Rishi Sunak: ఆ రోజు ఎంతో బాధ పడ్డా...

పిన్నవయసులోనే బ్రిటన్‌ ప్రధాని పీఠాన్ని అధిరోహించి యావత్‌ప్రపంచం దృష్టిని తన వైపు తిప్పుకున్నారు  రిషి సునాక్‌.  ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి అల్లుడిగానే తప్ప ఆయన వ్యక్తిగత జీవితం గురించి మనకు తెలిసింది తక్కువే. మరి ఆ విశేషాలేంటో రిషి మాటల్లోనే విందామా!

Updated : 06 Nov 2022 11:15 IST

Rishi Sunak: ఆ రోజు ఎంతో బాధ పడ్డా...

పిన్నవయసులోనే బ్రిటన్‌ ప్రధాని పీఠాన్ని అధిరోహించి యావత్‌ప్రపంచం దృష్టిని తన వైపు తిప్పుకున్నారు  రిషి సునాక్‌.  ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి అల్లుడిగానే తప్ప ఆయన వ్యక్తిగత జీవితం గురించి మనకు తెలిసింది తక్కువే. మరి ఆ విశేషాలేంటో రిషి మాటల్లోనే విందామా!


అలవాటు
కోకకోలాకు సంబంధించిన వస్తువుల్ని సేకరించడం చిన్నప్పట్నుంచీ అలవాటు. మా పిల్లలు ఇప్పటికీ ఆ అలవాటును ఆటపట్టిస్తుంటారు. అంతేకాదు, నేను కోక్‌కి వీరాభిమానిని... కాదు కాదు, అంతకు మించి బానిసను అని చెబితేనే బాగుంటుందేమో.

ఆరోగ్యం కోసం
వారంలో ఒకటీ రెండ్రోజులు ఉపవాసం ఉంటా. మిగిలిన రోజుల్లో నచ్చినవి తింటూనే వ్యాయామాలు చేసి కెలోరీలు కరిగించుకుంటుంటా. ఆ సమయంలో చెవిలో బ్రిట్నీస్పియర్‌ పాటలు వినపడాల్సిందే. లేకపోతే ఎక్సర్‌సైజ్‌ చేసినట్టుండదు.

 


స్ఫూర్తి


మా అమ్మానాన్నలే.. నన్ను పేరున్న విద్యాసంస్థల్లో చదివించాలని వారెన్నో త్యాగాలు చేశారు. అవన్నీ చూస్తూ పెరిగిన నేను ఎప్పుడూ క్లాస్‌లో ఫస్ట్‌ ఉండాలని కష్టపడి చదివేవాణ్ణి. బాగా డబ్బు సంపాదించాలని కూడా అనుకునేవాణ్ణి.


ఇష్టంగా తినేవి


ఇడ్లీ, దోశల్ని సాంబారు చట్నీలతో తినడం చాలా ఇష్టం. బెంగళూరు వచ్చిన ప్రతిసారీ అక్కడ డెబ్బై ఏళ్లుగా రుచికరమైన దోశలకు ప్రసిద్ధిగాంచిన విద్యార్థి భవన్‌కు వెళ్లి మరీ తింటుంటా. అలానే, అక్షతతో కలిసి టీ తాగడం బాగా ఇష్టమైన కాలక్షేపం.  


సెంటిమెంట్‌


ఏ కొత్త పని మొదలుపెట్టినా తప్పకుండా పూజ చేయాల్సిందే. ఆవుని పూజించడం అమ్మ నుంచి నేర్చుకున్నా. ఎన్నికల ప్రచారం కూడా గోమాతని పూజించాకే మొదలుపెట్టా. అలానే నేను పని చేసుకునే టేబుల్‌ మీద నా ఇష్టదైవమైన గణపతి విగ్రహం ఉంటుంది.


మంచిపని

విద్యార్థిగా చదువుతోపాటు, జీవితపాఠాలు నేర్చుకున్న వించెస్టర్‌ కాలేజీ అభివృద్ధి కోసం దాదాపు 95లక్షల రూపాయలు విరాళంగా అందించా. చాలా సేవా కార్యక్రమాలు చేసినా బయటకు చెప్పడం ఇష్టముండదు. ఇది కూడా వించెస్టర్‌ కాలేజీ మేనేజ్‌మెంట్‌ దాతల పేర్లను వెల్లడించడంతోనే బయటకొచ్చింది.


అభిమానించేది!

భారతీయ సంప్రదాయాల్నీ, కళల్నీ బాగా అభిమానిస్తా. అందుకే మా అమ్మాయికి కూచిపూడి నేర్పించాం. అప్పుడప్పుడూ తనతో ప్రదర్శనలూ ఇప్పించడానికి ఆసక్తి చూపుతుంది అక్షత.


వినోదం

వినోదమంటే సినిమాలే గుర్తొస్తాయి. చిన్నప్పట్నుంచీ టీవీకి అతుక్కుపోయి మరీ సినిమాలు చూడటం అలవాటు. స్టార్‌వార్స్‌ సినిమాలంటే పిచ్చి. వాటిలో ‘జేడీ నైట్‌’, ‘ది ఎంపైర్‌ స్ట్రైక్స్‌ బాక్‌’ బాగా నచ్చుతాయి. స్కూల్‌ డేస్‌లో అయితే ‘స్టార్‌వార్స్‌’ సినిమాల్లో నటించాలని కలలు కనేవాడిని. ఏ సినిమా చూస్తే ఆ పాత్రలో లీనమై ఇంట్లో నటించేవాణ్ని.


ఆటలు
క్రికెట్‌, ఫుట్‌బాల్‌ బాగా ఇష్టమైన ఆటలు. సమయం దొరికితే మా అమ్మాయిలతో ఏదో ఒక ఆట ఆడుతుంటా. అంతేకాదు, వ్యాయామంలో భాగంగా వాళ్లని రోజూ ఆ ఆటలే ఆడమనీ సూచిస్తుంటా.

చేదు సంఘటన
చదువుకునే రోజుల్లో ఒకసారి రెస్ట్టరంట్‌కి వెళ్లినప్పుడు వర్ణ వివక్షకు గురయ్యా. చాన్నాళ్లు ఆ బాధ నా మనసులో ఉండిపోయింది. అమ్మ సాయంతోనే క్రమంగా ఆ బాధను అధిగమించగలిగా.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..