ఊరించే... ఉల్లి రుచులు!

కొన్నిరకాల కూరల్లో, సాంబారులో ఉల్లిపాయ వేస్తేనే రుచి. అలాగని ఎప్పుడూ ఇతర పదార్థాలతో వాటిని కలిపి వండితే మజా ఏముంటుంది.

Published : 19 Nov 2022 23:30 IST

ఊరించే... ఉల్లి రుచులు!

కొన్నిరకాల కూరల్లో, సాంబారులో ఉల్లిపాయ వేస్తేనే రుచి. అలాగని ఎప్పుడూ ఇతర పదార్థాలతో వాటిని కలిపి వండితే మజా ఏముంటుంది. అందుకే... ఈసారి కేవలం ఉల్లిపాయలతోనే నోరూరించే వంటకాలను ప్రయత్నించేద్దాం రండి.


ఆనియన్‌ రింగ్స్‌

కావలసినవి: పెద్ద ఉల్లిపాయలు: మూడు, మైదా: అరకప్పు, మొక్కజొన్నపిండి: పావుకప్పు, వెల్లుల్లి పేస్టు: అరచెంచా, ఉప్పు: తగినంత, కారం: చెంచా, చాట్‌మసాలా: చెంచా, సెనగపిండి: రెండు చెంచాలు, నూనె: వేయించేందుకు సరిపడా.

తయారీ విధానం: ఉల్లిపాయల్ని చక్రాల్లా కోసుకుని అన్నింటినీ వేరు చేసుకుని పెట్టుకోవాలి. మరో గిన్నెలో నూనె తప్ప మిగిలిన పదార్థాలను వేసుకుని కలుపుకోవాలి. ఆ తరువాత నీళ్లు పోస్తూ బజ్జీల పిండిలా చేసుకుని పావుగంట నాననివ్వాలి. ఇప్పుడు స్టౌమీద కడాయి పెట్టి నూనె వేయాలి. అది వేడెక్కాక విడదీసిన ఉల్లిపాయ చక్రాలను పిండిలో ముంచుతూ... కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి.


ఉల్లికారం

కావలసినవి: ఉల్లిపాయలు: నాలుగైదు, ఎండుమిర్చి: ఇరవై, చింతపండు: నిమ్మకాయంత, జీలకర్ర: చెంచా, ఉప్పు: తగినంత, నూనె: మూడు టేబుల్‌స్పూన్లు, ఆవాలు: చెంచా, సెనగపప్పు: చెంచా, మినప్పప్పు: చెంచా, ఇంగువ: పావుచెంచా.

తయారీ విధానం: ఉల్లిపాయముక్కలు, ఎండుమిర్చి, చింతపండు, జీలకర్ర, తగినంత ఉప్పు మిక్సీలో వేసుకుని మెత్తని పేస్టులా చేసుకోవాలి. ఇప్పుడు స్టౌమీద కడాయి పెట్టి నూనె వేయాలి. అది వేడెక్కాక ఆవాలు, సెనగపప్పు, మినప్పప్పు, ఇంగువ వేసి వేయించుకోవాలి. ఇందులో ముందుగా చేసిపెట్టుకున్న ఉల్లికారాన్ని వేసి బాగా కలిపి స్టౌని సిమ్‌లో పెట్టాలి. నూనె పైకి తేలేవరకూ వేయించుకుని స్టౌ కట్టేస్తే సరి. ఈ పచ్చడి వారం వరకూ నిల్వ ఉంటుంది.


