, పిల్లల చదువులకీ వాడతారు.

పండుగలా ప్రతిరోజూ

ప్రస్తుతం 140 మంది వృద్ధులకు ఆశ్రయం కల్పిస్తున్న ఆశ్రమంలో రోజూ- పొద్దున్నే అందరికీ స్నానాలు చేయిస్తారు. వాళ్లందరి బట్టలూ ఉతకడానికి సెంట్రల్‌ వాషింగ్‌ మెషీన్‌, డ్రయ్యర్ల ఏర్పాటూ ఉంది. ఇంట్లో మాదిరిగా చక్కగా ఏ పూటకాపూట బట్టలు ఉతికి మడత పెట్టి పెడతారు. ఎప్పటికప్పుడు వేడివేడిగా వండి బాబాకి నైవేద్యం పెట్టాక వృద్ధులకు పెడతారు. ఉదయం టీ, టిఫిన్లు అయ్యాక ఆరోగ్యం బాగోలేని వారికి మందులిస్తారు. ఎవరికైనా ట్రీట్‌మెంట్‌ అవసరమంటే హాస్పిటల్‌కి తీసుకెళతారు. ఆ తరవాత భజనలూ, పూజలూ చేయిస్తారు. మధ్యాహ్నం అన్నం, కూర, వేపుడు, పచ్చడి, స్వీటు, రోటీ, సాంబారు, పెరుగుతో కమ్మటి భోజనం పెడతారు. అదయ్యాక కాలక్షేపం కోసం సినిమాలు చూపిస్తారు. సాయంత్రం టీ, స్నాక్స్‌ అందించాక మళ్లీ ఆధ్యాత్మిక కార్యక్రమాలుంటాయి. అవి అయ్యాక రాత్రిపూట ఏడుగంటలకల్లా వారికి భోజనాలు పెట్టి మందులు వేస్తారు. కంటిపాపల్లా చూసుకుంటున్న ఆ వృద్ధులుండే పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని ప్రతి మూడు గంటలకోసారి మరుగుదొడ్లు శుభ్రం చేస్తారు. పసిపిల్లల మాదిరి ఎప్పటికప్పుడు డైపర్లు మార్చడం, గదులు తుడవడం వంటివన్నీ చేస్తారు. అందుకోసం దాదాపు 30 మంది సిబ్బంది పని చేస్తారు. వాళ్లందరికీ తన సొంత ఖర్చులతో ఆరోగ్యబీమా ఇప్పించి ఉపాధినిస్తున్నారు శ్రీనివాస్‌ దంపతులు. కరోనా సమయంలో ఏ ఒక్కరికీ ప్రాణ హాని లేకుండా ప్రాణం పెట్టి చూసుకున్న శ్రీనివాస్‌ దంపతులు ఆ వృద్ధుల్ని తమ తల్లిదండ్రులుగానే భావిస్తారు. అందుకే అక్కడ ఉంటానికి వెళ్లిన ప్రతి ఒక్కరికీ కొత్త బట్టలే కొని వేస్తారు. పండుగలొస్తే వాళ్ల పిల్లలతోపాటు వృద్ధులకీ ఒక్కొక్కరికీ రెండు జతల బట్టలు కొంటారు. ప్రతి ఒక్కర్నీ వేడుకల్లో భాగం చేస్తారు. ఇక ఆశ్రమంలో ఎవరు మరణించినా శ్రీనివాసే వారి అంత్యక్రియలు నిర్వహిస్తారు. పేగు బంధం లేకపోయినా అభాగ్య వృద్ధులు ఆనందంగా ఆఖరి శ్వాస విడిచే వరకూ ప్రేమగా చూసుకుంటున్న ఆ దంపతులు తాము చేసేది మానవ సేవ కాదు మాధవ సేవ అని నమ్ముతారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..