నోరూరించే లంచ్‌ బాక్సులు!

ఏ వంటకమైనా నోరూరించాలంటే రుచి కన్నా ముందు దాని రూపమూ కమ్మని రంగులతో ఆకర్షించాల్సిందేగా. దాన్ని దృష్టిలో పెట్టుకునే జపాన్‌లో ‘బెంటో బాక్స్‌’ సంప్రదాయం వచ్చి ఉండొచ్చు.

Updated : 18 Sep 2022 04:19 IST

నోరూరించే లంచ్‌ బాక్సులు!

ఏ వంటకమైనా నోరూరించాలంటే రుచి కన్నా ముందు దాని రూపమూ కమ్మని రంగులతో ఆకర్షించాల్సిందేగా. దాన్ని దృష్టిలో పెట్టుకునే జపాన్‌లో ‘బెంటో బాక్స్‌’ సంప్రదాయం వచ్చి ఉండొచ్చు. అక్కడ గృహిణులు తమ చిన్నారులకు అన్ని రకాల పోషకాలూ అందేలా- ఆహారాన్ని చక్కగా సర్దుతూ లంచ్‌ బాక్సుల్ని సిద్ధం చేస్తుంటారు. అంతవరకే ఆగిపోతే ఎలా అనుకున్నారో ఏమో కొంతమంది అమ్మలు- ఇంకాస్త సృజనాత్మకతను అద్దుతూ ‘బెంటో బాక్స్‌ ఫుడ్‌ ఆర్టిస్టులు’గా మారిపోయారు. కూరగాయలూ, పండ్లూ, అన్నమూ, మాంసమూ, పిండిపదార్థాలూ... ఇలా అన్నింటినీ ఉపయోగిస్తూ పిల్లలకు ఇష్టమైన కార్టూన్‌పాత్రల ముఖాలతో బాక్సుల్ని తయారుచేస్తున్నారు. బొమ్మ రూపానికి అవసరమైన కూరగాయలూ పండ్లూ వంటి వాటిని కావాల్సిన ఆకారాల్లో కత్తిరించుకుంటూ ఓపిగ్గా వాటితో చక్కని రూపాల్ని సృష్టిస్తున్నారు. రొటిన్‌కు భిన్నంగా ఇలా కమ్మకమ్మని రుచిలో నచ్చిన బొమ్మల్లా ఆహారం ఉంటే ఏ పిల్లలైనా లొట్టలేసుకుంటూ తినరా. కుదిరితే మీరూ మీ చిన్నారుల కోసం ఇలా తయారుచేసి ఇచ్చి చూడండి!


ప్రపంచంలోనే అతి సన్నటి నగరం

తల తిప్పినా ఎత్తి చూసినా రెండు వైపులా పచ్చదనం కప్పుకున్న ఎత్తైన పర్వతాలే.కొన్ని కిలోమీటర్ల పొడవున జంటగా కనిపించే ఈ కొండల మధ్య గలగలా పారే నది, ఆ ఒడ్డునే కొండల్ని ఆనుకుని పెద్ద పెద్ద భవనాలూ అపార్ట్‌మెంట్లూ... ఈ చిత్రాన్ని చూస్తే నిజంగా ఇలాంటి చోటు ఉందా లేక ఫ్యాంటసీ సినిమాల్లోలా ఫొటోషాప్‌లో సృష్టించారా అనిపించకమానదు. కానీ ‘యాంజిన్‌’ అనేఈ నగరం చైనాలో నిజంగానే ఉంది. ఇక్కడి పర్వతాల మధ్య ఒక్కో చోట కేవలం ముప్ఫై మీటర్ల దూరమే ఉంటుందట. బాగా ఎడం ఉన్న చోటులో 300మీటర్లు ఉంటుంది. అందుకే, ఈ ఊరుని ప్రపంచంలోనే అతి సన్నటి నగరంగా చెబుతారు. ఇక, స్థలం తక్కువగా ఉంటుంది కాబట్టి నీటి ఒడ్డునే పిల్లర్లతో పునాదులు వేసి భవనాలు నిర్మించేస్తున్నారు.


క్లిక్‌... క్లిక్‌...

నింగి రంగుల్ని చూసి మురిసిన కడలి కెరటమై ఎగసి నాట్యమాడగా, ఆ నాట్య విన్యాసంలో అందంగా ఒదిగిన ప్రకృతికాంతని కనురెప్పపాటులో తన కెమెరాతో క్లిక్‌మనిపించిన ఫొటోగ్రాఫర్‌ క్లార్క్‌ లిటిల్‌ మెరుపు వేగాన్ని మెచ్చుకోకుండా ఉండగలమా?!


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..