మసాలా కూర

కావలసినవి: చిన్న ఉల్లిపాయలు: పదిహేను, పసుపు: అరచెంచా, కారం: చెంచా, గరంమసాలా: అరచెంచా, ఉప్పు: తగినంత. కర్రీకోసం: నూనె: రెండు టేబుల్‌స్పూన్లు, ఆవాలు: చెంచా, జీలకర్ర: చెంచా, ఇంగువ: చిటికెడు, కరివేపాకు రెబ్బలు: నాలుగు, ఉల్లిపాయ: ఒకటి, వెల్లుల్లి రెబ్బలు: మూడు, అల్లం: చిన్న ముక్క, పసుపు: పావుచెంచా, కారం: చెంచా, దనియాలపొడి: చెంచా, గరంమసాలా: ముప్పావు చెంచా, క్యాప్సికం: ఒకటి, టొమాటో గుజ్జు: ఒకటిన్నర కప్పు, గిలకొట్టిన పెరుగు: పావుకప్పు, కసూరీమేథీ: అరచెంచా.

తయారీ విధానం: ఉల్లిపాయల పొట్టు తీసి.. అక్కడక్కడా గాట్లు పెట్టి మసాలా పట్టించాలి. ఇందుకోసం పసుపు, కారం, గరంమసాలా, అరచెంచా ఉప్పు ఓ గిన్నెలో వేసి కలిపి ఈ మిశ్రమాన్ని ఉల్లిపాయలకు పట్టించి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టౌమీద కడాయి పెట్టి నూనె వేయాలి. అది వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు వేయించాలి. ఇందులో ఉల్లిపాయ ముక్కలు, అల్లం-వెల్లుల్లి తరుగు వేసి మరోసారి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేగాక పసుపు, కారం, దనియాలపొడి, గరంమసాలా, ఉప్పు, క్యాప్సికం ముక్కలు, టొమాటో గుజ్జు, పెరుగు వేసుకుని బాగా కలిపి అరకప్పు నీళ్లు పోయాలి. నిమిషయ్యాక మసాలా పట్టించిన ఉల్లిపాయల్ని వేయాలి. ఉల్లిపాయలు మెత్తగా అయ్యాక కసూరీమేథీ వేసి దింపేయాలి.


ఉల్లి పరోటా

కావలసినవి: గోధుమపిండి: కప్పు, ఉప్పు: తగినంత, కరిగించిన నెయ్యి: అరకప్పు, నూనె: నాలుగు చెంచాలు, జీలకర్ర: చెంచా, పచ్చిమిర్చి: ఒకటి, సెనగపిండి: టేబుల్‌స్పూను, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు: కప్పు, కారం: చెంచా, చాట్‌మసాలా: చెంచా, కసూరీమేథీ: చెంచా, కొత్తిమీర తరుగు: రెండు చెంచాలు.

తయారీ విధానం: ఓ గిన్నెలో గోధుమపిండి, అరచెంచా ఉప్పు వేసుకుని నీళ్లు చల్లుకుంటూ చపాతీ పిండిలా చేసుకోవాలి. దీనిపైన చెంచా నూనె వేసి మరోసారి కలిపి మూత పెట్టాలి. ఇప్పుడు స్టౌమీద కడాయి పెట్టి మిగిలిన నూనె వేసి... జీలకర్ర, పచ్చిమిర్చి వేయించుకుని సెనగపిండి వేయాలి. సెనగపిండి కూడా వేగాక ఉల్లిపాయముక్కలు వేసి వేయించుకోవాలి. తరువాత కారం, చాట్‌మసాలా, తగినంత ఉప్పు, కసూరీమేథీ, కొత్తిమీర తరుగు వేసి వేయించుకుని స్టౌని కట్టేయాలి. ఈ మిశ్రమం పూర్తిగా చల్లారాక పరోటా చేసుకోవాలి. కొద్దిగా పిండిని తీసుకుని మందంగా చపాతీలా ఒత్తి... ఇందులో రెండు చెంచాల ఉల్లి మిశ్రమాన్ని ఉంచి అంచుల్ని మూసి మళ్లీ ఒత్తాలి. ఇలా చేసుకున్న పరోటాను వేడిపెనం మీద ఉంచి.. నెయ్యి వేసుకుంటూ రెండు వైపులా కాల్చుకుని తీసుకోవాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..